Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వయంగా కోటలు నిర్మించి యుద్ధాలలో కోటలను జయించి రాజ్యాన్ని విస్తరించి పరిపాలన చేసిన వాడు రాజు గాక దొంగ ఎట్లైండు?
తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా ఖిలాషాపూర్ గ్రామం లో సర్వమ్ము, ధర్మన్న గౌడ్ దంపతులకు క్రీ.శ. 1650 ఆగస్టు 18న పాపన్నగౌడ్ జన్మించాడు. తన కులవృత్తి అయిన గీత కార్మిక వృత్తిని స్వీకరించి జీవనం గడిపేవాడు. తన మిత్రులు అప్పటి మొగులాయి నవాబులు చేస్తున్న ఆగడాలు, పన్నుల గురించి పాపన్నకు చెప్పేవారు.
ఆ కాలంలో సామాన్యులపై పన్నుల భారం అధికంగా ఉండేది. పన్నులు కట్టకపోతే కఠినమైన శిక్షలు ఉండేవి. ఈ పరిణామాలకు చలించిపోయిన పాపన్న గౌడ్ తన స్సేహితులతో కలిసి మొగలాయి సైనికులు బడుగు బలహీన వర్గాల ప్రజలపై పన్నులు వసూలు చేసే వారిపై తిరుగుబాటు చేసి ఆ ధనాన్ని పేదవారికి సహాయం చేయడంతో పాపన్న గౌడ్ పేరు జనగామ పరిసర ప్రాంతాలలో మారుమోగింది. ఈ దశలో జనగామ చుట్టు పక్కల గ్రామాల యువకులు పాపన్న గౌడ్ వద్దకు చేరారు. వీరికి పాపన్న
యుద్ధ విద్యలు నేర్పించి పాపన్న గౌడ్ తన సైన్యంగా ఏర్పాటుచేసుకుని 1675 లో తన స్వగ్రామమైన ఖిలాషాపూర్‌లో కోటను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. పాపన్న గౌడ్ తన రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు, పన్నులు వసూలు చేసేవాడు కాదు. క్రమక్రమంగా తన రాజ్యాన్ని విస్తరిస్తూ తాటికొండలో కోటను నిర్మించాడు. తన రాజ్యంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి చెక్ డ్యాంలు నిర్మించినాడు.
తన రాజ్యాన్ని విస్తరిస్తూ తాటికీండ, చేర్యాల, కొలనుపాక, సిద్దిపేట, హుస్నాబాద్, హుజురాబాద్, కరీంనగర్ లను తన ఆధీనంలోకి తెచ్చుకొని దాదాపు 20 ఏండ్లు పాలించాడు. పాపన్న గౌడ్ తన కులదైవం అయినా రేణుక ఎల్లమ్మ భక్తుడు కావున హుజురాబాద్‌లో రేణుక ఎల్లమ్మ గుడి కట్టించాడు.
1707 లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మరణించడంతో అతని వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. 1708 ఏప్రిల్ 1న పాపన్న గౌడ్ వరంగల్ కోటను ముట్టడించి తన ఆధీనంలోకి తెచ్చుకుని తర్వాత భువనగిరి కోటపై దాడిచేసి భువనగిరి కోట ఆక్రమించుకున్నాడు. 1709 లో గోల్కొండ కోటపై దాడి చేసి స్వాధీనం చేసుకుని ఏడు నెలల పాటు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించాడు. తమ ఆధిపత్యం పై దాడి చేసిన పాపన్న గౌడ్‌పై అప్పటి నవాబు చరిత్రకారులు పాపన్న గౌడ్‌ను దారి దోపిడీ దొంగగా చిత్రీకరించారు. ఏది ఏమైనా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ధక్కన్ రాజ్యంపై ఢిల్లీ పెత్తనాన్ని దిక్కరించి గోల్కొండ ఖిల్లాపై స్వతంత్య్ర జెండా ఎగరవేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం స్ఫూర్తిదాయకం, ఎన్ని తరాలు గడిచినా పాపన్న గౌడ్ పోరాటం ఆదర్శవంతమైనది. ఆంగ్లేయ చరిత్రకారుడు జె.ఏ. బోయల్ పాపన్న గౌడ్ చరిత్ర పై పరిశోధనలు చేసి పాపన్నగౌడ్ నిజ చరిత్రను ప్రజలకు అందిం చాడు. జె.ఏ. బోయల్ పరిశోధనల మూలంగా పాపన్న గౌడ్ చరిత్ర కొంతవరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను తెలుసుకున్న బ్రిటిష్ వారు ఇంగ్లాండ్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌కి చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు ఒకరు ఆ మ్యూజియంను సందర్శించేం దుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాపన్న గౌడ్ విగ్రహాన్ని గమనించి ఆయన దాని చిత్రపటాన్ని నగరానికి తీసుకు వచ్చారు. ఆ చిత్ర పటం ఆధారంగానే నేటి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు చిత్రప టాలు, ఆ మూల చిత్రపటం ఆధారంగానే అనేక చిత్ర పటాలు వెలువడ్డాయి. ధైర్యంతో దేన్నైనా ఎదిరించి నిలిచి గెలిచే సాహసం తెగువ కలిగి ఉండడం నేటి తరం యవతకు అతని జీవితం ఆదర్శనీయం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర తెలుసుకుని లండన్ మ్యూజియంలో ఆయన విగ్రహం పెట్టారు. కానీ మన దగ్గర ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం విచారకరం...
- బత్తని రాకేష్ గౌడ్
రీసెర్చ్ స్కాలర్, కాకతీయ యూనివర్సిటీ, 7097559909