Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీలో ఆగస్టు 8న నల్సా మొబైల్ యాప్ ప్రారంభోత్సవ వేడుకలో... పొలీసు కస్టడీలో హింసా, ఇతర వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయనీ, మానవ హక్కులకు ముప్పు ఎక్కువగా పోలీసు ఠాణాల్లోనే ఉందని దేశ ప్రజలను ఉద్దేశించి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ప్రసంగించారు. వాస్తవానికి పోలీసు ఠాణాల్లో నిందితులు చిత్రహింసలకు గురవుతున్నారు. నిందితులు పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక మరణిస్తే తప్ప, వార్తా మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడం లేదు. అలా ఎన్నో వందల సంఖ్యలో నిందితులు పోలీస్ హింసలకు గురై దెబ్బలకు తట్టుకొని మరణించని సందర్భాల్లో బాధితులుగా నిలిచిన ఘటనలు వెలుగులోకి రావడం లేదు. అన్యాయానికి గురైన ప్రజలను రక్షించాల్సిన పోలీసులే, అమాయకులని అన్యాయంగా తప్పుడు కేసుల్లో ఇరికించి, ముద్దాయిలను చట్టాలకు విరుద్దంగా చితికబాధితే బాధ్యులు ఎవరు?
భారత రాజ్యాంగం ఆర్టికల్ 246 ప్రకారం, ఏడవ షెడ్యూల్ ఆధారంగా పోలీసులు, కోర్టులు, జైల్లు మొదలైనవి రాష్ట్ర జాబితాలో వస్తాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ప్రధానంగా నేరాలకు సంబంధించిన మూడు చట్టాలైన 1. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్.పి.సి) 2. భారతీయ శిక్షాస్మృతి (ఐ.పి.సి) 3. భారతీయ సాక్ష్యా చట్టాలను ప్రవేశపెట్టారు. 'పోలీస్'' అనే పదాన్ని సిఆర్.పి.సి, 1973, భారతీయ పోలీసు చట్టం, 1861లో నిర్వచించారు. కానీ, పొలీసు వారికి సిఆర్.పి.సి ద్వారా ఇచ్చిన హక్కులనే, కొందరు పోలీసులు ప్రధాన ఆయుధంగా అమాయక పౌరులపై ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో సిఆర్.పి.సి, 1973 ప్రకారం నేరాలని రెండు రకాలుగా విభజిస్తారు. 1. గుర్తించదగిన నేరం 2. గుర్తించలేని నేరం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సెక్షన్ 41 ప్రకారం పోలీసు ఆఫీసర్ గుర్తించదగిన నేరంలో నిందితుడిని అరెస్టు వారెంట్ లేకుండా, అరెస్టు చేయవచ్చు. గుర్తించలేని నేరం అయితే తప్పకుండా మెజిస్ట్రేట్ నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొని నిందితుడిని అరెస్టు చేయవలసి ఉంటుంది. సిఆర్.పి.సి, సెక్షన్ 46 ప్రకారం మహిళా నిందితులను సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందుగా అరెస్టు చేయరాదు (తప్పకుండా మహిళా పోలీసులచే అరెస్టు చేయాలి). సిఆర్.పి.సి, సెక్షన్ 49 ప్రకారం పోలీసులు అరెస్టు చేయనిదే నిందితుడిని కస్టడీలోకి తీసుకోరాదు. ఒకవేళ పోలీసులు సెక్షన్ 49 పాటించకుండా నిందితుడిని చితకబాది లేదా సమయం కాని సమయంలో అరెస్టు చేయకుండా చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకున్నట్లయితే రిమాండ్ కేసు డైరీలో ఎంత తెలివిగా కేసును నమోదు చేస్తున్నారంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 2008 (సవరణ) చట్టం ప్రకారం గుర్తించదగిన నేరమైతే నిందితుడికి అప్పియరెన్స్ నోటీసులు పంపినట్లు పత్రాలను సృష్టించి, నిందితుడు అది పాటించలేదు అని ఉదయం వేళల్లో లేదా మధ్యాహ్నం వేళల్లో అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నామని తెల్పుతున్నారు. ఈ విధంగా తప్పుడు సమాచారం రాసి కేసును ఏకపక్షంగా పోలీసులవైపే నడిచేటట్లుగా చేస్తున్నారని పలు కేసుల విచారణల్లో చూస్తున్నాం.
ఒక పబ్లిక్ సర్వెంట్ తప్పుడు కేసుల్లో అమాయకుల్ని ఇరికించి, గాయపరచడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు డాక్యుమెంటేషన్ని తయారు చేసినట్లయితే భారతీయ శిక్షాస్మృతి, సెక్షన్ 167 ప్రకారం అతను శిక్షార్హుడు, తప్పుడు ఎఫ్.ఐ.ఆర్ని తయారుచేసినచో భారతీయ శిక్షాస్మృతి, సెక్షన్ 203 ప్రకారం శిక్షార్హులు. నిందితుడిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నాక నేరాన్ని నిందితుడే చేసినట్లు ఒప్పుకోమని హింస పెట్టి, నిందితుడిని ఒప్పించినా కానీ భారతీయ సాక్ష్య చట్టం, 1872లోని సెక్షన్ 25, 26 ప్రకారం అటువంటి నేర అంగీకరణలు కోర్టుల్లో చెల్లవు. మానసికంగా, శారీరకంగా నిందితులను గాయాలపాలు చేసి రిమాండ్‌కి పంపేటప్పుడు గౌరవజడ్జి దగ్గర వాస్తవాలు చెప్పనివ్వకుండా కొట్టలేదు, తిట్టలేదు అని చెప్పించే పోలీసు వ్యవస్థలో బతుకుతున్నాం. కేసును ఎలాగైనా అమాయక నిందితులపై రుజువు చేయడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. అలాంటి కేసుల్లో సంబంధిత పొలిసులు భారతీయ శిక్షాస్మృతి, సెక్షన్ 192 ప్రకారం శిక్షార్హులు.
సుప్రీంకోర్టు వినరు త్యాగి వర్సెస్ ఇర్షద్ అలీ, తానా సింగ్ వెర్సెస్ సెంట్రల్ బ్యూరో అఫ్ నార్కోటిక్స్ కేసుల తీర్పుల్లో పోలీసులు అమాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని తెలిపింది. నేటి వరకు తప్పుడు కేసుల్లో ఇరికించడం వలన ఎందరో జీవితాలు నాశనమయ్యాయి. ఉదాహరణకు సూరత్ బాంబ్ బ్లాస్ట్ కేసుకు సంబందించిన హుస్సేన్ ఘాడియల్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో 11మంది అమాయకులను ఇరికించగా, వారికి న్యాయం జరగడానికి 19ఏండ్లు పట్టింది. 2007లో హైదరాబాద్ మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు 16మంది అమాయక ముస్లిం యువతను ఇరికించగా వారికి 2011లో న్యాయం జరిగింది. అందుకు పరిహారంగా ప్రతీ ఒక్కరికి రూ.3 లక్షలు ప్రభుత్వం చెల్లించింది. అయితే నేరాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. 1. సమ్మేళన నేరం 2. అసమ్మేళన నేరం. సమ్మేళన నేరం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కేసు నమోదు చేస్తే అటువంటి కేసులో రాజీ కుదురుతుంది. అసమ్మేళన నేరం అంటే ప్రభుత్వం లేదా పోలీసులే నమోదు చేసే కేసులు, ఇటువంటి వాటిలో రాజీ కుదరదు. సిఆర్.పి.సి, 1973 సెక్షన్ 320లో తెలుపని భారతీయ శిక్షాస్మృతి సెక్షనులన్ని అసమ్మేళన నేరాల క్రిందకు వస్తాయి. అసమ్మేళన నేరాల నుంచి బయటపడాలంటే హైకోర్టులో భారత రాజ్యాంగం ఆర్టికల్ 226 ప్రకారం లేదా సిఆర్.పి.సి, 1973 సెక్షన్ 482 ప్రకారం క్వాష్ పిటిషన్ వేయవచ్చు.
గత సంవత్సరం తమిళనాడులో జయరాజ్, ఫెనిక్స్‌ల కస్టోడియల్ మరణం. ఈ ఏడాది మన రాష్ట్రంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరియమ్మ కస్టోడియల్ మరణం జరిగింది. అమెరికాలో నల్లజాతికి చెందిన జార్జి ఫ్లాయిడ్ పోలీసు హింసకు మరణిస్తే, అతనిని చంపిన డెరెక్ చౌవిన్ అనే పోలీస్ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా మర్డర్ నేరం క్రింద 22.5యేండ్లు జైలు శిక్ష వేశారు. మరియమ్మ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించారు. కానీ, వీరికి జైలు శిక్ష పడుతుందా? లేదా? అనేది సమాధానం లేని ప్రశ్న. పోలీసు వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఎస్సై, కానిస్టేబుళ్లు సక్రమంగా, చట్టబద్దంగా పనిచేసినట్లైతే ఇటువంటి నేరాలు జరగవు. ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులతో పాటు, క్షేత్రస్థాయిలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు, కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు ఉద్యోగుల పనితీరు, ప్రవర్తన బాగా లేకపోతే జనానికి పోలీసులపై నమ్మకం కలగదు. భారతదేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన మానవ హక్కుల గురించి, సిఆర్.పి.సి, ఐ.పి.సి చట్టాలపై కనీస అవగాహన అవసరం. అందుకు పాఠశాలల్లో ప్రాధమిక, ఉన్నత విద్యలో పాఠాల రూపంలో భోదించాలి. అదేవిధంగా తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసులు అని చెబుతున్న ప్రభుత్వం, పోలీస్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత అధికారుల వరకు మానవ హక్కులపై ప్రతీయేటా శిక్షణా తరగతులు నిర్వహించి, ప్రత్యేక కమిషన్ ద్వారా పోలీసులపై నమోదైన ఫిర్యాదులను విచారించి, పోలీసు నేరస్తులను గుర్తించి, ఉద్యోగాల నుంచి తొలగించి ఫ్రెండ్లీ పోలీసు పరిపాలనగా నిరూపించుకోవాలి.
- కె. రోహిత్
సెల్ :7386648140