Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైకి చాలా సరళంగా కనిపించే సామ్యాలు కొన్నిసార్లు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. కొన్ని సామ్యాలు ప్రమాదకరమైనవి కూడా. ప్రభుత్వ నిర్వహణ గురించి చర్చించేటప్పుడు తరచూ దానిని ఇంటి నిర్వహణతో పోల్చి మాట్లాడడం ఇటువంటిదే. ఒక ఇంటికి వచ్చే ఆదాయానికి మించి ఖర్చులు చేయడం ఎంతో కాలం పాటు కొనసాగించడం సాధ్యం కాదని, ఏదో ఒక దశలో అప్పులవాళ్ళు కొత్త అప్పులు ఇవ్వడం మానేయడమే గాక, పాత బకాయిల కింద ఇంట్లో ఉన్న సామాన్లని కూడా స్వాధీనం చేసుకుంటారని అందరికీ తెలుసు. ఈ పరిస్థితితో ప్రభుత్వ నిర్వహణను పోల్చి ప్రభుత్వాలు ఎల్లకాలమూ అప్పులు చేస్తూ పోవడం సాధ్యం కాదని, అప్పులిచ్చినవాళ్ళు కొత్త అప్పులను ఇవ్వకపోవడమే గాక, ప్రభుత్వ ఆస్థులను పాత బకాయిలకింద జప్తు చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్తుంటారు.
ఈ విధమైన వాదనను మనం ఇప్పటికి చాలా సార్లు వినివున్నాం. అటు బ్రెట్టన్‌వుడ్ సంస్థలు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ గాని, ఇటు బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా మన ఆర్ధిక మంత్రి గాని ద్రవ్యలోటును ఎందుకు పరిమితం చేయాలో వివరించేటప్పుడు ఇటువంటి వాదనలనే వినిపిస్తారు. ప్రభుత్వం తన స్థోమతకు మించి ఎంత మేరకు అప్పు చేస్తోంది అన్నది తెలియజెప్పే కొలమానం ఈ ద్రవ్యలోటు. కాబట్టి ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్నది అంటే ప్రభుత్వం మరిన్ని కష్టాలను కొనితెచ్చుకుంటున్నది అని భావించాలి - ఇదీ ఆ వాదన సారాంశం. ఈ వాదనను సమర్ధించుకోడానికే ప్రభుత్వ నిర్వహణను ఒక ఇంటి ఆర్ధిక నిర్వహణతో పోల్చి మాట్లాడతారు.
ఐతే ఇక్కడ కొంత రాయితీ ఇస్తారు. దేశ జీడీపీ వృద్ధి చెందుతున్నప్పుడు దాని పర్యవసానంగా ప్రభుత్వానికి వచ్చే పన్ను రాబడి కూడా వృద్ధి చెందుతూవుంటుంది. కనుక జీడీపీతో పోల్చినప్పుడు ఒకే స్థిర నిష్పత్తిలో గనుక ద్రవ్యలోటు కొనసాగుతున్నట్టయితే ఆ మేరకు ద్రవ్యలోటులో పెరుగుదల ఉన్నా దానిని అనుమతించవచ్చు. (జీడీపీ వృద్ధి రేటు పెరిగినప్పుడు ఆ మేరకు ద్రవ్య లోటును కూడా పెంచుకోవచ్చు) అప్పుడు జీడీపీతో పోల్చి దేశానికి ఉన్న అప్పును చూస్తే అది ఒకే మోతాదులో కొనసాగుతుంది కనుక పరవాలేదన్నమాట. ఆ అప్పుకు చెల్లించే వడ్డీరేటు జీడీపీ వృద్ధి రేటు కన్నా ఎక్కువ మాత్రం ఉండకూడదు. అప్పుడు అప్పుకు, ఆదాయానికి మధ్య నిష్పత్తి ఒకే విధంగా కొనసాగుతుంది గనుక సర్దుకోవచ్చు. అదే ఆ పరిమితికి మించి గనుక అప్పు చేసి ద్రవ్యలోటును పెంచితే దేశ ఆర్ధిక నిర్వహణ అదుపు తప్పిపోతుంది. అందుకే జీడీపీలో ఒక నిర్దిష్ట శాతంకు మించకుండా ద్రవ్యలోటు ఉండాలని ( మన దేశానికి 3 నుంచి 4 శాతం) పరిమితి విధిస్తారు. - ఇదే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు చేసే వాదన.
ఈ విధంగా ఒక ఇంటి నిర్వహణతో పోల్చి దేశ ఆర్ధిక నిర్వహణను నిర్దేశించడం పూర్తిగా తప్పు. అంతేగాక ఇది ప్రమాదకరం కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవ్యలోటు పరిమితికి మించి ఉండకూడదన్నదే ఈ వాదన సారాంశం. అందుకోసం ప్రభుత్వ వ్యయాన్ని పరిమితి దాటనివ్వకుండా చూస్తారు. దేశంలో స్థూల డిమాండ్ పడిపోయి, దాని ఫలితంగా భారీ స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యయం పెరగకూడదనే ఆదేశిస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఈ తప్పుడు సామ్యం ముందుకు తెచ్చి (ఇంటి నిర్వహణకు ప్రభుత్వ నిర్వహణకు సామ్యం) లక్షలాదిమంది శ్రామికవర్గ ప్రజల జీవితాలను దానికి బలిచేస్తారు.
ప్రభుత్వం విదేశాల నుంచి అప్పులు తెస్తే తప్ప మన దేశ ఆస్తులపై హక్కు కోల్పోవడం అన్న ప్రసక్తి తలెత్తదు. ఎప్పుడు అప్పులు విదేశాల నుంచి తేవాల్సిన అగత్యం ఏర్పడుతుంది ? మన ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచినప్పుడు పెరిగిన డిమాండ్ ను దిగుమతులద్వారా అందుకోవడం అన్నది జరిగితే అప్పుడు సంపద బైటకు జారుకుంటుంది. దానిని భర్తీ చేయడానికి విదేశాల నుంచి అప్పులు తేవలసిరావచ్చు. ఐతే అటువంటి పరిస్థితి రాకుండా దిగుమతులపై సుంకాలను పెంచడం, ఆంక్షలు విధించడం, ప్రభుత్వ వ్యయాన్ని తగిన పద్ధతిలో నియంత్రించి దిగుమతులు పెరిగే దిశగా డిమాండ్ పెరగకుండా చూసుకోవడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టవచ్చు.
కనుక విదేశాల నుంచి అప్పులు తెచ్చే సందర్భాన్ని పక్కన పెట్టవచ్చు. అప్పుడు ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచుకోవడం కోసం అప్పులు చేయవలసివస్తే ఆ అప్పుల్ని ఈ దేశంలో ఉండే వ్యక్తుల నుంచి సంస్థల నుంచి సేకరిస్తుంది. ఆ వ్యక్తులపైన గాని, సంస్థలపైన గాని పన్నులు విధించే సార్వభౌమాధికారం ఈ ప్రభుత్వానికి పూర్తిగా ఉంది కదా. ఒకవేళ ద్రవ్యలోటు బాగా పెరిగిపోతూవుంటే, ప్రభుత్వం ఎప్పుడైనా పన్నుల రేట్లను పెంచి, తద్వారా ఆదాయాన్ని పెంచుకుని, అప్పు భారం పరిమితికి లోబడివుండేలా చూసుకోవచ్చు.
ఇక ఇంటి నిర్వహణ విషయంలో ఈ విధంగా చేయడం సాధ్యపడుతుందా ? అప్పు ఇచ్చేవారిపై మనకు సార్వభౌమాధికారం ఏమీ ఉండదు కదా. కాని ప్రభుత్వానికి ఉంటుంది. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పన్నులు పెంచవచ్చు. తద్వారా ఆర్ధిక పరిస్థితి అదుపు తప్పిపోకుండా చూసుకోవచ్చు.
ప్రభుత్వం కోరిసప్పుడల్లా అప్పులివ్వడానికి దేశంలో వ్యక్తుల వద్ద, సంస్థల వద్ద తగినంత నిల్వలు ఉండాలి కదా ? వారికి మాత్రం ఏ విధంగా వస్తాయి? అన్న ప్రశ్న వస్తుంది. ఐతే ఈ ద్రవ్యలోటు ఏవిధమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అన్నది ఇక్కడ చూడాలి. ద్రవ్యలోటు పెరగడం అంటే ప్రభుత్వ వ్యయం పెరగడం. పెరిగిన ఈ వ్యయాన్ని సక్రమంగా నియంత్రించితే ( దిగుమతుల వైపు దారి తప్పిపోకుండా చూసుకుంటే) వ్యయం పెరిగిన మేరకు అదనంగా స్థూల డిమాండ్ పెరుగుతుంది. దానిని అందుకోడానికి అదనంగా ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో ఉపాధికల్పన పెరుగుతుంది. దానివలన ప్రైవేటు వ్యక్తుల, సంస్థల వద్ద అదనంగా పొదుపు పోగుబడుతుంది. ద్రవ్యలోటు ఏ మోతాదులో ఉందో దానితో సమంగా అదనపు పొదుపు పోగుబడేవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే, ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల, సంస్థల వద్ద నుంచి ఎంత అప్పు తెచ్చి ఖర్చు చేసిందో దానికి సమానమైన స్థాయిలో తిరిగి ప్రైవేటు వ్యక్తుల, సంస్థల వద్ద అదనపు పొదుపు సమకూరుతుంది. కాబట్టి ప్రభుత్వానికి అప్పివ్వడానికి తగిన నిల్వలు లేకపోవడమనే సమస్యే ఉత్పన్నం కాదు.
ప్రభుత్వం ద్రవ్యలోటు పెంచి అప్పు చేసి అదనంగా ఖర్చు చేయడమూ, ఇంటి ఖర్చుల కోసం అప్పులు చేయడమూ ఒకటే తరహాకు చెందినవి కావని, రెండింటినీ ఒకే గాటన కట్టకూడదని చెప్పడమంటే దానర్ధం ద్రవ్య లోటు పెంచి, అప్పులు చేసి ఖర్చు చేయడమే ఉత్తమమైన మార్గం అని చెప్పడం కాదు సుమా. పైన వివరించినట్టుగా ద్రవ్యలోటు పెంచి అప్పులు తెచ్చి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం వలన అది అంతిమంగా ప్రైవేటు వ్యక్తుల, సంస్థల వద్ద అదనపు పొదుపు పోగుబడడానికి దారి తీస్తుంది. అంటే ప్రైవేటు సంపద పెరగడానికి దాని తీస్తుంది. పొదుపు చేయగలిగిన స్తోమత ఉన్నవారు ధనికులే గనుక సమాజంలో ఉన్న ధనికులు మరింత ధనికులు కావడానికి అది దోహదపడుతుంది. అందుచేత ద్రవ్యలోటును పెంచి అప్పులు చేసి ఖర్చు చేసేబదులు సంపన్నుల మీద పన్నులు పెంచి ఆ విధంగా సమకూరిన ధనంతో అదనపు వ్యయాన్ని ప్రభుత్వం చేపట్టవచ్చు. అప్పుడు సంపద అసమానతలు పెరగవు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండే సంపద ఏమీ తరిగిపోదు. వారి వద్ద నుంచి పన్ను రూపంలో అదనంగా ఎంత వసూలైందో దానికి సమానమైన మొత్తం అదనపు పొదుపు రూపంలో తిరిగి వారివద్దకు చేరుతుంది.
అందుచేత పన్నులు పెంచి ప్రభుత్వం అదనపు వ్యయాన్ని చేపట్టడం ద్రవ్యలోటు పెంచి అదనపు వ్యయాన్ని చేపట్టడం కన్నా మెరుగైనది. అదే సమయంలో ప్రభుత్వం ఎటువంటి అదనపు వ్యయాన్నీ చేపట్టకుండా ఉండడం కన్నా ద్రవ్యలోటు పెంచి అదనపు వ్యయాన్ని చేపట్టడం నయం కదా. ఆ విధంగా చేయడం వలన లక్షలాది మంది శ్రామిక ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడతాయి కదా.
ఇంటి ఖర్చుల కోసం అప్పు చేయడంతో పోల్చి ప్రభుత్వం ద్రవ్యలోటు పెంచడం తప్పు అని వాదించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి ? ఈ విధమైన సామ్యం తీసుకురావడం తప్పు అని చెప్పి వాదించినంతమాత్రాన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ద్రవ్యలోటు పెంచడానికి అంగీకరించదు. పెట్టుబడిదారుల ప్రత్యక్ష పాత్ర లేకుండా ప్రభుత్వమే నేరుగా స్థూల డిమాండ్‌ను పెంచడానికి జోక్యం కల్పించుకోవడం వలన పెట్టుబడిదారీ విధానం చేతకానిదని ఒప్పుకున్నట్టు అవుతుంది. సమాజానికి ఇక ఈ పెట్టుబడిదారీ విధానం అవసరం లేదు అన్న వాస్తవాన్ని అంగీకరించవలసివస్తుంది. అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోడానికే ద్రవ్య పెట్టుబడి ఈ సామ్యాన్ని (ఇంటి నిర్వహణకు, ప్రభుత్వ నిర్వహణకు మధ్య), అది తప్పుడు సామ్యం అయినప్పటికీ, ముందుకు తెస్తుంది. తద్వారా ప్రభుత్వం ఆర్ధిక రంగంలో జోక్యం చేసుకోకుండా నిశ్చేష్టంగా ఉండిపోయేలా చేస్తుంది.
అదొక్కటే కాదు. నయా ఉదారవాదం వాస్తవానికి ప్రభుత్వ పాత్రను ఒక ఇంటి నిర్వహణ వంటి పాత్రకు కుదించుకుపోయేలా చేయడానికి కావాలని ప్రయత్నిస్తుంది. ఆ విధంగా ఒక తప్పుడు సామ్యాన్ని వాస్తవంగా మార్చడానికి పూనుకుంటుంది. ఇది నయా ఉదారవాద విధానపు ప్రత్యేకమైన లక్షణం. ఒక ప్రభుత్వాన్ని కాస్తా ఏదో ఒక ప్రైవేటు సంస్థలాగా, ఒక వ్యక్తిగత గృహం లాగా వ్యవహరించే ఆర్ధిక యూనిట్‌గా దిగజార్చడమే ఈ విధానపు ఉద్దేశ్యం.
ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేటు రంగాన్ని పోల్చి ఏది ఎక్కువ లాభసాటిగా నడుస్తోందో చూడండంటూ చర్చ లేవనెత్తుతారు. తద్వారా ప్రభుత్వ రంగం లాభసాటి కాదని, అందుచేత నిరుపయోగమని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వ రంగం నిర్వహించే పాత్ర కూడా ప్రైవేటు సంస్థల వంటిదేనని ముందుగా ఒక నిర్ధారణకు వచ్చేసి ఆ తర్వాత చర్చ లేవనెత్తడమే ఇందులో కిటుకు. ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వంలో భాగం. అటువంటి ఒక భాగం నిర్వహించే పాత్ర కేవలం ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించే పాత్ర మాదిరిగానే పరిమితంగా ఉండాలన్నదే దాని సారాంశం. దానికి అంగీకరించాక ఇక లాభాల ఆర్జనను పోల్చడమొక్కటే మిగులుతుంది. ప్రభుత్వ రంగం పోషించే సామాజిక పాత్ర అంతరించిపోతుంది. ఆ విధంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు బ్యాంకులతో పోల్చడం మొదలుబెట్టాక, ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ లాభాలను పెంచుకోవడం కోసం వ్యవసాయం వంటి ప్రాధాన్యతా రంగాలకు రుణాలివ్వడం నిలిపివేశాయి.
ఒక ఇంటికి, ప్రభుత్వానికి తేడా ప్రభుత్వానికి ఉన్న సార్వభౌమాధికారంలో ఉంది. ఆ అధికారంతోటే ప్రభుత్వం పన్నులు విధించ గలుగుతుంది. ఇప్పుడు ప్రైవేటు రంగం విషయంలో ఆ సార్వభౌమాధికారాన్ని ప్రభుత్వం వినియోగిం చకుండా నిరోధించడం మీద అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి గురి పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం అదనపు వ్యయాన్ని చేపట్టాలంటే అందుకు కావలసిన ఆర్ధిక వనరులను సమీకరించడానికి కార్పొరేట్ పన్ను పెంచవలసి వుంటుంది. కాని ప్రభుత్వం ఆ విధంగా తనకు నచ్చిన విధంగా కార్పొరేట్ పన్నును గనుక పెంచితే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కన్నెర్ర చేస్తుంది. వెంటనే ఈ దేశం నుంచి తరలిపోతానని బెదిరిస్తుంది. ఒక గృహస్తు ఏ విధంగా అప్పు చేసే విషయంలో నిస్సహాయంగా నిలిచిపోతాడో, ప్రభుత్వం కూడా పన్ను విధించే విషయంలో గాని, అప్పు చేసే విషయంలో గాని అదే విధంగా నిస్సహాయంగా నిలిచిపోతున్నది.
ఆ విధంగా నయా ఉదారవాదం ఒక సర్వ సత్తాక ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య తప్పుడు సామ్యాన్ని తీసుకురావడానికే పరిమితం కాకుండా, ఆ తప్పుడు సామ్యాన్నే వాస్తవంగా మార్చడానికి పూనుకుంటుంది. ప్రభుత్వపు సార్వభౌమాధికారాన్ని దానినుంచి దూరం చేస్తుంది. తాను నిర్దేశించిన పాత్రను మాత్రమే ప్రభుత్వం పోషించేలా నియంత్రిస్తుంది.
కనుక నయా ఉదారవాదం మీద పోరాటం చేయడం అంటే ఆ పోరాట ఎజండాలో ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని తిరిగి పునరుద్ధరించడం అనే అంశం తప్పకుండా ఉండాలి. ఆ అంశం ఉండాలంటే ప్రభుత్వం వేరే వర్గ స్వభావంతో వ్యవహరిం గలగాలి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని తిరస్కరించి, కార్మిక-కర్షక ఐక్య సంఘటన మద్దతు మీద ఆధారపడి ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడం తన ప్రాధాన్యతగా కలిగివున్న ప్రభుత్వం రావాలి.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్