Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ఏదైనా ఇంగ్లీషులో అడిగితే అదే భాషలో జవాబు చెప్పాలి తప్ప హిందీలో చెప్పడం సరైంది కాదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ గురువారం (19-20-2021) నాడు కేంద్రాన్ని ఆదేశించింది. సీఆర్పీఎఫ్ పారామెడికల్ రిక్రూట్మెంట్ కేంద్రాలను తమిళనాడు, పుదుచ్చేరిలలో ఏర్పాటు చేయాలని మదురై పార్లమెంట్ సభ్యులు ఎస్. వెంకిటేషన్ (సిపిఐ(ఎం)) కేంద్ర ప్రభుత్వానికి ఇంగ్లీషులో వ్రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వ హౌమ్ మంత్రిత్వ శాఖ హిందీలో సమాధానం ఇచ్చింది. ఇంగ్లీషులో అడిగితే హిందీలో జవాబు ఇవ్వడం ఏమిటని వెంకిటేషన్ ఏడాది క్రితమే హైకోర్టులో వేసిన 'ప్రజా ప్రయోజన వ్యాజ్యం' కి ఇప్పుడు తీర్పు వచ్చింది. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్, 1963 ని అమలు చేయాలని, ఇంగ్లీషులో అడిగితే ఇంగ్లీషులోనే జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని జస్టిస్ ఎం. కిరుబకరన్, జస్టిస్ దురైస్వామి ధర్మాసనం తీర్పు చెప్పడం భాషల విషయంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆధిపత్య దాడికి చెంప పెంపపెట్టు వంటిదే.
రాజ్యాంగం 343 అధికరణంలో కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా హిందీ ఉంటుందని చెబుతూ, 15 సంవత్సరాల వరకు అధికారిక కార్యకలాపాలకు ఇంగ్లీషే కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. 15 సంవత్సరాల తర్వాత కూడా అవసరమనుకుంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఇంగ్లీషునే కొనసాగించవచ్చని కూడా పేర్కొన్నది. అందుకు అనుగుణంగానే 1963 పార్లమెంట్ చట్టం సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అధికారిక వ్యవహారాలు ఇంగ్లీషులో నిర్వహించాలి. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉల్లంఘించి అన్ని సందర్భాల్లో హిందీ భాషనే వినియోగిస్తూ ఇంగ్లీషును అంటరాని భాషగా తీసి పారేస్తుంది. జాతీయ విద్యా విధానం 2020 లో ఇంగ్లీషును విదేశీ భాషల్లో ఒకటిగా మాత్రమే పేర్కొన్నది. ప్రపంచ భాషగా చలామణి అవుతున్న, భారతీయులు అధికంగా ఆదరిస్తున్న ఇంగ్లీషును విస్మరించే కేంద్ర ప్రభుత్వ అనుచిత ధోరణి దేశానికి, ముఖ్యంగా హిందీ యేతర రాష్ట్రాలకు అశనిపాతం వంటిది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఆధిపత్య దాడిని ఎదుర్కోవడంలో తమిళనాడు రాష్ట్రం రాజీలేని పోరాటం చేస్తోంది. అందులో భాగమే మద్రాస్ హైకోర్టులో ఎంపీ వెంకిటేషన్ గెలుపు. హ్యాట్సాఫ్.
-నాగటి నారాయణ
సెల్: 9490300577