Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా దళిత బంధు పథకాన్ని సోమవారం నాడు ప్రారంభించింది. మొదటిసారి ప్రతిపాదనగా కొన్ని వారాల కింద మాత్రమే వినిపించిన ఈ పథకం, వాయువేగ మనోవేగాలతో విధివిధానాలు తయారై, అమలులోకికూడ రావడం వెనుక ఉన్న బలవత్తర కారణాలేమిటో ఎవరి ఊహలు వారికున్నాయి. ఈ పథకం తొలి అడుగు హుజూరాబాద్‌లోనే పడడానికి మాత్రం అక్కడ జరగనున్న ఉప ఎన్నిక, ఇటీవల పెరుగుతున్న దళిత రాజకీయ సమీకరణ కారణమనేది ఎవరూ ఊహించకుండానే తెలిసే కఠోర వాస్తవం. ఈ శీర్షిక పరిమితుల దృష్ట్యా, ఈ పథకపు రాజకీయ ఉద్దేశాల, లక్ష్యాల, ప్రయోజనాల గురించి చర్చించడం సాధ్యంకాదు గాని, తప్పనిసరిగా రాజకీయార్థిక, సామాజిక, చారిత్రక కోణాలు మాత్రం చర్చించవలసి ఉంది.
మొట్టమొదట చెప్పవలసినది దళితుల అభ్యున్నతి కోసం, పురోగతి కోసం ఎన్ని పథకాలైనా, ఎంత భారీ కేటాయింపుల పథకాలైనా తప్పనిసరిగా రావలసిందే. అందులో మరొక భిన్నాభిప్రాయం లేదు. వేల సంవత్సరాలుగా నిరాదరణకూ, అస్పృశ్యతకూ, అసమానతకూ, వివక్షకూ, అవకాశాల నిరాకరణకూ, కనీస మానవ హక్కుల ఉల్లంఘ నకూ గురైన అతి పెద్ద ప్రజా సమూహమైన దళితుల పట్ల సమాజం ఇంతకాలం చూపిన వైఖరిని సమూలంగా మార్చవలసిందే.
అయితే, దళితుల పట్ల ఇంతకాలమూ అమలైన, అమలవుతున్న వైఖరి కేవలం ఆర్థిక సంబంధమైనది మాత్రమే కాదు. అది కేవలం కొన్ని లక్షల రూపాయల నిధుల వితరణతో సమసిపోయేది కాదు. ఆ వివక్షకు, అన్యాయానికి చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక, మత, భావజాల మూలాలున్నాయి. విద్యా, ఉద్యోగ, రాజకీయాధికార రంగాలలో జనాభా నిష్పత్తిన వారి వాటా వారికి దక్కేలా చేసిన రాజ్యాంగ ప్రయత్నం ఏడు దశాబ్దాలుగా అమలైనా వివక్ష మారలేదంటే దాని మూలాలు ఎంత విస్తారమైనవో, బలమైనవో అర్థమవుతుంది. ఆ రాజ్యాంగ అవకాశాల సహాయంతో విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయాధికారంలో, ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట సంపదలో ఉన్నత స్థానం సంపాదించినా కూడ, వారిపట్ల కులపరమైన అసమానత, వివక్ష, అవమానం తొలగిపోలేదు. చివరికి దేశంలోనే అత్యున్నత రాజకీయాధికార పదవి అయిన రాష్ట్రపతి స్థానానికి చేరినా కులపరమైన అవమానాలు పొందిన చరిత్ర మనది. ప్రపంచస్థాయి క్రీడల్లో, విద్యలో, కళల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి, రచ్చగెలిచి కూడ ఇంట అవమానాలు, వివక్ష ఎదుర్కొన్న చరిత్ర. ఆ అసమానత, వివక్ష ప్రతి రోజూ, ప్రతి క్షణమూ దళితుల మీద జరుగుతున్న అవమానాలలో, అత్యాచారాలలో, హింసలో, హత్యలలో వ్యక్తమవుతూనే ఉన్నాయి. అసంఖ్యాక ఘటనల్లో కొన్ని మాత్రమే నేరాలుగా నమోదవుతున్నప్పటికీ, వాటికి కూడ నేరస్తులు శిక్ష పడకుండా బలాదూర్ గా తిరుగుతూ మళ్లీ మళ్లీ దళితుల పట్ల లైంగికదాడులు సాగిస్తున్న సమాజం మనది.
అంటే దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, వారిని మిగిలిన సమాజం సమానంగా చూసేలా చేయడం, వారి అభ్యున్నతి సాధించడం కేవలం ఆర్థిక పథకాలతో మాత్రమే సాధ్యం కాదు, మొత్తంగా సామాజిక ఆలోచనా సరళి మారవలసి ఉంటుంది. సమాజ నిర్మాణం మారవలసి ఉంటుంది. చరిత్ర పట్ల, మతం పట్ల, మనుస్మృతి పట్ల, సామాజిక విలువల పట్ల, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం పట్ల కొత్త చూపు కావాలి. కొందరికి పుట్టుకతో అందే అవకాశాలూ, మరికొందరికి పుట్టుకతోనే ఏర్పడే అవరోధాలూ అనే సామాజిక నిర్మాణాన్ని సమూలంగా మార్చాలి. కొందరి పట్ల చిన్నచూపును, అవమానాన్ని, శ్రమను నిర్దేశించిన సాంస్కృతిక జీవనం పట్ల కొత్త విశ్లేషణ కావాలి. దాని పరివర్తనకు సువిశాల మార్గాలు కావాలి. ఆ కొత్త చూపు ఏదో ఒక పథకంలో, సభలో ఒక రోజులో మాత్రమే కాక, నిరంతర సామాజికీకరణలో భాగం కావాలి.
భారత సమాజం తనలో ఆరో వంతు భాగం పట్ల ఎంత అమానవీయంగా, అమానుషంగా, క్రూరంగా ప్రవర్తించిందో చరిత్రను తవ్వితీసి తిరగదోడి, మన గతం పట్ల మనకు ఒక శాస్త్రీయమైన దృక్పథం ఏర్పడాలి. మనువాద భావజాలాన్ని నిరంతరం ఎత్తిచూపి, విమర్శించి, ఓడించి, దానిపట్ల అసహ్యాన్ని కలిగించే విద్యాశిక్షణ, సామాజిక చైతన్యీకరణ జరగాలి. హిందూ బ్రాహ్మణీయ మత నిర్మాణం ఎట్లా అసమానత మీద, హింస మీద, పీడన మీద నిర్మాణమైందో నిరంతర చర్చ జరగాలి. దళిత జీవిత అస్తిత్వవేదన గురించి మాట్లాడేటప్పుడు అసమానతే, నిచ్చెనమెట్ల వ్యవస్థే హిందూమతపు ఆత్మ అని, హిందువుగా పుట్టినా, హిందువుగా మాత్రం మరణించనని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాట తప్పకుండా గుర్తుంచుకోవాలి. ప్రచారం చేయాలి.
ఒకవైపు అత్యవసరమైన ఈ పనులేవీ చేయకుండా, మరొకవైపు నన్ను మించిన హిందువు ఉన్నాడా అని, నిత్యం హౌమాలతో పూజలతో హిందూ బ్రాహ్మణీయ అసమాన సంస్కృతిని ఔదల దాలుస్తూ, దళిత అభ్యున్నతి అని మాట్లాడడం ఆత్మవంచనో, పరవంచనో అవుతుంది.
విశాలమైన చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక దృక్పథం పునాదిగా చర్చించవలసిన ఆ మౌలిక అంశాలు అలా ఉంచి, నిజంగానే ఈ ఏలికకు దళితుల వేదన పట్ల నిజమైన సహానుభూతి ఉన్నదని అనుకున్నప్పటికీ వేయదగిన ప్రశ్నలున్నాయి. ఎంత పరిమితమైనదైనా ఈ పథకం నిజంగా అమలు చేసే చిత్తశుద్ధి ఈ పాలకులకు ఉందా, ఒకవేళ చిత్తశుద్ధి ఉందనుకున్నా, ఇది అమలు కాగల ఆర్థిక, సాంకేతిక, గణాంక అవకాశాలున్నాయా, ఏదో ఒక మేరకు ఇది అమలైనా ఏమి సాధిస్తుంది అనే ప్రశ్నలు ముఖ్యమైనవి.
ఎవరి చిత్తశుద్ధినీ ముందస్తుగానే అనుమానించ నక్కరలేదు. ప్రతి ఒక్కరూ ప్రతి మాటా నిబద్ధతతోనే అంటున్నారని కూడ అనుకోవచ్చు. కాని ఆ నిబద్ధత త్రికరణ శుద్ధిగా ఉన్నదా, ఏదో తక్షణ అవసరం కోసం, పెదవుల మీది నుంచి వస్తున్నదా చూడడానికి మాత్రం కొలబద్దలున్నాయి. చిత్తశుద్ధిని అంచనా కట్టాలంటే, కోటలు దాటిన మాటలను బట్టి కాదు, వారి చేతలు ఎన్ని అంగుళాలు, గజాలు ముందుకు కదిలాయనేది చూడాలి. మిగిలిన డజన్ల కొద్దీ వాగ్దాన భంగాలను కూడ లెక్క పెట్టనక్కర లేదు, కేవలం దళితుల విషయంలోనే ఈ ప్రభుత్వం, ఈ ఏలిక చేసిన వాగ్దానాలేమిటి, వాటిలో అమలు చేసినవెన్ని, అమలు చేయడానికి ప్రయత్నించినవెన్ని ఏడు సంవత్సరాల చరిత్ర అందరి కండ్లముందూ ఉంచిన బహిరంగ వాస్తవాలున్నాయి. భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తామన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా సద్వినియోగం అయ్యేట్టు చూస్తామన్నారు. దళితుల మీద అత్యాచారాలను అరికడతామన్నారు.
వీటిలో అసాధ్యమైన పనులేవీ లేవు. కాని ఏ ఒక్క పనీ అమలులోకి రాలేదు. ఆరు సంవత్సరాల కింద, 2015 ఏప్రిల్ 6న ఈ శీర్షిక ప్రారంభమైన రెండో వారమే, ''వ్యవసాయం మీదనే ఆధారపడిన నిరుపేద దళిత కుటుంబాలకు తలా మూడు ఎకరాల భూమి ఇవ్వాలనీ, దానికి ఆ కుటుంబ పెద్ద అయిన మహిళ పేరుమీదనే పట్టా ఇవ్వాలనీ ప్రశంసనీయమైన ఆదర్శం పెట్టుకున్న ప్రభుత్వం ఆ ఆదర్శాన్ని చేరడానికి తగిన మార్గంలో, అవసరమైనంత చిత్తశుద్ధితో లేదని చెప్పకతప్పదు'' అని గణాంకాల సహాయంతో రాశాను. భూమి కొని అయినా ఇస్తామని గంభీరమైన వాగ్దానం చేసిన ప్రభుత్వం, తానే అంతకంతకూ భారీగా ఊదిన రియల్ ఎస్టేట్ బుడగ వల్ల, భూముల ధరలు పెరిగి, కొని ఇవ్వడం సాధ్యం కావడం లేదని చేతులు ఎత్తేసింది. భూగరిష్ట పరిమితి చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే, వ్యవసాయేతర వినియోగానికి భూబదిలీని నియంత్రిస్తే, పంపిణీకి భూమి దొరికేదే గాని, ప్రభుత్వం ఆ పని చేయలేదు.
ఇప్పుడు అలా భూమి కొని ఇచ్చే బదులు, ప్రతి కుటుంబానికీ పది లక్షల రూపాయలు ఇవ్వాలనే కొత్త పథకం తయారయింది. ఇది కేవలం భూమిలేని నిరుపేద కుటుంబాలకు మాత్రమే కాక, ప్రభుత్వోద్యోగులతో సహా అన్ని దళిత కుటుంబాలకూ వర్తింపజేస్తామంటున్నారు. ఈ లబ్ధిదారుల ఎంపికలో ఆంక్షలు ఉంటాయని ఇన్నాళ్లూ వార్తలు వచ్చాయి గాని, ఎటువంటి ఆంక్షలూ ఉండవని, ప్రతి ఒక్క దళిత కుటుంబానికీ ఈ లబ్ధి చేకూరుతుందని స్వయంగా ముఖ్యమంత్రి మొన్న ప్రకటించారు. ఇది తిరిగి చెల్లించవలసిన రుణం కాదని, ఎందుకు వాడుకుంటారో కూడ లబ్ధిదారుల ఇష్టమని కూడ అన్నారు. మొత్తంగా పదిహేడు లక్షల కుటుంబాలకు ఒక లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలైనా వెచ్చిస్తామని, ఏడాదికి ముప్పై నలబై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని అన్నారు.
నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో చేరే ఈ పది లక్షల రూపాయలను వారు చిన్నతరహా పరిశ్రమలకు గాని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు గాని, మరేదైనా స్వయం ఉపాధి పనికి గాని వాడుకోవచ్చునని ప్రభుత్వ ప్రకటనలు చెపుతున్నాయి. ముఖ్యమంత్రి హుజూరాబాద్ బహిరంగ సభలో అదనంగా వైన్ షాపులు పెట్టుకోవచ్చునని కూడ అన్నారు!
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులలోనే ప్రతిపాదించిన దానికన్న 20-25శాతం తగ్గించిన చరిత్ర గల ప్రభుత్వం, గత కొద్ది నెలలుగా ఉద్యోగుల జీతాలనే అందరికీ ఒకే తేదీన ఇవ్వలేక, నాలుగు జిల్లాలకు ఒకరోజు చొప్పున పదో, పన్నెండో తేదీ దాకా సాగదీస్తున్న ప్రభుత్వం హఠాత్తుగా ఒకే పద్దు మీద ముప్పై వేల కోట్ల అదనపు కేటాయింపు ఎక్కడి నుంచి చేయగలదు? అదనపు ఆదాయ వనరులేమిటి? అది పన్నుల ఆదాయం అయితే, లబ్ధి పొందనున్న దళితులకూ, మిగిలిన జనాభాకూ కూడ ఆ మేరకు పన్నుల భారం పెరగనున్నదా? అది పన్నేతర ఆదాయం అయితే, ఏ దేశీ, విదేశీ ద్రవ్య సంస్థ నుంచి ఏ షరతుల మీద, ఎంత వడ్డీకి రుణం తేనున్నారు? ఆ రుణం తిరిగి చెల్లించే భారం వర్తమాన సమాజం మీద, భవిష్యత్తు సమాజం మీద కూడ ఎంత పడనున్నది?
అసలు ఇంతచేసీ కుటుంబానికి పది లక్షలు ఇవ్వగానే దళితుల పట్ల అసమానత, వివక్ష రద్దయిపోతాయా? వారి అభ్యున్నతి సాధ్యమవుతుందా? ఈ ఏడు సంవత్సరాలలో రాష్ట్రంలో దళితుల మీద జరిగిన అత్యాచారాలకు, హింసలకు, అవమానాలను, హత్యలకు ప్రభుత్వం తీసుకోగలిగిన చట్టబద్ధమైన చర్యలు కూడ తీసుకున్న దాఖలాలు లేవు. ఈ పదిలక్షలతో ఆ అవమానాలు, పీడన, హింస ఆగిపోతాయా? అందరికీ కాకపోయినా, కొందరికి ఈ లబ్ధి అంది, వారు అధికారపార్టీ సమర్థకులుగా, ఓట్లుగా మారడం జరుగుతుందేమో గాని, వారు పెట్టబోయే యూనిట్లకు ముందూ వెనుకా అవసరమైన పనులు, ముడిసరుకుల సరఫరా నుంచి ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు ఏర్పాట్లు ఉన్నాయా? విద్యా, ఉద్యోగావకాశాలు కత్తిరిస్తూ, ఈ ప్రత్యక్ష నగదు బదిలీ ఆ కుటుంబాలకైనా నిజమైన మేలు చేస్తుందా?
- ఎన్ వేణుగోపాల్
సెల్: 9848577028