Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్ఘనిస్థాన్‌లో పరిణామాలు 20 ఏళ్లుగా దాన్ని అక్రమించిన అమెరికా గానీ, ఇతర దేశాలు గానీ ఊహించిన దానికంటే వేగంగా జరిగిపోతున్నాయి. గత వారం అప్ఘనిస్థాన్‌లో వేగంగా జరిగిన పరిణామాలు గమనిస్తే భారత పాలకులు అమెరికాను అంటకాగి తన విదేశాంగ విధానాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం వల్ల జరిగే నష్టమేమిటో అర్ధమవుతుంది. ఆగస్టు 15న మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటే అదే సమయంలో అప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అస్రఫ్ ఘని నాలుగు కార్లు, హెలీకాప్టర్ నిండా డబ్బు తీసుకుని అఫ్ఘాన్ రాజధాని కాబూల్ విడిచి పలాయనం చిత్తగించారు. గత కొద్ది వారాలుగా మెరుపు వేగంతో వివిధ నగరాలు, ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వచ్చిన తాలిబాన్లు కాబూల్‌లోకి సునాయాసంగా ప్రవేశించారు. తాలిబాన్ల నుంచా తప్పుకోడానికి అమెరికా సైన్యం తుండూ తపాకీ పట్టుకుని విమానాల్లో పారిపోవడం 1975లో వియత్నాం నుంచి అమెరికా దళాలు పారిపోయిన దృశ్యాలను తలపించింది. 20 ఏండ్లుగా అమెరికా 'శిక్షణ' ఇచ్చి, పెంచి పోషించిన అఫ్ఘాన్ ప్రభుత్వ సైన్యం ఎక్కడికక్కడ తాలిబాన్లతో బేరాలకు వచ్చి లొంగిపోయింది. కొందరు విస్తారమైన మైదానాలు దాటుకుంటూ పారిపోయారు. మొత్తం మీద అమెరికా సేనల ఉపసంహరణ తరువాత అది 'నిర్మించిన అప్ఘనిస్థాన్' తాలిబాన్ల ముందు పేకమేడలా కూలిపోయింది.
గత ఏడాది ఫిబ్రవరి 29న కతర్ రాజధాని దోహాలో అమెరికాకూ, తాలిబాన్లకూ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా అప్ఘనిస్థాన్ను విడిచిపెట్టింది. అమెరికా దళాలు భద్రంగా స్వదేశానికి వెళ్లిపోడానికి తాలిబాన్లు అడ్డుపడకూడదన్నది ఈ ఒప్పందంతో ప్రధాన అంశం. ఈ ఒప్పందం తరువాత ఏదో ఒక నాడు అప్ఘనిస్థాన్ తాలిబాన్ల వశమవుతుందని అందరూ బావించారు. కానీ అది ఇంత వేగంగా, అమెరికాకు ఇంత తలవంపులుగా జరుగుతందని పశ్చిమ దేశాల దౌత్య నిపుణులుగానీ, మీడియా గానీ భావించలేదు. అమెరికా 'సైనిక శిక్షణ' మీద నమ్మకం పెట్టుకున్న చాలా మంది అప్ఘనిస్థాన్ దళాలు చాలా కాలం పాటు తాలిబాన్లను నిలువరించగలుగుతాయని అనుకున్నారు. అమెరికా నిష్క్రమణ తరువాత ఆ దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందనీ, సిరియా మాదిరిగానే ఆయా దేశాలు ఈ అంతర్యుద్ధంలో తమతమ పాత్రలు నిర్వహిస్తాయనీ అనుకున్నారు. అమెరికా కూడా అప్ఘనిస్థాన్ను విడిచిపెట్టినప్పటికీ ఏదో ఒక రూపంలో అప్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పవచ్చుననుకుంది. భారత దేశం కూడా సరిగ్గా ఇదే అభిప్రాయంలో ఉండి అప్ఘనిస్థాన్‌లో రానున్న పరిణామాలను సరిగ్గా అంచనా వేయలేకపోయిందని మన దౌత్య నిపుణులు ఇప్పుడు చెబుతున్నారు.
అమెరికా సైనిక శక్తి, దౌత్య నీతిపట్ల అపారమైన నమ్మకంతో వ్యవహరించిన భారత పాలకులు నేడు ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే అప్ఘనిస్థాన్ తాలిబాన్ల వశం అవ్వడం అంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే అమెరికాను నమ్ముకుని ఇరుగుపొరుగు దేశాలకు దూరమైన భారత ఇప్పుడు అప్ఘనిస్థాన్ నుంచి కూడా దూరమవుతుంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో అమెరికా విధానాలకు భారత దేశం పూర్తి మద్దతిచ్చినప్పటికీ, అమెరికా మాత్రం అఫ్ఘాన్ విషయంలో భారత్‌కు ఏనాడూ ప్రయోజనకరంగా వ్యవహరించలేదు. దోహాలో జరుగుతున్న చర్చల ప్రక్రియకు భారత్‌ను దూరం పెట్టింది. అప్ఘనిస్థాన్ను విడిచి వెళ్లిన తరువాత కూడా ఈ దేశంపై పట్టు నిలుపుకోడానికి అమెరికా ఏర్పాటు చేసిన మధ్య ఆసియా 'చతుష్ట కూటమి' (క్వాడ్)లో అప్ఘనిస్థాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లను చేర్చుకుంది గానీ భారత్‌కు స్థానం కల్పించలేదు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్‌లో జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతోపాటు భారత్ భాగస్వామిగా ఉంది. అక్కడ చైనాను నిలువరించాలన్న తన సైనిక వ్యూహంలో పావుగా వాడుకునేందుకు బారత్‌ను చేర్చుకుంది. కానీ భారత్ పొరుగున ఉన్న అప్ఘనిస్థాన్ విషయంలో మాత్రం దానికి స్థానం కల్పించడానికి ముందుకు రాలేదు.
తాలిబాన్లకు ముందు నుంచి మద్దతిస్తున్న పాకిస్తాన్ రానున్న అఫ్ఘాన్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతుందని అందరికీ తెలుసు. అప్ఘనిస్థాన్‌తో మధ్య ఆసియాలోని అనేక దేశాలకు సరిహద్దులు ఉన్నాయి. తాలిబాన్లు అధికారంలోకి వస్తే తమ దేశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని భావించి ఈ ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. రష్యా తాలిబాన్లతో అనేక దఫాలు చర్చలు జరిపింది. అఫ్ఘాన్ భూభాగం మీద నుంచి రష్యాపైగానీ, పొరుగు దేశాలపైన గానీ దాడులకు అనుమతివ్వబోమని తాలిబాన్లు హమీ ఇచ్చారు. తాలిబాన్ నాయకత్వంతో చైనా చర్చలు జరిపి కొంత అవగాహనకు వచ్చింది. కొద్ది వారాల క్రితం తాలిబాన్ల ఉన్నతాధికార బృందం చైనా సందర్శించి చైనా విదేశాంగ మంత్రితో బేటీ అయ్యింది. అదే విధంగా అప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఇరాన్ కూడా తాలిబాన్లతో చర్చలు జరిపి తమ దేశ ఆందోళనలను వివరించింది. ఈ చర్చల ఫలితంగానూ, ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబాన్లు తమ పాత విధానాలు కొన్ని విడిచిపెట్టినట్టు ప్రకటించారు. మహిళలు విద్యా, ఉద్యోగాలు చేయడానికి అనుమతిస్తామని ప్రకటించారు. ఉగ్రవాదలు తమ దేశం మీద నుంచి ఇతర దేశాల మీద దాడి చేయడానికి అనుమతివ్వబోమని హామీ ఇచ్చారు. ఇవి ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాలి.
అయితే అమెరికాను నమ్ముకుని దాని చెంగుపట్టుకు తిరిగిన భారత దేశం మాత్రం ఇటువంటి ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యంది. మన దేశం అమెరికా-తాలిబాన్ సంబంధాల మీద ఆధారపడ్డం వల్ల చివరికి అమెరికా మాదిరిగా మనం కూడా మన పౌరులను ఆఘమేఘాలమీద ఆ దేశం నుంచి తరలించాల్సి వచ్చింది. అప్ఘనిస్థాన్ విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వేరపడిపోయింది. తాలిబాన్ల వశం అవుతున్న తరుణంలో కూడా మోడీ ప్రభుత్వం తాలిబాన్ల 'చట్టబద్దత' గురించి మాట్లాడ్డం ద్వారా అప్ఘనిస్థాన్‌లో నేడు జరుగుతున్న పరిణామాల్లో మరింత వేరుపడిపోయింది.
ఇక రెండవ విషయం, అమెరికా భరోసా చూసుకుని క్వాడ్‌లో చేరిన భారత దేశం అమెరికా సరఫరా చేసే ఆయుధాలు, దాని 'సైనిక శిక్షణ'పై నమ్మకం పెంచుకున్నదని ఇటీవలి చాలా పరిణామాలు తెలుపుతున్నాయి. కానీ అమెరికా ఎల్లవేళలా తన ప్రయోజనాల కోసమే సైనిక కూటములు కడుతుందనీ అవసరం ఉన్నంతవరకు ఉపయోగించుకుని అవసరం తీరాక అవతల పారేస్తుందని నాడు ఇరాన్-ఇరాక్ యుద్ధం విషయంలో ఇంకా అనేక సందర్భాల్లోనూ రుజువైంది. నేడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. 20 ఏండ్ల క్రితం యుద్దానికి దిగినప్పుడు అప్ఘనిస్థాన్ను సుస్థిరమైన, ఆధునిక దేశంగా నిర్మిస్తానని అమెరికా ప్రపంచానికి హామీ ఇచ్చింది. రెండేళ్లలోనే దేశం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకన్నాం ఇక దేశాన్ని సుస్థిరాభివృద్ధి పథంలో పెట్టడమే తరువాయి అని నాటి అమెరికా రక్షణ మంత్రి డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ పేర్కొన్నారు. కానీ జరిగింది దానికి భిన్నం. అప్ఘనిస్థాన్‌లో అమెరికా జరిపిన సుదీర్ఘ యుద్ధంలో దానికి 20 ఏండ్లలో 2 లక్షల కోట్ల డాలర్ల ఖర్చయింది. వేలాది మంది అఫ్ఘాన్ పిల్లలు, స్త్రీ, పురుషులు చనిపోయారు. దేశం సర్వనాశనం అయింది. ఈ సుదీర్ఘ యుద్ధంలో ఓడిపోయిన అమెరికా అక్కడి ప్రభుత్వాన్ని, సైన్యాన్ని, ప్రజలను వదిలేసి అవమానకరమైన రీతిలో దేశం నుంచి తప్పుకున్నది. భారత దేశాన్ని కూడా రేపు అవసరం తీరాక అమెరికా ఇదే విధంగా వదిలిపెట్టేయదని ఏమీ లేదు. ఇంకా దుర్మార్గం ఏమంటే ఇరాన్‌పై పదేళ్ల యుద్ధంలో ఇరాక్‌ను అన్ని విధాల ఉపయోగించుకున్న అమెరికా తరువాత ఆ ఇరాక్‌పైనే పాశవికంగా దాడి చేసి లక్షలాది మంది ప్రజలను పొట్టన బెట్టుకుంది. దేశాన్ని ధ్వంసం చేసింది.
అమెరికాతో అంటకాగడం వల్ల భారత దేశంలో కొద్ది మంది కుభేరులకు లాభం చేకూరవచ్చుగాక కానీ దేశంయొక్క విస్తారమైన ప్రయోజనాలకు తీవ్ర నష్టం సంభవిస్తుందన్న వాస్తవాన్ని నేడు అప్ఘనిస్థాన్ పరిణామలు మరోమారు రుజువు చేస్తున్నాయి. అమెరికాతో అణుఒప్పందంలో భాగంగా మన దేశం ఇరాన్‌తో సత్సంబంధాలను వదులుకుంది. దాని వల్ల చమురు రంగంలో మన దేశం అపారమైన నష్టాన్ని అనుభవిస్తోంది. అదే విధంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో క్వాడ్ కూటమి ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చిన భారత పాలకులు ఇరుగు పొరుగు దేశాలను విస్మరించారు. సార్క్ దేశాల్లో పెద్దదైన భారత దేశం తన పొరుగు ఉన్న ఈ కూటమిని విస్మరించింది. 2014 తరువాత సార్క్ శిఖరాగ్ర సభ జరగలేదు. 2016 సార్క్ శిఖరాగ్ర సభలో పాల్గొనడానికి భారత దేశం అంగీకరించకపోవడంతో ఈ క్రమం దాదాపు అంతమై పోయింది. సార్క్‌ను పునరుద్ధ రించడానికి భారత ప్రభుత్వం సుముఖంగా లేదనీ, దానికి బదులుగా ఇటీవల ఏర్పాటు చేయబడిన బంగాళా ఖాత ప్రాంత దేశాల సాంకేతిక ఆర్థిక సహకార గ్రూపు (బిమ్స్టెక్) పట్ల ఆసక్తి కలిగి ఉందన్న అభిప్రాయం ఈ దేశాల్లో పెరిగింది. బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలతో ఈ గ్రూపు ఏర్పడింది.
భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన 'వాక్సిన్ దౌత్యం' బెడిసి కొట్టడంతో మన పొరుగున ఉన్న అనేక దేశాలు మనకు దూరమైనాయి. ఈ దేశాలకు చైనా సహాయం చేసింది. భారత్ మినహా ఇతర దక్షిణాసియా దేశాలన్నిటికీ అది వాక్సిన్ సరఫరా చేసింది. ఈ చర్యల వల్ల భారత దేశం ఇరుగు పొరుగు దేశాల నుండి ఎంతోకొంత ఒంటరిపాటు అయింది. అందువల్లనే సార్క్ లోని ఎనిమిది దేశాల్లో అయిదు దేశాలు చైనా చొరవతో ప్రారంభమైన చైనా-దక్షిణాసియా దేశాల పేదరికం నిర్మూలన, సహకార అభివృద్ధి కేంద్రంలో చేరాయి. 2021 ఏప్రిల్‌లో చైనా, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక విదేశాంగ మంత్రు సమావేశంలోతీసుకున్న నిర్ణయం ప్రకారం జులై నెలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇప్పటికైనా భారత్ పాలకులు అమెరికాపై ఆధారపడ్డం మానుకుని స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తారా? లేక అంతర్జాతీయ యవనిక మీద మన దేశ ఒంటరిపాటును మరింత పెంచుతారా?
- ఎస్. వెంకట్రావు