Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మరణం అనివార్యం, చావునుండి ఎవరు తప్పించు కోలేరు. ఆ మరణం ఒక మంచి లక్ష్యం కోసమైతే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తు న్నందుకు నాతో పాటు మీరు సంతోషించాలి'' అని మరణశయ్య మీదినుండి తల్లి, దండ్రులకు, భార్యకు హితబోధ చేయడం అనేది వీరులకే సాధ్యం. ఆ వీరుడు ఎవరంటే? అక్షరాన్ని అగ్నికణంలా మార్చి హైదరాబాద్ సంస్థానంలోని దొరల, దేశ్ ముఖ్ల, రజాకార్ల ఆగాడాలను, నిజాం నిరంకుశ పాలనను సవాల్ చేస్తూ నిప్పుకణికల్లాంటి అక్షరాలతో నిజాం వెన్నులో వణకుపుట్టించిన ధీరుడు షహీద్ షోయబుల్లా ఖాన్.
హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన తెలంగాణ నిప్పు రవ్వ షోయబుల్లాఖాన్‌ను నిజాం ప్రభుత్వం దారుణంగా హతమార్చింది. నేడు షోయబుల్లాఖాన్ 73వ వర్థంతి. ఈ సంధర్భంగా మతమౌడ్యంపై, లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం ఆయన సాగించిన వీరోచిత పోరాటాన్ని స్మరించి స్ఫూర్తి పొందుదాం.
నిరంకుశత్వం ప్రజలపై కత్తులు దూస్తే అక్షరం ఆయుధమవుతుంది. కత్తుల కోలాటంపై కలం కన్నెర్రచేస్తుంది. ఆ కలానికి సైద్ధాంతిక పటుత్వం తోడయితే పెత్తనాన్ని ధిక్కరించే స్వేఛ్చాగీతమవుతుంది. పీడనను ఎదురించే పిడికిళ్ళకు ఊపిరి పోస్తుంది. ఒక్క సిరా చుక్క అక్షర రూపం దాల్చి లక్షలమెదళ్లలో కదలిక తెస్తుంది. తిరుగుబాటుకు బీజాలు నాటుతుంది. నిప్పులు కక్కే అక్షరాలు రాసిన ఆ కలం షోయబుల్లాఖాన్ది.
1920 అక్టోబర్ 17న ఖమ్మంజిల్లా సుబ్లేడ్‌లో లాయహున్నీషా బేగం, హబీబుల్లా దంపతులకు షోయబుల్లాఖాన్ జన్మించాడు. తండ్రి రైల్వేలో కానిస్టేబుల్, గాంధేయవాది. తల్లి గృహిణి, విశాల భావాలు కలిగిన మహిళ. షోయబ్ బొంబాయిలో ఇంటర్మీడియట్ వరకు చదివి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.
తెలంగాణ అగ్నిగోళంలా మండుతున్న కాలమది. భూస్వాముల, దొరల, దేశ్‌ముఖ్‌ల రాక్షసత్వాన్ని ఎదురిస్తూ హైదరాబాద్ సంస్థానంలో రగల్ జెండాలు ఎత్తుకొని దోపిడీ సాగదంటూ సామాన్యుడు సాయుధుడై సమరం సాగిస్తున్న రోజులవి. సరిగ్గా అప్పుడే గుండెల నిండా ప్రజాస్వామ్య కాంక్షతో, దుర్మార్గ పాలనను ఎదురించే చైతన్యంతో ఉస్మానియా క్యాంపస్ నుంచి షోయబుల్లా ఖాన్ డిగ్రీ పట్టా చేతపట్టుకొని బయటకొచ్చాడు. తాను చదివిన చదువుకు కోరుకుంటే ఏ ఉద్యోగమైనా కాళ్ల దగ్గరకే వచ్చేది. కానీ ఎన్నో ఆదర్శాలు, సమాజానికి ఏదో మేలు చేయాలనే ఆలోచనలు, అన్యాయాన్ని ప్రశ్నించాలనే తపన నరనరాన పాకుతుంటే తలదించుకుని ఉద్యోగం ఎలా చేయగలడు? అందుకే అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజల పక్షాన సమరం చేయాలనుకున్నాడు. ప్రజా పాత్రికేయుడుగా జీవితం ప్రారంభించాడు. జాతీయ భావాలను ప్రోత్సహిస్తున్న తేజ్ ఉర్దూ వారపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరాడు. నిజాం నిరంకుశత్యం గురించి. దొరలు, పటేల్, పట్వారీలు, భూస్వాములు, రజాకార్లు ప్రజలపై సాగిస్తున్న అమానుషకృత్యాలను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. ఆయన వ్యాసాలు సహజంగానే పాలకవర్గాలకు రుచించలేదు. ఆ కారణంగా తేజ్ పత్రిక నిషేధానికి గురైంది. ఆ తరువాత మందుముల నరశింగరావు ఆధ్వర్యంలో నడుస్తున్న రయ్యత్ ఉర్దూ పత్రికలో చేరి మరింత పదును పెంచి తన రచనలు కొనసాగించాడు. షోయాబుల్లాఖాన్కు అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపు లేఖలు రాసాగాయి. ఆ బెదిరింపులను ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. చివరకు రయ్యత్ పత్రిక కూడా పాలకవర్గాల ఆగ్రహానికి గురై మూతపడింది. ఆయన అధైర్యపడలేదు. ప్రజల పక్షంగా నిరంకుశ పాలకుల విరీద పోరాటం సాగించాల్సిందేనని షోయాబుల్లాఖాన్ నిశ్చయించుకున్నాడు. స్వయంగా జాతీయ పత్రికను ఆరంభించడానికి పూనుకున్నాడు. తల్లి, భార్యలపై ఉన్న నగలు
అమ్మి రామకష్ణారావు ఇళ్ళు అద్దెకు తీసుకుని ఇమ్రోజ్ అనే ఉర్దూ దినపత్రికను ప్రారంభించాడు. ఇమ్రోజ్ ప్రథమ సంచిక 1947 నవంబరు 15న వెలువడింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నా, ఇమ్రోజ్ను ప్రజల పత్రికగా తీర్చిదిద్దాడు. నిజాం నిరంకుశత్వం, ఉన్మాదుల మతదురహం కారం మీద తిరుగులేని సమరం కొనసాగించాడు.
దేశానికి స్వాతంత్య్రం లభించి, సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్‌లో కలసి పోతున్నాయి. జునాఘడ్, రాంపూర్, కాశ్మీర్ సంస్థానాలతో పాటుగా బ్రిటిష్ పాలకులతో స్నేహం నెరపిన నైజాం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి నిరాకరించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఇమ్రోజ్ పత్రికా సంపాదకునిగా షోయాబుల్లాఖాన్ బృహత్తర బాధ్యతలను నిర్వర్తించాడు. నైజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలని కోరుతూ సంపాదకీయాలు రాశాడు. భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం ఎంతటి అవసరమో వివరిస్తూ నిజాం నిరాకరణ వెనుక గల స్వార్ధ రాజకీయాలను తూర్పార పడుతూ వ్యాసాలు ప్రచురించాడు. ఏడుగురు ముస్లిం మేథావులు విలీనానికి మద్దతుగా చేసిన తీర్మానాన్ని పత్రికలో ప్రచురించాడు. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలలో ఎక్కువ మంది ఉర్దూ చదువుకున్న వారు కావడంతో ఇమ్రోజ్ రాతల ప్రభావంతో రోజురోజుకూ విలీనానికి అనుకూలంగా మేథావులు, ప్రజలు స్పందించసాగారు. 1948 జనవరి 29 నాటి ఇమ్రోజ్ సంచికలో 'పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం'' అను శీర్షికతో షోయాబుల్లా రాసిన సంపాదకీయం సంచలనం సృష్టించింది. ''...ఈనాడు గ్రామస్థులు ప్రభుత్వ తిరుగలిలో పిండి చేయబడుతున్నారు. ఇంత వరకు జరిగిన సంఘటనలు ప్రజల ఎదుట ఉన్నాయి. అరాచకం ఏవిధంగా రాజ్యం చేస్తోందో అందరికి తెలుసు దొరలు, రజాకార్లు పగలు గాంధీ టోపీలు ధరించి గాంధీజీకి జై అనే నినాదాలు చేస్తూ, రాత్రి గ్రామాలను దోచుకుంటున్నారు. ఒక గ్రావిరీణుడు బాధతో 'పగటిపూట ఒక ప్రభుత్వం, రాత్రి మరొక ప్రభుత్వం రాజ్యం చేస్తున్నది' ఆన్న మాట సత్యదూరమేమీ కాదు...'' అని ఆ సంపాదకీయంలో పేర్కొన్నాడు. ఈ రాతలు నిజాం గుండెల్లోకి బుల్లెట్టులా దూసుకెళ్లాయి. దొరలకు, రజాకార్లకు వాతలు పెట్టాయి. ఖాసిం రజ్వీ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అయినా షోయబుల్లాఖాన్ బయపడలేదు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాడు. ఇమ్రోజ్ పత్రిక నిజాం వ్యతిరేక గొంతుకగా మారింది. ప్రజలలో మతాలకతీతంగా చైతన్యం పెరగసాగింది. దీంతో నిజాంను వ్యతిరేకిస్తూ వార్తలు రాస్తే చేతులు నరికేస్తామని, పత్రికను సర్వనాశనం చేస్తామని 1948 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జరిగిన సభలో ఖాసిం రజ్వీ బహిరంగంగానే బెదిరించాడు. అయినా షోయబుల్లాఖాన్ తగ్గలేదు. సత్యాన్వేషణలో ప్రాణాలు పోవడం గర్వించదగ్గ విషయమన్నాడు.
ఆగస్టు 22 అర్థరాత్రి వరకు కాచిగూడ చౌరస్తాలోని ఇమ్రోజ్ పత్రిక ఆఫీసులో పని పూర్తి చేసుకుని నడుస్తూ లింగంపల్లిలోని తన ఇంటికి బయలుదేరారు షోయబుల్లాఖాన్, ఆయన బావమరిది ఇస్మాయిల్ ఖాన్. చప్పల్ బజార్‌కు చేరగానే అకస్మాత్తుగా పదిమంది నిజాం ప్రభుత్వ గూండాలు షోయబుల్లాఖాన్‌పై విరుచుకుపడ్డారు. తన రాతలతో నిజాంకు, దొరలకు చెమటలు పట్టించిన ఆ ధీరుని చేతులను నరికేశారు. భయమంటే తెలియని ఆ గుండెలపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. అడ్డుకోబోయిన ఇస్మాయిల్ చేతులు నరికారు. తుపాకీ చప్పుళ్లు విని స్థానికులు బయటకు రావడంతో దుండగులు పారిపోయారు. నెత్తుటి మడుగులో ఉన్న షోయబుల్లాఖాన్‌ను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రెండు గంటల తరువాత స్పహలోకి వచ్చిన షోయబుల్లాఖాన్ ''మరణం అనివార్యం, చావునుండి ఎవరు తప్పించుకోలేరు. ఆ మరణం ఒక మంచి లక్ష్యం కోసమైతే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు నాతో పాటు మీరు సంతోషించాలి'' అని తల్లిదండ్రులకు, భార్యకు చెప్పాడు. మిత్రులతో ఇమ్రోజ్ పత్రికను కొనసాగించాలని కోరాడు. ఇరవై ఎనిమిది సంవత్సరాల యుక్త వయస్సులోనే ఎంతో మనోధైర్యం, పరిణితి ప్రదర్శించాడు.
హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావాలని, దేశంలో ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని, మతమౌడ్యంలేని ప్రజాస్వామిక పాలన రావాలన్నది షోయబుల్లాఖాన్ కల. దాని కోసం నడిరోడ్డు మీద ప్రాణాలనే బలిపెట్టాడు. నిజాం తన మతం వాడే కదా అని నిరంకుశ పాలనను సవాల్ చేయడం మానలేదు. రజాకార్లు తన మతస్తులే కదా అని వారి దారుణ కృత్యాలను ఎండగట్టం ఆపలేదు. తన మత రాజ్యం ఏర్పాటు చేస్తామంటున్నారు కదా అని గుడ్డిగా మతమౌడ్యంతో కొట్టుకుపోలేదు. హైదరాబాద్ సంస్థానం లోని ప్రజలు మతమౌడ్య పాలనలో కాకుండా లౌకిక, ప్రజాస్వామిక దేశంలో భాగస్వాములు కావాలని కోరుకున్నాడు. దేశ విభజన జరిగి, మత విద్వేషాలు తారాస్థాయిలో ఉన్న ఆ సమయంలో ఇలాంటి ఉదాత్తమైన భావాలు కలిగి ఉండటం, ఆ విలువల కోసం ప్రాణాలర్పించడం సాధారణమైన విషయం కాదు. అలాంటి త్యాగమూర్తుల సందేశం నేడు దేశానికి ఎంతో అవసరం. మత విశ్వాసాలకు అతీతంగా యువతీ, యువకులందరికి ఆయన ఆదర్శనీయుడు. దేశంలో ప్రస్తుతం మతోన్మాద శక్తులు పెట్రేగి లౌకిక ప్రజాస్వామిక విలువలను సవాల్ చేస్తున్నాయి. తెలంగాణలో షోయబుల్లాఖాన్ వర్థంతి సందర్భాన్ని కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మతోన్మాదులు వాడుకోవడుకుంటున్నారు. ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులు దీనిని ఓ గుణపాఠంగా తీసుకోవాలి. షోయబుల్లాఖాన్ లాంటి త్యాగధనులు నెలకొల్పిన విలువలు నేటి తరాలకు అందించటానికి కృషి చేయాలి. తద్వారా మతోన్మాద రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కోగలం. దేశాన్ని మతోన్మాద ప్రమాదం నుండి కాపాడుకోగలం. అదే షోయబుల్లాఖాన్‌కు నిజమైన నివాళి అవుతుంది.
(రేపు షోయబుల్లాఖాన్ వర్థంతి సందర్భంగా)
- మహ్మమద్ అబ్బాస్
సెల్:9490098032