Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) దేశానికి కళంకం. నాగరికత ఉన్న ఏ దేశంలోనైనా, ప్రభుత్వం ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి కొన్ని సంవత్సరాల పాటు నిర్బంధించి విచారణ, బెయిల్ మంజూరు చేయకుండా, ఆ విచారణలో చివరికి ఆ వ్యక్తి అమాయకుడని తేలితే, అతడు కోల్పోయిన అన్ని సంవత్సరాల జీవితానికి ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారాన్ని చెల్లించకుండా అనుమతించే చట్టం ఏదైనా ఉంటుదా అంటే, 'ఉపా' చట్టం ఆ పని చేస్తుంది.
ఆఖరికి బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం కూడా తన అర్హతకు మించిన అలాంటి అధికారాలను పొందే డిమాండ్ చేయలేదు. వాస్తవానికి, ఆ ప్రభుత్వం అపకీర్తి పాలైన దేశద్రోహ చట్టాన్ని కలిగి ఉంది కానీ, ఆ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణ కోసం సంవత్సరాల తరబడి నిర్బంధంలో ఉంచకుండా వేగంగా విచారణ చేపట్టేవారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు అనేక సార్లు జైళ్ళకు వెళ్ళి, అనేక సంవత్సరాలు గడిపేవారు, కానీ వెళ్ళిన ప్రతీ సందర్భంలో జైలులో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గడపలేదు.1920 తొలి రోజుల్లో మహాత్మా గాంధీ సుదీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉన్న కాలాన్ని గమనిస్తే, ఆయన మార్చి 10, 1922లో అరెస్ట్ అయితే, కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ, జనవరి 12, 1924లో, అంటే ఇరవై రెండు నెలల తరువాత విడుదల అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆయన ఇంతకన్నా తక్కువ కాలమే జైలులో గడిపారు. అదే క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జవహర్ లాల్ నెహ్రూ సుదీర్ఘకాలం పాటు అంటే 1041 రోజులు అహ్మద్ నగర్ కోటలో నిర్బంధంలో ఉన్నారు. కానీ వీరందరి నిర్బంధాలకు విరుద్ధంగా భీమాకోరేగావ్ కేసులో 'ఉపా'చట్టం కింద నిర్బంధంలో ఉన్నవారు ఇప్పటికే మూడు సంవత్సరాలకు పైగా జైలులో ఉంటున్నారు, ఈ నెల తరువాత అనేక మంది మూడు సంవత్సరాల జైలు జీవితానికి చేరుకుంటారు. వారికి వ్యతిరేకంగా మోపబడిన ఆరోపణలను ఇంతవరకు రూపొందించలేదు. కోర్టులు వారికి బెయిల్ మంజూరు చేయకుండా తిరస్కరిస్తున్నాయి. ఈ క్రమంలో, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన 'ఆర్సినల్' సంస్థ, వారికి వ్యతిరేకంగా ఉపయోగించిన రుజువులు, వారిని అరెస్ట్ చేయడానికి ముందే వారి కంప్యూటర్లలో దాచి పెట్టారని నిష్కర్షగా చెప్పేసింది.
వాస్తవానికి, వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న విప్లవకారులు జైళ్ళలో చాలా కాలం గడిపారు. కానీ, ఆఖరికి చిట్టగాంగ్ సాయుధ దాడిలో పాల్గొన్నందుకు 14 సంవత్సరాల పాటు అండమాన్ సెల్యులార్ జైలులో శిక్షను అనుభవించిన ప్రముఖ విప్లవకారుడు గణేష్ ఘోష్ (విడుదల అయిన తరువాత కమ్యూనిస్టు పార్టీలో చేరాడు) కూడా అతని అరెస్ట్‌కు, చివరి విచారణకు మధ్యలో రెండు సంవత్సరాల కన్నా తక్కువ కాలమే నిర్బంధంలో ఉన్నాడు. సంవత్సరాల పాటు, విచారణ చేయకుండా ప్రజలను నిర్బంధంలో ఉంచే కార్యాచరణ బ్రిటిష్ వలస పాలనలో కూడా అసాధారణమైన విషయమే.
ప్రపంచంలో ఎక్కడైనా ఇదే విధమైన అదుపులను మనం గమనించవచ్చు. ఇటీవల కాలంలో వ్యక్తి స్వేచ్ఛకు రక్షణను అంగీకరించిన విషయం గురించి పక్కన పెట్టి, యుద్ధానికి ముందు జర్మనీని ఒకసారి చూద్దాం. 1933లో జర్మన్ పార్లమెంట్ భవనం, రీచ్య్ స్టాగ్పై దాడిచేసి తగులబెట్టినప్పుడు, ఆ చర్యలకు పూనుకున్నారని భావించబడిన కమ్యూనిస్టులను అణచివేయాలని, పార్లమెంట్ ప్రభుత్వానికి అనుమతించిన సందర్భంలో కూడా నేరారోపణలు చేయబడిన వారు ఏడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో లేరు. విచారణ తరువాత నేరారోపణలు చేయబడిన నలుగురిలో ముగ్గురిని విడుదల చేశారు, ఆ నాల్గవ వ్యక్తి జార్జ్ డిమిట్రోవ్ (తరువాత కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌కు అధ్యక్షుడు అయ్యాడు) తన తరపున తానే వాదించుకున్న సందర్భంలో నాటి మంత్రి హెర్మన్ గోరింగ్‌ను కోర్టు బోనులో నిలబెట్టి ప్రశ్నించేందుకు అనుమతించారు. (ఒకసారి భీమాకోరేగావ్ కేసులో నిందితుల్లో ఒకరికి నేటి భారతదేశ హౌంమంత్రి అమిత్ షాను ప్రశ్నించేందుకు అనుమతించినట్లు ఊహించండి). అది హిట్లర్ ఛాన్సలర్‌గా ఎన్నికైనప్పుడు ఉన్న జర్మనీ పరిస్థితి. తరువాత మారింది అనుకోండి, కానీ అప్పుడు హిట్లర్ ప్రజాస్వామికంగా ఉన్నట్లు నటించలేదు, ఆయన దృష్టి అంతా (భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్లు కనిపించే విధంగా కానటువంటి) ఫాసిస్ట్ రాజ్య స్థాపన పైనే కేంద్రీకరించాడు.
'ఉపా'చట్టంతో ఉన్న సమస్య ఏమిటంటే, అది ప్రజాస్వామ్యంలో అంగీకరించిన ధర్మ శాస్త్రము యొక్క ప్రాథమిక నియమాలను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. చాలా క్రిమినల్ కేసుల్లో, నేరారోపణలు చేయబడిన వ్యక్తులు సాక్షులపై ఒత్తిడి, సాక్ష్యాలలో జోక్యం లాంటివి, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాల ప్రక్రియకు అడ్డంకిగా లేకుంటే సాధారణంగా బెయిల్ మంజూరు చేస్తారు. ఇది ''బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు'' అనే నానుడిలో తెలియజేస్తుంది. కానీ 'ఉపా'చట్టం కింద నిర్బంధంలో ఉన్న నేరారోపణ చేయబడిన వ్యక్తి నిర్దోషి అని విశ్వసించడానికి తగిన ప్రాతిపదిక ఉంటేనే బెయిల్ మంజూరు చేస్తారు. అంటే దీనర్థం, విచారణకు ముందు కూడా, కోర్టు ఆ వ్యక్తి నిర్దోషిత్వం పైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది, విచారణ ముగింపులో దోషిగా నిర్థారించబడకుంటే, నిందితుడు నిర్దోషిగా భావించబడాలి అనే ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉంటుంది.
అదేవిధంగా, అరెస్ట్‌లు, బెయిల్ మంజూరుకు సంబంధించిన అంశాలను పక్కన పెడదాం. జూలై 2019లో సవరించబడిన 'ఉపా'చట్టం ఇంతకు ముందు తరహాలో కేవలం ఒక సంస్థను మాత్రమే కాక, వ్యక్తిని కూడా ప్రభుత్వం తీవ్రవాదిగా ప్రకటించడానికి, ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తిని (ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులకు సమాచారం లేకుండా) కూడా జప్తు చేయడానికి 'నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ'కి అనుమతిస్తుంది. ఒకవేళ తీవ్రవాదిగా ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఎటువంటి కళంకం లేకుండా తప్పించుకోవాలంటే, తాను నిర్దోషినని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తికే ఉంటుంది. అతడ్ని తీవ్రవాది అని ప్రకటించిన ప్రభుత్వానికి, అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసే బాధ్యత లేదు, అది ఆ వ్యక్తి బాధ్యత. ఇక్కడ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలోని ధర్మశాస్త్రం యొక్క ప్రాథమిక నియమాలు పూర్తిగా తలక్రిందులు చేయబడుతున్నాయి.
దానితోపాటుగా 'ఉపా'చట్టం కింద చేర్చిన ''తీవ్రవాదం'' అనే పదానికి నిర్వచనం కేవలం తీవ్రవాద చర్యలు మాత్రమే కాక, యధాతథ స్థితి నుంచి సామాజిక మార్పు కోసం చేసే ఆలోచనలు, అభిప్రాయాలను ప్రచారం చేయడం కూడా ప్రజలలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న కారణంగా తీవ్రవాదంగా పరిగణించ బడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత ప్రజాతంత్ర విప్లవాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేందుకు అవసరమైన అన్ని భిన్నాభిప్రాయాలకు, అన్ని విమర్శనాత్మక ఆలోచనలకు వ్యతిరేకంగా 'ఉపా'చట్టాన్ని ఉపయోగించవచ్చు. వేల సంవత్సరాలుగా వ్యవస్థీకృతమైన అణచివేత, అసమానతల వారసత్వం గుర్తించిన ఈ యధాతథ స్థితిని అంగీకరించాలని ఈ చట్టం సమాజాన్ని ఒత్తిడి చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వారెవరైనా విచారణ, బెయిల్ మంజూరు లేకుండా కొన్ని సంవత్సరాల పాటు జైలు నిర్బంధంలో ఉంటారు.
'ఉపా'చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సుదీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచడం చట్టం తప్పు కాదనీ, అధిక సంఖ్యలో కేసుల భారంతో ఉన్న కోర్టుల వలన జరుగుతుందని కొందరు వాదించవచ్చు. కానీ ఈ వాదనలో ప్రామాణికత లోపించింది. ఎందుకంటే, మొదట ఏ చట్టమైనా ఆచరణాత్మక పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలి, రెండవది అధికార సంస్థలు, విచారణకు వచ్చే 'ఉపా' కేసులను ఆలస్యం చేసే ప్రయత్నాలు చేస్తాయి. ఉదాహరణకు, భీమా కోరేగావ్ కేసుకు సంబంధించిన చార్జిషీట్ వాస్తవానికి మరాఠీలో ఉంది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మందికి మరాఠీ భాష తెలియకపోవడం వల్ల చార్జిషీట్‌ను అనువదించడానికి చాలా సమయం పట్టింది. అనువాదం చేయబడిన చార్జిషీట్ వేల సంఖ్యలో పేజీలు ఉండడంతో, చార్జిషీట్లు ఉన్న పెన్ డ్రైవ్‌లు అందజేశారు కానీ, జైలులో నేరారోపణలు చేయబడిన వ్యక్తులకు కంప్యూటర్ అందుబాటులో లేకపోవడంతో విచారణ జరుపుతున్న జడ్జి గారు చార్జిషీట్ నకలు ప్రతులను తీయించి ఇవ్వమని అడిగితే పోలీసులు అందుకు అవసరమైన నిధులు లేవని అన్నారు. జడ్జీ గారు ఈ విషయం పై పట్టుపట్టడంతో, చార్జిషీట్ నకలు కాపీలు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుత సమకాలీన భారతదేశంలో ఆరోపణలు చేయబడిన చాలా సున్నితమైన, ఆలోచనాపరులైన వ్యక్తులు తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్నారు. 'ఉపా చట్టం' అనేది దేశానికి ఒక కళంకంగా ఉంది, దీనిని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది.
అనువాదం : బోడపట్ల రవీందర్,
- ప్రభాత్‌పట్నాయక్
సెల్: 9848412451