Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజమైన భారతీయత మూలాలు క్రీస్తు పూర్వం నాటి నుండీ ఉనికిలో ఉన్న సాంస్కృతిక భిన్నత్వంలోనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు మనముందున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. సహేతుకమైన ఆధారాల తార్కిక, శాస్త్రీయ విశ్లేషణ మదింపు ద్వారా మాత్రమే ఏదేశపు గతాన్నైనా తవ్వి తీయటం, అధ్యయనం చేయటం సాధ్యమవుతుంది. గతం గురించి తలెత్తే ప్రశ్నలకు ఒకేరకమైనవో ఒక్క ప్రశ్నకు ఒక్క సమాధానంగానో నిర్థారించుకోలేని ప్రశ్నలు. సమకాలీన చారిత్రక పరిశోధకులు ఆర్య జాతి ఉనికి గురించిన చర్చను పదేపదే ముందుకు తెస్తున్నందున ఈ ప్రశ్నకున్న మూలాలు, నేటి ఏ సందర్భంలో ఈ ప్రశ్న మరోసారి ప్రాధాన్యత పొందిందో లోతుగా పరిశీలించాలిు. ప్రస్తుతం రెండు పరస్పర భిన్నమైన కోణాల్లో భిన్న లక్ష్యాలు సాధించే ఉద్దేశ్యంతో ఈ చర్చను ముందుకు తెస్తున్న విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి. 19వ శతాబ్దంలో సంస్కృత భాషలో ఉన్న భారతీయ రచనలను అధ్యయనం చేస్తున్న యూరోపియన్ మేథావులకు సంస్కృత భాషకు యూరోపియన్ భాషలకు మద్య సారూప్యత ఉన్నట్లు కనిపించింది. సంస్కృతం మధ్య ఆసియా ప్రాంతంలో పుట్టి భారతదేశానికి ప్రయాణించి ఇక్కడ స్థిరపడిపోయింది. తొలినాటి భారతీయ ఆర్యులకు, యూరోపియన్ ఆర్యులకు మధ్య జన్యుపరమైన సంబంధం ఉండవచ్చన్న అభిప్రాయం చలామణిలో ఉండేది. ఆర్య అన్న పదం భాషకు సంకేతంగా మారిందే తప్ప జాతికి కాదు.
క్రీస్తు పూర్వం రెండో సహస్రాబ్ది తొలినాళ్లలో పచ్చికబయళ్ల కోసం కానీ లేదా పర్యావరణ కారణాల రీత్యాగానీ మధ్య ఆసియా ప్రాంతం నుండి మొదలైన వలసలు రెండు స్రవంతులుగా ప్రయాణించాయి. ఓ స్రవంతి ఇరాన్ వైపు వలస వెళ్తే మరో భాగం పశ్చిమ భారతం వైపు వలస వచ్చారు. ఈ వలసల గురించి ఇరాన్భాషలో వెలువడిన గ్రంథం అవస్తలో వివరంగా ప్రస్తావించారు. ఇరానియన్ ఆర్యులు, ఇండో ఆర్యుల మధ్య భాషాపరమైన సామ్యం ఉండేది. రెండు బృందాల అక్షరమాల దగ్గర దగ్గరగా ఉండేది. వలసపాలన నాటి మేథావులు పూర్వకాలం నాటి వేద సంస్కృతి పశువుల కాపర్లతో స్థిరీకరించబడిన ఆర్య సంస్కృతి ఒక్కటేనని భావించారు. మాక్స్ ముల్లర్ కూడా ఇదే వాదనను ముందుకు తెచ్చాడు. కల్నల్ ఆల్కాట్ వంటివారు కూడా వేదాలతో మొదలు పెట్టి హిందూయిజం వరకూ అనూచానంగా సంబంధం ఉందని వాదించారు. ఇందులో భాగంగానే ఆర్య సమాజ్ వంటి సంస్థల ద్వారా ఆర్యుల సంస్కృతిని ప్రచారం చేయటానికి కృషి జరిగింది. అయితే 1920 దశకం నాటి తవ్వకాల్లో ఆర్యుల నాగరికతకు సుమారు వేయి సంవత్సరాల పూర్వమే భారత గడ్డపై ఉనికిలో ఉన్న సింధు నాగరికత వెలుగులోకి రావటం భారతదేశం అంటే ఆర్యావర్తమేనన్న వాదనకు సవాలు విసిరింది.
1920 నాటి పురావస్తు ఆవిష్కరణల ప్రాధాన్యతను మరుగుపరుస్తూ ఆర్యులే భారతీయ మూలవాసులు అన్న వాదనను నిరూపించే ప్రయత్నమే 1930 దశకంలో హిందూత్వ చరిత్రకు తొలిపునాదులు వేసింది. భారతీయతకు, హిందూత్వానికి ఇండో ఆర్యన్ నాగరికతే పునాదన్న వాదనతో పాటు భారత దేశ చరిత్ర హిందూ, ముస్లిం ధార్మిక స్రవంతుల మధ్య జరిగిన ఘర్షణ చరిత్రే అన్న వాదన కూడా ఈ పునాదులు బలోపేతం కావటానికి దారితీసింది. గత యాభై ఏండ్లుగా ఈ రెండు సిద్ధాంతాల డొల్లతనాన్ని చరిత్ర పరిశోధకులు రుజువు చేస్తూనే ఉన్నారు. అందువల్లనే హిందూత్వవాదులు నిర్మించబూనుకున్న భారతదేశ చరిత్రకు, చరిత్ర పరిశోధకులు నిర్మించిన భారతదేశ చరిత్రకు మధ్య పొసగని వైరుధ్యం నెలకొంది. వైదిక రచనలు ఈ అధ్యయనానికి కేంద్రంగా ఉన్నాయి. అయితే కాలక్రమంలో అనేక నూతన ఆధారాలు, చరిత్ర పరిశోధనా పద్ధతులు అందుబాటులోకి రావటంతో మొత్తం చరిత్ర పరిశోధన తీరుతెన్నులు కొత్త పుంతలు తొక్కాయి. గతంలో ఏమి జరిగి ఉండొచ్చు అన్న ప్రశ్నకు విన్నూత్న సమాధానాలు ముందుకొచ్చాయి.
భౌగోళిక శాస్త్రం, పురావస్తు పరిశోధనలు, భాషా శాస్త్రం, జన్యునిర్మాణ శాస్త్రం వంటి రంగాల్లో సాగుతున్న ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రాచీన భారత చరిత్ర గురించిన హిందూత్వ ప్రాజెక్టును నిరంతరం సవాలు చేస్తున్నాయి. భౌగోళిక విస్తృతి రీత్యా చూస్తే వైదిక నాగరికత కంటే హరప్ప నాగరికత విశాల భూభాగంలో విస్తరించి ఉంది. హరప్ప కాలం నాటి నివాసాలు, నిర్మాణాలు ఉత్తరాన పామీర్ ముడి మొదలు దక్షిణభారతం వరకూ, ఓమాన్, బలూచిస్తాన్ వరకూ విస్తరించిందని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. హరప్ప వాసులు మెసొపటేమియా వాసులకు రాగి వంటి ఖనిజ వనరులు రవాణా చేసినట్లు ఆధారాలున్నాయి. కానీ వేద సంస్కృతికి నేటి ఆఫ్గనిస్తాన్ - పంజాబ్ మొదలు తూర్పున ఉన్న గంగానదీ పరివాహక ప్రాంతానికి సాగిన వలసలను మాత్రమే ప్రస్తావిస్తుంది. అంటే రుగ్వేద రచయితలకు డోవాబ్ ప్రాంతానికి అవతల ఉన్న ఇరాన్ ఇరాక్ ఓమాన్ ప్రాంతాల గురించి తెలీదు. కానీ అంతకు పూర్వమే ఉనికిలో ఉన్న హరప్ప నాగరికులకు ఈ ప్రాంతంతో ఆర్థిక సాంస్కృతిక లావాదేవీలున్నాయి.
చరిత్ర పరిశోధన మూలవనరుగా భాషా శాస్త్రం పోషించినపాత్ర తెలుసుకోవటానికి వేదాల్లో ప్రయోగించిన భాష, వర్ణించిన క్రతువులను పరిశోధకులు పరిశీలించారు. భాష, పద ప్రయోగం, వ్యాకరణాల గురించి కూడా అధ్యయనం జరుగుతోంది. వైదిక సంస్కృతం పవిత్రమైన భాషగా గుర్తింపు పొందటంతో 20వ శతాబ్దం ఆరంభం వరకూ భాషా శాస్త్ర ప్రమాణాలకు సంస్కృతం దూరంగా ఉంది. కానీ 20వ శతాబ్ది ఆరంభం నుండీ ఈ ప్రమాణాలు సంస్కృతానికి కూడా వర్తింప చేయటంతో వేదకాలం నాటి సంస్కృతం కూడా సమకాలీన బాషల్లాగానే ఉనికిలోకి వచ్చిన సాధారణ భాష అని తేలిపోయింది. ద్రవిడ భాషలు అధ్యయనం చేసినా సంస్కృతం గురించి కూడా అవగతమవుతుంది. వేదాల్లో ద్రవిడ భాషకు సంబంధించిన పద ప్రయోగం కూడా కనిపిస్తుంది. ఈ వివరాలన్నీ పరిశీలిస్తే ఇతర సంస్కృతి, జీవన శైలిలను ప్రస్తావించటానికి దస్య, అసుర వంటి పదాలు, దాసవర్ణాలు వంటిపద ప్రయోగం చేశారు. దాసులు దేవుడిని పూజించరు. ఇండో ఆర్యన్ భాషను పలికేటప్పుడు అపశృతులుంటాయి. కాలకక్రమంలో దస్యుల్లో సంపన్నులను ఆర్యుల్లో విలీనం చేసుకోవటం మొదలైంది. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు ఐతరేయ బ్రాహ్మణ గ్రంథంలో కనిపిస్తాయి.
ఇదే తరహాలో పురావస్తు శాస్త్ర పరిశోధనలు కూడా అనేక విషయాలను ముందుకు తెస్తున్నాయి. హిందూత్వ వాదులు చెప్తున్నట్టు భారతదేశం కేవలం హిందూయిజం, హిందూ సంస్కృతి మాత్రమే భారతదేశపు గతం కాదనీ, భారతదేశంలో భాష, సంస్కృతి, జీవనశైలి, ఆహారవ్యవహారాలు వంటి విషయాల్లో వైవిధ్యం, బహుళత్వం, భిన్నత్వం క్రీస్తు పూర్వం మూడో శతాబ్ది నాటికే ఉనికిలో ఉన్నాయని రుజువు చేసే పరిశోధనా ఫలితాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటి సారాంశం ఆర్యులు భారతీయులు కాదన్నదే. కానీ ఆర్యులు భారతీయులు కాకపోతే హిందూత్వ ప్రాజెక్టు పునాదుల్లోనే కకావికలమవుతుంది. పైన ప్రస్తావించిన చారిత్రక పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక విశ్లేషణలు, జన్యు అధ్యయనాలు ఆర్యులు బయటి ప్రాంతం నుండి వలస వచ్చారని నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి. ఏ దేశపు గతమైనా సరళ రేఖ కాదు. ఏకైక సాంస్కృతిక జీవనం కాబోదు. భిన్న సంస్కృతులు, జీవన శైలులు, క్రతవులు, ఇరుగుపొరుగు ప్రాంతాల (దేశాల)తో ఆర్థిక సాంస్కృతిక వాణిజ్య లావాదేవీల కలబోతలోనే గతం నిండి ఉంటుంది. కానీ ఈ కీలక వాస్తవిక పునాదిని గుర్తించ నిరాకరిస్తోంది హిందూత్వ. హిందూత్వ రాజకీయ కార్యక్రమానికి అనుకూలమైన విషయాలను చరిత్ర పేరుతో సోషల్ మీడియా మొదలు టీవీ సీరియళ్ల వరకూ, పాఠశాల బోధనాంశాల వరకూ ఇష్టం వచ్చినట్లు ఊహాజనిత విషయాలతో నింపటానికి ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని ప్రశ్నించకుండా నిజమైన చరిత్రను భావితరాలకు అందించలేము. ఈ అడ్డగోలు వాదనలను ప్రశ్నించటం దేశ ద్రోహం కానేకాదు. ఈ దేశాన్ని లౌకిక ప్రజాతంత్ర సమాజంగా కాపాడుకోవాలంటే రంగురంగుల పోస్టులు, పోస్టర్లు, పాఠాల మరుగున పడిన నిజమైన చరిత్రను తవ్వి తీయటమే చరిత్రపరిశోధన లక్ష్యంగా ఉండాలి.
(ప్రఖ్యాత చరిత్ర కారుడు ఇర్ఫాన్ హబీబ్ 90వ జన్మదినోత్సవం సందర్భంగా రొమిల్లా థాపర్ ప్రసంగ పాఠం)
- రొమిల్లా థాపర్
అనువాదం :కొండూరి వీరయ్య,
సెల్: 9871794037