Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కత్తితో కదనరంగంలో మాత్రమే గెలవగలం, కానీ కలంతో ప్రపంచాన్నే కదిలించగలమని నిరూపించిన స్వాతంత్ర సమర యోధుడు, ఉద్యమ రచయిత, కార్మిక నాయకుడు, విప్లవ కవి కామ్రేడ్ మఖ్ధూమ్ మొహియుద్దీన్. ఆ కలానికి పోరాడటం తెలుసు.. ప్రేమించడం తెలుసు. అందుకే అది విప్లవకెరటమై హైదరాబాద్ వీధుల్లో స్వేచ్ఛ, సౌభాతృత్వాలకోసం నినదించింది.
మఖ్ధూమ్ తెలంగాణలోని ఆంథోల్‌లో 1908 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన పూర్తిపేరు ''అబూ సయీద్ మహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి''. తల్లిదండ్రులు ఉమ్దా బేగం, గౌస్ మొహియుద్దీన్. వీరి పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని అజంగడ్లో ఉండేవారు. తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. మఖ్ధూమ్ మొహిద్దిన్ తండ్రి నిజాం ప్రభుత్వంలో సూపరిండెంట్‌గా పనిచేసేవారు. మఖ్దూన్ తండ్రి ఆయనకు నాలుగేండ్లు రాకముందే చనిపోయాడు. ఆయన తల్లి వేరే వివాహం చేసుకోవడంతో మఖ్ధూమ్ తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. మఖ్ధూమ్ పాఠశాల విద్య హైదరాబాద్, సంగారెడ్డిల్లో పూర్తిచేశాడు.1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు.
పినతండ్రి బషీరుద్దీన్ పెంపకంలో మఖ్ధూమ్ పెరిగాడు. మఖ్ధూమ్ బతకడానికి నవాబు దగ్గర ప్రేమ లేఖలు రాసే ఉద్యోగంతో పాటు, పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మేవాడు. ట్యూషన్లు చెప్పేవాడు. పత్రికల్లో పని చేసేవాడు. ఆయన రాసిన గోథేప్రేమ లేఖలు మక్తబా అనే స్థానిక పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీలో మఖ్ధూమ్ హాస్టల్లో ఉండేవాడు. అక్కడ తన తొలి కవిత మధురభావగీతం ''టూర్''ను 1934లో రచించాడు. కవిగా, నాటక రచయితగా, నటుడిగా మఖ్ధూమ్ ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ''హౌష్ కె నా ఖూన్'' అనే ఉర్దూ అనుసరణ రాసి హైదరాబాదులో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. విశ్వకవి రవీంద్రుడు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక నాటక ప్రదర్శన అయిపోవటంతోనే స్టేజిపైకి వెళ్లి అభినందించి తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోమని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. ఆ స్ఫూర్తితో మఖ్ధూమ్ ''ఠాకూర్.. అతని కవిత'' అనే గ్రంథం రాశాడు.
1937లో మఖ్ధూమ్ తన 29వ ఏటనే యం.ఏ డిగ్రీ తీసుకున్నాడు. ఉర్దూ నాటకంపై ఒక పరిశోధన పత్రం కూడా రాశాడు. తర్వాత హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. మఖ్ధూమ్ కమ్యూనిస్టు భావాలకు ఆనాడే బీజం పడింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ''నేషనల్ ఫ్రంట్'' సంపాదించి చదివేవాడు. 1930-40లో నాగపూర్ కామ్రేడ్ల సాయంతో ''స్టూడెంట్స్ యూనియన్'' ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులాం హైదర్, రాజబహదూర్ గౌర్, హమీద్ ఆలీ ఖాద్రి వంటి కమ్యూనిస్టు మహా యోధులతో కలిసి పనిచేశాడు. ''రైతుకు రొట్టె నివ్వని పొలం ఎందుకు.. కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని'' అనే ఇక్బాల్ కవితను నినదిస్తూ కమ్యూనిస్టు భావాలతో ప్రజల్లో స్ఫూర్తి రగిలింగించే వాడు.
మఖ్ధూమ్ కేవలం రచనలు చేయటమేకాక హైదరాబాద్‌లో అక్తర్ హుస్సేన్, సిబ్తె హసన్‌లతో కలిసి ''అభ్యుదయ రచయితల సంఘం'' స్థాపించాడు. సరోజినీ నాయుడు నివాసమైన గోల్డెన్ త్రెషోల్డ్లో సాహిత్య సామాజిక రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతూ ఉండేవాడు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమించేవాడు. అందుకే చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, ఆల్విన్, షాబాద్ సిమెంట్ రైల్వే ఎంప్లాయిస్, ఎలక్ట్రిసిటీ, పిడబ్ల్యుడి మున్సిపాలిటీ ఫ్యాక్టరీ వంటి వందల కంపెనీల్లో కార్మిక సంఘాలకు మఖ్ధూమ్ అధ్యక్షుడయ్యాడు.
నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నుండి 1952లో కమ్యూనిస్టుపార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా కొనసాగాడు. మఖ్ధూమ్ కార్మిక నాయకుడిగా శాసన మండలి సభ్యుడిగా సమసమాజ స్థాపన కోసం క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే ''దస్తర్ ఖాన్'' గురించి ఎంతో కృషి చేశాడు. తద్వారా సమానత్వ భావనలకు బీజం వేశాడు. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన నిలిచి తన కలం ద్వారా అభ్యుదయం వైపు ప్రజలను నడిపించే ప్రయత్నం చేశాడు. మఖ్ధూమ్ హైదరాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శిగా పనిచేశాడు.
ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ ''తెలంగాణ సాయుధ పోరాటం''లో ముఖ్య పాత్రధారి. 1943లో హైదరాబాద్‌లో నిజాంకు వ్యతిరేకంగా చేసిన ఒక ప్రసంగంతో జైలుకు పోయాడు మఖ్ధూమ్. పోరాటానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాతవాసం ఇలా సాగేది మఖ్ధూమ్ జీవితం. 1951లో ''ఖైదు'' అనే గేయం రాశాడు. మఖ్ధూమ్ రాసిన కవితలు, గేయాలు ప్రజల గొంతుల్లో మారుమోగేవి. శాసన సభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, ప్రతిపక్షనేతగా కీలక పాత్ర పోషించాడు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య (ఏఐటీయూసీ) జాయింట్ సెక్రటరీగా కొంతకాలం ఢిల్లీలో ఉన్నాడు.1952-55 మధ్య చైనా, సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు తిరిగి వచ్చాడు. ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాలయం వియన్నాలో(1953 -54) పనిచేశాడు.
ఆయన రాసిన ''ఏ జంగ్ హై జంగే ఆజాదీ'', ''ఎక్ చంబేలీ కే మండ్వే తలే'' అనే గీతాలు ప్రసిద్ధిపొందాయి. ఉర్దూ మహాకవిగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. 1944-51 మధ్యకాలంలో ''తెలంగన్'' అనే కవిత రాశాడు. దానిని దాశరథి ''తెలంగాణ పిల్ల''గా తెలుగులోకి అనువదించారు. మఖ్ధూమ్ రచనలు ఇంగ్లీష్, రష్యన్, హిందీ, తెలుగు భాషల్లోకి తర్జుమా అయ్యాయి.
సారా సంసార్ హమారా హై
పూరబ్, పశ్చిమ్, ఉత్తర్, దక్కన్
హమ్ అమెరీకి, హమ్ ఆఫ్రంగి
హమ్ చీనీ జాం బాజానె వతన్
అనే ఆయన గీతం అంతర్జాతీయ గీతంగా రూపుదిద్దుకుంది. ''ఇది స్వాతంత్ర సమరం. మేం అమెరికన్లం. మేం ఆఫ్రికన్‌లం. చైనీయులం.. ప్రపంచమంతా మేమే, ప్రపంచమంతా మాదే'' అంటూ సాగిన ఈ గేయం ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చింది. విశ్వమానవ సౌభాతృత్వాన్ని చాటి చెప్పింది. మఖ్ధూమ్ కవిత్వాన్ని గజ్జల మల్లారెడ్డి చాలావరకు తెలుగులోకి అనువదించాడు. అంజుమనే తరఖి ఉర్దూ, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వంటి సాహిత్య సాంస్కృతిక సంస్థలలో ముఖ్య పాత్ర పోషించాడు మఖ్దూమ్... 1969, ఆగస్టు 25న గుండెపోటుతో ఢిల్లీలో చనిపోయాడు.
మఖ్ధూమ్ ఒక కవిగా ఎంతటి ప్రసిద్ధుడో ఒక కమ్యూనిస్టు యోధుడిగానూ అంతే ప్రసిద్ధుడు. ఈ రెంటిని ఆయన సమానంగా నిర్వహించేవాడు. కొద్దిమంది మఖ్ధూమ్ కవి కాకపోతే, కమ్యూనిస్టుగా మరింతసేవలందించేవాడని.. ఇంకొంతమంది కమ్యూనిస్టు కాకపోతే కవిగా ఇంకా రాణించే వాడని అభిప్రాయపడేవారు.. కానీ మఖ్ధూమ్లో ''కవి, కమ్యూనిస్టు ఒక్కరే'' ఒకరు లేకుండా మరొకరు లేరు. ఇలా భారత స్వాతంత్య్ర సమరంలో తనదైన ముఖ్య భూమిక పోషిస్తూనే సాహిత్యం ద్వారా ప్రజలలో చైతన్యాన్ని రగిలిగించి, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని ధారపోశాడు ''మఖ్ధూమ్ మొహియుద్దిన్''. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఇలాంటి త్యాగధనుల త్యాగాల ఫలితమే. ఆ ఫలితాలన్నీ తిరిగి హరించబడుతున్న వేళ.. ఆయన 25వ వర్థంతి మనకు గొప్ప స్ఫూర్తి కావాలి. ఆయన ఆశయాలు మన ఆచరణకు మార్గం కావాలి.
- కె. నిర్మలకుమారి
సెల్: 9652395184