Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశాధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంలోనే నయా ఉదారవాద విధానాలను ఒక 'విపత్తు'గా, ఒక 'దుర్ఘటన'గా పేర్కొన్నారు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రెడార్. ఆయన 'మొరెనా' అనే ఒక వామపక్ష పార్టీకి చెందినవాడు. ఆ పార్టీ తన కార్యక్రమంలో ఇలా పేర్కొంది.. ''నయా ఉదారవాద నమూనా వైఫల్యాన్ని ప్రపంచ ఆర్థిక సంక్షోభం బహిర్గతం చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు బలవంతంగా రుద్దిన విధానాలు మెక్సికోను అతి తక్కువ వృద్ధి జరుగుతున్న దేశంగా చేశాయన్నది వాస్తవం.'' ఇందుకు బదులుగా మొరెనా పార్టీ ''ప్రభుత్వమే బాధ్యత వహించి విదేశీ జోక్యం లేకుండా దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలి'' అని ప్రతిపాదించింది.
ఈ దృక్పథంతో ఓబ్రెడార్ దేశ ఆర్థిక విధానాలలో పలు మార్పులను ప్రవేశపెడుతున్నారు. నయా ఉదారవాద విధానాలను విడనాడి ప్రభుత్వ నియంత్రణలో దేశ ఆర్థిక వ్యవస్థ నడిచే విధంగా ఈ మార్పులు ఉన్నాయి. అందుచేత అటువంటి విధానాలవైపు తిరిగి దేశాన్ని నడిపిస్తున్నందుకు ఓబ్రెడార్ మీద పాశ్చాత్య మీడియా దాడి చేస్తోంది. అతని ఫొటోను మొదటి పేజీలో ప్రచురించిన లండన్ పత్రిక 'ది ఎకనామిస్ట్' దాని కింద 'మెక్సికో బూటకపు అవతార పురుషుడు' అన్న శీర్షిక పెట్టింది.
నయా ఉదారవాద విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటువంటి చిక్కులలోకి దించాయో ఈ పాశ్చాత్య మీడియాకు బాగా తెలుసు. అందుచేత సంపన్న దేశాలు గనుక నయా ఉదారవాద విధానాలకు కాస్త దూరంగా జరిగితే, ఆ దేశాలపట్ల కాస్త ఎక్కువ సానుకూలంగా వ్యాఖ్యానిస్తాయి. అదే ఏ మూడవ ప్రపంచ దేశమైనా గనుక ఆ విధానాలనుంచి కాస్త పక్కకు జరిగినా దానిపైన పెద్దపెట్టున విరుచుకు పడతాయి. ఇది కేవలం ద్వంద్వ వైఖరిని అనుసరించడం మాత్రమే కాదు. సామ్రాజ్యవాదం స్వభావం ఏమిటో తెలియజెప్పే ఉదాహరణ ఇది. ఎటువంటి ద్రవ్యోల్బణపు ప్రభావమూ లేకుండా సంపన్న దేశాల ఆర్థిక పరిస్థితి పుంజుకోవాలంటే అందుకు మూడవ ప్రపంచ దేశాల ప్రజల ఆదాయాలను తొక్కిపట్టివుంచడం అవసరమని భావించడం దీనికి కారణం. దక్షిణాసియా దేశాలకన్నా, ఆఫ్రికా ఖండ దేశాలకన్నా మెక్సికోలో తలసరి ఆదాయం బాగా ఎక్కువ. అయినా, ఆ దేశం మూడవ ప్రపంచ దేశాలలో భాగం గానే పరిగణించబడుతోంది. ఒక చమురు ఉత్పత్తి దేశం గనుక మూడవ ప్రపంచ దేశాలలో మెక్సికోకు గల ప్రాధాన్యత ఎక్కువే.
నిజానికి ఓబ్రడార్ తెస్తున్న సంస్కరణలలో చమురు రంగానికి సంబంధించినవి ప్రత్యేక ప్రాధాన్యత కలిగినట్టివి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి చమురు రంగాన్ని మరింత ప్రయివేటీకరించాలని కోరుతోంది. కాని ఓబ్రడార్ ప్రభుత్వం అందుకు పూర్తి వ్యతిరేకదిశలో అడుగులు వేస్తోంది. అంటే, చమురు రంగాన్ని తిరిగి జాతీయం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. జాతీయ విద్యుదుత్పత్తి గ్రిడ్ తనకు కావలసిన చమురును ప్రయివేటు ఆయిల్ కంపెనీలనుండి కాకుండా, ముందు ప్రభుత్వ అధీనంలో నడిచే 'పెమెక్స్' కంపెనీ నుంచి మాత్రమే తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆదేశించింది. దేశంలో చమురు నిక్షేపాలను గుర్తించి వెలికి తీసే హక్కులకోసం ప్రధానంగా విదేశీ కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఆ బిడ్డింగ్ ప్రక్రియను ఓబ్రడార్ నిలిపివేశాడు.
స్వదేశీ చమురు శుద్ధి సంస్థల సామర్థ్యాన్ని పెంచడం కోసం పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఉన్నప్పటికీ, మెక్సికో ప్రభుత్వం గతనాలుగు దశాబ్దాలుగా అందుకు పెట్టుబడులు పెట్టలేదు. దానికి బదులు ముడి చమురును అమెరికాకు పంపుతూవచ్చింది. ఇప్పుడు ఓబ్రడార్ ప్రభుత్వం దేశంలో చమురుశుద్ధి సామర్థ్యాన్ని అదనంగా పెంచడానికి గాను ప్రభుత్వ సంస్థ అయిన పెమెక్స్కు ఆర్థికంగా పెట్టుబడులు సమకూర్చి అదనపు చమురుశుద్ధి యూనిట్లను నెలకొల్పేటందుకు ప్రోత్సహిస్తున్నది. ఆ విధంగా చమురు నిల్వల అన్వేషణతో ప్రారంభించి, దానిని వెలికి తీయడంతో బాటు, దానిని శుద్ధి చేసేవరకూ అన్ని దశలలోనూ ప్రభుత్వ జోక్యం ఉండేలా, విదేశీ ప్రయివేటు సంస్థల పాత్రను కత్తిరిస్తున్నాడు ఓబ్రడార్.
దీనివలన దేశానికి ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పెమెక్స్ కంపెనీకి వచ్చే లాభాలు ప్రభుత్వానికి చెందుతాయి. ఆ కంపెనీ ఎంత చిన్నదిగా ఉంటే లాభాలు అంత తక్కువగా వస్తాయి. అప్పుడు తనకు కావలసిన ఆర్థిక వనరులకోసం మెక్సికో ప్రభుత్వం ఇతర వనరులపైన అంత ఎక్కువగా ఆధారపడవలసివస్తుంది. అటువంటి ఇతర వనరుల్లో పెట్రో ఉత్పత్తులపైన వసూలు చేసే పన్నులు ముఖ్యమైనవి. అందుచేత పెట్రో పన్నులను ఆ ప్రభుత్వం అదనంగా పెంచవలసివస్తుంది. (మన దేశంలో మోడీ ప్రభుత్వం సరిగ్గా ఇదే చేస్తోందిప్పుడు) చమురు ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన స్థానం మెక్సికోకు ఉంది. 2019లో ప్రపంచ చమురు ఉత్పత్తిలో 2శాతం ఒక్క మెక్సికో లోనే జరిగింది. కాని మొత్తం ఉత్తర అమెరికా ఖండంలోనే చూసుకుంటే అత్యధిక పెట్రో ధరలు మెక్సికోలోనే ఉన్నాయి. అందుకే ఓబ్రడార్ చాలా కాలంనుండీ అధిక పెట్రో ఉత్పత్తులను వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వ రంగ చమురు వ్యవస్థను బలోపేతం చేయడం ఆ కారణంగానే జరుగుతోంది.
మెక్సికో నయా ఉదారవాద విధానాలనుండి వైదొలగినది కేవలం చమురు రంగంలోనే కాదు. విదేశీ కంపెనీలకు, ముఖ్యంగా కెనడా దేశపు కంపెనీలకు ఇచ్చిన మైనింగ్ లీజులను నిలుపు చేశారు. మెక్సికో లోని లిథియం నిల్వలను జాతీయం చేసే పథకాన్ని రూపొందిస్తున్నారు.
దేశంలోని సహజ వనరులమీద తిరిగి నియంత్రణ సాధించడంతోబాటు ఓబ్రడార్ ప్రభుత్వం మెక్సికో కేంద్ర బ్యాంకు మీద కూడా నియంత్రణ సాధించడం కోసం ప్లాను చేస్తోంది. ఈ కేంద్ర బ్యాంకు గవర్నర్ను సాధారణంగా ప్రభుత్వమే నియమిస్తుంది. అయితే, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఆమోదయోగ్యమైనవారినే ఇంతవరకూ నియమిస్తూ వచ్చారు. అలా వచ్చిన వారంతా దేశ ఆర్థిక వృద్ధి కన్నా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే హెచ్చు ప్రాధాన్యతను ఇస్తూవచ్చారు. ఈ విధంగా చేయడాన్ని విమర్శిస్తున్నానంటే ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకూడదని మాత్రం కాదు సుమా. వృద్ధికి అవసరమైన వ్యయాన్ని కూడా అనుమతించని ద్రవ్య విధానాన్ని అనుసరించే బదులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని దానర్థం. ఈ విషయం మీద లాటిన్ అమెరికాలో వేడి, వాడి చర్చ జరుగుతోంది గనుక దాని గురించి ఇక్కడ కొంత చర్చించాలి.
మూడవ ప్రపంచ దేశాలలో ఆర్థిక వృద్ధిరేటు వేగాన్ని పెంచాలంటే దానికి వ్యవస్థీకృతంగానే కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ప్రధానంగా వ్యవసాయ రంగం నుంచి ఇవి ఎదురవుతాయి. ఈ రంగంలో పెరుగుదల మందకొడిగా సాగుతుంది. దానిని పెంచాలంటే బుద్ధిపూర్వకంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అవసరం. భూసంస్కరణలను చేపట్టడం ద్వారా, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వంటివి సరఫరా చేయడం ద్వారా, ఇతరత్రా తోడ్పడడం ద్వారా ఈ జోక్యం ఉండాలి. ఆ విధంగా తోడ్పడాలంటే అప్పుడు ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. అది అనివార్యంగా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణం ఉండకూడదు అనుకుంటే అప్పుడు ఈ విధమైన ప్రభుత్వ వ్యయం మీద కోత విధించక తప్పదు. అప్పుడు ఆర్థిక వృద్ధిరేటు అనివార్యంగా తగ్గిపోతుంది. దేశం ఇక తన ఆదాయాన్ని ఎన్నటికీ పెంచుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది.
ఈ స్థితినుండి బైట పడాలంటే దేశ ఆర్థిక విధానం కట్టడి చేసే ధోరణితో కాకుండా వృద్ధిరేటును పెంపొందించేదిగా ఉండాలి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఏర్పడినా, దానిని అదుపు చేయడానికి వేరే పద్ధతులను అనుసరించాలే తప్ప ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించకూడదు. మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని సరుకుల పంపిణీని రేషనింగ్ వంటి పద్ధతుల ద్వారా నియంత్రించాలి. ఎక్కడ సరుకుల ఉత్పత్తి ప్రజల అవసరాలకు తగినట్టు లేదో అక్కడ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి. అప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలం.
నయా ఉదారవాద యుగంలో తక్కిన అన్ని లక్ష్యాల కన్నా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే అధిక ప్రాధాన్యతనిస్తారు. దాని ఫలితంగా దేశం శాశ్వతంగా అల్పాదాయ దేశంగానే ఉండిపోతుంది. ఇదేదో ఆర్థిక విధానాలను పొరపాటుగా అర్థం చేసుకోవడం వలన జరుగుతున్నది కాదు. సామ్రాజ్యవాదం అనుసరించే వ్యూహంలో భాగమే. ఆ విధంగా మూడవ ప్రపంచ దేశాలు అల్పాదాయ స్థాయిలో ఉండిపోయినప్పుడే, సంపన్న దేశాలకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను, ఇతర ముడి సరుకులను అవి వాటి ధరలను పెంచకుండా తక్కువకే అమ్ముకోవలసివస్తుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణాన్ని అనుమతించరాదనే విధానం సంపన్న దేశాల ప్రయోజనాల కోసమే మూడవ ప్రపంచ దేశాలపై రుద్దడం జరిగింది. ఈ విధమైన పెత్తనాన్ని నిలవరించడానికే అధ్యక్షుడు ఓబ్రడార్ కంకణం కట్టుకున్నాడు. అందుచేతనే పాశ్చాత్య మీడియా ఆగ్రహానికి గురయ్యాడు. 'ఎదుగూ బొదుగూ లేకుండా, జాతీయ వాదంతో, 1970 దశకాల నాటి పరిస్థితులే గొప్పగా ఉండేవన్న భావనతో' ఓబ్రడార్ వ్యవహరిస్తున్నాడని 'ది ఎకనామిస్ట్' అభివర్ణించింది.
నయా ఉదారవాద ఎజండాను తిరగదోడడంలో ఓబ్రడార్ ఏ మేరకు జయప్రదం కాగలడో మనం వేచి చూడాల్సిందే. అయితే అతని విధానాలను అడ్డుకోవడం సామ్రాజ్యవాదానికి అంత తేలికేమీ కాదు. మళ్ళీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. ఈ మధ్య చట్ట సభలకు, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలను చూస్తే ఓబ్రడార్కి ప్రజలలో మద్దత్తు గణనీయంగా ఉన్నదని వెల్లడవుతున్నది. అంతే కాదు, మెక్సికన్ విప్లవం నుంచి పుట్టుకొచ్చిన పీఆర్ఐ తదితర పార్టీల మద్దత్తు కూడా ఓబ్రడార్కు ఉంది. కొన్ని దశాబ్దాల పాటు ఈ వామపక్ష పార్టీలు మెక్సికోలో ప్రభుత్వంలో ఉండేవి. అందుచేత బ్రెజిల్ తరహాలో, పార్లమెంటరీ కుట్ర ద్వారా లూలాను పదవీచ్యుతుణ్ణి చేసిన విధంగా ఓబ్రడార్ను తొలగించడం సాధ్యం కాదు.
మెక్సికోలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నుంచి మన దేశం నేర్చుకోవలన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకవైపున సంపన్న దేశాలు తమవరకూ నయా ఉదారవాద చిక్కుముడి నుంచి బైట పడడానికి ప్రయత్నిస్తున్నా, అదే విధంగా గనుక ఏ మూడవ ప్రపంచ దేశమైనా ప్రయత్నిస్తే మాత్రం దానిపై దాడి చేస్తాయి. ఆ దాడిలో అన్ని రకాల ఆయుధాలనూ ఉపయోగి స్తాయి. మితవాద అభివృద్ధి నిరోధక రాజకీయ కూటములను బలపరచడం, ప్రజల మధ్య చీలికలను తీసుకురావడం, క్యూబాలో మాదిరిగా ఆర్థిక దిగ్బంధనాన్ని ప్రయోగించడం, ఇంకా అవసరమైతే సైనికంగా కూడా జోక్యం చేసుకోవడం వంటివి చేస్తాయి. అయితే వివిధ రాజకీయ శక్తుల మధ్య ఐక్యత ఏర్పడే విధంగా ప్రజలు గనుక బలమైన ఐక్యతను ప్రజా ఉద్యమాల ద్వారా ప్రదర్శిస్తే ఈ సంపన్న దేశాల కుయుక్తులను సాగనివ్వకుండా ఓడించడం సాధ్యపడుతుంది. మనవంటి దేశాలకు నయా ఉదారవాద విధానాల ఉచ్చు నుంచి బైట పడడం తక్షణ అవసరంగా ముందుకొచ్చింది. ఆ దిశగా ప్రజానీకాన్ని సమీకరించడం చాలా అవసరం.
. -స్వేఛ్ఛానుసరణ
- ప్రభాత్పట్నాయక్