Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి సంవత్సరం ఆగస్టు 20న మనదేశంలో 'నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే'ను జరుపుకుంటున్నాం. హేతువాది డాక్టర్ నరేంద్ర దబోల్కర్‌ను సనాతనవాదులు అన్యాయంగా 20 ఆగస్టు 2013న హత్య చేసినందుకు గుర్తుగా ఆయన జ్ఞాపకార్థం జరుపుకుంటున్నాం. డాక్టర్ నరేంద్ర అచ్యుత్ దబోల్కర్ కేవలం ఒక ఫిజీషియన్ మాత్రమే కాదు. ఒక రచయిత, ఒక సామాజిక కార్యకర్త కూడా! వైజ్ఞానిక దృక్పథాన్ని సమాజంలో వ్యాపింపజేయడానికి స్థిర చిత్తుడై మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితిని 1989లో ప్రారంభించి, నిరంతరం కృషి చేస్తూ వచ్చిన మహౌన్నతుడు. సమాజంలో అంధ విశ్వాసాల్ని తొలగించడానికి, జనంలో తిరుగుతూ జనాన్ని చైతన్య పరచడం నచ్చనివారు ఒక పథకం ప్రకారం ఆయనను మార్నింగ్ వాక్‌లో మట్టుబెట్టారు. అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని ఆయన చాలా కాలంగా పట్టుబడుతూ వచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చలేదు. భారతీయ జనతాపార్టీ, శివసేన పార్టీలు తీవ్రంగా ఆయన డిమాండ్‌ను వ్యతిరేకించాయి. ఎందుకంటే దాని వల్ల తమ సంస్కృతీ సంప్రదాయాలు దెబ్బతింటాయని వారు భావించారు. సంస్కృతి, సంప్రదాయాల పేర గత కాలపు అవివేకాన్ని, అజ్ఞానాన్ని బతికించాలని చూసే వారికి వైజ్ఞానిక అవగాహన ఎలా ఉంటుందీ? ఎదుటివారికి ఇంకింత జ్ఞానం ఉంటే బావుండునని మనం అనుకుంటూ ఉంటాం గానీ, వారికి ఇంగిత జ్ఞానమే ఉండదు - అలాంటప్పుడు ఏం చేయగలం? పైగా పేరుకు పోయిన మూర్ఖత్వంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని ఎవరు హర్షిస్తారూ?
వైజ్ఞానిక స్పృహతో, మానవీయ విలువలు నిలుపుకుంటూ మసలు కోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని రాజ్యాంగంలోని ప్రకరణ 15ఎ(హెచ్) ఉంది కదా? దానికి తగినట్టుగానే ఏ సైన్సు కార్యకర్త అయినా వ్యవహరిస్తాడు. మరి ఇలా దుర్మార్గంగా చంపడమేమిటి? 2013 నుండి ఈ రోజు వరకు దబోల్కర్ హంతకులెవరో ప్రభుత్వాలు పసిగట్టలేక పోయాయి. అంటే ఏమిటీ? ఏలినవారి అండదండలతోనే దుండగులు ఆ పని చేశారని ఎంత తెలివిలేని వాడికైనా అర్థమవుతుంది! పైగా, మరో గొప్ప విషయమేమంటే దబోల్కర్ మరణం తర్వాత ఆయన పోరాడిన అంధ విశ్వాసాల వ్యతిరేక ఆర్డినెన్స్ (ANTI SUPERSTITION & BLACK MAGIC ORDINANCE) 29 సవరణలతో చివరికి 18 డిసెంబర్ 2013న మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే అది చట్టం కావాలంటే పార్లమెంట్ ఆమోదించాలి. డాక్టర్ నరేంద్ర దబోల్కర్ చనిపోక ముందు 6 ఆగస్టు 2013న 'ప్రగతిశీల భావాలు గల వారికి గడ్డుకాలం వచ్చిందని, అధికారంలో ఉన్న మంత్రులు సరిగా వ్యవహరించడం లేదని, అందుకే అంధ విశ్వాస వ్యతిరేక చట్టంపై అసెంబ్లీలో చర్చ జరగడం లేదని' ఆయన తన అసంతృప్తిని మీడియా ముందు వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన హత్య చేయబడ్డారు. హత్య జరిగిన మరునాడే మహారాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర వేసింది. అంతే... అది అక్కడే, అలాగే ఉంది.
డాక్టర్ నరేంద్ర దబోల్కర్, తర్వాత గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ యం.యం. కల్బుర్గి, జర్నలిస్ట్ గౌరీలంకేశ్లు వరుసగా హత్యలకు గురయ్యారు. అంటే ఏమిటి? ఎదిరించే వాళ్ళని బెదిరించేవాళ్ళు చంపేస్తూ రాజ్యాలేలుతుంటారనా? ఇన్ని హత్యల తర్వాత కూడా భావప్రకటనా స్వేచ్ఛ ఈ దేశంలో ఇంకా ఘోరంగా హత్య చేయబడుతోంది. మరి సామాన్యులేం చేయాలి? మరింత ధైర్యంగా ఉండాలి. మరింత హేతుబద్దంగా ఆలోచించడం ప్రారంభించాలి. రాజ్యాంగ వ్యతిరేక చర్యలు ఎవరు చేసినా ఎత్తిచూపుతూనే ఉండాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న వారి బలం కంటే ఎప్పుడైనా ప్రజాబలమే గొప్పది.. అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ అత్యాధునిక సమాజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పాతరాతి యుగంలోకి పోనివ్వొద్దు.
పన్నెండేండ్లు డాక్టరుగా ప్రజలకు సేవ చేసిన దబోల్కర్ 1980లో సామాజిక సేవ వైపు దృష్టి మరల్చారు. అఖిల బారత అంధ్రశ్రద్ధ నిర్మూలన సమితి (ABANS) కు అనుబంధంగా మహరాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి (MANS) కార్యక్రమాలు రూపొందించారు. తమకు తాము దేవుళ్ళమని ప్రకటించుకునే దొంగ బాబాల భరతం పట్టారు. సతార జిల్లాలో 'పరివర్తన్' అనే సేవాసంస్థను ప్రారంభించారు. మరాఠీ వార పత్రిక 'సాధన'కు సంపాదకత్వం వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రేషనలిస్ట్ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1990-2010 మధ్యకాలంలో దళితుల పట్ల వివక్ష ఉండకూడదని, కుల నిర్మూలన సంఘాలతో కలిసి పనిచేశారు. సామాజిక న్యాయం దొరకని వారి పక్షాన ఎప్పుడూ నిలబడ్డారు. అంధవిశ్వాసాల నిర్మూలనలో భాగంగా జనంలో మమేకమై 3వేలకు పైగా ఉపన్యాసాలిచ్చారు. ఆయన ఉపన్యాసం జనానికి కొత్త ఊపిర్లు ఊదేది. వినాలనుకునే వారికి ఆయన ఉపన్యాసాలు కొన్ని యూట్యూబ్‌లో దొరుకుతాయి.
ఆయన నిస్వార్థ సేవను గుర్తించాల్సింది పోయి, నేరుగా మనిషినే మాయం చేశారు. దబోల్కర్ స్వంత పట్టణమైన పూణెలో ఆయన మార్నింగ్ వాక్‌లో ఉండగా ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఒకటి తలలో మరొకటి ఛాతిలో బుల్లెట్లు దూసుకుపోయి, ఆయన అక్కడి కక్కడే కన్నుమూశారు. దగ్గర్లో పార్క్ చేసి ఉంచిన మోటార్ సైకిల్ తీసుకుని, దుండగులు నింపాదిగా పారిపోయారు. సీసీ కెమెరాల్లో కొన్ని దృష్యాలు నమోదయ్యాయి. హత్య జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులకు, దబోల్కర్ జేబులోని ఐడింటిటీ కార్డు దొరికింది. అందువల్ల ఆయనను వెంటనే గుర్తించడం జరిగింది. శక్తివంతమైన మారణాయుధాలు సమకూర్చుకుని ఇరుగు పొరుగు దేశాల్ని భయపెట్టగల మన ప్రభుత్వం ఒక హత్య చేసిన ఇద్దరు దుండగుల్ని మాత్రం ఏండ్లు గడిచినా పట్టుకోలేకపోతోంది! అంటే ఏమిటీ? దేశంలో స్వేచ్ఛాలోచన ఇలాగే పట్టపగలు హత్య చేయబడుతుంది.. అని చెప్పడానికి సంకేతమా?
1945 నవంబర్ 1న పూణెలో జన్మించిన నరేంద్ర దబోల్కర్ చదువుకునే రోజుల్లో మంచి కబాడి ఆటగాడు. బంగ్లాదేశ్‌తో పోటీ పడినప్పుడు భారత్ కబాడి జట్టుకు కెప్టెన్. మిరాజ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల నుండి ఎం.బి.బి.ఎస్ డిగ్రీ తీసుకుని పేదలకు వైద్య సేవలందించారు. ఒక హేతువాదిగా అతి సాధారణ జీవితం గడిపారు. తన పిల్లలకు కూడా ముహూర్తాలు, సంప్రదాయాలు లేని పెండ్లిండ్లు చేశారు. ఏ సమయంలోనైనా, ఏ విషయంలోనైనా ముహూర్తాలు చూడకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ పద్మా అవార్డు వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరిగిందేమో, కానీ నరేంద్ర దబోల్కర్‌కు ఒరిగిందేమీ లేదు. ఎందుకంటే ఆయన అంతకు ముందే - అంతకు వెయ్యిరెట్లు మించి.. జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన ప్రాణ త్యాగం వృధా పోలేదు.1983లోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. చిన్నపాటి దాడులు జరిగాయి. పోలీసురక్షణ కోరమని చాలామంది స్నేహితులు, అభిమానులు సూచించారు. కానీ ఆయన సూచనను స్వీకరించలేదు. పైగా ''నా ప్రజల మధ్య నాకు సెక్యూరిటీ ఎందుకూ'' అని ప్రశ్నించారు. తన చుట్టూ ఉన్న ప్రజల మీద ఆయనకు అంత విశ్వాసం..''అయినా నేను ఎవరికో కొమ్ము కాయడం లేదు కదా? రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ.. మొత్తం సమాజం ప్రగతి పథాన నడవడానికి కృషి చేస్తున్నాను. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన పనేలేదు'' అని ప్రకటించారు.
దబోల్కర్ హత్య తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో చురుకుగా పనిచేస్తున్న నలభై సైన్స్ సంఘాలు ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (AIPSN) కింద ఏకమై కలిసి పనిచేస్తున్నాయి. నరేంద్ర దబోల్కర్ స్మృతిలో 20 ఆగస్టును ప్రతి సంవత్సరం ''జాతీయ వైజ్ఞానిక స్పృహ దినం''గా జరుపుకోవాలని నిర్ణయించాయి. అందుకే గత ఐదేండ్లుగా దేశవ్యాప్తంగా ఈ రోజును జరుపుకుంటున్నాం. అందరం కలిసికట్టుగా ఎలా పనిచేయాలి? జనంలో గడ్డకట్టుకుని ఉన్న మూఢత్వాన్ని ఎలా ఛేదించాలి? అని ఆలోచించుకోవడానికి ఇదొక అకాశం. భవిష్యత్ పథకాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి, ముఖ్యంగా భావస్వేచ్ఛ కోసం, అంధ విశ్వాసాల నిర్మూలన కోసం ప్రాణాలు వదిలిన అమరవీరుల త్యాగాల్ని మననం చేసుకోవడానికి ఈ రోజును జరుపుకుంటున్నాం. ప్రజల ఆలోచనల్లో ఆరోగ్య కరమైన మార్పు తీసుకురావడానికి, అంధ విశ్వాసాల్ని అంతం చేయడానికి ఇలాంటి రోజులు ఉండాలి. వీటి ప్రాధాన్యతను జనానికి విడమరిచి చెప్పాలి. ఆచారాల పేరిట మూఢ నమ్మకాల వెంట పరుగులు పెడుతున్న జనాన్ని ఆపి, మనిషి కేంద్రంగా మానవీయ విలువలకు ప్రాధాన్యమిస్తూ జీవించడం నేర్పాలి!
ఒక రకంగా తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కూడా ఈ రోజు స్మరించుకోవాలి. ఎందుకంటే 'సైంటిఫిక్ టెంపర్' అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఆయనే! తన 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' అనే గ్రంథంలో 'సైంటిఫిక్ టెంపర్' అంటే ఏమిటో వివరించారు. ఏదైనా గాని, పరీక్షకు నిలువని దానిని రుజువు కాని దానిని నమ్మకుండా ఉండగలగడమే సైంటిఫిక్ టెంపర్ (వైజ్ఞానిక స్పృహ) అని ఆయన చెప్పారు. గత కాలపు మెట్టవేదాంతం మీద, అల్లుకున్న కథల మీద నమ్మకం ఉంచుకోవడం కాదని, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడమే సైంటిఫిక్ టెంపర్ అని తేల్చి చెప్పారు. ఒక రకంగా ఈ పదం, ఈ ఆలోచన భారతదేశానిదే. ఈ దేశంలో వెలసిన చార్వాక దర్శనం, బుద్ద దర్శనాల సారాంశాల్ని ఆధునీకరించి పండిట్ నెహ్రూ నిర్వచించి ఉంటారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వానికి నెహ్రూజీ అంటే పడదు. ఆయన చెప్పిన సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమిటో తెలియదు. దేశవ్యాప్తంగా ఆయన నెలకొల్పిన వైజ్ఞానిక సంస్థలకు ప్రతి యేటా విడుదల చేయాల్సిన నిధులు కూడా విడుదల చేయరు. ఇలాంటి సమయంలో దేశంలోని 136కోట్ల జనం ఏం చేయాలి? చేతులు ముడుచుకుని కూర్చోవాలా? లేక వైజ్ఞానిక స్పృహ గలవారికి అధికారం కట్టబెట్టాలా?
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు