Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ స్వాతంత్య్రం 74ఏండ్లు పూర్తి చేసుకుని 75వ యేట అడుగు పెడుతోంది. నిజంగా ఇది దేశానికి చాలా కీలకమైన తరుణం. స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలు, ఆదర్శాలు గణతంత్ర రాజ్యాంగ రూపకల్పనకు తోడ్పడ్డాయి. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చుక్కానిగా మారాయి. కానీ ఆ లక్ష్యాలు, ఆదర్శాలు కొంత కాలంగా తుడిచిపెట్టుకు పోతున్నాయి. అయితే బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గుణాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. 2014 నుండి, హిందూత్వ విధానం, నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం విష కలయిక కొనసాగుతోంది. ఇది స్వాతంత్య్రోద్యమ పోరాట ఆదర్శాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, జాతీయ సార్వభౌమాధికారానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను స్వాధీనం చేసుకుని, వాటిని నాశనం చేయడం ద్వారా హిందూ రాష్ట్రం సాధించాలన్న లక్ష్య సాధన కోసం బీజేపీ-ఆర్ఎస్ఎస్ సుదీర్ఘ ప్రయాణం ఆరంభించాయి.
గత మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలను పరిశీలించినట్లైతే, వారు ఊహించుకుంటున్న నూతన భారతదేశం ఆకృతి ఎలా ఉంటుందో ఎవరైనా గ్రహించవచ్చు. 2018 ఆగస్టు 15న మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేస్తూ, 2022 నాటికి అంటే దేశ 75వ వార్షికోత్సవం నాటికి నూతన భారతాన్ని రూపొందించడం గురించి మాట్లాడారు. వారు పేర్కొంటున్న ఆ 'నూతన భారతం' అంటే అర్థమేంటో తదనంతర కాలంలో వెల్లడి కావడం ఆరంభమైంది. 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసిన పది రోజులకు, ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేస్తూ... 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం' అన్న ఆలోచనను, సర్దార్ పటేల్ కలలుగన్న స్వప్నం 'ఏక్ భారత్, శ్రేష్ట భారత్'ను అమలు చేశామని చాలా గర్వంగా ప్రకటించారు. ఇది, ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చిన 'అఖండ్ భారత్' లాగానే ఉంది.
అదే ఏడాది డిసెంబరులో, పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో రూపొందించారు. మొట్ట మొదటిసారిగా పౌరసత్వాన్ని, మతపరమైన ప్రామాణికాలకు ముడిపెట్టారు. లౌకికవాద దేశంలో పౌరసత్వం యొక్క మౌలిక భావనకు ఇది విరుద్ధంగా ఉంది.
ఆ తర్వాత సంవత్సరం 2020లో, కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో, ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ సమక్షంలో ప్రధాని ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. విమోచనా దినంగా మోడీ ఆనాడు ప్రకటించారు. పది రోజుల తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రసంగిస్తూ, దశాబ్దాల తరబడి కొనసాగుతున్న రామ జన్మభూమి సమస్యకు శాంతియుత ముగింపును సాధించామని ప్రకటించారు. ఈ 'శాంతియుత' ముగింపు వెనుక హింస, రక్తపాతం నిండి ఉన్నాయి. 1992 డిసెంబరులో బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన తర్వాత వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, మోడీకి ఆలయం వేరొకదాన్ని కూడా సూచిస్తోంది. ''అభివృద్ధి కోసం జరిగే బృహత్తరమైన యజ్ఞంలో ప్రతి భారతీయుడు ఏదో ఒక దాన్ని త్యాగం చేయాలి'' అని వ్యాఖ్యానించారు. ఆ రకంగా ఆలయం జాతీయాభివృద్ధికి ఒక చిహ్నంగా మారింది. దీనికోసం ప్రతి భారతీయుడు త్యాగం చేయాలి.
ఆ రకంగా గత రెండు సంవత్సరాల్లో నూతన భారతదేశం చిహ్నాలు (అయోధ్యలో రామాలయం, నూతన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని నాశనం చేయడం) ఆవిర్భవించాయి. ఇవి, వరుసగా లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై దాడిని సూచిస్తాయి.
'నూతన భారతదేశం' అనేది హిందూత్వ నిరంకుశవాదం, కార్పొరేట్ నయా పెట్టుబడిదారీవాదం యొక్క విషపూరితమైన కలయికే. 'నూతన భారత' లక్ష్యాన్ని ప్రధాని మోడీ ప్రకటించిన మూడేండ్ల నుండి కార్పొరేట్ పన్నుల్లో తీవ్రంగా కోత విధించడం చూశాం. బడా కార్పొరేట్లు తీసుకున్న లక్షల కోట్ల రూపాయిల రుణాలను రద్దు చేశారు. పెద్ద ఎత్తున ప్రయివేటీకరణ ద్వారా ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వ్యవసాయ వాణిజ్యంలోకి, మార్కెటింగ్‌లోకి కార్పొరేట్ల ప్రవేశానికి వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు పార్లమెంట్లో ఆమోద ముద్ర పొందాయి. తీవ్ర అసమానతలు కలిగిన భారతదేశాన్ని సృష్టిస్తున్నారు. క్రెడిట్ సూసె వెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం, టాప్ ఒక శాతం మంది సంపద వాటా 2020 చివరి నాటికి 40.5శాతం పెరిగింది. 2020లో కోటీశ్వరుల సంఖ్య 102 ఉండగా, 2021 నాటికి 140కి చేరుకుందని ఫోర్బ్ నివేదిక అంచనా వేసింది. అదే సమయంలో మరో వైపు దుర్భర దారిద్య్రం అనూహ్యమైన స్థాయిల్లో పెరిగిపోయింది. కరోనా మహమ్మారి సమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
2020లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు మోడీ ఆత్మనిర్భర్ భారత్ నినాదమిచ్చారు. అంటే నూతన భారతదేశం స్వావలంబనతో ఉండాలని ఆకాంక్షించారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంకా ఒక అడుగు దూరంలోనే ఉన్నందున, భారత్ వంటి దేశానికి తన స్వంత కాళ్ళపై నిలబడడం, స్వావలంబన సాధించడం చాలా ముఖ్యం, అవసరం కూడా. కానీ ఇక్కడ నయవంచన స్థాయి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
స్వావలంబన గురించి మోడీ ప్రకటించిన తర్వాత, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో వ్యూహాత్మక రంగాలకు మినహాయింపు ఉంది. అయితే వ్యూహాత్మక రంగాల్లో కూడా గరిష్టంగా నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఒక్కో రంగంలో ఉంటాయి. రక్షణ ఉత్పత్తి రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల వనరులు ఉపయోగించి నిర్మించుకుంటూ వచ్చిన ప్రభుత్వ రంగాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారతదేశంలోని బడా కార్పొరేట్లను, విదేశీ కంపెనీలను అనుమతించడానికే ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. ఈ చర్యలన్నీ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తాయి.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడం నయా ఉదారవాద విధానాల్లో ఒక భాగం. ఈ విధానాలను దూకుడుగా ఆచరించడం వల్ల రాజకీయ వ్యవస్థపై, ప్రజాస్వామ్యం క్షీణించడంపై ప్రమాదకరమైన ప్రభావాలు ఉన్నాయి. రాజకీయాలు, బడా వ్యాపారవేత్తల మధ్య సంబంధాలు మరింతగా బహిర్గతమయ్యాయి. ఈ బంధాలకు చక్కని ఉదాహరణ ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ. దీనివల్ల పార్లమెంట్ విలువ తగ్గిపోతోంది. ఎన్నికల్లో వచ్చిన తీర్పులను విచ్ఛిన్నం చేసి, రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ఫిరాయింపులు చోటు చేసుకుంటున్నాయి. నూతన భారతదేశం, అరకొర ప్రజాస్వామ్యం పర్యాయపదాలుగా మారిపోయాయి. ఆ రకంగా భారతదేశ పునర్నిర్మాణం వడివడిగా సాగిపోతోంది. మోడీ ప్రభుత్వానికి కరోనా మహమ్మారి తీవ్ర సవాలు విసరడంతో ఈ ప్రాజెక్టు కాస్తంత నెమ్మదించింది. ఈ నూతన భారత దేశానికి, ఆధునిక, లౌకికవాద, శాస్త్రీయ దృక్పథం కలిగిన సమాజం ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదు. హిందూ రాష్ట్ర బ్లూ ప్రింట్ ఆధారంగానే ఈ నూతన భారత నిర్మాణం సాగుతోంది. స్వాతంత్య్రోద్యమ పోరాటానికి దూరంగా ఉన్న, లౌకికవాద సామ్రాజ్యవాదంతో ఎలాంటి సంబంధం లేని శక్తులు ఈ నూతన భారతాన్ని రూపొందిస్తున్నారు.
ఈ బూర్జువా ఉదారవాద భారత దేశ ఆలోచన గురించి వినడం, దానిపై దృష్టి పెట్టడం ఇకపై సాధ్యం కాదు. హిందూత్వ నూతన భారతదేశానికి ప్రత్యామ్నాయం నూతన సామాజిక పొందికతో ఆవిర్భవించాలి. ప్రజా పోరాటాలు, ప్రతిఘటనల ద్వారానే ఈ పొందిక ఆవిర్భవించాలి.
వారు ఆశించిన 'నూతన భారతదేశా'నికి సవాలు... వర్గ, ప్రజా పోరాటాల రూపంలో ఇప్పటికే రూపు దిద్దుకుంటోంది. చారిత్రాత్మక రీతిలో తొమ్మిది మాసాలుగా సాగుతున్న రైతుల పోరాటం కార్పొరేట్ హిందూత్వ పాలన పునాదినే సవాలు చేసింది. అంతకు ముందు, సీఏఏ-ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చెలరేగిన ప్రజా పోరాటాలు, నిరసనలు చూసినట్లైతే చైతన్యవంతులైన పౌరులు ఉన్నారని రుజువైంది. వారు మెజారిటీవాద మతోన్మాదం వ్యాప్తి చెందడాన్ని అనుమతించరని స్పష్టమైంది. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సాగిస్తున్న ప్రజా పోరాటాలు కొత్త ప్రామాణికాలను నెలకొల్పుతున్నాయి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం ఇందుకు ఉదాహరణ. రక్షణ ఉత్పత్తి కార్మికులు, బీమా ఉద్యోగులు, ఇతర రంగాల వారి పోరాటాలతో నయా ఉదారవాద విధానాల పట్ల ప్రతిఘటన మరింత పెరుగుతోంది.
ఈ ప్రతిఘటన, ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుంది. వామపక్షాలు, ప్రజాతంత్ర కార్యక్రమం ప్రాతిపదికగా ఈ ప్రత్యామ్నాయం ఉంటుంది. అటువంటి కార్యక్రమాలే స్వాతంత్య్రోద్యమ పోరాటాల లక్ష్యాలైన రాజకీయ, ఆర్థిక, ప్రజల సామాజిక విముక్తి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. ఇక చేయాల్సిం దల్లా, ఇటువంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం కోసం విస్తృత వర్గాలకు చెందిన కార్మికులు, ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులన్నిటినీ సమీకరించి, సంఘటితం చేయడమే.
- పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం