Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: గురూ.. చూశావా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం, పాలన వచ్చిందా? లేదా..?
గురువు:ఎక్కడ శిష్యా... ఆఫ్ఘనిస్తాన్ లోనా..?
శిష్యుడు: అక్కడే. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే కాదు. చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో కాస్త గమనించాలి.
గురువు: అవును తాలిబాన్ల దెబ్బకు అమెరికావాడు తోకముడిచాడు. ప్రపంచం అంతా ఓ కుదుపునకు లోనయింది.
శిష్యుడు: ఇప్పుడెలా..?
గురువు: ఏముంది. ఎవరి పోరాటం వారు చేయాలి. దాడులు, యుద్ధాలు ఆఫ్ఘాన్ ప్రజలకు కొత్తకాదు. ఆసియా ఖండంలో ఆఫ్ఘన్ ఓ కూడలి. ఐరోపాకు గుమ్మం. జనాభా మూడున్నర కోట్ల మందే. విస్తీర్ణం ఆరున్నర లక్షల చ.కి.మీ. ఆ పర్వత మైదాన భూభాగంలో నిధి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. దోపిడీకి, వ్యాపారానికి అగ్రరాజ్యాల కన్ను ఆ దేశంపై ఉంటుంది. బ్రిటిష్‌వాళ్ళు.. ఆ తర్వాత అమెరికావారితో, ఆ తైనాతీల సర్కారులతో ఆ ప్రజలు యుద్ధాలు పోరాటాలు చేశారు. చేస్తున్నారు. వాటి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు.
శిష్యుడు: శభాష్, అగ్రరాజ్యాలకు ఉగ్రవాదుల దెబ్బ. రాజ్యాధికారం ఇప్పుడు తాలిబాన్ల చేతికి వచ్చింది.
గురువు: ఊ వచ్చింది. ఇల్లు అలకగానే పండుగ కాదు కదా.. గతంలోనూ ఓ సారి తాలిబాన్లు పాలించారు. ఆ అనుభవాలు ప్రజలకు ఉన్నాయి. ముందు భయం పోవాలి. ఆఫ్ఘన్ ప్రజల తక్షణ అవసరం శాంతి.
శిష్యుడు: అవునవును. ఎవరికైనా ముందు శాంతి కావాలి. తర్వాతే ఏదైనా.. నాకో సంగతి సమజవడం లేదు గురూ.. ఈ ముస్లిం తాలిబాన్లు మంచోళ్ళా - చెడ్డోళ్ళా..?
గురువు: మంచి - చెడు ఎంత వ్యతిరేకమో అంత సాపేక్షం కూడా శిష్యా. హిందువులందరూ ఆర్.ఎస్.ఎస్. ఎలా కాదో ముస్లింలందరూ తాలిబాన్లు కాదు. వాజ్‌పారు, అద్వానీ, మోడీ అందరూ ఆర్.ఎస్.ఎస్. మూలాల నుండి వచ్చినా వారి మధ్య తరతమ తేడాలున్నాయి కదా! అలాగే తాలిబాన్ల వంటి ఉగ్రవాద గ్రూపుల్లో కూడా రకరకాల తేడాలుంటాయి. ఆల్‌ఖైదాలు, జష్ ఎ అహ్మద్‌లు, జిహాది - ముజాపాద్లు వగైరా.. వగైరా..
శిష్యుడు: గీ తాలిబాన్లు అసలు ఉగ్రవాదులు ఎలా అయ్యారు.
గురువు:తాలిబ్ అంటే పష్రో భాషలో విద్యార్థి అని అర్థం. పాకిస్థాన్ మదరసాల్లో చదువుకునే మిలీషియా విద్యార్థి విభాగం తాలిబాన్‌గా రూపాంతరం చెందింది. 'తమ నేలపై విదేశీ సైనిక బలగాలను తరిమికొట్టడం, తమ పాలనలో కచ్చితమైన ఇస్లామిక్ షరియత్ చట్టాన్ని అమలు పరచడం వీరి లక్ష్యం. 1994లో ఆవిర్భవించిన ఈ తాలిబాన్లు 1996 నాటికి ఆఫ్ఘనిస్తాన్‌ను తొలుత స్వాధీనం చేసుకున్నారు. అయితే 2001 సెప్టెంబరు 11న అమెరికా జంట భవనాలపై (ట్విన్ టవర్స్) దాడి అనంతరం అమెరికా పెద్దఎత్తున సైనిక దళాలను మోహరించి అక్కడి జనాలను ఊచకోత కోసింది. ఈ రెండు దశాబ్దాల కాలం అమెరికా, దాని మిత్రదేశాల అండతో పాలన సాగింది. అందుకు అమెరికా వెచ్చించిన మూల్యం రెండు లక్షల 26వేల కోట్ల డాలర్లు. ఆ యుద్ధాలు, దాడుల కారణంగా చనిపోయింది ఒకలక్షా నలభైఏడువేల మంది ప్రజానీకం. 2014లో ఎన్నికైన అష్రాఫ్ ఘనీ అధ్యక్షుడిగా ఏడేళ్ళ పాలన సాగించి ఇప్పుడు పారిపోయాడు. రాజ్యహింసకు ప్రతిగా ప్రతిహింస చెలరేగడం సహజమే కదా శిష్యా!
శిష్యుడు: ఇంతకీ ఆ అగ్రరాజ్యాల సహాయ (తైనాతీ) ప్రభుత్వం మంచిదా..? ఇప్పుడు ఈ ఉగ్రవాద అధీన ప్రభుత్వం మంచిదా..?
గురువు: ముందుగా మనం ఓ విషయాన్ని అంగీకరించాలి. ఏదేశాన్నైనా ఆ దేశ ప్రజలే పరిపాలించుకోవాలి. అది ఆధునిక ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం, ధర్మం. విదేశీ సహాయం ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా ఉండాలే తప్ప, సైనిక జోక్యంతో ప్రజల పీచమణిచే విధంగా ఉండకూడదు. ఉండరాదు. అమెరికా భూభాగంపై అమెరికా ప్రజలకు ఎంతటి సార్వభౌమాధికారం ఉంటే, ఆఫ్ఘన్ ప్రజలకు ఆఫ్ఘనిస్తాన్పై అంతటి సార్వభౌమాధికారం ఉంటుంది. అవునా..!
శిష్యుడు: మరి ఇస్లామిక్ షరియత్ చట్టం మాటేమిటి?
గురువు: తమ మత ఛాందసంతో దేవుని పేరిట (ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్) ఎవరు ఏ అకృత్యాలు చేసినా అది అంతిమంగా ఉగ్రవాద హింసకు దారితీస్తుంది. మారణ హౌమం చెలరేగుతుంది. మానవ హక్కులు హరించుకుపోతాయి. స్త్రీలు, పిల్లలు, వృద్దుల బాధలు వర్ణనాతీతం.. అమాయకులు సామూహికంగా నిర్దాక్షణ్యంగా బలైపోతారు. భయానక వాతావరణం కమ్ముకుటుంది. శాంతిభద్రతలు కనుమరుగు అవుతాయి. చరిత్ర చెపుతున్నది అదే. వర్తమానమూ అదే కళ్ళకు కడుతున్నది.
శిష్యుడు: మరి దానికి పరిష్కారం ఏమిటి గురూ...
గురువు: పాలకనేతల్లో మేల్కొనే మానవత్వం. అందుకు ఆఫ్ఘన్ ప్రజానీకం చేసే ఉద్యమాలు, వత్తిడి. అంతర్జాతీయ సంఘీభావం. ఒకరు ఎక్కువా కాదు. ఒకరు తక్కువా కాదు. ప్రజలందరూ సమానమనే విశ్వజనీన ప్రజాస్వామ్య దృక్పథమే వీటిని బలంగా పెనవేస్తుంది.
శిష్యుడు: ఇంతకీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి?
గురువు: అగ్రరాజ్యాలతో గుడ్డిగా అంటకాగడం తప్పు. స్వతంత్రను స్వాభిమానాన్ని ఎవరూ కోల్పోకూడదు. అది ఏ మతమైనా హిందూ, ముస్లిం, క్రైస్తవమైనా ఉగ్రవాదంలోకి దిగజారకూడదు. ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల్ని కాపాడాలి, గౌరవించాలి. అదే ఆఫ్ఘన్ పరిణామాలు మనకు నేర్పుతున్న గుణపాఠం.
శిష్యుడు: పాఠమా.. ఎలా చెపుతున్నావ్ గురూ..?
గురువు: వెరీ సింపుల్. నీవే అన్నావుగా ధ్యానం అని. మనసుంటే మార్గం. ఇబ్బడి ముబ్బడిగా దొరికే సమాచారంలో వాస్తవాలు చూడాలి. వాస్తవాల నుండి నిజాలు గ్రహించాలి. ప్రజానుకూలంగా మాట్లాడాలి. ఉద్యమాలు చేపట్టాలి. గతతర్కం కూడా ఇదే.
శిష్యుడు: అవును గురూ.. అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. ఆలోచించకూడదు.
గురువు: మతం పేరుతో అస్సలు చేయకూడదు శిష్యా. అందుకే మహాకవి గురజాడ ఏనాడో అన్నాడు. 'మతములన్నియు మాసిపోవును. జ్ఞానమొకటే నిలిచి వెలుగును'. అదే మానవాళిని ముందుకు నడిపిస్తుంది.
శిష్యుడు: సత్యం చెప్పావ్ గురూ.. సెలవ్.
- కె. శాంతారావు
సెల్:9959745723