Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ ఛాయా చిత్రం చరిత్రకు సజీవ సాక్షంగా నిలుస్తుంది. ఓ ఫోటోగ్రాఫ్ న్యాయస్థానంలో తిరుగు లేని సాక్షమవుతుంది. ఓ ఫోటో అనంత భావాక్షరాలను వ్యక్తం చేస్తుంది. ప్రకతి రమణీయతను బంధించిన ఓ ఛాయాచిత్రం, కోట్ల హదయాలను మీటే అద్భుత భావోద్వేగ మంత్రం అవుతుంది. ఫోటో అంటే ఓ సాధారణ చిత్రమే కాదు, సామాజిక మాద్యమంలో ప్రవహించే వార్తా పత్రిక. ఫోటోగ్రఫీ అంటే ఫోటో తీయడం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఒక్క ఫోటోతో ఉద్యమం పుట్టవచ్చు, అన్యాయం బయట పడవచ్చు, ఆశ్చర్యం కలిగించవచ్చు, అపూర్వ అనుభూతిని మిగిల్చవచ్చు, నిజాన్ని నిర్భయంగా తెలుపవచ్చు, రహస్యాన్ని బహిర్గతం చేయవచ్చు, కోట్ల గుండెల్ని పిండేయవచ్చు, స్వీయ చరిత్రను వివరించవచ్చు, శుభ క్షణాలను ఆల్బమ్‌లో బంధించవచ్చు. ఫోటోగ్రాఫర్‌కు కెమెరా ఉంటే సరిపోదు, ఫోటోను బంధించగల కోణాలు, క్షణాలు, ఫోటో పరిధి లాంటి పలు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. ఒక సాధారణ దశ్యాన్ని అసాధారణ, అద్భుత ఛాయాచిత్రంగా మార్చగలగడం ఓ నేర్పు. కెమెరాతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఫోటోగ్రాఫర్లు, తమ జీవిత లక్ష్యంగా, జీవనభతి సాధనంగా తీసుకున్న ఎందరో మహానుభావులు మన మధ్య కదలాడుతున్నారు. ఫోటోగ్రఫీ వత్తి పట్ల చిన్న చూపు చూసే వారికి ఛాయాచిత్రాల ప్రాధాన్యతల గూర్చి అవగాహన లేదని అనుకోవాలి. ఒక్క అరుదైన ఛాయచిత్రం లక్షల రూపాయల ధర పలుకవచ్చు, అపూర్వ అంతర్జాతీయ గుర్తింపును ఇవ్వవచ్చు.
ఫోటోగ్రఫీలో కళ, నైపుణ్యం, వైజ్ఞానికశాస్త్రం దాగి ఉంటాయి. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్ అందరి చేతుల్లో నాట్యమాడుతోంది. ప్రతి సెల్ఫోన్లో అత్యాధునిక కెమెరా దాగి ఉంది. ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన దశ్యాలను కెమెరాలో బంధించి సామాజిక మాద్యమాల్లో అందుబాటులోకి తేవడం, లైకులను చూసి సంబరపడడం సర్వసాధారణమైంది. 1826లో తొలి శాశ్విత ఛాయాచిత్రాన్ని ఫ్రెంచ్ 'జోసెఫ్ నైస్‌ఫోర్ నైపస్' అనే మహానుభావుడు తీయడం జరిగింది. 1837లో నైపస్తో లూయిస్ డెగ్యూరే కలిసి రూపొందించిన డెగ్యూరేటైప్ కెమెరా నేటి ఆధునిక కెమెరాకు ఆధారంగా నిలిచింది. 1880ల్లో తొలిసారి కోడాక్ కంపెనీ కెమెరాలను వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. 1940ల్లో కెమెరా ఫిల్ముల ధర సామాన్యులకు అనుకూలమైంది. 1960ల్లో పోలరాయిడ్ కెమెరా, అనంతర కాలంలో యస్‌యల్‌ఆర్, డియస్యల్ఆర్, డిజిటల్ స్మార్ట్ కెమెరాల ఉప్పెన రావడం చూశాం.
19 ఆగష్టు 1839 రోజున నైపస్- డెగ్యూరే రూపొందించిన కెమెరా పెటెంట్ హక్కులను ఫ్రెంచ్ ప్రభుత్వం కొనడం జరిగిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏట 19 ఆగష్టున 'ప్రపంచ ఫోటోగ్రఫీ దినం' పాటించుట ఆనవాయితీగా మారింది. ఫోటోను నిశితంగా పరిశీలించడం, ఫోటోగ్రాఫర్ మనోగతాన్ని అర్థం చేసుకోవడం, ఛాయాచిత్ర రహస్యాన్ని ఆకలింపు చేసుకోవడం సాధారణ ప్రజల బాధ్యతగా గమనించాలి. ఫోటోగ్రాఫర్ ప్రతిభను గుర్తించి సముచితంగా గౌరవించాలి. తనదైన వత్తిలో ఫోటోగ్రాఫర్ చొరవను ప్రస్తుతించాలి. కొన్ని సందర్భాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఫోటోలు తీయాల్సి వస్తుంది. ఛాయాచిత్రాన్ని చూడటానికి కొన్ని సెకన్ల కాలం మాత్రమే పడుతుంది, కాని ఆ ఫోటోను కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్ పడిన గంటల ప్రయాస అనంతంగా ఉంటుందని గమనిద్దాం. చక్కని ఫోటోలను మనసులో, మన వ్యక్తిగత ఆల్బమ్స్‌లో భద్రంగా పదిలపరుచకుందాం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037