Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కైలాసంలో శివుడు, పార్వతి కొలువుదీరి ఉన్నారు. వారిద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. నంది, వీరభద్రాది ప్రమథగణాలు కూడా వారికి తోచిన విషయాలు మాట్లాడుకుంటున్నాయి. కొంత సేపటికి శివుడు గంభీరంగా మారిపోయాడు. పార్వతితో మాట్లాడటం మానేశాడు. పార్వతి ఆశ్చర్యపోయింది! ''ఏమిటీ ఆకస్మిక మార్పు?'' అని ఆలోచించి, ''గంగాదేవి ఏమైనా చేసిందా?'' అని శివుని తలవైపు పరికించి చూసింది. కాని అక్కడేమీ మార్పులేదు! గంగాదేవి చల్లని ప్రవాహం కొనసాగుతూనే ఉంది! ''ఈ మగాళ్ళంతా ఇంతే! ఎప్పుడెలా ఉంటారో అంతుబట్టదు!'' అనుకుంది!
''ఏమైంది స్వామి? ఉన్నట్టుండి గంభీర ముద్ర దాల్చారు?'' అడిగింది పార్వతి.
పార్వతి వంక కోపంగా చూశాడు పరమశివుడు.
అంతలోనే ''నారాయణ! నారాయణ!'' అంటూ వచ్చాడు నారదుడు.
''రా! నారదా! సరిగ్గా సమయానికి వచ్చావు! మీ స్వామివారు చాలా కోపంగా ఉన్నారు! ఎందుకని అడిగితే నాకేమీ చెప్పటం లేదు! నీకైనా చెబుతాడేమో, అడుగు!'' అంటూ పరమశివుడి వైపు చూపింది పార్వతి.
''నారాయణ! ఏమిటి తల్లీ ఇది? స్వామివారి తలపై నున్న గంగమ్మ స్వామివారి మూడు కళ్ళ నుండి ధారగా కారుతున్నది! మీరేమో కోపంగా ఉన్నారని చెబుతున్నారు! భోళాశంకురుడిపైన ఇన్ని అపవాదులు వేయవచ్చనా?'' ప్రశ్నించాడు నారదుడు.
పార్వతి, శంకరుడి వైపు చూసింది! నిజమే! మూడు కళ్ళ నుండి నీళ్ళు ధారగా కారుతున్నాయి! ఈయన భోళాశంకరుడెందుకు అవుతాడు? కొద్ది సేపటిలోనే మూడు రసాలు చూపించాడు! ఇంకెన్ని రసాలు చూపుతాడో! లాభం లేదు తేల్చుకోవాలి అనుకుంది పార్వతి.
''ఎందుకు స్వామి! మూడు నిమిషాల్లో మూడు రసాలు కురిపించారు..? ఇంతకీ మీ ఉద్దేశ్యం ఏమిటి?'' అంటూ నిలదీసింది పార్వతి.
''అపవిత్రం! గర్భగుడిని అపవిత్రం చేశారు!'' అన్నాడు పరమశివుడు గద్గదస్వరంతో.
''పార్వతితో సహా ప్రమధగణాలన్నీ ఆశ్చర్యపోయాయి.''
''ఎక్కడ స్వామీ? ఎవరు స్వామీ?'' అంటూ ప్రమథగణాలు ఆగ్రహంతో ఊగిపోయాయి.
''శాంతించండి! ఎక్కడా ఎవరూ, ఏమీ చేయలేదు! ఇదంతా భూలోక ప్రభావం!'' అన్నాడు నారదుడు.
''భూలోక ప్రభావమా?'' అన్నారు అందరూ ఒకేసారి!
''అవును! భూలోకమంటే, భారతదేశంలోని పార్లమెంటులో రాజ్యసభ అధిపతి వెంకయ్యనాయుడుగారు కన్నీరు పెట్టుకుని అన్న మాటలే మన స్వామివారు అంటున్నారు! ఎంతైనా మన స్వామివారు భోళాశంకరుడు కదా! భక్తుల బాధ! స్వామివారి బాధ!'' అన్నాడు నారదుడు.
''వెంకయ్యనాయుడికి కూడా కన్నీరు వచ్చిందా? అంత కష్టం ఏమివచ్చింది స్వామీ?'' అడిగాడు నంది ఆశ్చర్యంగా.
''పార్లమెంటు సజావుగా జరగటం లేదని, ప్రజా సమస్యలు చర్చించాల్సిన పార్లమెంటులో ధర్నాలు, నిరసనలు పెల్లుబుకుతున్నాయని, ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని, చంపేస్తున్నాయని, ఆవేదనతో వెంకయ్యనాయుడు కన్నీరు మున్నీరయ్యారు!'' వివరించాడు నారదుడు.
అది వింటూనే పార్వతి పగలబడి నవ్వింది!
''ఎందుకు దేవీ, అంతగా నవ్వుతున్నావు?'' ప్రశ్నించాడు శివుడు.
''ఎందుకేమిటి స్వామీ, మీ అమాయకత్వానికి, వెంకయ్యనాయుడి నటనా చాతుర్యానికి నవ్వురాక మరేమి వస్తుంది?'' అంటూ మళ్ళీ నవ్వింది! పార్వతి.
''కొంతైనా వివరించు దేవీ!'' అన్నాడు అమాయకంగా శివుడు.
''ఏ భక్తుడైనా గుడికి ఎందుకు వస్తాడు? తన కోర్కెలు, సమస్యలు తీర్చమని చెప్పుకోవటానికే వస్తాడు! సమస్య వ్యక్తిగతమైనదైతే మనసులో చెప్పుకుంటాడు. అది ప్రజలందరికీ సంబంధించినదైతే, ధైర్యంగా బయటకే చెప్పుకుంటాడు. ఏ కోర్కె లేనివాడు గుడికి రాడు! ఆఖరికి మోక్షం కావాలంటే అదీ కోర్కెనే కదా! కోర్కెలు తీరని భక్తులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తారు! అందులో తప్పేమి ఉంది?'' అన్నది పార్వతి.
శివుడు, నారదుడు అయోమయంగా మొహాలు చూసుకున్నారు. వారి పరిస్థితే అట్లా ఉంటే ప్రమధగణాలకు అసలే అర్థం కావటం లేదు.
''ఇందులో అర్థం కాని విషయమేముంది? ప్రజల సమస్యలు చర్చించి, వాటి పరిష్కారానికి, మంచి చట్టాలు చేసే అత్యున్నత ప్రజాస్వామ్యవేదిక పార్లమెంట్! అందువల్ల అది అత్యంత పవిత్రం! గర్భగుడితో అందుకే పోల్చారు! అయితే ఇక్కడే ఉంది అసలు తమాషా! రైతు చట్టాలు, విద్యుత్ చట్టం, పెగాసస్ స్పైవేర్ గురించి చర్చించాలని సభను అడ్డుకున్నారు! సభలో నిరసనలు తెలిపారు! అందువల్ల ప్రజాస్వామ్యం యొక్క పవిత్రతను నిలబెట్టే ప్రయత్నం చేశారు! ప్రజలు వారికి అప్పగించిన బాధ్యతను నెరవేర్చారు! ఇంకా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు పవిత్రతను దెబ్బతీస్తుంటే, ప్రతిపక్షాలు పవిత్రతను కాపాడుతున్నాయి!'' అన్నది పార్వతి.
''భక్త కన్నప్ప, తాను వేటాడిన మాంసాన్ని తెచ్చి, గర్భగుడిలో మీ లింగ రూపానికి తినిపిస్తే, మీరు చక్కగా ఆరగించారు గదా! అప్పుడు గర్భగుడి అపవిత్రం కాలేదేమి? ఇప్పుడు మాత్రం ప్రజా సమస్యలు చర్చించండి మొర్రో! అని మొత్తుకుంటుంటే పవిత్రత పోతున్నదా! ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు కదా! మరి గత ఏడేండ్లుగా పార్లమెంటులో ఎన్ని బిల్లులపై చర్చలు జరిపిన వాటిని చట్టాలు చేశారు. పోనీ గత తొమ్మిది నెలలుగా వ్యవసాయ చట్టాలపై, ఎండ, వాన, చలికి ఎదురొడ్డి పోరాడుతున్న రైతులతో, ప్రధానమంత్రి చర్చించనే లేదు! రైతులు గర్భగుడిని అపవిత్రం చేయకుండానే పోరాడుతుంటే, వారినెందుకు పట్టించుకోవటం లేదు!'' ప్రశ్నించింది పార్వతి.
పరమశివుడు అవునన్నట్టు తలుపాడు.
''దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మికులకు సంక్షేమం కలిగించే చట్టాలను, వారిని దోచుకునే యజమానులకు అనుకూలంగా మార్చింది ఈ గర్భగుడిలోనే కదా! కార్మికుల తరఫున ఏవరైనా మాట్లాడుతారేమోనని, ప్రతిపక్ష సభ్యులను, ముఖ్యంగా కమ్యూనిస్టులను గర్భగుడి బయటకు గెంటివేసి, చట్టాలను కోడ్స్‌గా మార్చినప్పుడు, గర్భగుడి పవిత్రత మంటగలిసింది కదా! అప్పుడు ఎవరికీ కన్నీరు రాలేదెందుకు?'' ఆవేశంగా ప్రశ్నించింది! పార్వతి.
''కరోనా కాటుకి ఆక్సిజన్ అందక, వేలాది మంది ప్రజల ఊపిరి ఆగిపోయింది! ఇది లోకానికంతా తెలుసు, అయినా ఆక్సిజన్ అందక ఒక్కరూ చనిపోలేదని గర్భగుడిలోనే మంత్రులు ప్రకటన చేస్తే వెంకయ్యనాయుడి కళ్ళకు గంతలు, చెవుల్లో ఇయర్స్ ఉన్నాయా? 75సంవత్సరాలుగా ప్రజల డబ్బులతో, కార్మికుల శ్రమతో అభివృద్ధి చెందిన ప్రభుత్వరంగ సంస్థలను, ప్రయివేటు వ్యక్తులకు అమ్ముతామని ఆర్థిక మంత్రి ప్రకటిస్తుంటే అప్పుడు పార్లమెంటు పవిత్రత మంటగలవలేదా?''
పరమశివుడికి క్రమంగా కోపం వస్తున్నది!
''ఈరోజు దేశంలో నా బిడ్డలు, నానా అగచాట్లు పడుతున్నారంటే దానికి కారణం గర్భగుడిగా చెబుతున్న పార్లమెంటులో అధికారం చెలాయించుతున్న ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక చట్టాలు, నిర్ణయాలు చేయటమే! అందువల్ల పార్లమెంటు పవిత్రత, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చట్టాలు చేస్తే పోతుంది! కాని ప్రజా సమస్యలపై చర్చిస్తే పోదు!'' అన్నది పార్వతి!
''ఒకవంక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్టాలు పార్లమెంటులోనే చేస్తూ, మరోపక్క గర్భగుడి, పవిత్రత లాంటి పదాలు వాడుతూ, కన్నీరు పెట్టుకోవటం దేనికి? గతంలో ప్రధాని, ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎందుకిలా చేస్తున్నారు?'' ప్రశ్నించాడు పరమశివుడు కోపంగా.
''ఎందుకంటే ప్రజలు కూడా మీలాగే భోళాశంకరులుగా ఉంటారని, ఉండాలన్నదే వారి కోరిక! చిన్న, పెద్దా సెంటిమెంట్లు ప్రయోగించి ప్రజలను బోల్తా కొట్టించాలని వారి ప్రయత్నం! మొదట్లో రాములవారి గుడి, ఆ తర్వాత దేశభక్తి, ఆపై పొరుగుదేశాలపై వ్యతిరేకత, వీలైతే పొరుగుదేశాలతో ఘర్షణలు పెట్టుకుని, యుద్ధ వాతావరణం తీసుకుని రావటం, మధ్యలో ఏ పాపమెరుగని గోమాతను ఇరికించటం ఇలాంటి వెన్నో ప్రయోగించి, ప్రజలను ఏమార్చుతున్నారు! ఇప్పుడు ప్రజా సమస్యలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు చర్చించాలని పట్టుపడితే, గర్భగుడిలో పవిత్రత పోయిందని కన్నీరు పెడుతున్నారు! ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరు! మీరు ఎంత భోళాశంకరులైనా, వాస్తవం తెలిసిన మరుక్షణం మీ మూడోకంటి చూపుతో భస్మం చేస్తారు కదా! ప్రజలు కూడా మూడోకన్ను తెరిచే రోజు వస్తుంది!'' అన్నది పార్వతి.
పరమశివుడు శాంతించాడు. నారదుడు సెలవు తీసుకున్నారు.
- ఉషాకిరణ్