Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''యాద్గిరీ, యాద్గిరీ ఎట్లైనా సరే ఈసారి కూడా నువ్వే పైసలడ్జెస్ట్ చేయాలి. లేకపోతే కొంప మునిగేటట్టుంది'' అంటూ పరుగు పరుగున వచ్చాడు కిషన్.
''అసలేమనుకుంటున్నవ్రా నా గురించి? మా ఇంట్ల ఏమన్నా పైసల చెట్టున్నదా'' యాద్గిరి కొద్దిగా గరం గరంగానే అన్నాడు.
''మీ ఇంట్లో ఏ చెట్టైనా ఉండనీ, నాకు మాత్రం నీడనిచ్చే చెట్టు నువ్వే''. ఎక్కడ కొట్టాలో బాగా తెలిసినోడు కిషన్. తనే మళ్ళీ ''ట్యాంక్ బండ్ ఎండిపోవచ్చు, రిజర్వు బ్యాంకు దగ్గర డబ్బుల్లేకపోవచ్చు, నీ దగ్గర మాత్రం నాకు సరిపొయేన్ని పైసలెప్పుడూ నా కోసం ఎదురు చూస్తుంటరు'' కిషన్ దెబ్బ మీద దెబ్బ వేస్తున్నడు.
''అంత గ్యారెంటీగా దొరుకుతాయా'' యాద్గిరి ఒక పక్క ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు ఇంకో పక్క పరేషానవుతుండు. ''పైసలిస్తే తన మరియాద ఎక్కువవుతుంది. లేవు అన్నాననుకో రిజర్వ్ బ్యాంక్ అంతటిది ఖాళీ అయిందా అని ఈ కిషన్ అనుకునే ప్రమాదముంది'' అనుకుంటున్నాడు లోపల.
''ఆలోచించడానికి టైమ్ లేదు, జర స్పీడుగా తీరు పైసలు'' కిషన్ దబాయించినట్టే అడుగుతున్నడు
''కొన్ని పైసలిస్త కానీ అవి నాటుకో మీ ఇంట్లో, నన్ను అడిగే పనే ఉండదు తరువాత''
''చూశాములే, ఆ చెట్లు మాలాంటి వాళ్ళ ఇంట్లో ఎలా మొలుస్తాయి, అవి మీకే సొంతం. అయినా ప్రయత్నిస్తా కొన్ని నాటి, ఇప్పటికి మాత్రం నీవే నన్ను కాపాడాలి'' అన్నాడు కిషన్. ఇక తప్పింది కాదు యాద్గిరికి.
నిజానికి పైసల చెట్టన్న కాన్సెప్టే సోమరితనానికి తొలిమెట్టు అనిపిస్తుంటుంది. రకరకాల చెట్లు వేసి, పంటలేసి ఇలా ఎన్నో చేస్తే కాని పైసలు రావు. అలాంటిది పైసల చెట్టు అన్నదొకటుంటుంది, కామధేనువులాగ దాన్ని సంపాదిస్తే చాలుననుకునే వారు నిజంగా సోమరిపోతులై ఉంటారు. కష్టపడితేనే ఏ చెట్టైనా వచ్చేది. ఏ శ్రమా లేకుండా వచ్చేవి కలుపు మొక్కలు మాత్రమే. అవేగాక చట్టవిరుధ్ధమైన గంజాయి మొక్కలు లాంటివి కొన్ని ఉన్నాయి. అవి నిజంగా పైసల చెట్లే. చట్టబద్దమైనదైనా పొగాకుకు మాత్రం మంచి రేటుంటేనే మంచి ఫలితాలు. లేకుంటే అంతే.
అసలు ఈ పైసల చెట్టే తమాషా విషయం. అందుకే ఒక కథ చెప్పుకోవాలి. తెనాలి రామలింగడు అందరికీ తెలుసు. శ్రీకష్ణ దేవరాయలు దగ్గరికి పోతూ ఉంటే చీకటి పడి ఓ గుళ్ళో ఉంటాడు కుటుంబంతో సహా, పొద్దున్నే పోవొచ్చులెమ్మని. అది అమ్మవారి గుడి. ఆమె ప్రత్యక్షమై రెండు గ్లాసుల పాయసమిస్తుంది. ఒకటి తాగితే మంచి ధనవంతుడవుతాడు, రెండోది తాగితే మంచి కవి అవుతాడని చెబుతుంది. ముందే అక్కినేని కదా! రెండూ కలుపుకొని తాగేస్తాడు. దేవికి కోపమొచ్చి నీ అవసరానికి నీ డబ్బు ఉపయోగపడదు, ఇతరులను నవ్వించడానికే తప్ప నీ విద్య దేనికీ పనికి రాదు, నీవు వికటకవివౌతావు అని శాపమిస్తుంది. మనకు రెండు గ్లాసులిచ్చే వాళ్ళు కాదు కదా ఒక్క స్పూను పాయసం కూడా ఇచ్చేవాళ్ళు లేరు. లేకపోవడమే కాదు మనం సంపాదించుకున్నదంతా పెట్రోలు బంకుల్లో, సూపర్ మార్కెట్లలో, ఇంకా ఇతర విధాల పెరిగిన రేట్లతో సతమతమై ఖర్చు పెట్టవలసిన దుస్థితి. ఈ పైసల చెట్లు మనకు మాత్రమే లోకల్ అనుకోవద్దు. ఐ.ఎం.ఎఫ్Û, ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు ఇలా ఇంకా ఎన్నో సంస్థలు పైసల చెట్ల రూపంలో మన ఇంటికే వచ్చి, మన వాకిట్లోకే వచ్చి, మన హాల్లోకే వచ్చి లోన్స్ ఇచ్చిపోతాయి. మనకంటే ఇక్కడ ప్రభుత్వాలకన్న మాట. తరువాత అన్నీ షరతులే. అప్పుడు మన రాష్ట్రము, దేశము వాళ్ళకి పైసల చెట్లయి పోతాయి. మన పండ్లు ఊడేలా మనపైనే ఆస్తి పన్ను అని, కరెంటు బిల్లులని, ఇంకా జీ.ఎస్.టీ అని వేస్తారు. అప్పుడు మన పైసల చెట్టు నుండే పైసలు రాలి కింద పడుతుంటాయి.
ఎన్నికలప్పుడు దాచిన సొమ్మంతా తీసి వాడేస్తారు. అది ఎలా సంపాదించారో అలాగే ఖర్చు చేస్తారు. అవే పైసలు గెలిచాక ఇంకా చాలా డబ్బుని సంపాదిస్తాయి. నిజంగా పైసల చెట్టు ఫార్ములా దీనికి సరిపోతుంది. ఎలా వచ్చే డబ్బు అలా పోతుందంటారు కాని ఎవ్వరూ ఊరకే అలా డబ్బును పోగొట్టుకోరు. మళ్ళీ రాబట్టుకోవడానికే చూస్తారు. ఎన్నికలప్పుడు పెట్టిన పైసలు విత్తనాల్లాంటివి, అవి తరువాత మొక్కలై, తీగలై, మానులై ఇంకా ఇంకా సంపాదించి పెడతాయి పైసల్ని. అప్పుడు కానీ మనకర్థం కాదు అసలు విషయం. ఆ విత్తనాలు మామూలు వాళ్ళకు దొరకవు.
ఉదయం లేచిన దగ్గరినుండి కొందరిదగ్గరే అంతంత డబ్బు ఎలా తిరుగు తుంది. అసలు అది ఎలా కూడబెట్టారు, అంతగా కష్టపడ్డారా అన్న అనుమాన మొస్తుంది. అలా కనిపించేదానిలో నిజంగానే చాలా కష్టపడి సంపాదించిన వాళ్ళూ కనిపిస్తారు. అలా కాక తాతలు, తండ్రుల నుండి వచ్చింది వాళ్ళదగ్గర ఎలా గుమికూడింది అని ఆలోచిస్తే మన ఆలోచనలు కొద్ది దూరం పోయి ఆగిపోతాయి. ఇక్కడే మార్క్సు మహనీయుడు, అతని నిజమైన దోస్త్ ఎంగెల్స్‌లు రాసిన క్యాపిటల్ అనే పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. అందుకే చదవాలి. లేదా ఎవరితోనైనా చెప్పించుకోవాలి. ఆ పుస్తకం పై వచ్చిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. అసలైన పైసల చెట్లు ఈ ప్రపంచంలో ముందునుండీ ఉన్నాయా, లేక తరువాత కాలంలో ఎలా వచ్చాయి అన్న ఎన్నో విషయాలు ఆ పుస్తకం అరటి పండు వలిచిపెట్టినట్టు మనకు చెబుతుంది. కోతులనుండి మానవులైన వారు మనుషులైనాక ఎలాగున్నారు, ఎలా మారారు, అందరి శ్రమను వాడుకొని కొందరు మాత్రమే ఈ పైసల చెట్లను ఎలా సంపాదించారు అన్నవి అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ పైసలే మన ప్రతీ సంబంధంలో తమ పాత్ర పోషిస్తాయని తెలుసుకుంటే పరేషానవుతారు కొందరు.
మామూలు జనాలు పోలేని చంద్ర మండలానికి, అంతరిక్షంలోకి త్వరలో మస్తు కమాయించినోళ్ళు పోతారంట. తరువాత గురు గ్రహంపైకి కూడా పోతారంట. మానవుడే మహనీయుడు కాని పైసలున్న మానవుడు ఇంకా ఇంకా మహనీయుడన్న విషయం యాదిలో పెట్టుకోవాలి. అందుకే ఈ పైసల గురించి, పైసల చెట్ల గురించి ఎంత బాగా తెలుసుకుంటే మన జీవితాలు అంత బాగా అర్థమవుతాయి.
- జె. రఘుబాబు
సెల్:9849753298