Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతిమొత్తాన్నీ
తాకట్టు పెడుతున్న వైనం!
ఒక దళారీ పాలన
ఆటంకాల కాలాన్ని
రచిస్తున్న దశ్యం!
ఆరుబయట నీ కలలోకి
వెన్నెల రావడం నేరం!
నీవు రాసే కవిత్వం
పక్క చెవికి చేరడం మరీ నేరం!
నీవు ఊపిరి పీల్చడం
దేశద్రోహం!
నీవు ఐదు వేళ్ళతో అన్నం తినడమూ దేశద్రోహమే!
సందు చివర కాల్వపక్క ఉచ్చ పోసినా
రాత్రి చీకటిలో ఒంటరిగా
భయాన్ని చేధించే పాట పాడినా..
దేశద్రోహమే!
వాడు తప్ప నువ్వు దేశభక్తిని
ప్రదర్శించడమూ దేశద్రోహమే!
ఈ దేశంలో వాక్స్వాతంత్య్రం
పేరు దేశద్రోహం!?
రాజకీయం రాజ్యాంగాన్ని
అమ్మకానికి పెట్టిన
కాషాయ కాలం!
జాతి ఆస్తుల్ని అమ్ముకోవడమే
ఇప్పటి వ్యాపార హక్కని
తీర్మానించేశారు
కార్పొరేట్ లకు తాకట్టు పడటమే
నేటి అభివృద్ధి మంత్రమని
నొక్కి చెప్తున్నారు
ప్రశ్నల్ని జైళ్లలో
కుక్కుతున్న వడగాలులు
రైతు రాజెప్పటికీ కాడు
దేశద్రోహి తప్ప అంటూ
మార్కెట్ రాజ్యం
మరణ శాసనం చేస్తున్నది
ఏ హక్కుల గురించి మాట్లాడినా
మనల్ని మాయం చేయడమే
వాడి హక్కుగా ప్రకటిస్తున్నాడు
హింస... హింస.. హింస
అమ్మకపు హింస
నమ్మకాల అమ్మకపు హింస
బలిదానాల్ని పెంచడమే
వాడి మార్కెట్ హక్కు
శ్రమనీ, పరిశ్రమల్నీ
అమ్మకానికి సిద్ధం చేయడమే
మార్కెట్ వ్యాపార నిఘంటువు
వాడి శ్రేయస్సు పేరు హింస!
దేన్నైనా తాకట్టు పెట్టడమే
వాడి అసలైన అభివృద్ధి ప్రణాళిక!
చరిత్ర అంటే గతమే కానీ
వర్తమాన భవిష్యతులు
కానేకాదని వారు మత మందిర
చరిత్రల్ని నిర్మిస్తారు!
వారు చరిత్ర సృష్టిస్తారు
ప్రజల కోసం పాలన అబద్ధం
ప్రభువుల సుఖ లాలస నిజం
వాడు సముద్రాన్ని పూడ్చడానికి మొదలయ్యాడు
ప్రజల ఉక్కు సంకల్పంతో
వాడి కోటగోడల్ని కూల్చేయడానికి
ఒక యుద్ధ సునామీగా
మొదలవుదాం రండి!
- శిఖా-ఆకాష్