Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీ చాంబర్స్ ఖాళీ చేస్తూనో, మురికి కాలువల్లో పూడిక తీస్తూనో, దేశంలో రోజూ, ఏదో ఒక చోట పారిశుద్ధ్య కార్మికులు చనిపోతున్నప్పటికీ, మీడియాలో పెద్దగా వార్తలు కావడం లేదు. అధికార వ్యవస్థలకు పట్టింపుగా లేదు. పౌర సమాజం మొద్దుబారిపోయింది. బాధి తులంతా నిరుపేదలు, నిరక్షరాస్యులు, దళితులు కావడం వల్ల, వీరిపై ఎడతెగని, అంతులేని వివక్షలు వ్యవస్థీకతంగా సాగుతున్నాయి.
హైదరాబాద్ వనస్థలిపురం పద్మావతి కాలనీలో డ్రైనేజీ పూడికతీత పనుల ప్రమాదంలో ఇటీవల ఇద్దరు కార్మికులు శివ, అనంతయ్య మృతి చెందిన ప్రాంతాన్ని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దర్, కమిషన్ సభ్యులు రాములు 2021 ఆగస్టు 10న పరిశీలించారు. మాన్యువల్ స్కావెంజింగ్ పనులపై జాతీయ స్థాయిలో నిషేధం ఉన్నప్పటికీ, పనులు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారని జీహెచ్ఎంసీ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా సంబంధిత కాంట్రాక్టర్ రాత్రివేళల్లో పని చేయించడం నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేయించడం ఇంకా నేరం అని వారన్నారు. మృతి చెందిన కార్మికులు శివ, అనంతయ్య ఇండ్లకు వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల చొప్పున అందజేసినట్టు, సంబంధిత కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసినట్టు, జిహెచ్ఎంసి అధికారులు ఎస్సీ కమిషన్‌కు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు, నెలకు ఐదు వేల రూపాయల చొప్పున పింఛన్ సౌకర్యాలను అందించాల్సి ఉంటుందని అరుణ్ హల్దర్ జిహెచ్ఎంసి అధికారులకు తెలిపారు.
''ఏ దేశమూ తన ప్రజలని చావు కోసం, విష వాయువుల గదుల్లోకి పంపదు. కానీ, మన దేశంలో ప్రతి నెలా నలుగురైదుగురు కార్మికులు పారిశుద్ధ్యపనుల్లో తమ ప్రాణాలు కోల్పోతున్నారని, 2019 సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జాతీయ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2018లో 14 రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన సర్వే ప్రకారం మన దేశంలో 87,913 మంది మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికులు ఉన్నట్టు వెల్లడయింది. కాగా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2020 సంవత్సరానికి ముందు జరిగిన 27ఏండ్లలో, దేశంలో 1013 మంది మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికులు చనిపోయారు. ఈ కేసులను పరిశీలిస్తే 462 కేసుల్లో మాత్రమే ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. కేవలం 418 కేసుల్లో భారత శిక్షా స్మృతిలోని 304 (నిర్లక్ష్యం వల్ల చనిపోవడం) అనే సెక్షన్ కింద కేసులు నమోదైనాయి. 44 కేసులు యాక్సిడెంట్ చావుల కింద నమోదయ్యాయి.
మాన్యువల్ స్కావెంజింగ్ పనులను మనుషులు చేయకుండా నిషేధిస్తూ, 2013లో భారత పార్లమెంటు చట్టం చేసింది. దాని పేరు ''ఉద్యోగులుగా మ్యాన్యువల్ స్కావెంజర్ల నియామకాల నిషేధం, పునరావాస చట్టం''.ఈ చట్టం ప్రకారం, ప్రమాదకరమైన సెప్టిక్ ట్యాంకులు, మురికి కాలవల్లో, డ్రైనేజీ చాంబర్లలో ఏ వ్యక్తితోనైనా, ఏ వ్యక్తిగానీ, స్థానిక అధికారులుగానీ, ప్రభుత్వంగానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పని చేయించడం శిక్షార్హమైన నేరం. ఇలాంటి నేరానికి పాల్పడినందుకుగాను, రెండేళ్ళ వరకూ జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల వరకూ జరిమానా లేదా రెండూ విధించ వచ్చునని ఈ చట్టం చెబుతున్నది.
2020 డిసెంబర్ 31కి ముందు గడిచిన ఐదేండ్లలో, దేశంలో మొత్తం 340 మంది మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికులు చనిపోయినట్లు ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కి తెలియజేసింది. జూలై 28న రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖా మంత్రి రాందాస్ అథవాలే సమాధానమిస్తూ, గడిచిన ఐదేండ్లలో దేశంలో మ్యాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుల మరణాలు ఎక్కడా సంభవించినట్టు మాకు ఎటువంటి నివేదికలు అందలేదని తెలిపారు.
2018లో రామన్ మెగసే అవార్డీ, జాతీయ సఫాయి కర్మచారి ఆందోళన్ కన్వీనర్ బెజవాడ విల్సన్ తెలిపిన వివరాల ప్రకారం, 2016 నుంచి 2020 వరకు, 472 మంది మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుల మరణాలు దేశంలో సంభవించాయి. 2021లో 26 మంది స్కావెంజింగ్ కార్మికులు చనిపోయారు. అసలు ఇలాంటి చావులు జరగడమే పెద్ద అమానుషం. కాగా ఇలాంటి చావుల వివరాలను వెలుగులోకి రాకుండా వాస్తవ సంఖ్యలను ప్రభుత్వాలు తగ్గించి చూపడం ఇంకా అమానుషమని బెజవాడ విల్సన్ అన్నారు. ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కి ఇచ్చిన సమాధానం ప్రకారం, 2016-2020 మధ్య కాలంలో తెలంగాణలో మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుల మరణాలు నాలుగు జరిగాయి. సఫాయి కర్మచారి ఆందోళన్ ప్రకారం ఏడు జరిగాయి. 2019 ముందు రెండేండ్లలో తెలంగాణలో ఇలాంటి మరణాలు 27 వరకూ జరిగాయని మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన కోసం తెలంగాణలో కృషి చేస్తున్న అడ్వకసీ గ్రూప్ అంచనా వేసింది.
సఫాయి కర్మచారి ఆందోళన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సరస్వతి అంచనా ప్రకారం హైదరాబాద్‌లో కనీసం 1800 మంది మ్యాన్యువల్ స్కావెంజింగ్ వర్కర్స్ ఉన్నారు. మాన్యువల్ స్కావెంజింగ్ పనిని, మానవ రహితంగా నిర్వహించేందుకు జిహెచ్ఎంసి ఇటీవల యాంత్రికీకరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా 130 యంత్రాలను ప్రవేశపెట్టింది. ఒక్కొక్క మిషిన్ ఖరీదు 40 లక్షల రూపాయలు. దళిత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీస్ (డిక్కి) వారి సహాయంతో పదిశాతం డౌన్‌పేమెంట్‌తో, ఇందులో 50 మిషన్లను మాజీ స్కావెంజింగ్ వర్కర్స్ పొందగలిగారు. యంత్రాలకు యజమానులమైనా, మళ్ళీ అదే మురికి పని పరిస్థితుల్లోనే తాము ఉండిపోవాల్సి వస్తున్నదని ఇప్పుడు, ఈ ''దళిత పారిశ్రామికవేత్తలు'' వాపోతున్నారు.
సెప్టిక్ ట్యాంకులు మనుషులు శుభ్రం చేయడానికి వీలుగా నిర్మించబడి లేవు. ఈ సమస్యను స్వచ్ఛ భారత్ కార్యక్రమం సైతం పట్టించుకోలేదు. 2015లో మ్యాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుల పని పరిస్థితుల మీద సర్వే చేసినప్పుడు, దుర్గంధ వాయువుల నుంచి స్కావెంజింగ్ కార్మికులను రక్షించుకోడానికి చేతి రుమాలులు సరిపోతాయని సంబంధిత కాంట్రాక్టర్లు కొందరు అనడం ఎంతో అన్యాయం. విడ్డూరం. మ్యాన్యువల్ స్కావెంజింగ్ కార్మికులు చనిపోయిన ప్పుడు ప్రభుత్వాలు నేరుగా బాధ్యత వహించడం లేదు. ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్ మీదకు బాధ్యతను నెట్టివేస్తున్నది. మృతి చెందిన మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుడి గురించి సదరు కాంట్రాక్టర్ ''పనిలోకి రాకుండా పారిపోయాడు'' అని అబద్ద మాడి తప్పించుకోచూస్తాడు!
దేశంలో మ్యాన్యువల్ స్కావెంజింగ్ పనుల్లో ఉన్నది తొంభైయైదు శాతం దళితులే. ఐదు శాతం మంది ఆదివాసులు ఉన్నారు. నిజానికి పాకీవృత్తి కులంతో ముడిపడి ఉన్నది. ఆధిపత్య కుల వ్యవస్థ యొక్క హీన రూపమే కొన్ని సాంఘిక సమూహాలను పాకీ వృత్తిలోకి నెట్టివేయడం అనేది. సమాజం మల మూత్రాల మురికి కాల్వగా మారితే, పరిశుద్ద మానవులు మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికులు. సమాజం చెత్త కుప్పగా, కుప్పతొట్టిగా మారితే, రోగాల బారిన పడకుండా శుభ్రం చేసిన వాస్తవ స్వచ్ఛ సైనికులు వారు. యాచకవృత్తిలో ఉన్న వారిని సమాజం ముట్టుకుంటది. కొండొకచో గౌరవిస్తుంది. కానీ పాకీవృత్తిదారులను, సమాజం అంటరాని వారికి అంటరానివారిగా పరిగణిస్తున్నది. ఇది చాలా అసాంఘికమైనది. అన్యాయమైనది. వారి జీవితా లకు అంటిస్తున్న పంకిలాన్ని ఇప్పటికైనా మాను కోవాలి. మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికులు ఈ విధమైన దోపిడీ పీడనలకు, తీవ్ర సామాజిక వివక్షకు గురవుతున్నప్పుడు, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం (1989)ను వర్తింపజేసి, తగిన భద్రత, రక్షణ కల్పించవలసి ఉంటుంది. కానీ, ఎక్కడా ఇది అమలు కావడం లేదు. అంతే కాదు, పదిహేడవ అధికరణం కింద, అంటరానితనం, కుల వివక్షలను నిషేధించిన రాజ్యాంగాన్ని ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలు కూడా ఉల్లంఘిస్తూ ఉండటం వాటి బాధ్యతా రాహిత్యాలకు పరాకాష్టగా చెప్పుకోవాలి.
సఫాయి కర్మచారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2014)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, రాష్ట్రాలు చట్టాలకు కట్టుబడి తమ విధులను పాటించకపోవడం, మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుల విషయంలో రాజ్యాంగాన్ని (అధికరణం పదిహేడును), సంబంధిత చట్టాలను ఉల్లంఘిం చడమేనని స్పష్టం చేసింది.
- కృపాకర్ పొనుగోటి
సెల్: 9948311667