Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాయం ఒకడికి తీపి
ఎప్పుడూ జోలెలో వేసుకొని తిరుగుతుంటాడు
ఒకడికి గాయం చేదు
ఎప్పుడూ ఎవరో ఒకరి
కన్నీళ్ళను తాగుతుంటాడు
గాయం ఒకడికి పాట
కారుతున్న నెత్తురుకు పూసుకొని
నవ్వుతుంటాడు
ఒకడికి గాయం ఆట
ఇంకొకరిని నిద్రపోనివ్వకుండా
పావులు కదుపుతాడు
అసలు గాయం కానీ,గాయం చేయని
మనిషి ఉంటాడా
మనసుంటుందా
చోటుంటుందా ఎక్కడైనా?
కొన్ని కొన్ని సార్లు
రూపాలను మార్చుకుంటుంది తప్ప!
దిక్కులను జేబులేసుకొని తిరుగుతూ
ఏ కొమ్మ మీద కూర్చొని
ఎటువైపు వెళ్ళినా
గాయం తాలూకా పచ్చివాసనలే
ప్రపంచాన్నంతా ఎక్కడికక్కడికి
అక్షాంశాలు, రేఖాంశాలుగా విడగొట్టి
రాత్రి, పగళ్ళుగా
తవ్వి పారేసినా
గుప్తనిధుల్లా బయటికొచ్చే
ఆత్మబంధువులు గాయాలే!
గాయం లోలోంచి కనులను తెరిపించే
దేహపు కిటికీ
మనిషిని
మనిషివని గుర్తుచేసే
కాలసంతకం
ఎలా జీవించాలో
ఎలా జీవించకూడదో చెప్పే
ఏకైక జీవనవ్యాకరణం
- తండ హరీష్ గౌడ్, 8978439551