Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నక్షత్రాలంటే లెక్కలేదు
నెలవంక వంక అసలు చూన్నేలేదు
రాతిరి మబ్బుకి మాట వరసకైనా చెప్పకుండా
చిమ్మ చీకటిని చీల్చుకొచ్చే వేకువకి ఎంత పొగరు?
అంధకారాన్ని రాతి గుహల్లోకి తోసి తాలమేస్తుంది
ప్రపంచానికి ప్రపంచాన్నే దిగ్దర్శనం చేస్తుంది
ఎంత పుణ్యం చేసుకుంది వేకువ మహాధిక్కారం
అందుకే ధిక్కారం చాలా గొప్పది అంటాను
తళతళమని మెరుపులు పెలపెలమని ఉరుములతో
ఆకాశం ఘోషిస్తుంటే!
మబ్బు తునకల్ని ఖండించుకు దూకే చినుకుది కూడా ధిక్కారమే!
గగనపు అంచునుంచి నగమంచుతుంచి జలపాతమై
నేలకు నడిచి వంకలు తిరిగి గగనయానం నుంచి ప్రకృతియానం చేస్తుంది నీరు
గంగా సంగమాలు కృష్ణా తరంగాలు
యమునా విహారాలు సెలయేళ్ల సరాగాలు
ఆ చినుకు ధిక్కారం నుంచి జనించినవే!
అందుకే ధిక్కారం చాలా గొప్పది అంటాను
ఉర్వికి తెలీనే తెలీదు పాపం
తొలకరి ఝల్లుమని పిలిచిందని
విత్తనపు హృదయాన్ని పొడుచుకొచ్చిన మొక్కది
ఎంత తెగింపు- కానీ!
యుగయుగాల మన జాడలకైనా!
మనుగడ నీడలకైనా!
అనాది కాలపు పచ్చని పునాదులకైనా!
ఆ మొక్క ధిక్కారమే కదా కారణం
అందుకే ధిక్కారం చాలా గొప్పది అంటాను
ఈ ధిక్కారాల ముందు
నీ ధిక్కారం నా ధిక్కారం ఎంత తమ్ముడూ
ధిక్కరిస్తే ఉరేమీ వెయ్యరుగా!
మహా అయితే స్ట్రా సిప్పర్ నో అంటారు
అంతే కదా..! గెలిస్తే జ్ఞాన కిరణమవుతావు
ధిక్కారం నవజీవనయానానికి ఓంకారం
మన ధిక్కారం సూడో మేధావులకు గడ్డి పంచాలి
మన ధిక్కారం నిరంకుశ విధానాలకు వీరతాళ్ళు పేనాలి
మన ధిక్కారం చీకటిని ఖండించే కాంతి పుంజం కావాలి
మన ధిక్కారం చిగురులకు మొగ్గ తొడగాలి
మన ధిక్కారం అందమైన ప్రశ్న కావాలి
మన ధిక్కారం మనిషిని వెలిగించాలి
మనిషి మనిషిని సంస్కరించాలి
ఏ చరిత్రైనా ఆ ధిక్కార కలంనుంచే అచ్చోసుకుంది
ఏ విప్లవమైనా ఆ ధిక్కార గలంనుంచే ధ్వనిస్తుంది
ఇప్పుడు ఆ ధిక్కారపు డమురుకమే మనిషికి కావాలి
కొత్త ప్రపంచానికి వేకువ కావాలి.
- పువ్వాడ వెంకటేష్