Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్యాఅగ్రరాజ్యం సరే, భారత్ ఉగ్ర రాజ్యం మాత్రం కావొద్దు!యం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉంటూ, నేను తటస్థంగా ఉన్నానంటే - అది అన్యాయమానికి మద్దతు ఇస్తున్నట్టే... - డెస్మండ్ టుటు,
జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దక్షిణాఫ్రికా యోధుడు.
తమ మాతృదేశమైన భారతదేశం, ప్రపంచంలో అగ్రరాజ్యం కావాలన్న ఆశ ఈ దేశ ప్రజలలో కొందరికి ఉండే ఉంటుంది. అది సబబే. కాని అది ఎలా సాధ్యమనేది వారు ఆలోచించుకుంటూ ఉండాలి. ఒకవైపు గతాన్ని తవ్వుతూ, మరోవైపు సమకాలీనాన్ని విశ్లేషిస్తూ సాగితేనే ఈ దేశంలోని యువతీ యువకులు దేశాన్ని సమర్థవంతంగా భవిష్యత్తులోకి నడిపించ గలరు. మరుగున పడిన వాస్తవాల్ని వెలికి తీస్తూ, చర్విత చర్వణంగా కొనసాగుతూ వస్తున్న బ్రాహ్మణవాద చారిత్రక కథనాల్ని తోసి పుచ్చుతూ ఒక కొత్త దృష్టి కోణంలోంచి అర్థం చేసుకోవడం అవసరం. అంటే ఈ దేశ మూలవాసుల దృష్టికోణంలోంచి విశ్లేషించు కోవడం అవసరం. భూస్థాపితమైన ఎన్నో అన్యాయాల్ని, అక్రమాల్ని వెలికితీసే యత్నం చేయడం అవసరం. దేశానికి స్వాతంత్య్రం లభించి డెబ్బయి అయిదేండ్లు అవుతున్నా ఇంకా ఈ దేశం ఎందుకు మూఢత్వంలో గడ్డకట్టుకుపోయి ఉందో బేరీజు వేసుకోవడం అవసరం. ప్రతిభావంతులు అణగదొక్కబడుతూ ఉండడం, బుద్ధిహీనులు ప్రచార ఆర్భాటాలతో అధికార పీఠాలు ఆక్రమించుకోవడం ఎలా జరుగుతూ వస్తోందో.. ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టించడం జరుగుతూ ఉందో.. క్రమంగా ఈ దేశ ప్రజలు అవగతం చేసుకుంటున్నారు. దేశంలోనూ, ప్రపంచంలోనూ జరుగుతూ ఉన్న దాదాపు అన్ని విషయాల గూర్చి ఈ దేశ ప్రజలు తెలుసు కుంటున్నారు. కచ్చితమైన అభిప్రాయాలు ఏర్పరుచు కుంటున్నారు.
ఆర్థిక అసమానతలతో పాటు, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు దేశంలో నిరంతరం పెచ్చరిల్లిపోతున్నాయి. అందుకు ప్రధాన కారణం నేటి పాలకులే కావడం విషాదం! ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎలా కాగలదూ? అందుకు కావల్సిన పరిస్థితులు దేశంలో నెలకొనబడాలి కదా? దేశం సగర్వంగా తలెత్తి చెప్పుకోగలిగే విషయాలు చెప్పుకోకుండా సంస్కృతీ సంప్రదాయాల పేర అర్థం పర్థం లేని విషయాల్ని ఢంకా బజాయించి చెప్పుకోవడం వల్ల ఒరిగేదేమిటీ? దేశ ప్రజల చెవులకు చిల్లులు పడటం మినహా.. ప్రపంచంలో దేశ గౌరవం ఇసుమంతైనా పెరుగుతోందా? ఔనన్నా కాదన్నా 19-20 శతాబ్దాలలో యూరోప్ దేశాలు సాధించిన వైజ్ఞానిక ప్రగతినే ఈ దేశ ప్రజలు స్వీకరించాల్సి వచ్చింది. అదే సమయంలో మనం ప్రపంచానికి ఏమిచ్చామన్నది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి! శివుడు తొలి పర్యావరణవేత్త అని, గణపతి తొండం ప్లాస్టిక్ సర్జరీ అని, భారత యుద్ధం ప్రత్యక్ష ప్రసారం జరిగిందనీ ఈ దేశంలోని మహా మహా నాయకులు చెప్పిన విషయాలకు దేశ ప్రజలే ముక్కున వేలేసుకున్నారు. ఇక విదేశీయులు యేం లెక్కచేస్తారూ? అసందర్భ ప్రేలాపనల్లా మిగిలిపోయిన పరిపాలకుల భాషణల్ని దేశ ప్రజలే తిరస్కరించారు. ఇక ఈ దేశం, ప్రపంచంలో ఏ విధంగా అగ్రరాజ్యమ వుతుంది? ఏ విషయంలో తలమానికమని చెప్పగలం? చెపితే గిబితే పాలకుల మూర్ఖత్వంలో.. అని మాత్రమే చెప్పగలం! పురాణ పాత్రల్ని, మనుస్మృతిని, వేదాల్ని ప్రమోట్ చేసుకోవడం వల్ల జరిగేదేమిటి? దేశాన్ని వెనక్కి మళ్ళించడం తప్ప?
మన రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ విషయాల మీద ఇలా అన్నారు... ''ఈ పనికి మాలిన వేదాల్లో ఉన్నదేమిటీ? పవిత్రతా లేదు, ప్రశ్నించే తత్వమూ లేదు. తమ శత్రువుల నాశనం కొరకు వారి ఆస్థులను దోచుకుని, వాటిని తమ అనుయాయులకు పంచుకోవడం కోసమూ కొండ దేవతను ప్రార్థించడం తప్ప మరేమీ లేని ఆ వేదాలను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకపోయింది. అగ్ర వర్ణాల వారు ప్రచారం చేసి, చేసి అందరి మెదళ్ళలోకి చొప్పించిన ఈ అర్థరహిత భావాల పట్టు నుంచి ప్రతివాడూ విముక్తి పొందాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విముక్తిలేకపోతే దేశానికి భవిష్యత్తు ఉండదు. ఇది ఎంత దుస్సాధ్యమైన కార్యమో తెలిసే నేను ఈ పనికి పూనుకున్నాను. దీనివల్ల కలిగే పరిణామాలకు నేను భయపడడం లేదు. ఈ విధంగా జన సామాన్యాన్ని ఉత్తేజ పరచడంలో కృతకృత్యుణ్ణి కాగలిగితే సంతోషిస్తాను'' అని సుమారు వందేండ్ల క్రితమే చెప్పగలిగారు అంబేద్కర్! మరో సామాజిక ఆలోచనా పరుడు క్రైస్తవం గురించి దాదాపు ఇలాంటి మాటలే చెప్పాడు. మెదడు మొద్దుబారి పోవడానికి లేదా మెదడు చచ్చిపోవడానికి (బ్రెయిన్ డెడ్) మూడు మార్గాలున్నాయన్నాడు. అందులో ఒకటి: ఇన్ఫెక్షన్ (వ్యాధిసోకడం) రెండు: రేడియేషన్ (అణుధార్మిక శక్తి), మూడు: వైరస్. ఈ మూడూ మాత్రమే కాకుండా నాలుగోది ఇంకొకటి ఉంది. అదే మతం. మతాల గూర్చి వాస్తవాలు మాట్లాడేవారు, ఏ మతం గురించైనా దాదాపు ఒకేరకమైన విషయాలు చెప్పారు. అందులో ఉన్న నిజమెంత? అని విజ్ఞతతో ఆలోచించేవారికి మాత్రమే విషయం అర్థమవుతుంది. అర్థం చేసుకోకుండా ఊరికే ఆవేశపడిపోయే వారుంటారు. పాపం వారికి ''మనోభావాలు'' దెబ్బతింటాయి. అలా దెబ్బతినకుండా ఉండాలంటే, తెరచిన మనసుతో అన్నింటిని సునిశితంగా విశ్లేషించుకునే స్థాయికి ఎదగాలి.
తన మేథో సంపదను తను నిలుపుకోలేని అసహాయ స్థితిలో దేశం ఉన్నందువల్లనే కదా? మన నోబెల్ గ్రహీతలంతా 'విదేశీయులు'గా గుర్తింపు పొందారూ? నిన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారతీయ సంతతికి చెందిందని, ఈ రోజు అంగారక గ్రహంపై నాసా పరిశోధనలు విజయవంతం కావడం వెనక భారతీయ సంతతికి చెందిన మహిళ స్వాతి మోహన్ ఉన్నారని మనమింకా భుజాలు ఎగరేస్తూనే ఉందామా? లేక దేశంలోని వైజ్ఞానిక పరిశోధనాశాలలకు ఈ ప్రభుత్వం ఎందుకు సరిగా నిధులివ్వడం లేదని ప్రశ్నిద్దామా? దేశంలో వైజ్ఞానిక స్పృహను బహిరంగంగా ఎందుకు హత్య చేస్తున్నారని నిలదీద్దామా? ప్రశ్నల పీకలు నులిమేస్తూ 'సబ్క సాత్ సబ్క వికాస్' ఎలా సాధ్యం? ఆర్థికంగా దేశం ఎందుకు కుప్పగూలింది? ఆకలి సూచిలో దేశం ఎందుకు అట్టడుగున ఉందీ? అవగతం చేసుకుందామా వద్దా? నోట్ల రద్దయినా, పౌరసత్వ చట్టమైనా, రైతుల నల్ల చట్టాలైనా ఎందుకు ఉద్యమ రూపం దాలుస్తున్నాయో ఆలోచించుకోవాలి కదా? మత కలహాలు చేయించేది వాళ్ళే, మళ్ళీ వాటిమీద ఎంక్వయిరీలు చేయించేది వాళ్ళే.. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాల్సిన బారతదేశం ఇలా కొంచెం కొంచెంగా కూలిపోతూ ఉండడం, హృదయమున్న ప్రతి ఒక్కరికీ కుమిలిపోయే విషయమే!
మానవీయ విలువలకు దెబ్బతగిలే సంఘటనలు రోజూ దేశంలో అనేకం జరుగుతున్నాయి. మనుషుల హుందాను దిగజార్చే వృత్తులు దేశంలో ఇంకా ఉన్నాయి. అత్యాధునిక 21వ శతాబ్దంలో జీవిస్తున్నామని గొప్పగా గర్వపడే ఈ రోజుల్లో.. దేశంలో ఇంకా మానవుల మలం చేతులతో ఎత్తేసే వృత్తులున్నాయి. అది తట్టలో వేసుకుని మోసుకెళ్ళే మహిళలున్నారు. పూర్తిగా డ్రైనేజ్‌లో మునిగి పనిచేసే పనివాళ్ళున్నారు. ఊళ్ళలో ఇంకా ముట్టు గుడిసెలున్నాయి. మరి ఈ దేశం అగ్రరాజ్యంగా ఎదగాలంటే ఇంకా ఎన్ని శతాబ్దాలు కావాలీ? ఎవరో ఒకరు రేప్ చేసి, ఎక్కడో ఓ చోట హత్య చేయబడడానికేనా ఈ దేశంలో ఆడపిల్లలు పుడుతున్నారూ? కనీసం నెలల పాపలు కూడా అత్యాచారాలకు మినహాయింపులు కాకపోతే ఎలా? దీన్ని ఎదిగిన సమాజమని ఎలా పిలుద్దాం? ఇలాంటి సమాజ వైకల్యాలకు ఎవరు బాధ్యులు? రాజకీయ నాయకుల్ని తిట్టిపోస్తే సరిపోదు కదా? సగటు మనిషి బాధ్యతల మాటేమిటీ? ఆవుతోక పట్టుకుని పాతరాతి యుగంలోకి పోయే పరిపాలకులుంటే ప్రజలేం చేయాలి? వివేకవంతులైన ప్రజలే కదా వ్యవస్థల్ని మార్చుకోవాల్సిందీ! జ్ఞానానికి అజ్ఞానానికి తేడా తెలుసుకోగలగాలి కదా? దైవభీతితో నైతికత నిలువదని రుజువైపోయిన ఈ దేశంలో ప్రజల్లో పరిణతి ఇంకా ఎప్పుడొస్తుందీ? మనిషే మనిషి కేంద్రకంగా ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన అత్యవసర సమయం వచ్చింది. పాత విలువల్ని ధ్వంసం చేస్తూ నవీన మానవీయ విలువల్ని నిలుపుకోవాల్సిన సమయం వచ్చింది.
భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యం కావడం తర్వాతి మాట! ముందు కనీసం చేజారిన స్థానాన్నైనా చేజిక్కించుకోవాలి! సమకాలీన దేశ కాల పరిస్థితుల్ని అవలోకించి.. ''భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఎంత మాత్రమూ కాదు'' అని పలు అంతర్జాతీయ సంస్థలు నిర్మొహమాటంగా ప్రకటించాయి. అంటే ఇప్పుడీ దేశం, అభివృద్ధి చెందని దేశాల జాబితాలో చేరిపోయిందన్న మాట! ఈ దేశం అగ్రరాజ్యంగా ఎదగలేకపోయినా సరే, ముందు హిందూ ఉగ్రరాజ్యంగా మారకుండా ఉండాలని కోరుకుందాం. ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లడానికి ప్రతి ఒక్కరం పొటుపడదాం. దీన్నే మానవీయ రాజ్యంగా మలుచుకుందాం!
వ్యాసకర్త: సుప్రసిద్ద సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు