Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇంక్విలాబ్ జిందాబాద్'' ఈ నినాదం మనం అనేకసార్లు వినే ఉంటాం. విప్లవం వర్థిల్లాలి అని తెలుగులో అనువాదం కూడా చేసుకున్నాం. మొదటిసారి ఈ నినాదమిచ్చిన వారెవరో తెలుసా? ఆయన పేరు మౌలానా హస్రత్ మొహానీ. భారత చరిత్రలో మొదటిసారి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరిన వ్యక్తి ఆయనే. 1921లో సంపూర్ణ స్వతంత్రం కావాలని నినదించారు. ఆయన ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ముఖ్యుల్లో ఒకరు. మౌలానా హస్రత్ మొహానీ రాసిన రెండు పదాలు భారత ఉపఖండంలో 1921 నుంచి నేటి వరకు మారుమోగుతూనే ఉన్నాయి. ఆ రెండు పదాలు ''ఇంక్విలాబ్ జిందాబాద్''. భగత్ సింగ్ సగర్వంగా అసెంబ్లీ హాలు దాడి తర్వాత ఈ నినాదమే పలికాడు. మౌలానా హస్రత్ మొహానీ పేరు వినగానే అందమైన గజళ్ళు గుర్తొస్తాయి. నికా చిత్రంలో ఆయన రాసిన ''చుప్కే చుప్కే రాత్ దిన్'' పాట వాడుకున్నారు. అద్భుతమైన, అందమైన గజల్ అది. అలాంటి గజళ్ళు రాయడమే కాదు హస్రత్ మొహానీ విప్లవాత్మక కవితలు అల్లారు. మౌలానా హస్రత్ మోహని భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని చాలా సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు.
''సైమన్ గో బ్యాక్'' నినాదం గురించి కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. అలాగే ఇప్పుడు క్విట్ ఇండియా వార్షికోత్సవం జరుపుకున్నాం. ''క్విట్ ఇండియా'' నినాదం గురించి కూడా చాలా మందికి తెలుసు. కాని ఈ రెండు నినాదాలిచ్చిన స్వాతంత్య్ర సమరయోధుడి పేరు యూసుఫ్ మెహరలీ. 1942లో బాంబే మేయరుగా ఎన్నికయ్యాడు. యరవాడ సెంట్రల్ జైలులో అతన్ని చాలా కాలం బ్రిటిషువారు నిర్బంధించారు.
''జైహింద్'' నినాదం కూడా మనందరికీ తెలుసు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో వినిపించిన నినాదం ఇది. ఈ నినాదాన్ని సృష్టించింది మన హైదరాబాదుకు చెందిన ఆబిద్ హసన్ సఫ్రానీ. ఆయన తల్లి ఫక్రూల్ హాజియా బేగం హైదరాబదులో ఆంక్షలు ఉన్నప్పటికీ స్వతంత్ర సమరంలో పాల్గొన్న వీరవనిత. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి ఆబిద్ హసన్ చదువు మానేశాడు. ఆ తర్వాత మళ్ళీ జర్మనీలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళాడు. అక్కడ సుభాష్ చంద్రబోస్‌ను కలిశాడు. మళ్ళీ చదువు మానేసి బోస్‌తో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి దేశం కోసం పోరాడాడు.
స్వాతంత్య్ర సమరయోధుడు కాకోరి కుట్ర కేసులో శిక్షకు గురైన అష్ఫాఖుల్లా ఖాన్ గొప్ప కవి. రామ్ ప్రసాద్ బిస్మిల్తో కలిసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. వీరిద్దరు కూడా మంచి కవులు. కాకోరి కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైన అష్ఫాకుల్లా ఖాన్ చివరి కోరిక ఏమడిగాడో తెలుసా ''నా కఫన్ (శవంపై కప్పే వస్త్రం)లో నా జన్మభూమి మట్టిని కాస్త ఉంచండి చాలు'' అన్నాడు. స్వాతంత్య్రం కోసం ఉరితాడును ముద్దాడుతూ భారతదేశ ముద్దుబిడ్డ అమరజీవి అష్ఫాఖుల్లా ఖాన్ పలికిన మాటలివి.
దేశ స్వాతంత్య్రం కోసం ముస్లింలు అసామానమైన త్యాగాలు చేశారు. చెరసాలల పాలయ్యారు. ఉరికంబాలు ఎక్కారు. స్వాతంత్రోద్యమానికి ముందు సంస్కరణోద్యమాల్లో కూడా మనం ముస్లింల పాత్రను విస్మరించలేం. ఉదాహరణకు.. మహాత్మా జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలేల గురించి అందరికీ తెలుసు. కానీ జ్యోతిబాఫూలేకు అండగా నిలిచింది ఉస్మాన్షేక్ అని, సావిత్రాబాయి ఫూలేకు ఆశ్రయమిచ్చింది ఫాతిమాషేక్ అని ఎంతమందికి తెలుసు..? కాని నేడు ఆ చరిత్ర మరుగున పెట్టే ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయి.
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెసు పేరు కూడా లేనప్పటి నుంచి ముస్లిములు పోరాడుతున్నారు. 1757లోనే బెంగాల్ పాలకుడైన నవాబ్ సిరాజుద్దౌలా బ్రిటీషువారిపై పోరాటానికి నాంది పలికాడు. మీర్ జాఫర్ చేసిన ద్రోహం వల్ల ఆయన పోరాటం విఫలమైంది. సిరాజుద్దౌలా ఈ పోరాటంలో తన ప్రాణాలు బలిపెట్టారు. అప్పట్లో మైసూరును పాలించిన హైదరాలి బ్రిటిషు వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. బ్రిటిషు సైన్యాలను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ బ్రిటిషు వారికి వణుకు పుట్టించాడు. మీర్ సాదిఖ్ ద్రోహం వల్ల టిప్పు సుల్తాన్ ఓటమిపాలయ్యాడు. రణరంగంలోనే ప్రాణాలు వదిలాడు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన టిప్పు సుల్తాన్ పై ఇప్పుడు విద్వేష ప్రచారాలు జరుగుతున్నాయి. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు నుంచి ముస్లింలు బ్రిటిషువారిపై పోరాటం కొనసాగిస్తూ వచ్చారు. 1831లో ప్రాణాలొదిలిన అహ్మద్ షహీద్, ఇస్మాయీల్ షహీద్ సోదరులు అలాంటి వారే. 1857 పోరాటంలో కూడా ముస్లిములు అగ్రభాగాన కనిపిస్తారు. మౌలానా ఇనాయతుల్లా సాదిక్ పురి, మౌలానా ఖాసీం నానోత్వీ లాంటి అనేకమంది పేర్లు వినిపిస్తాయి. అంతెందుకు 1857లో బ్రిటిషువారిపై పోరాడాలని ఫత్వా జారీ చేసిన ఫజలె హక్ ఖైరాబాదీ అండమాన్‌లో శిక్ష అనుభవిస్తూ ప్రాణాలు వదిలారు. 1887లో జరిగిన కాంగ్రెస్ నాల్గవ సమావేశానికి అధ్యక్షత వహించింది సయ్యద్ బద్రుద్దీన్ తయ్యబ్జీ ఇది మద్రాసులో జరిగింది. ఈ సభకు కూడా అందరికంటే అధిక సంఖ్యలో ముస్లిములు హాజరయ్యారు. ఆనాటి కాంగ్రెస్ ప్రముఖుల్లో జౌహర్ అలీ, షౌకత్ అలీ (అలీ బ్రదర్స్) హస్రత్ మొహానీ, రఫీ అహ్మద్ కిద్వారు, మౌలానా సయ్యద్ హుసైన్ అహ్మద్ మదనీ, మౌలానా అబుల్ ఖాసిం సైఫ్ బనారసీ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
భారత స్వతంత్ర సంగ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేశారు. కాని నేడు పరిస్థితి ఎలా ఉందంటే, భారత స్వతంత్ర సంగ్రామంలో ముస్లిములు పోషించిన పాత్రను తుడిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖమర్ జలాల్వి రాసిన పంక్తులు గుర్తొస్తున్నాయి. జబ్ గులిస్తాం కో ఖూం కీ జరూరత్ పడీ (తోటకు నెత్తురు అవసరమైనప్పుడు), సబ్ సే పహలే హమారీ హి గర్దన్ కటీ (మొదట తెగింది మా మెడలే), ఫిర్ భీ కహతే హై హమ్ సే యే అహ్లే చమన్ (అయినా ఈ తోటవాళ్ళు ఏమంటున్నారంటే), యే హమారా చమన్ హై తుమ్హారా నహీ (ఇది మా తోట, మీ తోట కాదంటున్నారు).. ఈ ప్రయత్నాలను అడ్డుకుని, అసలైన చరిత్రను చాటి చెప్పవలసిన అవసరం ఉంది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో అన్ని మతసముదాయాలు ఐక్యంగా వీరోచితంగా పాల్గొన్నాయనే వాస్తవాన్ని చాటి చెప్పవలసిన అవసరం ఉంది.
- వాహెద్