Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది. అదే కాలం ఎన్నో మార్పులకు సంకేతమిస్తుంది.. సంధిగా నిలుస్తుంది. ఈ విషయం తెలియక అనేక మంది రాగద్వేషాలు, ప్రతిష్టలకు పోయి... ఆ తర్వాత ఖంగు తింటుంటారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ విధంగా ఖంగు తినటం ఆనవాయితీ, అంతకు మించిన రివాజూనూ. మొన్నటికి మొన్న పీసీసీ పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి, సోనియమ్మ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిన హస్తం పార్టీ పాత కాపులందరూ...ఆ పదవి దక్కక నిద్రాహారాలు మానేశారు. కొత్తగా పీఠమెక్కిన రేవంత్‌రెడ్డిపై వారు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. విమర్శలు, ప్రతి విమర్శలు, అలకలు, బుజ్జగింపులు, సంబంధిత డ్రామాలకు గాంధీ భవన్ వేదికైంది. ఈ క్రమంలో సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకడుగు ముందుకేసి... 'సీనియర్ అయిన నన్ను కాదని ఎవరో కొత్త వారికి పదవినిచ్చారు. అందువల్ల నేను గాంధీ భవన్ మెట్లుకూడా ఎక్కబోను...' అంటూ హెచ్చరించారు. బస్తీ మే సవాల్, ఖబర్దార్ అనే రీతిలో పంచ్ డైలాగులతో నిన్న మొన్నటి వరకూ ఆయన హల్చల్ చేశారు. మీసాలు మెలేసి సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. కానీ ఏం జరిగిందో తెలియదు... ఇటీవల ఇంద్రవెల్లి ఆదివాసీల గర్జన తర్వాత... ఆయనలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. 'నేను ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించే సభకు రాలేకపోతున్నా. ఆ రోజు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పర్యటన ఉంది. అందువల్ల 21 తర్వాత ఎప్పుడు, ఎక్కడ సభ పెట్టినా తప్పకుండా వస్తా...' అంటూ రేవంత్‌కు లేఖ రాసి, సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఆయనలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పునకు కారణమేంటో...?
- గుడిగ రఘు