Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెభ్భైమూడు సంవత్సరాల ఆర్టీసీ కార్మికోద్యమ చరిత్రలో తమకు సామాజిక భద్రత కల్పించాలని, సీసీఎస్‌కు నిధులు ఇవ్వాలని, ఎస్ఆర్బిఎస్ బెన్ఫిట్ సక్రమంగా చెల్లించాలని కోరుతూ ఆగస్టు 9న బస్‌భవన్ వద్ద ప్రదర్శన జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డిపో మేనేజర్లుగా పనిచేసిన వారే ఆ ప్రదర్శనకు నాయకత్వం వహించారు. లక్షల రూపాయలు జీతాలు తీసుకున్న వారే ప్రస్తుతం సీసీఎస్, ఎస్ఆర్బిఎస్ స్కీమ్‌ల పట్ల అంత అభద్రత ఉంటే కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లుగా చేసిన వారి ఆర్థిక పరిస్థితి ఇంక ఎంత దారుణంగా ఉంటుదో?
63సంవత్సరాల ఆర్టీసీ కార్మికోద్యమం చేసిన ఆందోళన, పోరాటాల వల్ల పాలకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయి. మరికొన్ని భారతదేశ కార్మికోద్యమం చేసిన పోరాటాల ఫలితంగా వచ్చిన సంక్షేమ పథకాలు ఆర్టీసీ కార్మికులకు కూడా అమలవుతున్నాయి. అలా తెచ్చుకొన్ని అనేక సంక్షేమ పథకాలు నేడు ప్రమాదంలో పడుతున్నాయి. ఉన్న సంక్షేమ పథకాలు ఏ రకంగా నిర్వీర్యం చేయబడుతున్నాయో పరిశీలిద్దాం.
మొదటిది భవిష్యనిధి: 1952లో వచ్చిన చట్టం ప్రకారం భవిష్యనిధి అమలులోకి వచ్చింది. దానికి అనుబంధంగానే మరో రెండు పథకాలు పని చేస్తున్నాయి. 1. ఎంప్లాయీస్ డిపాజిటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఇడిఎల్ఐఎస్). 2. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్. కేంద్రం నుంచి అనుమతి తీసుకొని ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ స్వతంత్రంగా పని చేస్తున్నది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పరిశీలిస్తే 2014-15 సంవత్సరం నుండి 2017-18 సంవత్సరం వరకు ఉద్యోగి వాటా డబ్బులు పూర్తిగా ట్రస్ట్‌కు జమ చేశారు. ఇదే కాలంలో యజమాని వాటా డబ్బులు సుమారు 270 కోట్లు ట్రస్ట్‌కు చెల్లించలేదు. 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాలలో కార్మికుల వాటా సొమ్ము 650 కోట్లు, యజమాని వాటా 400కోట్లు ట్రస్ట్‌కు చెల్లించకుండా యాజమాన్య అవసరాలకు వాడుకొన్నది. మొత్తంగా రూ.1320 కోట్లు కార్మికుల సొమ్మును యాజమాన్యం వాడుకొంటున్నది. ఫలితంగా పిల్లల పెండ్లి, చదువులు, ఇంటి కొనుగోలు తదితర అవసరాల కోసం భవిష్య నిధి నుంచి లోన్ తీసుకోలేక పోతున్నారు. ప్రధానంగా 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని రకాల లోన్లు నిలిపివేశారు.
ఉద్యోగి సర్వీసులో ఉండి మరణించినప్పుడు డెత్ సర్టిఫికెట్తో క్లెయిమ్ పంపిన నెల రోజులలో ఇడిఎల్ఐఎస్ కింద 6లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు చనిపోయిన కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించనందున ఆ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచిన నేపథ్యంలో కూడా ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ ప్రకారం 58సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగి పెన్షన్ పొందడానికి అర్హులు. కార్మిక సంఘాలు చేసిన ఒత్తిడి ఫలితంగా దీని అమలుకు ఆర్టీసీ యాజమాన్యం సర్క్యులర్ ఇచ్చింది. కానీ 2020 మార్చి నుంచి నేటి వరకు ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కోసం రీజనల్ ప్రావిడెంట్ కమిషనర్ కార్యాలయంలో జమ చేయాల్సినవి సుమారు 100 కోట్లు చెల్లించనందున, అర్హత ఉన్నవారు కూడా పెన్షన్ పొందలేకపోతున్నారు. ఈపీఎస్‌కు డబ్బులు చెల్లించకపోతే 2021 డిసెంబర్ నుంచి రిటైర్ కాబోతున్న కార్మికులకు పెన్షన్ ఎలా వస్తుంది? అనే వ్యధ కార్మికులను కుదిపేస్తున్నది.
మరో స్కీమ్ స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్ఆర్బిఎస్). 1989 సంవత్సరం నుంచి కార్మికుల దగ్గర నుంచి రికవరీ చేస్తున్న నిధులతో నిర్వహిస్తున్న ట్రస్ట్. ఇది 30సంవత్సరాలు సభ్యత్వం పూర్తి చేసిన వారికి రూ.3225లు ప్రతి నెల బెనిఫిట్ గాను, అంతకంటే తక్కువ సర్వీసు చేస్తే, వారు పూర్తి చేసిన సర్వీసుకు దామాషాగా ప్రతి నెలా బెనిఫిట్ చెల్లిస్తారు. స్కీమ్‌లో ఇప్పటి వరకు మూలధనంగా 400కోట్లు ఉన్నాయి. ఆర్టీసీ యాజమాన్యం వద్దే లోన్ రూపంలో ఉన్నాయి. దీనిపైన 3నెలలకు ఒకసారి 9 కోట్లు ట్రస్ట్‌కు చెల్లించాలి. అలాగే సభ్యుల నుంచి నెలకు 1.5కోట్లు చొప్పున రికవరీ చేస్తారు. వడ్డీ, సభ్యత్వం నుంచి వసూలైన వాటిని కలిపి రిటైరైన వారికి నెలకు 4.5కోట్లు చెల్లిస్తున్నారు. అయితే యాజమాన్యం వడ్డీ డబ్బులు ట్రస్ట్‌కు సక్రమంగా జమ చేయడం లేదు. ఫలితంగా రిటైరైన కార్మికులకు గత 3నెలలుగా చెల్లించాల్సిన బెనిఫిట్‌ను చెల్లించలేదు. పైగా ఎస్ఆర్బిఎస్ ట్రస్ట్‌కు యాజమాన్య వాటా కింద చెల్లించాల్సిన సంవత్సరానికి 6కోట్లు చొప్పున 42కోట్లు ట్రస్ట్‌కు చెల్లించలేదు. ఇది కూడా కార్మికులలో భయాందోళనలు పెరగడానికి కారణమవు తున్నది. స్టాఫ్ బెన్వఎలంట్ ట్రస్టీ ఫండ్ (ఎస్బిటి) అనే మరో ట్రస్టు పని చేస్తున్నది. సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి 1.5లక్షలు నగదును అందిస్తారు. రిటైరైన వారికి ట్రస్ట్‌లో తన వాటాగా జమ అయిన నగదును వడ్డీతో కలిపి చెల్లిస్తారు. దీనికి సంబంధించిన డబ్బులు 125 కోట్లు కూడా టీఎస్ఆర్టీసీ వద్దనే లోన్ రూపంలో ఉన్నాయి. ఆ లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీ సక్రమంగా చెల్లించనందున సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబాలలో సుమారు 350 కుటుంబాలకు ఎస్బిటి నుండి బెనిఫిట్ నేటికి చెల్లించలేదు.
సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబాలలో అర్హత కలిగిన వారికి ఒకరికి ఉద్యోగం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఒక ఉద్యోగి మరణిస్తే తక్షణమే ఒక పోస్ట్‌ను సృష్టించి, అందులో చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తారు. ఆర్టీసీలో మాత్రం ఉన్న ఖాళీలలో మాత్రమే నియామకం చేయాలన్న నిబంధన ఈ రోజు ప్రతిబంధకంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా చనిపోయిన వారి కుటుంబాలలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అనేక మందికి ఆర్టీసీ నిబంధనల ప్రకారం రిక్రూట్ చేయబడినా కూడా పోస్టింగ్స్ ఇవ్వడం లేదు. ఈ స్థితి మారనంత వరకు ఈ పథకం కూడా నిరుపయోగంగా ఉన్నట్లే భావించాల్సి ఉంటుంది.
ఆర్టీసీ కార్మికులకు సంస్థే తన స్వంత ఆసుపత్రి ద్వారా వైద్యం అందించే ఉద్దేశ్యంతో 1978లో తార్నాక ఆసుపత్రిని ప్రారంభించారు. కానీ రాను రాను సంస్థ కార్మికుల ఆరోగ్యం కోసం చేసే ఖర్చును పెంచాల్సింది పోయి, మరింతగా తగ్గించి వేస్తున్నారు. అలాగే సంస్థలో పని చేసి రిటైరైన వారి కోసం 'రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్' (ఆర్ఇఎంఎస్) క్రింద వైద్యం అందిస్తున్నారు. 2019 సమ్మె అనంతరం 2020 మార్చి నుండి నేటి వరకు కరోనాతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ కరోనాకు వైద్యం అందించకపోవడమే కాకుండా, సాధారణ జబ్బులకు కూడా సరైన వైద్యం అందించడం లేదు. అలాగే నష్టాల పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లించాల్సిన 20కోట్లు బకాయిలు చెల్లించనందున, ప్రముఖ ఆసుపత్రులు ఏవి కూడా వైద్యం అందించడం లేదు. అలాగే కార్మికులు, వారి కుటుంబాలకు అవసరమైన అనేక రకాల మందులను సగం మాత్రమే ఇస్తున్నారు.
కార్మికుల సామాజిక భద్రతలో అతి ముఖ్యమైనది కార్మికుల కోసం కార్మికులే నిర్వహించుకుంటున్న క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ. కార్మికుల అవసరాలకు ప్రయివేటు వ్యక్తుల నుండి అప్పులు చేసి ఇబ్బంది పడకుండా, సరసమైన వడ్డీతో పరపతి సౌకర్యం కల్పించేది. 1600 కోట్ల ఆస్తితో అతి ఎక్కువ మంది సభ్యులు కలిగిన సొసైటీగా, ఆసియాలోనే రెండవ సంస్థగా పేరొందింది. షార్ట్‌టర్మ్ లోన్ కోసం అప్లై చేసుకున్న ఒక్క రోజులో లోన్స్ విడుదల చేసే స్థితిలో కార్మికుల లోన్స్ రికవరీ, సభ్యత్వ రుసుము రికవరీ చేసి సీసీఎస్‌కు చెల్లించే బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్నదే. దీనినే అవకాశంగా తీసుకొని ఆర్టీసీ 2019 నుండి ప్రతి నెలా రికవరీ చేస్తున్న డబ్బులను సీసీఎస్‌కు చెల్లించకుండా తన స్వంత అవసరాలకు వాడుకొంటున్నది. సంస్థకు ఉన్న 1600 కోట్లలో 1100 కోట్లకు పైగా ఆర్టీసీ యాజమాన్యం వాడుకోగా, మిగతా 500 కోట్లు కార్మికుల వద్ద లోన్స్ రూపంలో ఉన్నాయి. ఫలితంగా సీసీఎస్ వాటాదారులు, డిపాజిట్ చేసిన వారిలో అభద్రత పెరిగిపోయి తమ సభ్యత్వం రద్దు చేసుకోవడం కోసం 12 వేల మందికి పైగా అప్లై చేసుకొన్నారు. వందల సంఖ్యలో డిపాజిట్‌దారులు తమ డబ్బులు తిరిగి చెల్లించాల్సిందిగా కోరారు. తాము ఉద్యోగంలో ఉండగా లక్ష రూపాయల జీతం వచ్చిన ఆఫీసర్స్ కూడా తాము ఉద్యోగ విరమణ చేసిన పిదప 1000 రూపాయలలోపే ఈపీఎస్ పెన్షన్ అందుకుంటున్నారు. వారికి సీసీఎస్‌లో చేసిన డిపాజిట్లపై వస్తున్న వడ్డీనే జీవనాధారంగా ఉంది. ఇప్పటి యాజమాన్య నిర్వాకం వల్ల ఇప్పుడున్న ఉద్యోగులతో పాటు రిటైరైన వారు కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు.
కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన బాధ్యత యజమాన్యానిది. కానీ అది ఆ బాధ్యతను నెరవేర్చకపోగా, కార్మికుల కోసం కార్మికులే నడుపుకుంటున్న సీసీఎస్‌ను కూడా నిర్వీర్యం చేస్తున్నది. సంక్షేమ పథకాలను రక్షించుకొనేందుకు ఇప్పటి కార్మికులు, రిటైరైన వారు కూడా కల్సి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
- పుష్పా శ్రీనివాస్