Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి స్వయం పాలన చేసిన మొనగాడు సర్వాయి పాపన్న. ఆనాటి రాజరికపు వ్యవస్థలో జమీందార్లు జాగీర్దార్ల ఆగడాలను ఎదిరించి పోరాడిన యోధుడు. సామాన్యుడు సైతం రాజ్యం ఏల గలడు అని ఆచరణలో చూపించిన మార్గదర్శి సర్వాయి పాపన్న.
ఓరుగల్లు కేంద్రంగా సుదీర్ఘకాలం దక్షిణ పదాన్నేలిన కాకతీయుల పాలన క్రీస్తు శకం 1727 లో అంతమైంది. దక్కన్ ప్రాంతం మొదలుకొని దక్షిణ భారతదేశంలో సుమారు మూడు వందల యాభై సంవత్సరాలు విరాజిల్లిన కాకతీయుల సామ్రాజ్యం ఢిల్లీ చక్రవర్తుల నిరంతరం దాడులతో ధ్వంసమైంది. హైదరాబాద్, వరంగల్ పట్టణాలతో సహా దక్కన్ ప్రాంతం మొగల్ చక్రవర్తుల వశమైంది. వీరి పాలనలో రాజ్యాధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు కుమ్ములాటలు కొనసాగేవి.
గ్రామ అధికారులుగా ఉన్న పౌజ్ దారులు, అధికారులు ప్రజలను ఎన్నో విధాలుగా పీడించే వారు. తెలంగాణ ప్రాంతంలోని వివిధ కుల వృత్తులు చేసుకునే వారి జీవనం దుర్భరంగా ఉండేది. విపరీతంగా పన్నులు విధించే వాళ్లు. అలాంటి పరిస్థితుల్లో ఓరుగల్లు జిల్లా (నేడు జనగాం జిల్లా) తాటికొండ గ్రామంలో 1650 సంవత్సరం ఆగస్టు 18న ఒక సామాన్య గౌడ కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న పన్నులకు వ్యతిరేకంగా పోరాడాడు. వీరి ఆగడాలను ఎదిరించాడు పశవులను కాస్తూ, కుల వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న పాపన్న ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. రాజునై రాజ్యాన్ని ఏలాలి అనే బలమైన సంకల్పం ఏర్పరచుకున్నాడు.
ఆ వైపు అడుగులు వేస్తూ ఆలోచన కొనసాగించాడు తన మిత్రులు చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్, దూదేకుల పీరు, మీరు సాహెబ్ తదితరులతో సమాలోచనలు చేశాడు అందుకు వారు కూడా అంగీకరించడంతో సమరోత్సాహంతో ముందుకు సాగాడు. తన తల్లి సర్వమ్మతో ఈ విషయం చెప్పగా ఆమె అంగీకరించకపోవడంతో ఎదిరించి ఇంట్లో ఉన్న సొమ్మును తీసుకొని పోయి వాటితో ఆయుధాలు సమకూర్చుకున్నాడు. తన మిత్రులతో కలిసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అనంతరం భూస్వాములు, వ్యాపారుల గడిలపై దాడి చేసి వారి సంపదను పేదలకు పంచడంతోపాటు బందీలుగా మగ్గుతున్న వందలాదిమంది అణగారిన కులాల ప్రజలను విడిపించాడు. దీంతో 12 మంది స్నేహితులతో ప్రారంభమైన పాపన్న సైన్యం తక్కువ సమయంలోనే 12 వేలకు చేరుకుంది. చిన్న చిన్న సంస్థానాలు గడీలపై మెరుపు దాడులు చేసి వాటిని ఆక్రమించి రాజ్యవిస్తరణ గావించాడు. సర్వాయిపేట కేంద్రంగా పాలన సాగిస్తూ అక్కడ శత్రుదుర్భేద్యమైన, పటిష్టమైన కోటను నిర్మించుకున్నాడు.
తన తల్లి పేరుతో సర్వాయిపేట చెరువును నిర్మించాడు. నేటికీ అవి సజీవ సాక్షిగా ఉన్నాయి. ఆ తర్వాత కరీంనగర్, హుస్నాబాద్ రాజ్యాలు జయించాడు. తాటికొండలో నిర్మించిన కోట ద్వారా సైనిక కార్యకలాపాలను ఉదతం చేశాడు. ఖిలాషాపురంలో కోటను నిర్మించి దీనిని కేంద్రంగా చేసుకుని 1708లో ఓరుగల్లు, నల్లగొండ జిల్లా రాజ్యాలను జయించాడు. 1708లో గోల్కొండ కోటకు వేలాది మంది సైన్యంతో చేరుకొని పెద్ద ఎత్తున దాడి చేశాడు గోల్కొండ ముఖద్వారం వద్ద తీవ్రమైన యుద్ధం జరిగింది వ్యూహాత్మక దాడితో మొగలు సైన్యం ఖంగు తిన్నది పాపన్న సైన్యం కోటలోకి చొరబడేకుండా తీవ్రంగా ప్రతిఘటించింది. ఎట్టకేలకు చారిత్రాత్మకమైన దక్కన్ గుండెపై నిటారుగా నిలిచిన గోల్కొండ కోట సర్దార్ సర్వాయి పాపన్న వశమైంది.
గోల్కొండపై బహుజన జెండా ప్రతిష్టించిన తెలంగాణ మొనగాడు సర్దార్ సర్వాయి పాపన్న.
ఊరు కొడితే నేమీ ఫలము వాడ కొడితే నేమి ఫలము కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి. రాజు నవ్వాలి రాజ్యాన్ని ఏలాలి అని తన చిన్నతనంలో తల్లితో అన్న మాటలను ఆచరణలో చేసి చూపించాడు. తెలంగాణ ఇతిహాసం చారిత్రిక పుటల్లో పరిశీలించినట్టయితే రాచరిక ప్రభువుల గురించి తప్ప సామాన్యుల సాహసాలు, వీరోచిత పోరాటాలు తెరకెక్క లేదు. కాకతీయుల సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసి వీరవనితలు సమ్మక్క-సారలమ్మ , పడిగిద్ద రాజు ఆ తర్వాత దేశమంతా విస్తరించిన నిరంకుశ మొగల్ ఆదిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన సర్వాయి పాపన్న గురించి అసలైన చరిత్ర గ్రంథాలు కనపడకపోవడం బాధాకరం. రాచరిక నిరంకుశ పాలనలో ధ్వంసమవుతున్న సామాన్యమైన జీవితాలను చూసి సహించలేక కడుపు మండి కత్తిపట్టిన పాపన్న పోరాట చరిత్ర కెక్కలేదు.
క్రీస్తుశకం 1874లో జె ఏ బోయల్ అనే ఆంగ్లేయుడు మొట్టమొదట జానపదుల నుంచి పాపన్న జీవిత చరిత్రను వెలికి తీశాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వెలువడిన ఎ సోషల్ హిస్టరీ ఆఫ్ దక్కన్ ఎయిట్ ఇండియన్ లీవ్స్ పుస్తకంలో రిచర్డ్ ఈటన్ పాపన్న గురించిన విశేషాలను రికార్డ్ చేశారు. ఆ తర్వాత ప్రముఖ రచయితలు మల్లంపల్లి సోమశేఖరశర్మ, బిరుదురాజు రామరాజు, ఏటూరి బలరాం మూర్తి రచనలలో పాపన్న గురించి ప్రస్తావించారు. కొంపెల్లి వెంకట్ గౌడ్ దీనిపై సమగ్ర పరిశోధన చేసి 2003లో పుస్తకం రూపంలో చరిత్రను నిక్షిప్తంగా చేశారు. అనేకమంది కవులు, కళాకారులు, రచయితలు, సంఘాలు పాపన్న చరిత్రను ప్రచారం చేస్తు న్నారు. ఇంత చరిత్ర కలిగిన వీరుడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికా రికంగా జయంతి ఉత్సవాలు జరపక పోవడం, ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టకపోవడం శోచనీయం.
ఆయన నిర్మించిన కోటలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న కోటలను పదిల పరిచి పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేయాలి. పాపన్న జీవిత చరిత్రపై మ్యూజియం ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ పై విగ్రహం ప్రతిష్టించి గౌరవించాలి. సర్వాయి పాపన్న స్ఫూర్తితో నేటితరం ముందుకు సాగాలి పాపన్న జయంతి ఉత్సవాలు జరిపి ఘన చరిత్ర మాకుందని చెప్పడమే కాకుండా అణగారిన ప్రజల అభివద్ధి కోసం కషి చేయాలి. పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాల వలన సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకతమై పోతుంది. సామ్రాజ్యవాదుల ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వారికి ధారాదత్తం చేస్తున్నారు.
పేద ప్రజల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక రాజ్య స్థాపన కోసం పోరాడి సాధించడమే పాపన్నకు నిజమైన నివాళి.
- యంవీ రమణ