Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ అప్రజాస్వామికంగా రాజ్యసభ బిజినెస్ రూల్స్‌ను తుంగలో తొక్కి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిన పరిస్థితి గతంలో ఏనాడూ లేదు. ప్రస్తుత మార్కెటింగ్ యార్డులు రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నాయని, ఈ నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులు ఎక్కడికైనా తమ ఉత్పత్తులను పంపి, తనకు నచ్చిన ధరకు అమ్ముకొనే వెసులుబాటు లభిస్తుందని, కమిషన్ ఏజెంట్లు ఉండరని, రైతులకు చాలా మేలు చేకూరుతుందని ప్రధాని మోడీ, వ్యవసాయ మంత్రి తోమర్ తదితరులు పదేపదే చెెబుతున్నారు. వాస్తవానికి ఈ మూడు నల్ల చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్ళుగా మారతాయి. ఇప్పటివరకు దేశం మొత్తం మీద వున్న 2384 రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులు, 4887 సబ్ యార్డులు, ఎ.పి.ఎం.సి.లు నోటిఫై చేసిన వేలాది ప్రయివేటు మార్కెట్ యార్డులు, గోడౌన్లు ఈ-నామ్‌తో అనుసంధానం చేయబడిన వందల మార్కెట్ యార్డులు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న దాదాపు 20,000 చిన్న చిన్న మార్కెట్ యార్డులు, మోడీ తెచ్చిన చట్టంలో ''ట్రేడ్ ఏరియా'' నిర్వచనంలోకి రావు. దాంతో మార్కెటింగ్ వ్యవస్థ క్రమేపీ నిర్వీర్యమై, గత్యంతరం లేక రైతులు కార్పొరేట్ సంస్థలకు ఎమ్.ఎస్.పి.లతో నిమిత్తం లేకుండా తక్కువ ధరలకు అమ్ముకోవలసిన దుర్గతి పడుతుంది.
మోడల్ ఎ.పి.యం.సి. యాక్ట్-2017, మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్-2018లను అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు ఆర్థిక మద్దతు ఇవ్వబడుతుందని, దాంతో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కలుగుతుందని ఆర్థిక మంత్రి లోక్‌సభలో నమ్మబలికారు. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ రెండు మోడల్ చట్టాలను అమలు చేయటం అవసరమని నిటి అయోగ్ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేసి ఉంది. కమిషన్ ఏజెంట్లు ఉండరని ప్రధానమంత్రి పెద్ద అబద్ధం చెబుతున్నారు. రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌లో ''ఎగ్రిగేటర్లు'' ఉంటారని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. కమిషన్ ఏజెంట్లు చేసే పనినే ''ఎగ్రిగేటర్లు'' చేస్తారు.
''మోడల్ ఎ.పి.ఎం.సి. యాక్ట్-2017'' లో రెగ్యులేటెడ్, ప్రయివేటు మార్కెట్ యార్డులను ఈ-నామ్‌తో అనుసంధానం చేయడం, ధాన్యం, గోధుమలు మున్నగు ఉత్పత్తులపైన 2శాతం మించకుండా, కూరగాయలు, పండ్లు మొదలగు పచ్చి సరుకుపై ఒక శాతం మించకుండా మార్కెట్ సెస్సు వసూలు చేయవచ్చు. కమిషన్ ఏజెంట్లకు ధాన్యం మున్నగు వాటిపైన 2శాతం మించకుండా, కూరగాయలు మున్నగు వాటిపైన 4శాతం మించకుండా కమిషన్ వసూలు చేసుకోవచ్చు. ఇందుకు పూర్తి భిన్నంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకు రావలసిన అగత్యంపై కేంద్రం నుండి ఇంతవరకు సమాధానం లేదు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం-2020 రైతులకు నష్టం కలిగించే విధంగా ఉంది. రైతులకు సరైన రక్షణ కలిగించే అంశాలు ఇందులో లేవు. స్పాన్సర్‌తో విభేదాలు వచ్చినపుడు (ఆర్.డి.ఒ/జిల్లా కలెక్టర్ స్థాయిలో నడిచే వివాద పరిష్కార ప్రక్రియ సందర్భంగా) రైతు న్యాయవాది సహాయం తీసుకోడానికి వీల్లేదని ఆంక్షలు విధించడం అత్యంత దుర్మార్గం. సాధారణంగా రైతాంగంలో ఎక్కువ శాతం మంది నిరక్షరాశ్యులు. స్పాన్సర్ తరపున హాజరయ్యే వారికి ఉన్నత విద్య, చట్టాల పట్ల అవగాహన, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. కావున వారు చెప్పినట్టుగానే జరుగుతుంది. అంతే తప్ప రైతుల మాటలకు విలువ ఉండదు.
''నిత్యావసర వస్తువుల సవరణ చట్టం''లో నిల్వ పరిమితులను ఎత్తివేయడం వల్ల బడా రిటైల్ సంస్థలు చాలా హెచ్చు పరిమాణంలో సరకులను నిల్వ చేసుకోగల అవకాశం కల్గుతుంది. ఫలితంగా కృత్రిమ కొరతలు సృష్టించబడేందుకు ఆస్కారం ఉంది. అంతేకాక గత 12 మాసాలలో వస్తువు సగటు ధర పైన మరుసటి సంవత్సరం 50శాతానికి మిగలని ధరలకు అమ్ముకోవచ్చుననే అంశం ప్రయివేటు రిటైల్ మాల్స్‌కు అత్యధిక అదనపు లాభాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు, రిలయన్స్ రిటైల్ మార్టులలో వినియోగదారులకు అమ్మే ధరలకు పొంతన లేదు. రైతులకు ఎంతమాత్రం ఉపయోగం లేకపోగా వినియోగదారుల పైన పెనుభారం మోపబడుతుంది.
ఈ నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారయ్యే అవకాశం ఉంది. సన్నకారు, చిన్న రైతులలో నూటికి 40 మంది ప్రయివేటు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని నాబార్డు సర్వే చెబుతోంది. రూ.1.5లక్షల లోపు పంట రుణాలను హామీతో నిమిత్తం లేకుండా రైతులకు, కౌలు రైతులకు ఇవ్వాలని రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు ఉన్నా సరిగ్గా అమలు కావడం లేదు. దేశవ్యాప్తంగా సాగుభూమిలో 10శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో ఇంకా అధిక శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. పంట రుణాలే కాక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అందవలసిన ఇన్పుట్ సబ్సిడీ గానీ, ప్రభుత్వం నేరుగా అందించే నగదు బదిలీ సహాయం (పి.ఎం. కిసాన్ సమ్మాన్ యోజన) కానీ, పంటల భీమా పథకం వలన అందాల్సిన సహాయం గానీ కౌలు రైతులకు ఇప్పటికీ అందడం లేదు. చాలామంది రైతులలో కౌలుకిచ్చినట్లు కాగితంపైన అంగీకరిస్తే, తమ భూ యాజమాన్య హక్కుకు భంగం వాటిల్లుతుందనే భయాందోళనలు ఉండటం వలన కౌలుపత్రం పైన సంతకాలు చేయడం లేదు. అంతేకాక బ్యాంకు కౌలు రైతుకిచ్చే పంట రుణం అతను కట్టకపోతే తాను కట్టవలసి వస్తుందనే భయం కూడా ఉంది. వాస్తవంగా తాము కౌలు చేస్తున్న భూమి తనకు చెందాలని, కౌలు రైతు కోరుకోవడం లేదు. కౌలు చేసుకోడానికి భూమి దొరికితే చాలనుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నిటి ఆయోగ్ సంస్థ ''మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్-2016''ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఈ చట్టం అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చట్టాన్ని ఆమోదించాలని, రైతుకు తన భూమి పైన యాజమాన్య హక్కుకు ఎట్టి పరిస్థితిలోనూ భంగం వాటిల్లదని హామీ ఇస్తూ, అదే సమయంలో కౌలు రైతుకు గుర్తింపు ఇచ్చి, బ్యాంకు రుణం, ఇన్సూరెన్స్ సదుపాయం, ఇన్-పుట్ సబ్సిడి, నగదు బదిలీ మున్నగు ప్రయోజనాలు అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయవలసి ఉంటుంది. రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, మోడల్ యాక్టులోని అంశాలను రైతులకు అవగాహన కల్పించి కౌలు పత్రాల పైన సంతకాలు చేయడం ద్వారా కౌలు రైతులు మేలు కలిగేందుకు కృషి సల్పాలి.
కేంద్ర ప్రభుత్వ నగదు బదిలీ (పి.యం.కిసాన్ సమ్మాన్) పథకంలో ఐదు ఎకరాల లోపు భూయజమానులైన సన్నకారు, చిన్న రైతులకు మాత్రమే వార్షికంగా మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున మొత్తంగా రూ.6,000 నగదు బదిలీ జరుగుతుంది. వాస్తవానికి సాగు చేస్తున్న భూమిగల రైతుగాని లేక అనేక కష్టనష్టాలకోర్చి సాగు చేస్తూ ఉన్న కౌలు రైతుకు ఈ సహాయం అందవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాలియా పథకం కింద ఒరిస్సా ప్రభుత్వం వార్షికంగా వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ.12,500 చొప్పున, సన్నకారు, చిన్న రైతులు, కౌలు రైతులకు రూ.10,000 చొప్పున అందచేస్తున్నది. అదే పద్ధతిని ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే భూమి రికార్డులు సక్రమంగా ఉండాలి. దేశంలో సుమారు 2కోట్ల గిరిజన కుటుంబాలు ఉండగా 20లక్షల మందికి మాత్రమే ఫారెస్ట్ అటవీ హక్కు పత్రాలు ఇవ్వబడ్డాయి. తగు సంఖ్యలో సిబ్బందిని నియమించి మహిళా రైతుల పేర్లతో సహా భూ యజమానుల పేర్లు, కౌలు రైతుల పేర్లతో సహా భూ రికార్డులను ఆధునీకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
- వడ్డే శోభనాద్రీశ్వరరావు