Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నలభై మంది భారతీయ జర్నలిస్టులపై పెగసస్ స్పైవేర్‌తో పెట్టిన నిఘా బయటపడింది. ఇది స్వతంత్ర మీడియాపై దాడికి అనువుగా ఉన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఏడుగురు జర్నలిస్టుల ఫోన్లపై 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్' నిర్వహించిన విశ్లేషణలో, ఐదు ఫోన్లపై పెగసస్ విజయవంతంగా ఇన్ఫెక్షన్ జరిపిన ఆనవాళ్ళను రుజువు చేసింది. 'ద వైర్'కు సంబంధించిన కొందరు జర్నలిస్టుల పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు కనుగొన్నారు. వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ్ వరదరాజన్, ఎం.కే.వేణు, డిప్లొమాటిక్ ఎడిటర్ దేవీరూపా మిత్ర, కాంట్రిబ్యూటర్స్ రోహిణి సింగ్, స్వాతీ చతుర్వేది, భద్రత, రాజకీయాంశాల జర్నలిస్ట్ ప్రేమ్ శంకర్ ఝాలు వారిలో ఉన్నారు. రోహిణీ సింగ్ కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జే షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడైన ఒక వ్యాపారి నిఖిల్ మర్చంట్ల వ్యాపార వ్యవహారాలపై కథనాలను పంపిన తరువాత, మోడీ కేబినెట్లో ప్రముఖుడైన ఒక మంత్రి పియూష్ గోయల్‌తో వ్యాపారవేత్త అయిన అజరు పిరమల్‌కు ఉన్న సంబంధాలను ఆమె విచారిస్తున్న సమయంలో ఆమె నెంబర్ ఆ జాబితాలో కనిపించింది.
అణచివేత వాతావరణం
పెగసస్ స్పైవేర్ చర్యలు బహిర్గతం అవడానికి ముందు కూడా, జర్నలిస్టులు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసేందుకు భారతదేశం ప్రమాదకరమైన దేశంగా మారుతూ ఉంది. ''ఇండియన్ ప్రెస్ ఫ్రీడం రిపోర్ట్ 2020'' ప్రకారం, ఢిల్లీ మేథావులకు చెందిన 'రైట్స్ అండ్ రిస్క్స్ ఎనాలిసిస్ గ్రూప్'(ఆర్ఆర్ఏజీ) 2020లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కనీసం 226 మంది జర్నలిస్టులు, రెండు మీడియా సంస్థలే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. 13 హత్య చేయబడ్డారు. 37 మందిని నిర్బంధంలో ఉంచారు. వారందరిలో 64 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 13 మంది జర్నలిస్టులకు, ఒక వార్తాపత్రిక వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, 101 మంది జర్నలిస్టులపై భౌతిక దాడులు, బెదిరింపులు, ఇళ్ళమీద దాడులు, కుటుంబ సభ్యులపై దాడులు చేసినట్లు గణాంకాలను విడుదల చేసింది. మోడీ నాయకత్వంలోని బీజేపీ రెండోసారి అధికారం చేపట్టిన 2019 ఏప్రిల్ నుండి హిందూ జాతీయవాదులు చెప్పినట్టు చేయాలనే ఒత్తిడి పెరిగుతూ ఉంది. భయోత్పాతాన్ని సృష్టించి, జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించడంపై దృష్టిని మరల్చకుండా చేయడంలో ప్రభుత్వం పాక్షికంగా విజయం సాధించింది.
''గెట్టింగ్ అవే విత్ మర్డర్'' పేరుతో అధ్యయనం చేసిన 'ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్' నివేదిక ప్రకారం 2014-2019 మధ్య మోడీ ప్రభుత్వ పాలనలో, జర్నలిస్టుల పైన 200కు పైగా దాడులు జరిగాయి. అదే కాలంలో 40 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వారిలో 21 మంది మరణాలు, వృత్తి సంబంధిత మైనవిగా నిర్దారణ అయ్యాయి. బెంగుళూరులో ఎడిటర్ గౌరీ లంకేశ్, శ్రీనగర్‌లో సుజాత్ బుఖారీ, ఛత్తీస్‌ఘడ్‌లో సెక్యూరిటీ ఫోర్సెస్‌పై మావోయిస్టులు జరిపిన దాడిలో దూరదర్శన్ కెమెరా మ్యాన్ అచ్యుతానంద సాహుల హత్యలతో పాటు స్థానిక పత్రికలలో నేరాలు, అవినీతి చర్యల సమాచారాన్ని అందించే ఉద్యోగుల హత్యలను ఆ అధ్యయనం వెల్లడించింది. వీటిలో కనీసం ఏడు కేసులు, చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలైన అక్రమ మద్యం వ్యాపారం, భూఆక్రమణ కేసులు, నీటి మాఫియాకు సంబంధించిన కేసుల విచారణకు సంబంధించినవి ఉన్నాయి.
2020లో 'రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్' ప్రపంచంలో జర్నలిస్టులకు భారతదేశం అత్యంత ప్రమాదకరమైన దేశమని, వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌లో మొత్తం 180 దేశాల్లో భారత్‌ను 142వ దేశంగా గుర్తించింది. చట్టపరమైన వేధింపులు, ఎఫ్ఐఆర్లు, దాడులు, అరెస్ట్‌లు, హత్యలు ఇప్పుడు నిఘాలతో జర్నలిస్టుల పై గతంలో ఎన్నడూలేని విధంగా దాడులే లక్ష్యంగా రోజువారీ చర్యలు నిత్యకృత్యం అయ్యాయి. మే 2021 ఇండో-యూరోపియన్ శిఖరాగ్ర సదస్సులో, 'ద కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్'(సీపీజే) భారతదేశంలో జర్నలిస్టులు పని చేస్తున్న ప్రతికూల పరిస్థితులను తెలుపుతూ తమ విధులను నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవద్దని కోరాలని విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను అందజేసింది. పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన సమస్యను లేవనెత్తుతూ, ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న జర్నలిస్టులు సిద్ధిక్ కప్పన్, ఆసిఫ్ సుల్తాన్, ఆనంద్ టెల్టుమ్డే, గౌతం నవలకాలను విడుదల చేయాలని సీపీజే పిలుపునిచ్చింది. టెల్టుమ్డే, గౌతం నవలకాలు భీమాకోరేగావ్ కేసులో అరెస్ట్ అయితే, సిద్ధిక్ కప్పన్ అక్టోబర్ 2020లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో గ్యాంగ్ రేప్‌తో హత్యకు గురైన దళిత బాలిక సమాచారం కోసం వెలుతుంటే అరెస్ట్ చేశారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు అందించిన సమాచారం ప్రకారం, 'కాశ్మీర్ న్యారేటర్' మ్యాగజైన్‌కు ''రెయిజ్ ఆఫ్ బుర్హాన్'' పేరుతో ఒక కథనాన్ని రాసాడని ఆరోపణలు చేస్తూ ఆసిఫ్ సుల్తాన్ అనే ఒక కాశ్మీరీ జర్నలిస్టును అక్టోబర్ 2018లో అరెస్ట్ చేశారు. వీరంతా కఠినమైన 'ఉపా'చట్టం కింద నిర్బంధంలో ఉంటున్నారు.
ఆర్ఆర్ఏజీ సమాచారం ప్రకారం, గత ఏడాది అరెస్ట్ అయిన జర్నలిస్టులందరిలో 37మంది ఉత్తరప్రదేశ్, 22 మంది మహారాష్ట్ర, 18 మంది జమ్మూకాశ్మీర్, 15 మంది ఢిల్లీ, 12 మంది కర్నాటకకు చెందినవారు. వీరిలో భౌతికంగా హింసకు గురై, అన్లైన్ వేధింపులు, బెదిరింపులకు గురైన 12మంది మహిళలు ఉన్నారు. అనేక మంది జర్నలిస్టులు తమ తమ రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఎఫ్ఐఆర్లను ఎదుర్కొన్న వారిలో వినోద్ దువా, ఆకార్ పటేల్, జగత్ బైన్స్, ఓం శర్మ, అశ్వనీ షైనీలు ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ప్రపంచ మీడియా కాపలాకుక్క లాగా పని చేస్తున్న ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్సిట్యూట్,(ఐపీఐ) జర్నలిస్టులపైన 18 దాడులు, 8 అరెస్ట్‌లు, భారతదేశంలో 20 చట్టపరమైన వేధింపుల కేసులను నమోదు చేసింది. భారతదేశంలో జూలైలో పర్యటిస్తున్న యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌కు అందజేసిన లేఖలో ఈ అన్ని సంఘటనలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసినందుకు జర్నలిస్టులను, మీడియా సంస్థలను లక్ష్యంగా పెట్టుకున్నారని ఐపీఐ తెలిపింది. ఒక భయానక వాతావరణంలో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల బెదిరింపులు, చట్టపరమైన వేధింపుల మధ్య స్వతంత్ర మీడియా పని చేస్తుందని ఆ లేఖలో ఐపీఐ పేర్కొంది. ''వాస్తవాలను మాట్లాడుతూ తమ విధానాలను విమర్శించే జర్నలిస్టులను, మీడియా సంస్థలను చట్టపరంగా వేధింపులకు గురి చేస్తూ, వారిపైన పూర్తి అసహనాన్ని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. ప్రభుత్వ విధానాలను, చర్యలను ముఖ్యంగా కోవిడ్ మహమ్మారిపైన ప్రభుత్వ స్పందనలను ప్రశ్నించిన ప్రముఖ సంపాదకులు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా దేశద్రోహ చట్టాన్ని, 'ఉపా' లాంటి అనాగరిక చట్టాలతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లను ప్రయోగిస్తున్నారని'' ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇతర మార్గాల ద్వారా బెదిరింపులు
కేసులు నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వం ఇతర మార్గాల ద్వారా బెదిరింపులకు పాల్పడుతుంది. జూలై 2021లో ఆదాయ పన్ను శాఖ అధికారులు పన్నులు ఎగవేశారనే కారణంతో, మన దేశంలోనే అత్యంత ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న హిందీ దిన పత్రిక యజమాని దైనిక్ భాస్కర్ ఇళ్ళపై, 30 కార్యాలయాలు, భారత్ సమాచార్ అనే న్యూస్ ఛానల్ పై ఏకకాలంలో దాడులు చేశారు. కోవిడ్-19 నివారణా చర్యలను ప్రభుత్వం సరిగా నిర్వహించలేదని తమ పత్రిక ఇచ్చిన సమాచారానికి ప్రతీకారంగానే దాడులు జరిగాయని దైనిక్ భాస్కర్ పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై న్యూస్ క్లిక్ డైరెక్టర్ల ఇళ్ళు, కార్యాలయాలపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. అప్పటికే ఒక మినీ ల్యాండరింగ్ కేసు పోలీసుల విచారణలో ఉంది. ఢిల్లీ పోలీసులు దానిని ఆగస్ట్ 2020లో ప్రారంభించారు. ఈ దాడులు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో తెలిపే ప్రయత్నంలో ఒక సీనియర్ టీవీ జర్నలిస్ట్, ఆనింద్యో చక్రవర్తి, ''నేను సంవత్సరానికి పైగా న్యూస్ క్లిక్‌లో వీడియోలు తీస్తున్నాను. కరోనా మహమ్మారి వచ్చేంతవరకు నేను ప్రతీ వారం ఆఫీస్‌కు వెళ్లేవాడ్ని. నాకు టీ ఇచ్చిన కప్పును నేనే కడగాలి అని అనుకునేంత చిన్న ఆఫీస్ అది. అలాంటి ఒక చిన్న ఆఫీస్‌ను కూడా ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లక్ష్యం చేసుకుంది. న్యూస్ క్లిక్ రిపోర్టర్ లైన సుమేధాపాల్, మోహిత్ కుమార్‌లు హర్యానాలోని ఖోరీగావ్లో కూల్చివేతలను, నిరసనలను రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తుంటే పోలీసు అధికారులు వారిని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఇతర రిపోర్టర్లను కూడా పోలీసులు బెదిరించారు.
'ద వైర్'కు, అక్కడ పని చేస్తున్న రిపోర్టర్లకు వ్యతిరేకంగా అనేక ఎఫ్ఐఆర్లు, సమన్లు నమోదు అయి ఉన్నాయి. ఏప్రిల్ 2020లో ఉత్తరప్రదేశ్ పోలీసులు 'ద వైర్' ఎడిటర్ సిద్ధార్థ్ పైన ఒక నేరం మోపారు. గత నెలలో జమ్మూకాశ్మీర్ పోలీసులు రెండు కథనాలు రాసినందుకు సిద్ధార్థ్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. జూన్ 2021లో ఉత్తరప్రదేశ్ పోలీసులు న్యూస్ పోర్టల్, జర్నలిస్టులు రాణా అయూబ్, మహమ్మద్ జుబెయిర్ల పైన హిందువులు ఘజియాబాద్‌కు చెందిన వృద్ధుడైన ఒక ముస్లింను వేధిస్తూ, కొట్టిన సంఘటనను వీడియో తీసినందుకు నేరాన్ని మోపారు. అనేకమంది జర్నలిస్టులు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ నమోదును వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలను తెలియపరచినందుకు లేక కరోనా మహమ్మారిని నిరోధించడంలో ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేసినందుకు అనేక మంది జర్నలిస్టులను నిర్బంధించారు. ఉదాహరణకు,గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉర్దూ దిన పత్రికలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న ముబాషిరుద్దీన్ ఖుర్రంను సీఏఏ/ఎన్ఆర్సీ లను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల వార్తలను అందించినందుకు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి 15గంటల పాటు నిర్బంధంలో ఉంచారు. ఫిబ్రవరి 2020లో ఒక బీజేపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజబక్సీ అనే ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ఎడిటర్‌ను, సీఏఏ/ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా కర్నాటకలో కొప్పల్ జిల్లాలోని ఒక పట్టణంలో జరిగిన ఒక ఫంక్షన్లో ఒక పద్యం పాడిన సిరాజ్ బిసారలీతో పాటు అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ ఆ పద్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఏప్రిల్ 2020లో బీహార్‌లోని ముంగర్‌కు చెందిన ఒక కోవిడ్ రోగి మరణం గురించి తప్పుడు సమాచారమిచ్చారన్న ఆరోపణలతో ఆన్లైన్ పోర్టల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న 30ఏండ్ల పవన్ చౌదరిని అరెస్ట్ చేశారు. అదే నెలలో జమ్మూకాశ్మీర్‌లో లాక్డౌన్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో 'ద కాశ్మీర్ అబ్జర్వర్'లో పని చేస్తున్న 34ఏండ్ల ముష్తఖ్ అహ్మద్ గనైని అరెస్ట్ చేసి రెండు రోజులు నిర్బంధంలో ఉంచారు. అతడు తన గుర్తింపు కార్డు, కారుకు సంబంధించిన పత్రాలను చూపించినప్పటికీ పోలీసులు అతని కారును అడ్డగించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతన్ని పదే పదే చెంప దెబ్బలు కొట్టి, లాఠీతో కొట్టాడు. మే 2020లో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగిన కారణంగా వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని గుజరాత్లో నాయకత్వ మార్పు జరగబోవచ్చు అన్న కథనాన్ని రాసాడనే ఆరోపణలతో 'ఫేస్ ఆఫ్ నేషన్' అనే గుజరాత్ న్యూస్ పోర్టల్‌లో ఎడిటర్‌గా పని చేస్తున్న ధావల్ పటేల్‌ను దేశద్రోహ నేరం కింద 15రోజులు నిర్బంధంలో ఉంచారు. ఇక ముందు ''ఎటువంటి నేరాలకు పాల్పడనని'' షరతులులేని క్షమాపణ పత్రం రాసిచ్చిన తరువాత మాత్రమే గుజరాత్ హైకోర్టు దేశద్రోహ నేరం మోపడాన్ని తోసిపుచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడని ఢిల్లీకి చెందిన స్వతంత్ర జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను, అజమ్ఘర్ లోని ఒక పాఠశాలలో విద్యార్థులు నేలను తూడుస్తున్న ఫొటోలు తీసాడని సంతోష్ జైస్వాల్‌ను అరెస్ట్ చేశారు. ఒక బీజేపీ ఎంపీ తనపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడనే ఫిర్యాదుతో లఢక్‌లోని ఫేస్బుక్ అడ్మినిస్ట్రేటర్, జర్నలిస్ట్ త్సేవంగ్ రిగ్జిన్ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే ఆరోపణలతో మణిపూర్‌కు చెందిన కిశోర్ చంద్ర వాన్గ్ ఖెమ్ పై దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేశారు.
పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వం ప్రత్యక్షంగా చేస్తున్న దాడితో పాటు ప్రభుత్వానికి అనుకూలంగా లేని పత్రికా సంస్థలకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా నిధులను తిరస్కరిస్తున్నారు. జూలై 2020లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న 'ద ల్యాండ్ అండ్ డెవలప్మెంట్' కార్యాలయం వారు, న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో పీటీఐ కేంద్ర కార్యాలయం కోసం కేటాయించిన ప్లాట్ విషయంలో కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు చేస్తూ 84కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని పీటీఐకి ఒక నోటీసు పంపారు. జాతీయ కార్యక్రమాలు ప్రసారం చేసే సంస్థ, 'ప్రసార భారతి' జాతి వ్యతిరేక సమాచారాన్ని అందిస్తున్న మీ న్యూస్ ఏజెన్సీ అనుమతిని రద్దు చేస్తామని బెదిరించిన రెండు రోజుల తరువాత ప్రభుత్వం పీటీఐ కి నోటీసులు పంపింది.
'ఫ్రంట్ లైన్' సౌజన్యంతో
తెలుగు : బోడపట్ల రవీందర్,సెల్:9848412451
- దివ్యా త్రివేది