Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం స్వాతంత్య్రం పొంది 75సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్లాటినం జుబ్లీ జరుపుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ''ఆజాదీ కా అమృత మహౌత్సవ్'' పేరున దేశంలో సంబరాలు జరిపిస్తున్నారు. అమృత మహౌత్సవం అంటే ఫోటోలకు ప్రణామాలు కాదు, పాటలకు పేరడీలు కాదు, ఉచ్ఛారణా తృప్తి కలిగించే వొట్టి పలుకులు కానేకాదు. జతీయ గీతాన్ని ఆలపించి ఆన్లైన్లో ఒక సర్టిఫికేట్ పొందాలని పౌరులను వివిధ మాధ్యమాల ద్వారా పురమాయిస్తున్నది కేంద్రం. సరైన స్పందన రాలేదేమో! ప్రభుత్వ సంస్థల ద్వారా అధికారికంగా ఎక్కువ మంది పాల్గొనేలా ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ గీతాన్ని ఆలపించడంలో తప్పు లేదు. కానీ దానికి సమయమూ సందర్భామూ ఉండక్కర్లేదా? యాబై రెండు సెకన్లలో పాడాల్సిన ఒక గీతాన్ని ఎలాగైనా ఆలపించడం జాతీయ గీతానికి అవమానం కాదా? అంచేత నినాదాలూ భావోద్వేగాలూ వ్యక్తపరచడం మాత్రమే స్వాతంత్య్ర సంగ్రామానికీ, ఇన్నాళ్ళ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికీ నిజమైన గుర్తింపు కాదు. దేశంలో వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకున్న కరోనా రోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలను ప్రచారం చేసి దేశ ప్రధాని మన కోసం కన్నీళ్ళ పర్యంతమయ్యారని గర్వపడటమా ఆజాదీకా అమత మహౌత్సవం అంటే! వేసిన టీకాల కన్నా వెలసిన ప్రచార హౌర్డింగులే ఎక్కువగా ఉండటం చూసి గర్వపడటం కాదు మహౌత్సవమంటే? స్వాతంత్రం అంటే ఆంగ్లేయుల పాలన నుండి మాత్రమే విముక్తి కాదు, అణచివేత విధానాల నుండి విముక్తి కావాలన్నది నినాదం. మరి నేడు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేస్తే, పరదేశియుడు వదిలివెళ్లిన దేశ ద్రోహ చట్టం స్వదేశీయుడు స్వదేశస్థుతలపై విధించడమేనా అమృత మహౌత్సవం అంటే?
అయితే... భారత ఆజాదీ (స్వాతంత్య్రం) అమృత మహౌత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవచ్చు. ఎందుకంటే భారత స్వాతంత్య్ర పోరాటం అసమాన్యమైనది. ఆ మహా సంగ్రామంలో, ఆ రోజుల్లో పాలుపంచుకున్న పౌరుల సంఖ్య ఆనాటి పరిస్థితులతో పోలిస్తే అనేక దేశాల జనాభా కన్నా ఎక్కువే. విభజించు-పాలించు అన్న ఆంగ్లేయుని నినాదాన్ని ఎదుర్కొని 74 ఏండ్ల క్రితం జరిగిన సంగ్రామంలో కులం, మతం, ప్రాంతం, పేద, ధనిక అనే తేడాలు లేకుండా లక్షలాదిగా మన కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను స్మరించుకుని సంబుర పడాల్సిందే. కానీ ఇప్పుడు అధికారం కోసం ప్రజలను కుల మతాల పేర బహిరంగంగా విభజిస్తుంటే దేశం విలపిస్తుందన్నది మరువరాదు. అదే సందర్భంలో స్వాతంత్రోద్యమంలో మహౌజ్వలమైన పాత్ర నిర్వహించిన మహనీయుల పేర్లు చరిత్రనుండి చేరిపేసి అంగ్లేయులకు వంత పాడిన కొత్త ముఖాలను వీరులుగా పరిచయం చేయాలనుకునే ప్రయత్నాలు తప్పు అని చెప్పడం ఒక బాధ్యత. స్వాతంత్య్ర పోరాటం పరాయి పాలన విముక్తి కోసమే కాదు. సమాజానికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలన్న వాగ్దానాలను పెనవేసుకొని సాగిందని గర్వపడదాం. స్వేచ్ఛాయుత సమాజానికై ఆనాటి స్వాతంత్య్ర పోరాటం సారధ్యం వహించింది. రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వేచ్ఛలేని స్వాతంత్రం అర్థరహితమని అది వివరించింది. స్వతంత్ర భారతదేశం మతపరమైనదిగా కాకుండా ఒక సెక్యులర్ దేశంగా ఉండాలని నిర్దేశించిన సంగ్రామం అది. కానీ నేడు మత పరమైన ఏకీకరణ ద్వారా రాజకీయ లాభం పొంది అధికారాన్ని చెలాయించ జూస్తున్న రాజకీయాల వల్ల ప్రమాదకర ముప్పు పొంచి వున్నదని గుర్తించకపోతే సంబురాలకు అర్థం లేదు. ఆధునిక దేవాలయాలుగా గుర్తించబడి, అహర్నిశలు కష్టపడి, అన్ని వనరులను అందుబాటులో ఉంచి, ఆర్థిక స్వావలంభనకు పునాది వేసి నడిపించిన ప్రభుత్వరంగాల చలవే నేటి ఆర్థిక పటిష్టతకు మూలమని సంబుర పడదాం. కానీ, జేబు ఖర్చులకోసం ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అమ్ముతూ పోతుంటే భవిష్యత్తుకు ప్రమాదమని గుర్తిద్దాం. వాటి మనుగడకై పోరాడటమే ఈ దేశానికి భవిష్యత్తని నినదిద్దాం.
అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) రోజులు మినహా దేశంలోని అన్ని అధికారిక సంస్థలూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతూనే వచ్చాయి. ఇది ఎన్నికైన ప్రతినిధుల, దేశ పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమైంది. కానీ ఈ రోజుల్లో వాటి పరిధి కుంచించుకుపోయి రాజకీయ బాసుల చేతికే పగ్గాలు పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన అంగాలైన ఎన్నికల కమిషన్, సి.బి.ఐ.తో సహా న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ నిర్దేశాల చట్రంలో పడిపోయిందా అని అనిపిస్తోంది. శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో అపారమైన అభివృద్ధి సాధించినప్పటికీ ఆ ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి రానంత వరకు అది మానవ అభివృద్ధికి సూచిక కాదని గుర్తించడమే అమృత మహౌత్సవానికి అర్థం. ప్రత్యేకించి గత ఆరు సంవత్సరాల పాలన ఆర్థిక, సాంఘిక జీవనానికి సవాలుగా మారింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు మాత్రమే అనే అర్థాన్ని రాజకీయ నాయకులు వంట పట్టించుకున్నారు. రాజకీయాలు పూర్తిగా వ్యాపార మయమై కార్పొరేట్లే నాయకులు - నాయకులే కార్పొరేట్లుగా పరిణామం చేందాయి. సేవా దృక్పధాన్ని వదిలేసి రాజకీయాలు ఉన్నోడి లాభదాయక మార్గాలుగా మారాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులను రిసార్టులలో దాచుకుని అధికారాన్ని పొందాల్సిన దారుణ పరిస్థితులు దాపురించాయి. పార్టీల ఫిరాయింపులు ప్రజాస్వామ్య ఉనికికి సవాలుగా పరిణమించాయి. అందుచేత ప్రపంచదేశాల ప్రజాస్వామ్య సూచీలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. డెమోక్రసీ నుంచి ప్లుటోక్రసీ వైపు దాదాపు ప్రయాణం సాగుతున్నది. గత ఆరు సంవత్సరాల కాలం నుండి పౌర హక్కులకు విపరీతమైన విఘాతం ఏర్పడుతున్నది. ప్రజాస్వామ్యయుత విమర్శలను సహించే స్థితిలో ఎన్నికైన ప్రభుత్వాలు లేవు. అమాయక, దళిత, గిరిజన, పీడిత ప్రజల పక్షాన నిలిచే అనేకమంది మేథావులు పాలనా విధానాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు నిర్బంధాలకు గురిచేస్తున్నారు. ప్రభుత్వానికి భిన్నమైన వైఖరి వహించినవారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ప్రభుత్వ రంగాల ధ్వంసంతో నయా ఉదారవాద విధానాలకు పెద్దపీట వేసి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని(క్వాంటిటి) చూసి గర్వ పడమంటున్నారు. కానీ ఇది నిజమైన అభివృద్ధికి సూచిక కాదు. ఎందుకంటే పెరిగిన సంపద అంతా కొందరి చేతుల్లో పేరుకు పోతున్నది. ఒక్క శాతం జనాభా 58శాతం దేశ సంపదను కలిగి ఉండటం కంటే అన్యాయం ఉంటుందా..?
సాధించాల్సినది ఎంతో ఉంది
ఈ ఆరేండ్ల పాలనలో పొరుగు దేశాలతో వైరమే తప్పా స్నేహమెందుకు చేయలేకపోతున్నామో సమీక్షించుకోవాలి. రాష్ట్రాల హక్కులన్నీ హరించి భారత ఫెడరల్ వ్యవస్థను చిన్నాభిన్నంచేసే విధంగా చట్టాలు రోపొందించబడు తున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన అభివృద్ధి లక్ష్యాల సాధనలో మనం ప్రపంచంలో 117వ స్థానంలో ఉన్నాం. పేదరికం, ఆహార భద్రత విషయంలో ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నాం. 1947లో భారత జీడీపీలో వ్యవసాయం వాటా 54శాతం కాగా ఇప్పటికీ 52శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ జీడీపీలో దాని వాటా కేవలం 16శాతం మాత్రమే. ప్రత్యామ్నాయ పని కల్పనకు విధానాలేవీ అని ప్రశ్నించుకోవాలి. ఉపాధి కల్పనకు ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటే బాల్యం నుంచే ఒక మార్గాన్ని పౌరులు ఎంచుకునే అవకాశముంటుంది. 75 సంవత్సరాలైనా 100శాతం అక్షరాస్యత ఎందుకు సాధించలేక పోతున్నాం? 30శాతం నిరక్షరాస్యులకు ఆజాదీ కా అమృత మహౌత్సవమంటే అర్థమవుతుందా? దేశంలో మెరుగైన వైద్యం అందుబాటు లో లేదనడానికి ప్రభుత్వాసుపత్రుల దుస్థితియే నిదర్శనం. అలమటిస్తున్న రోగుల ఆక్రందనలొకవైపు, కుళ్ళిన శవాలను ఎలుకలు కొరక్కు తింటున్న దృశ్యా లింకొకవైపు హృదయ విదారకంగా కనిపించే ఈ పరిస్థితులెప్పుడు మారతాయని ప్లాటినం జూబ్లీ ప్రశ్నిస్తోంది.
స్వాతంత్య్రం తర్వాత మనం రూపొందించుకున్న భారత రాజ్యాంగం ఇప్పుడు ఆచరణలో ఏ ప్రాధాన్యత లేని ఒక పుస్తకంలా మిగిలిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అది ఒక నియమాల పుస్తకం కాదు, అది ప్రజలకొక సాంఘిక ఒప్పందం. న్యాయం, ధర్మం, సమానత్వం అనే వాగ్దానాలు పొందుపరిచిన విధాన రూపకం. చట్టం ముందు అందరూ సమానులేనన్న రాజ్యాంగ నియమాలిన్నీ ఆచరణలో నిరర్థకంగా మారుతున్నాయని దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు జాతీయోద్యమ లక్ష్యాల్నీ, తద్వారా దేశాన్నీ కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలందరిదీ. ఇది గుర్తించగలిగితేనే ఈ 75వ స్వాతంత్య్రదినోత్సవాలకు సార్థకత. సంబరమంటే భావోద్వేగం వ్యక్త్ర పరచటమే కాదు, బాధ్యతను నిర్వర్తించటం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016