Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెగాసస్ నిఘా, రైతు వ్యతిరేక శాసనాలు, కరోనా సంక్షోభం వంటి అంశాలపై ప్రజాస్వామికంగా చర్చ చేయలేక పార్లమెంటును ముందే వాయిదా వేసుకుని పలాయనం చిత్తగించిన నరేంద్రమోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మరో బ్రహ్మాస్త్రం సంధించాయి. దేశంలోని 19 పార్టీలు-వాటిలో కీలకమైన జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాలలో పాలనచేస్తున్న ప్రాంతీయ పార్టీలతో సహా ఆగస్టు20న సమావేశమై మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాల మీద ఐక్య నిరసనకు శంఖం పూరించాయి. సెప్టెంబరు20-30 తేదీల మధ్య దేశ వ్యాపితంగా ఈ నిరసనోద్యమం రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి ఆయా శాఖలు నిర్ణయించు కుంటాయి. పార్లమెంటు ఉభయసభలలో పారదర్శక చర్చకు పాతర వేయడమే గాక ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగిన బీజేపీకి, కేంద్రానికి ఇది రాజకీయంగా ఎదుదుదెబ్బే, మోడీ రెండవ సారి అధికారంలోకి వచ్చారు గనక బీజేపీకి మూడువందల పైన స్థానాలు వచ్చాయి గనక ఇక ఎదురు ఉండదని కలలు గన్న కాషాయ కూటమికి భంగపాటే. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల కీలక నేతలు పాల్గొనడం, 19 పార్టీలు నిర్దిష్టమైన ప్రజా సమస్యలపై ఆందోళనకు సంయుక్త ప్రకటన చేయడం ఈ సమావేశం ప్రాధాన్యత తెల్పుతున్నది. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం ఎవరిది వంటి అడ్డు సవాళ్లతో ప్రజలను తికమక పర్చడానికి జరిగిన వ్యూహాత్మక ప్రచార దాడి ఇకముందూ కొనసాగుతుంది. వాస్తవానికి ఆశీర్వాద యాత్రల పేరుతో ఇప్పటికే బీజేపీ జాతీయనేతలు కేంద్ర మంత్రులు దేశమంతా తిరిగేస్తున్నారు కూడా. అయితే వారు ఎంతగా ఎదురు దాడి చేసినా ప్రభుత్వ ఇరకాటం దాచేస్తే దాగని సత్యంలా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ప్రతిపక్షా లలో జాతీయంగానూ ఆయా రాష్ట్రాలలోనూ ఎన్ని తేడాలు ఉన్నా మోడీసర్కారు నిరంకుశపోకడలు పార్లమెంటులో ప్రస్పుటమైన తర్వాత ఉమ్మడిగా పోరాడటం అవసరమనే మెళకువ పెరుగుతున్నది. చాలా ప్రాథమిక దశలో ఉన్నా ఇది మాత్రం కాదనలేని నిజం.
మరో మూడు సమావేశాలు
వాస్తవానికి సోనియా చొరవతో జరిగిన ఈ సమావేశానికి ముందు మూడు ఇష్టాగోష్టుల వంటివి జరిగాయి. వాటిలో పాల్గొన్న పార్టీలలో కొన్ని అటూ ఇటుగా ఉన్నా ఈ ప్రక్రియ మాత్రం ముందుకు పోతూనే ఉంది. వామపక్షాలు ఈ నాలుగు సందర్భాలలోనూ పాలుపంచు కోవడం ద్వారా బీజేపీ మతతత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణ పెంచడంపట్ల వాటి నిబద్దత వెల్లడైంది. మొదటగా ఎన్సీపీ అధినేత సీనియర్ నాయకుడు శరద్‌పవార్ నివాసంలో ఒక చర్చ జరిగింది. ఎస్పీ, బీఎస్పీ, తెలుగు రాష్ట్రాల పార్టీలు తప్ప తక్కినవన్నీ హాజరైనాయి. ఈసమావేశం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెరవెనక చొరవతో జరిగిందని చెప్పినా రాజకీయంగా పరిమిత సంకేతాలు ఇచ్చింది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన అల్పాహార విందులో ప్రతిపక్షాలు చర్చలు జరిపి సభలో ప్రభుత్వ మొండివైఖరిని ఎలా ఢకొీనాలో నిర్ణయించాయి. పార్లమెంటుకు సైకిళ్లపై వెళ్లి పెట్రోలు ధరల పెంపుపట్ల నిరసన ప్రకటించాయి. లోక్‌సభలో ప్రభుత్వం చర్చకు కాస్తయినా సిద్దపడకపోవడం వల్ల నిరసనలతో ప్రకంపించింది. బీసీలను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే పునురుద్ధరిస్తూ తెచ్చిన బిల్లును బలపర్చాలని తీసుకున్న నిర్ణయం మేరకు దాన్ని ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఆమోదించపడం ద్వారా ప్రతిపక్షాలు తమ పరిపక్వతను ప్రదర్శించాయి. కాని ప్రభుత్వం మాత్రం తను ఉద్దేశించిన బిల్లులను బుల్డోజర్లా చర్చలేకుండా ముద్ర వేయించుకోవడానికే పాకులాడింది.
సాధారణంగా లోక్‌సభలో కాకున్నా రాజ్యసభలోనైనా కొంతచర్చకు అవకావ మివ్వడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి. పైగా అక్కడ ప్రతిపక్షాలకే మెజారిటీ ఉంది. అయినా సరే ప్రభుత్వం గానీ చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడు గానీ కాస్తకూడా పట్టువిడుపులు ప్రదర్శించలేదు. నిబంధనల ప్రకారం చర్చను అనుమతించనేలేదు. సాధారణ బీమాబిల్లుపై కనీస ఏకాభిప్రాయం కూడా లేకున్నా రభసలోనే మమ అని ప్రకటించేసుకున్నారు. ఈ క్రమంలో సహజంగా నిరసన పెల్లుబికితే అదేదో మహాపరాధమైనట్టు, బీజేపీ ఎన్నడూ సభల్లో ప్రతిష్టంభన సృష్టించనట్టు వెంకయ్యనాయుడు అదేపనిగా సూక్తులు సుద్దులు వల్లించారు. కంటతడిపెట్టి కరుణ రసం కురిపించినట్టు కనిపించినా కఠోర చర్యలకు ఆదేశాలిచ్చారు. సభలో 12 మంది ప్రతిపక్ష సభ్యులు అవాంతరాలు సృష్టించారని ప్రభుత్వం చెబుతుంటే వెంకయ్యగారి సభాపీఠం ఏకంగా నలభైమందిపై ఆరోపణలు చేసింది. వీరిపై ఏదో చర్య తీసుకోవడానికి హడావుడి పడుతున్నది. ఇలాంటి వాటివల్ల సభ్యులు జంకేది ఉండదు గాని ప్రభుత్వ స్వభావమే బహిర్గతమవుతుంది. పెగాసస్‌పై చెప్పేదేమీ లేదని బుకాయించిన ఈ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో భిన్నమైన అఫిడవిట్ దాఖలు చేసింది. పెగాసస్ వినియోగించలేదని అఫిడవిట్ వేయడానికి, కనీసం మౌఖికంగా చెప్పడానికికూడా సిద్ధం కాలేదు. సైన్యానికి పెగాసస్‌తో సంబంధం లేదని సైనికవర్గాలు ప్రకటిస్తే ఇది దేశ రక్షణకు సంబంధించిన సమస్య అని ప్రభుత్వం బుకాయించింది. ఇవి రెండూఎంత పరస్పర విరుద్ధమైన వాదనలో వేరే చెప్పాలా?
కపిల్‌సిబాల్ చొరవ
ఈ పరిస్థితులలోనే కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నాయకుడు కపిల్‌సిబాల్ పుట్టిన రోజు పేరుతో అన్ని ప్రతిపక్షాలను విందుసమావేశానికి పిలిచారు. గతంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి హరికిషన్సింగ్సూర్జిత్ తృతీయ ప్రత్యామ్నాయాల కోసం కృషి చేసిన ఢిల్లీ అశోకారోడ్ 9 నివాసంలో ఈ విందు జరిగింది. సీతారాం ఏచూరి ఆ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. పై రెండు సమావేశాలకు హాజరవని సమాజ్‌వాదిపార్టీ వంటివి ఈవిందుకు వచ్చాయి. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని ఇక్కడా అభిప్రాయం వ్యక్తమైంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశంలేదని అంతకు ముందే చెప్పిన మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఈ ఎన్నికల్లో మద్దతునివ్వాలని సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు వచ్చినట్టు చెప్పారు. ఈ సమావేశం ప్రతిపక్షాల మధ్య ఐక్యతా వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకుపోయినట్టు పరిశీలకులు భావించారు. అయితే కాంగ్రెస్‌ను కాయకల్ప చికిత్సతో బలోపేతం చేయాలని, వెంటనే సంస్థాగత ఎన్నికలు జరపాలని అంతర్గత పోరాటం చేస్తున్న జి23 బృందంలో కపిల సిబాల్ ఒకరు గనక ఈ సమావేశం ఆ పార్టీలో గాంధీల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిందనే వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. రాహుల్‌గాంధీ సమావేశం కన్నా దీనికే ఎక్కువ స్పందన వచ్చిందనట్టు కొన్ని పత్రికలు రాశాయి. ఆ తర్వాత కాంగ్రెస్ మాజీ ఎంపీ, మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు సుమిత్రాదేవ్ పార్టీకి రాజీనామాచేసి టీఎంసీలో చేరారు. పాతవాళ్లుచేస్తామంటే వద్దంటున్నారు, యువతవెళ్లిపోతున్నారు అని కపిల్‌సిబాల్ దానిపై వ్యాఖ్యానించారు. ఇలాంటి తరుణంలో సోనియాగాంధీ సమావేశం మరింత ప్రచారం పొందింది. పైగా జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ప్రసాద, ఇప్పుడు సుమిత్రాదేవి వంటివారంతా నిష్క్రమించడంతో రాహుల్ బృందానికి గండిపడింది. కాంగ్రెస్‌కు ఆయనే నాయకుడవుతాడని ఒక వర్గం, కొత్తనాయకత్వం కావాలని మరోవర్గం బాహాటంగానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఆ సమస్యను వారు అంతర్గతంగా పరిష్కరించుకోవలసిందే.
ఐక్యత అవసరాన్ని చెప్పిననేతలు
సోనియాగాంధీ ఈ సమావేశంలో పార్లమెంటు పరిణామాలను ప్రస్తావించి, ప్రతిపక్షాలు ఆ తరహా సమన్వయం బయిటకూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాడుతూనే 2024ఎన్నికలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఒక బాధ్యతాయుత ప్రజాస్వామిక ప్రభుత్వం తెచ్చుకోవడంపై ప్రణాళికా బద్దంగా కృషి కేంద్రీకరించా లన్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యతను కొనసాగించడానికి ఒక కోర్‌గ్రూప్ వంటిది ఏర్పాటు చేయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. మోడీ సర్కారు రాజ్యాంగ విలువలను ధ్వంసంచేస్తున్న పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలనేదానిపై ఎవరు ఏమేరకు నిలబడతారన్నది తేలుతుందని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య లౌకిక విలువలపై నమ్మకం ఉన్నవారంతా ఒకతాటిపైకి రావాలని శరద్ పవార్ చెప్పారు. సమాఖ్య వ్యవస్థను కాపాడుకోవడానికి దేశవ్యాపిత పోరాటం అవసరమని తమిళనాడు స్టాలిన్ చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్భవ్ ఠాక్రే మాట్లాడినప్పుడు కాంగ్రెస్ తరపున గతంలో అహ్మద్‌పటేల్ ప్రతిపక్షాలతో సమన్వయం చేస్తుండేవారని, ఇప్పుడు శరద్‌పవార్‌కే ఆ పనివదిలేశారని చెబుతూ ఉమ్మడికృషి అవసరాన్ని బలపర్చారు. వాస్తవానికి ఆయన పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సరిగా లేదని భావించగా, సీతారాం ఏచూరి కొంత సర్దుబాటు చేయవలసి వచ్చిందట. నాయకత్వం ఎవరిదనేది ఇప్పుడు సమస్య కాదని కూడా సమావేశంలో పాల్గొన్న నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఢిల్లీలో పాలకపార్టీ అయిన ఆప్‌ను ఆహ్వానించలేదు గాని ఆ పార్టీ కూడా బీజేపీపై పోరాటం అవసరమని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకూ జరిగిన ఏ సమావేశంలోనూ పాల్గొనని బీఎస్పీని కూడా ఆహ్వానించలేదు. తెలుగు రాష్ట్రాలలో పాలకపార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీలు ఈ సమావేశాలలో పాల్గొనలేదు. కపిల్ సిబాల్ విందుకు టీడీపీ, వైసీపీ ప్రతినిధులు కొందరు హాజరైనాయనేదానిపై బిన్న కథనాలున్నాయి. (మమతా బెనర్జీ జరిపిన ఒక వెబ్సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు హజరైనారు. బీజేడీ కూడా దూరంగానే ఉంది). వివిధ పార్టీలకు ఆయారాష్ట్రాలలో కాంగ్రెస్‌తో సంబంధాలు ఎలా ఉన్నాయనే దానికీ జాతీయ స్థాయిలో జరగాల్సిన ఈ ఉమ్మడిపోరాటానికీ సంబంధంలేదని కూడా సమావేశంలో ఒక అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రాలలో పోటీకి, జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలపై పోరాటంలో అవగాహనకు వైరుధ్యం లేదని, గతంలో కూడా తేడాలున్నాయని ఏచూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవన్నీ ఆచరణలో ఎలా పరిణమించేది చూడవలసే ఉంటుంది. ఈలోగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డియాత్రకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకడంలోనూ రాజకీయ సంకేతాలు అందరూ గమనించారు. ఆయన మాత్రం తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలపై తీవ్రంగానే ధ్వజమెత్తారు. ఇదొక రాజకీయ వైపరీత్యం.
చిన్నచిన్న విషయాలు ఎలా ఉన్నా కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయపార్టీల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు ఇంతమంది ఒక వేదికపైనుంచి దేశ ప్రజలను పీడించే 10అంశాలపై ఉమ్మడి కార్యాచరణకు పిలుపునివ్వడం ఆహ్వానించదగిన పరిణామం. ఉత్తర ప్రదేశ్‌తో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు కూడా బీజేపీకి పెద్ద సవాలుగా ఉన్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాలలో బీజేపీ ప్రధానశక్తికాదు. ప్రధాని మోడీ ప్రజాదరణరేఖ ఆరు నెలల్లోనే 68 నుంచి 24 పాయింట్లకు పడిపోయిందంటే అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉన్నదీ విదితం. ఈ ప్రజాస్పందనకు ఒక రూపం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైనే ఉంటుంది. దేశవ్యాపితంగా బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలు, మతతత్వ, వ్యూహాలు, కోవిడ్ తాకిడి, వాక్సిన్ల కొరత, ఆర్థిక దిగజారుడు, ఉపాధి కొరత వంటి పది సమస్యల పరిష్కారంకై పదికోర్కెలతో వచ్చే నెలలో ఈ పార్టీలు దేశవ్యాపితంగా జరిపే ఆందోళన ప్రభావం చాలా ఉండబోతుంది. అయితే ఇది చాలా సంక్లిష్టమైన ఇబ్బందులతో కూడిన ప్రయాణం అనడంలో సందేహం లేదు.
- తెలకపల్లి రవి