Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేనూ.. నా దేశం.. పవిత్ర భారతదేశం...' అనే అలనాటి పాటను విన్నప్పుడు మన మనస్సు దేశభక్తితో ఉప్పొంగుతుంది. 'పుణ్యభూమి నా దేశం' అనే అన్నగారి గీతాన్ని ఆలకించినప్పుడు జనాల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 'తెలుగు వీర లేవరా... దీక్షబూని సాగరా...?' అంటూ నట శేఖర కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రలో అడవి బిడ్డలకు కర్తవ్య బోధ చేసే సీను... ఆద్యంతం రక్తికట్టిస్తుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానంటూ చెప్పే క్రమంలో మెగాస్టార్ రౌద్రరూపం... అవినీతి పరుల గుండెల్లో పిడిబాకులా దిగుతుంది. ఇదే క్రమంలో దేశమంటే మట్టికాదోరు... దేశమంటే మనుషులోరు... అంటూ గురజాడ వారి అడుగు జాడలు అప్పుడప్పుడు మనల్ని వెంటాడుతుంటాయి. వీటన్నింటినీ రంగరించి... భారతజాతి ఔన్నత్యాన్ని, స్వాతంత్య్రం కోసం ఆనాటి త్యాగధనులు చేసిన 'ఇంక్విలాబ్ జిందాబాద్...' నినాదాల మీద ఈరోజు మనం వేసుకున్న పునాదుల్నీ మననం చేసుకోవాలి. చిన్నప్పుడు బడిలో చదువుకునేటప్పుడు పొద్దునే ప్రార్థనా గీతంలో... 'భారతదేశం నా మాతృ భూమి, భారతీయులందరూ నా సహోదరులు...' అనుకుంటూ ప్రతిజ్ఞ చేశాం. అందులోనే 'సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దాన్ని కాపాడుకునేందుకు సర్వదా కృషి చేస్తాం...' అనే కీలకమైన కర్తవ్యాన్ని చేబూనాం. సహజ సిద్ధమైన అడవులు, గనులు, నీరు, గ్యాస్ దగ్గర్నుంచి ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, రైల్వే, విమానాలు, బ్యాంకులు, ఎల్ఐసీలాంటి వాటిని కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పాలకులు రంగం సిద్ధం చేశారు. 'కాదేదీ కవితకనర్హం...' అని ఆనాడు మహాకవి శ్రీశ్రీ చెబితే... 'కాదేదీ విక్రయానికనర్హం...' అంటూ నేడు ఢిల్లీ గద్దె మీద కూర్చున్నోళ్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఉందిలే మంచికాలం ముందు ముందునా...' అంటూ భవిష్యత్ తరాలు పాటలు పాడుకోవాలంటే... 'ఈ నేల మనదిరా, ఈ నింగి మనదిరా...' అంటూ మనం పిడికిళ్లెత్తాలి. తద్వారా దేశాన్ని, దేశ సంపదనూ రక్షించుకోవాలి.
-బి.వి.యన్.పద్మరాజు