Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాజీవితాలను అత్యంత ప్రభావితం చేసే రాజకీయాలు... ఈ క్రమంలో రాబోతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఆయాపార్టీలు సన్నద్ధమవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నవి. ఈసీటు దక్కించుకోకపోతే భవిష్యతు మంటగలుస్తుందనే ఆందోళన ఆ పార్టీల్లో వ్యక్తమవుతున్నది. అందుకే ఎన్నడూ లేనంత హంగామా చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్కు ఈ ఎన్నిక కత్తిమీద సాములా మారింది. అది అన్ని రకాల ప్రయోగాలూ చేస్తున్నది. అన్ని వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం ముమ్మరం చేసింది. బీజేపీ కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపించుకుంటే దిగజారిపోతున్న ప్రభను తిరిగి దక్కించునే అవకాశం ఉందని భావించి అందుకు తెగ ఆరాటపడుతున్నది. టీఆర్ఎస్ వ్యతిరేక ఫోర్స్ కూడా బలంగా హుజూరాబాద్‌లో పని చేస్తున్నది. ఇదంతా ఒక ఎత్తు...మరి నూటయాభై ఏండ్ల చరిత్ర ఉందని జబ్బలు జర్చుకునే కాంగ్రెస్ మాత్రం అక్కడ కుక్కతోకలా వ్యవహరిస్తున్ననట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ఎందుకనో వెనకబడిపోయింది. ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు. బలమైన నేత కోసం వెతుక్కుతున్నట్టు ప్రచారం చేస్తున్న హస్తం పార్టీకి చిట్టచివరికి మాజీ మంత్రి కొండా సురేఖ దొరికింది. ఈ నిర్ణయం పట్ల ఆ పార్టీ నేతల్లో పలు అనుమానాలు వస్తున్నాయి. స్థానికులను వదిలిపెట్టి, పక్క జిల్లా నేతను అభ్యర్థిగా ప్రకటించడంతో 'పెద్ద తలకాయల'పై విమర్శలొస్తున్నాయి. కొండా సురేఖను బరిలోకి దించడంతో బీసీ ఓట్లు చీల్చి కారును పరిగెత్తించేందుకు ఒప్పందం కుదిరిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. హుజూరుబాద్‌లో కీలక ఇంచార్జితోపాటు కాంగ్రెస్‌లోని ఆ నలుగురు ఇందుకోసం చక్రం తిప్పారనేది ఇప్పుడు టాక్. గత ఎన్నికల్లో కోవర్టుల వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని విమర్శలు చేస్తున్న నేతలు... ఈసారి ఏకంగా సీటునే అమ్ముకున్నట్టు తీవ్ర విమర్శలొస్తున్నాయి. అందువల్ల ఇప్పుడైనా కుక్కతోక సక్కనవునా...అని చెవులు కొరుక్కుంటున్నారు కాంగ్రెస్ జనాలు.
-గుడిగ రఘు