Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి జాతీయ అస్సెట్ మోనిటైజేషన్ పైప్‌లైన్ ప్రకటించారు. సాధారణంగా ప్రభుత్వాలు పథకాలు, ప్రణాళికలు, కార్యక్రమాలు ప్రకటిస్తాయి లేదా లక్ష్యాలు నిర్దేశించుకుంటాయి. మా రూటే సపరేటు అన్నట్టు సాగుతున్న మోడీ పాలనలో వీటి స్థానాన్ని పైప్లైన్లు ఆక్రమించాయి. ఇప్పటి వరకూ ప్రకటించిన పథకాలు, లక్ష్యాలతో సాధించేమిటన్న వివరణ లేకుండానే బీజేపీ ప్రభుత్వం మరో విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం కొనసాగింపులో భాగంగానే నిటి ఆయోగ్ జాతీయ ఆస్తుల తనఖా పైప్‌లైన్ పేరుతో రెండు నివేదికలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో మొదటి భాగం తనఖా పెట్టేందుకు పాటించే పద్ధతుల పైప్‌లైన్ కాగా రెండో భాగం తనఖా పెట్టే ఆస్తుల పైప్‌లైన్.
ప్రభుత్వం తాను దేశాన్ని పప్పు బెల్లాల కింద అమ్మేయదల్చుకుంది అన్నది ఈ మొత్తం కసరత్తు వెనక ఉన్న సారాంశం. ఓటర్లకు అర్థం కాని భాషలో దీనికి అస్సెట్ మోనిటైజేషన్ అని అత్యంత కృత్రిమమైన వికృతమైన పేరు పెట్టారు. నాకు అర్థమైన భాషలో చెప్పటానికి ఈ మొత్తం కసరత్తును ఆర్థిక అద్వైతం అని పిలుస్తున్నాను. ఈ ఆర్థిక అద్వైత వేదాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో నాకు నేను కొన్ని ప్రశ్నలు వేసుకున్నాను. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికాను. అదే విషయాన్ని మీతో ఈ వ్యాసంలో పంచుకుంటున్నాను.
ప్రభుత్వం ప్రకటించిన వికృతభాషను వదిలేస్తే దీన్ని జాతీయ తనఖా విధానంగా మనం పిలుచుకోవచ్చు. ఏ కుటుంబంలోనైనా యజమాని ఎప్పుడు తనఖా పెడతాడు? దివాళా తీసినప్పుడు. దివాళాకు వంద కారణాలుండొచ్చు. స్వయంకృతాపరాధాలు లేదా పరిస్థితులు కారణాలు కావచ్చు. కానీ దివాళా వాస్తవం. తాజాగా గత ఏడేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది కాబట్టే ఉన్న ఆస్తులు తనఖా పెట్టుకుని వచ్చిన డబ్బులతో ఉప్పు పప్పు ఉడకబెట్టుకునేలోపు పదవీకాలం పూర్తవుతుందన్న అంచనాకు వచ్చింది కేంద్రం. అందుకే ఈ తనఖా కార్యక్రమాన్ని కూడా 2024-2025 ఆర్థిక సంవత్సరంలోపే ముగించేయాలని కంకణం కట్టుకుంది.
ఈ దివాళాకు కారణం ఏమిటన్నది మరో ప్రశ్న. ప్రభుత్వం వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన తనఖా కార్యక్రమం నివేదికలో 2019లో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ రూపొందించిన జాతీయ మౌలిక వలతుల కల్పన పైప్‌లైన్ నివేదిక అంచనా ప్రకారం రానున్న నాలుగేండ్లల్లో ప్రజలను ఉద్ధరించటానికి 111లక్షల కోట్లు కావాలట. ఇందులో 85శాతం వనరులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 15శాతం వనరులు సమీకరించటానికి ఆస్తులు తనఖా పెట్టాలని నిర్ణయించాం అని ప్రకటించింది. అంతటితో ఆగకుండా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా తన నిర్ణయానికి తానే వత్తాసు తెచ్చుకుంది. కానీ వాస్తవం ఏమిటి? బీజేపీ తొలిసారి అధికారానికి వచ్చేంత వరకూ దేశంలో పరిశ్రమలశాఖ మాత్రమే ఉండేది. కానీ 1999లో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ప్రారంభించింది బీజేపీ. అంటే ప్రభుత్వరంగ కంపెనీల అమ్మకానికి కావల్సిన విధి విధానాలు రూపొందించే శాఖ అన్నమాట. ఈ శాఖను 2016 నాటికే ఆస్తుల నిర్వహణ శాఖగా మార్చేశారు. అంటే 2021 ఆగస్టులో వచ్చిన ఆస్తుల తనఖా ప్రతిపాదన ఇప్పటికిప్పుడు కోవిడ్ కారణంగానో, లేక ఆర్థిక వ్యవహారాల శాఖ భవిష్యత్ పెట్టుబడుల గురించి ఇచ్చిన నివేదిక ఆధారంగానో తెరమీదకు వచ్చిన ప్రయోగం కాదు. దాదాపు ఐదేళ్ల క్రితం నుండే 'పైప్‌లైన్'లో ఉన్న పథకం. దేశమంతా కోవిడ్ బారిన ఖైదు అయిన పరిస్థితుల్లో ఎవ్వరూ నోరెత్తి నిలదీయలేని సమయంలో చడీ చప్పుడు కాకుండా ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించింది.
ఆస్తులు తనఖా పెడుతున్నామే తప్ప అమ్మటం లేదని, ప్రయివేటు యాజమాన్యం విజయవంతంగా ఈ ఆస్తులను అజమాయిషీ చేస్తుందని, ప్రజలకు సేవలందిస్తుందని, సంస్థలను లాభాలదారికి తెస్తుందని ప్రభుత్వం ఈ తొలి పేజీల్లో ముందుకు తెచ్చిన మరో వాదన. ప్రభుత్వ సంస్థల కంటే ప్రయివేటు సంస్థలే లాభార్జనలోనూ, అజమాయిషీలోనూ విజయవంతంగా వ్యవహరించేట్టయితే ప్రయివేటు కంపెనీలు తీసుకున్న బ్యాంకు రుణాలు కూడా చెల్లించలేనంతగా ఎందుకు దివాళా తీస్తాయన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్రభుత్వాధినేతల తల వెయ్యి వక్కలవుతుందని భయపెట్టే భేతాళుడు కూడా మోడీ భుజాన లేడు. కాబట్టి ఇష్టం వచ్చిన తర్కాన్ని యాగాశ్వంలాగా దేశం ముందు వదిలితే దేశంలో నోరున్న వాళ్లు, ఆలోచించగల వాళ్ళంతా ఆ తర్కాన్ని అర్థం చేసుకుని విశ్లేషించి వ్యాఖ్యానించే పనిలో నిమగమవుతారు. ఎంతమంది ఈ పనిలో మునిగి తేలినా జనానికి చేరేది మాత్రం ఏలికల మనసెరిగిన విశ్లేషణలూ, వ్యాఖ్యానాలే అన్నది ప్రభుత్వం ధీమా.
ప్రభుత్వం చెప్పిన లెక్కల్లోనే రానున్న నాలుగేండ్లల్లో దేశాన్ని ఉద్ధరించటానికి కావల్సిన సొమ్మెంత? అక్షరాలా 1,02,50,704 కోట్లు. అంటే సుమారు కోటికోట్లు. ఇందులో ఆస్తుల తనఖా ద్వారా సేకరించుకోవాలనుకుంటున్న సొమ్ము కేవలం ఆరులక్షల కోట్లు. అది కూడా నాలుగేండ్లల్లో. ఏడాదికి లక్షా 25వేల కోట్ల అవసరం మాత్రమే. అంటే కోటి కోట్ల ఖర్చు చేయగలిన సత్తా ఉన్న ప్రభుత్వానికి అందులో ఆరు లక్షల కోట్లు సేకరించుకోవటానికి 13 రకాల పరిశ్రమల్లో ప్రభుత్వ వాటాను అస్మదీయులైన దేశ విదేశీ పెట్టుబడిదారులకు తనఖా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని దేశాన్ని నమ్మించటానికి బీజేపీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నది.
దేశం ఆర్థిక పరిస్థితి మోడీ పాలనలో అధోగతికి చేరిందీ, కనీసం ఆరులక్షల కోట్లు కూడా సమీకరించుకోలేని దురవస్థలో ఉన్నామని కాసేపు సర్దిచెప్పుకుందాం. మరి ప్రభుత్వం చెప్పినట్టు ఆస్తులు తనఖా పెట్టుకుని ఆరులక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగలిగిన దమ్మున్న పెట్టుబడిదారులెవరు ఈ దేశంలో అని ఓ సారి చూద్దామంటే రిజర్వుబ్యాంకు వార్షిక నివేదిక హెచ్చరిక గుర్తొచ్చింది. 2020-21 సంవత్సరపు ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు మదింపు చేసిన రిజర్వు బ్యాంకు, దేశంలో ఏ రంగంలోనూ ప్రయివేటు పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగాలేరని అంచనాకు వచ్చింది. దాదాపు నాలుగైదేళ్ల నుంచీ ఆర్థిక రంగంలో ప్రత్యేకించి మౌలికవసతుల కల్పన రంగంలో ప్రయివేటు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా లేరన్నది రిజర్వు బ్యాంకు నివేదిక సారాంశం. దీని ప్రభావం పెట్టుబడుల ఉపంసహరణలో కూడా మనకు కనిపిస్తుంది. గత ఆరేండ్లల్లో వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల్లో సుమారు ఎనిమిది లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ వాటాలు అమ్మటానికి సిద్ధమైతే కేవలం 3.38 లక్షల విలువైన వాటాలు మాత్రమే కొనుక్కున్నారు. ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో సుమారు ఐదులక్షల కోట్ల రూపాయల మేర చిల్లు పడింది. ఈ చిల్లు పూడ్చుకోవడానికి పన్నిన పన్నాగమే ఈ ఆస్తుల తనఖా.
పైగా ఈ తరహాలో ఆస్తులు కుదువ పెట్టుకోవటానికి ముందుకు వచ్చే వాళ్ల దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వమే ఈ డబ్బులు ఎదురు అప్పిచ్చేందుకు కూడా విధానాన్ని రూపొందించింది. దానికి పెట్టిన ముద్దు పేరే మౌలికవసతుల కల్పిన అభివృద్ధికి నిధులు సమకూర్చే బ్యాంకు (నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్). అంటే కుదవ పెట్టుకునే వాళ్లకు కేవలం ఆలోచన ఉంటే చాలు. వారికి పెట్టుబడులు కూడా ప్రభుత్వం ఈ బ్యాంకు ద్వారా సమకూరుస్తుంది. అలా తీసుకున్న రుణంతోనే ఈ తనఖా వ్యాపారులు ప్రభుత్వ ఆస్తులను 30ఏండ్లకో లేదా 50ఏండ్లకో స్వంతం చేసుకుని అనుభవించవచ్చు. వీలైతే మరో యాభై ఏండ్లకు ఈ ఒప్పందాన్ని పొడిగించుకోవచ్చు. ఇదే సొమ్మును ప్రభుత్వరంగ సంస్థలకు రుణంగా ఇస్తే కనీసం తిరిగి వస్తాయన్న గ్యారంటీ అన్నా ఉంటుంది. కానీ తనఖా వ్యాపారులకిచ్చిన రుణాలు వెంకటేశ్వరుని హుండీలో వేసిన చందాగా మారిపోయినా ప్రభుత్వం చేయలిగిందేమీ లేదు. అంతేకాదు, ఈ విధంగా నిర్వహణ కోసం తనఖా పెట్టుకున్న ఆస్తులు, సేవల విషయంలో ప్రజలకు ఎటువంటి సేవల హామీ ఉండాలన్న విషయం గురించి గానీ, ఆయా సంస్థల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు, దిగువ స్థాయి అధికారుల ఉద్యోగ భద్రత విషయంలోగానీ ఎటువంటి హామీ ఈ ప్రతిపాదనల్లో కనపడటం లేదు. కనీసం తనఖా పెట్టుకున్న వాళ్ల ఆర్థిక లావాదేవీలపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌కు గానీ, విజిలెన్స్ సంఘానికి గానీ లేదా పార్లమెంట్‌కు గానీ ఎటువంటి హక్కు, అధికారం, అజమాయిషీ ఉండబోవు.
పెట్టుబడుల ఉపసంహరణకు, తనఖా పెట్టుకున్న ఆస్తుల యాజమాన్యానికి మధ్య తేడా ఏమిటన్నది వివరించటానికి ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయలేదు. తనఖా వ్యాపారంలో యాజమాన్యం మారదని మాత్రం చెప్పేందుకు ప్రయత్నం చేసింది. కానీ విమానయాన రంగంలోని ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టడం ద్వారా వచ్చే నాలుగేండ్లల్లో రూ.20782 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా ఈ తనఖా విధానంలో ప్రకటించారు. అయితే ఇప్పటికే విమానాశ్రయాలు, విమానాశ్రయాల అభివృద్ధి సంస్థలోని ప్రభుత్వ వాటాలు అమ్మటం ద్వారా పది వేల కోట్ల రూపాయలు సంపాదించాలని పెట్టుకున్న లక్ష్యంలో ఏ మాత్రం మార్పు లేదని కూడా ఈ నివేదికలో ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఓడరేవులు, క్రీడాస్థలాలు వంటి అనేక రంగాల్లో కూడా ఇదే సూత్రం అప్రకటితంగా అమలులో ఉండదని చెప్పేంత సాహసం ప్రభుత్వానికి లేదు.
ఇలాంటి అనేక వివరాలు, పొంతనలేని వాదనలు, అడ్డగోలు ఆర్థిక తర్కాలు పరిశీలిస్తే అర్థమయ్యేది ఒక్కటే. ప్రభుత్వరంగ వాటాలు అమ్మటానికి గత ఆరేడేండ్లుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితి రీత్యా పెట్టుబడిదారులు ముందుకు రావటం లేదు. కాబట్టి వాళ్లను ప్రోత్సహించటానికి ప్రకటించిన విధానమే ఇది. దీని అంతిమ లక్ష్యం దేశాభివృధ్ధికి వ్యూహాత్మక అవసరాలైన అన్ని రంగాల్లోని ప్రభుత్వ వాటాలు అమ్మేయటం. ప్రయివేటు యాజమాన్యం ఇష్టాయిష్టానికి జనాన్ని వదిలేయటం. దీనికి పెట్టిన పేరే ఆత్మనిర్భర భారత్. అమృత కాల్ లక్ష్యాలు. అద్వైతంలో ఆత్మ పరమాత్మ లేవు. బ్రహ్మమొక్కడే అన్నది సారాంశం. ఆర్థిక అద్వైతంలో పెట్టుబడులు, సేవలు అంటూ ఏమీ ఉండవు. లాభమొక్కటే సారాంశం. కొత్త యజమానుల లాభాలకు కేంద్రం జామీనుగా ఉండటమే ఈ ఆర్థిక అద్వైత సిద్ధాంతం.
- కొండూరి వీరయ్య
సెల్: 8971794037