Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బావ కళ్లల్లో ఆనందం కోసం...' ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హత్య కేసుల విషయంలో జైలుకెళ్లిన ఓ ఫ్యాక్టనిస్టు చెప్పిన డైలాగ్ ఇది. అప్పట్లో ఎంతో పాపులరైన ఈ డైలాగుని సినిమాల్లో సైతం కామెడీగా వాడుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం... 'జనం కళ్లల్లో ఆనందం కోసమే...' నంటూ నానా హడావుడి చేస్తున్నారు. నిత్యం జనంలో ఉంటూ, వారి నోళ్లలో నానుతూ, పేపర్లలో రోజుకో ప్రకటన, టీవీల్లో గంటకో బ్రేకింగ్ న్యూస్‌తో హల్చల్ చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడ.. ఎవరి పుట్టిన రోజు జరిగినా.. అది పెండ్లి రోజైనా, చావైనా, గుళ్లో ధ్వజస్తంభం పాతినా, పుట్టిన పిల్లలను ఉయ్యాల్లో వేసినా... తేదీ గుర్తు పెట్టుకుని మరీ, ఠంఛనుగా అటెండై, హాజరు వేయించుకుంటున్నారు. పనిలో పనిగా అక్కడి జనంతో సెల్ఫీలకు ఫోజులిచ్చి మురిసిపోతున్నారు. ఇందుకోసమే ఎదురు చూసే ఆ నాయకుల అనుయాయులు, మద్దతుదారులు...'మా అన్న టైగర్, ఆయన జిందాబాద్, మా అన్న లయన్... ఆయన నాయకత్వం వర్థిల్లాలి...' అంటూ చప్పట్లు కొట్టి, సంబర పడిపోతున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఈ ధోరణి బాగా ముదిరి పాకానపడింది. ఇక్కడే ఒక లాజిక్కు, అంతకు మించిన రాజకీయ జిమ్మిక్కూ దాగుంది. ప్రజల ఓట్లతో ఎన్నికైన ఈ ప్రజా ప్రతినిధులు... నియోజకవర్గాల్లోని ప్రజలు, కార్యకర్తల ఇండ్లలో జరిగే ఫంక్షన్లు, వేడుకలకు హాజరు కావటాన్ని ఎవరూ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఫొటోలు, సెల్ఫీలు దిగటాన్ని కూడా మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. కానీ రేషన్ కార్డులు, పింఛన్లు, వికలాంగులకు సర్టిఫికెట్లలాంటి వ్యక్తిగత అంశాలతోపాటు వీధి దీపాలు, పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, బస్ సౌకర్యం, బళ్లు, ఆస్పత్రులు, రైతు బంధు, రైతు బీమా, భూ కబ్జాలు... ఇలా ఊరికి, జనాలకు ఉపయోగపడే అంశాలపై కూడా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు దృష్టి సారిస్తే ఎంత బావుంటుందో...? అప్పుడే 'జనం కళ్లల్లో నిజమైన ఆనందాన్ని...' మనం చూడగలుగుతాం... - బి.వి.యన్.పద్మరాజు