Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు దయనీయస్థితిలో బతుకులీడుస్తున్నారు. ఏ ఆధారంలేని అట్టడుగు కార్మికులుగా, అతి తక్కువ వేతనాలు పొందుతున్న పేదలు వీరు. రాష్ట్రంలోని 12,765 గ్రామ పంచాయతీలు, 2 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లాలో 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీల్లో సుమారు లక్ష మంది కార్మికులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, పార్ట్ టైం, ఫుల్ టైమ్ కార్మికులుగా, ఫిక్స్డ్-పే, టైమ్ స్కేల్, మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులు దళితులు, బలహీన వర్గాల పేదలు, మహిళలున్నారు. 75ఏండ్ల స్వాతంత్య్రంలో నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన కార్మికవర్గం వీరే. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ, మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులకు పీఆర్సీ తరహాలో ప్రత్యేక తరహా, నిర్మాణాత్మక వేతన విధానాన్ని అమలు చేస్తామని, వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు కార్మికవర్గానికి శాపంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతన్నది. పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.21,000లు ఇవ్వాలని కార్మిక సంఘాలు చేసే డిమాండ్‌ను ఖాతరు చేయడం లేదు. కార్మికుల కోర్కెలను కేంద్ర ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తున్నది. కరోనా నివారణలో మొదటి శ్రేణిలో ఉన్న యోధులంటూ గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు సన్మానాలు చేస్తూ, పూలదండలు వేస్తూ పొగడ్తలతో ముంచేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం వారి కడుపు నింపేందుకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సంక్షేమ పథకాల అమలులో తీరని అన్యాయం చేస్తున్నది. స్వచ్ఛ భారత్ పథకం అమలులో భాగంగా వీరితో శ్రమ చేయించుకుంటున్నారు తప్ప స్వచ్ఛ భారత్ నిధుల్లో కార్మికుల వేతనాల కోసం బడ్జెట్లో కేటాయింపులు చేయటం లేదు. కార్మికులకు ఇంతటి ద్రోహం చేసిన ప్రభుత్వం స్వాతంత్య్రానంతరం మరొకటి లేదు.
స్వాతంత్రోద్యమ కాలంలోనే గ్రామ స్వరాజ్యం నినాదం మారుమ్రోగింది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ సుపరిపాలన, రచ్చబండ, ప్రజల వద్దకే పాలన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ జ్యోతి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటున్నారు. గ్రామాల, పట్టణాల అభివృద్ధి, రక్షిత మంచినీరు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు ఈ మాటలే పాలకవర్గాల నుండి వినపడతాయి. కానీ ఈ పనులన్నింటిలో తలమునకలై పనిచేస్తున్న దళిత, గిరిజన, అట్టడుగు వర్గాలకు చెందిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల గోడు ఏ ప్రభుత్వానికీ పట్టడం లేదు. ఒకటి, రెండు సంవత్సరాలు కాదు, 75సంవత్సరాల స్వాతంత్య్రంలో పంచాయతీ, మున్సిపల్ సిబ్బందివి ఇవే బతుకులు. పనిచేసిన కాలానికి నెలయ్యాక జీతమడిగితే ఇవ్వరు. సర్పంచ్, ఛైర్మన్ల దగ్గర నుండి ఈఓ, డీపీఓ, కలెక్టర్ల వద్ద జీతం గూర్చి మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కులేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు పోరాటాలకు తలొగ్గి జీఓ 51ని విడుదల చేసింది. అందులో ఉద్యోగ భద్రతకు హానికరమైన షరతులను పెట్టి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకువచ్చి, పాత కేటగిరీలను రద్దు చేశారు. కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ బలవంతపు బాండ్ పేపర్లను రాయించు కున్నారు.
2021లో ఉన్న ప్రజానీకానికి పంచాయతీ కార్మికులు నేడు సేవలు చేస్తున్నారు. కానీ 2011 జనాభాని పరిగణలోకి తీసుకొని 500జనాభాకి ఒక కార్మికుడి చొప్పున లెక్కవేసి వేతనాలిస్తున్నారు. ప్రజా అవసరాల కోసం పాలకవర్గాలు 2021 జనాభాకి సరిపొయ్యేటట్లు సిబ్బందిని నియమించారు. అందరికీ వేతనాలు పెంచకపోవడంతో కొందరికిచ్చే వేతనాలనే అందరూ పంచుకుంటున్నారు. దాంతో రూ.3,000ల నుండి రూ.5,000 లోపే చేతికి అందుతున్నాయి. జీఓ 51 విడుదల కాకముందు పంచాయతీ ఆదాయాలను బట్టి అదనంగా వేతనాలిచ్చే వారు కూడా వేతనాల్లో కోత పెట్టారు. ''కొండ నాలుకకు మందువేస్తే - ఉన్న నాలుక ఊడినట్లైంది'' పంచాయతీ సిబ్బంది పరిస్థితి. మల్టీపర్పస్ వర్కర్స్ విధానం సాకుతో ఇంటిపని, స్వంత పని, ఉపాధి హామీ పనులు, నర్సరీల పెంపకం లాంటి పనులు కూడా చేయించుకుంటున్నారు. అలా చేయని కార్మికులపై వేధింపులకు పాల్పడుతూ అక్రమంగా తొలగిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్నారు. నేడు ఒక వ్యక్తికి కరోనా సోకిందని తెలియగానే ఆమడ దూరం పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా ప్రాణ భయంతో ఇండ్లకే పరిమితమైన పరిస్థితుల్లో శానిటైజేషన్ పనులు చేస్తూ, కరోనా వైరస్‌తో మరణించిన శవాలను స్వయంగా తీసుకెళ్ళి దహన సంస్కారాలు నిర్వహించి గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది మానవత్వాన్ని ప్రదర్శించిన తీరు సామాన్యమైనది కాదు. ఇలాంటి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకోవడం కాకుండా ప్రభుత్వం నుండి కనీస ప్రోత్సాహం లేకపోవడం అన్యాయం.
రాష్ట్రంలో దళితులు సాధికారత గురించి చర్చించేందుకు 2021 జూన్ 27న రాష్ట్రస్థాయిలో స్వయాన ముఖ్యమంత్రి కేసిఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి వామపక్షాలు, ప్రతిపక్షాలు, సామాజిక సంఘాలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శితో పాటు ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధి బృందం రాష్ట్రంలో దళితుల సాధికారత కోసం తీసుకోవాల్సిన నిర్మాణాత్మక, నిర్ధిష్ట చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుంచారు. అందులో ప్రత్యేకించి గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల వేతనాలు, పర్మినెంట్, ఉద్యోగ భద్రత, సంక్షేమం గురించి సీపీఐ(ఎం) ప్రత్యేకంగా పేర్కొన్నది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తరహాలో వీరి కోసం ప్రత్యేక తరహా, నిర్మాణాత్మక వేతన విధానాన్ని అమలుచేస్తామని, వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చేసిన ప్రకటన పట్ల మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. యూనియన్లు సైతం ఆ నిర్ణయాన్ని స్వాగతించాయి. కానీ, హామీనిచ్చి 45 రోజులు గడిచినా వాటి గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ కాలేదు. కొత్త రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు పూర్తయ్యింది. అంతకు ముందు అనేక ఏండ్లుగా ప్రజా ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను కాపాడుతూ తమ జీవితాలను సమాజం కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు అంకితం చేశారు. ఈ క్రమంలో అనేకమంది విధి నిర్వహణలో ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇటీవల జీహెచ్ఎంసీ డ్రైనేజీలో ప్రాణాలను కోల్పోయిన శివకుమార్, అంతయ్య, మేడ్చల్ రోడ్డు ప్రమాదాల్లో నుజ్జునుజ్జయిన లకీë, దశరథ్, నల్లగొండలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కత్తుల గిరి, బోల్గూరి మధు, వరంగల్ కార్పొరేషన్లో డ్యూటీకి హాజరయ్యేందుకు ఆటోలో వస్తున్న వారిని లారీ గుద్దడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన మరియమ్మ, సులోచన, పిర్జాదీగూడలో ప్రమాదంలో మృతి చెందిన బాస సత్యనారాయణ, సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ ముందు డ్యూటీ చేస్తుంటే రోడ్డు ప్రమాదంలో విగత జీవుల్లా ప్రాణాలు వదిలిన ఘటనలు మన కండ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఆ కార్మికులకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. నష్టపరిహారం చెల్లించలేదు. ఆ కుటుంబాలను ఆదుకోలేదు. సాధారణ ప్రజలు 60సంవత్సరాలు జీవిస్తే, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు 45-50 సంవత్సరాలకే మరణిస్తున్నారు. వయస్సు మీరిందనే సాకుతో డ్యూటీల నుండి అక్రమంగా తొలగిస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం లేదు. వీరికి చట్ట ప్రకారం అమలు చేయాల్సిన హక్కులు కూడా అమలు చేెయడంలో పాలకులు విఫలమయ్యారు.
గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కానే కావు. వారి జానెడు పొట్టకు పిడికెడు బువ్వ మాత్రమే. బువ్వ దొరకాలంటే భూమైనా ఉండాలి. లేదా కనీస వేతనం, భద్రతతో కూడిన కొలువైనా ఉండాలి. రెక్కల శ్రమ తప్ప మరే ఆధారం లేని బక్క జీవులైన గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు న్యాయబద్ధమైన వేతనం నిర్ణయించడం ద్వారా ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఇదే ఆత్మగౌరవంతో కూడిన సాధికారత జీవనానికి ఒక దారి చూపుతుంది. తరతరాలుగా వెట్టి చాకిరి చేస్తూ, సరైనటువంటి వేతనాలు, సంక్షేమం అమలు కాని గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు ఇప్పటికైనా నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలి.
- పాలడుగు భాస్కర్
సెల్:9490098033