Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు - అన్నట్టుగా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసే ఈ టెలివిజన్ సీరియల్స్ వల్ల లాభమేమిటీ? వీటివల్ల సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నాయి. నిత్యం టీవీలకు అతుక్కుపోవడం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. విలువైన సమయం వృధా అవుతోంది. చెడు ఆలోచనలతో మెదడు పాడవుతూ ఉంది. సీరియల్స్ చూడటం ఒక వ్యవనంగా మార్చుకున్న వారు బయట పడటానికి వేరే ఇతర వ్యాపకాల్లో తీరికలేకుండా ఉండటం మేలు!''
- కె. శాంతిలక్ష్మి, ఎల్ఐసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.
జీవిత భీమాకు సంబంధించిన అధికారి ఆలోచనల్లో నిజాయితీ ఉంది. తెలుగు సీరియల్స్ తీరుతెన్నులు క్షుణ్ణంగా గమనించిన తర్వాతే, ఆవిడ అలా వ్యాఖ్యానించారు. ఉదాహరణకు కన్నకూతుర్ని ఎలా నాశనం చేయాలో ఒక పువ్వు సీరియల్ చూపింది. పనిమనిషి కోడలయితే ఎలా ఏడిపించాలో ఒక రాజకుమారి సీరియల్ చూపింది. తండ్రి నుండి కూతుర్ని ఎలా విడదీయొచ్చో ఒక లమ్మ సీరియల్ చూపింది. అత్తగారు కోడల్ని ఎలా చంపుతుందీ అంటే ఓ కళ్యాణం సీరియల్ చూపింది. ఇంటి ఆడబడుచుని ఎలా కష్టపెట్టొచ్చో మరో సీరియల్ చూపింది. సరే, ఇవికాక సీరియల్స్ ద్వారా కూడా మత ప్రచారం జరుగుతోంది. అవసరమున్నా లేకున్నా విగ్రహాల ముందు పటాల ముందు పెద్ద ఎత్తున పూజలు, నేపథ్యంలో సినిమా పాటలు. అయితే దాదాపు అన్నీ అక్రమ సంబంధాల చుట్టూ రంజుగా నడిచే తెలుగు సీరియల్సే ఉండగా ఇంకా వేరే మత్తుమందులెందుకూ? రోజు రోజుకూ మానసిక రోగులుగా మారి... ఇంత బిర్యానీ తిని, కోక్ తాగి, ముడుచుకు పడుకోక ఇంకా వేరే వేరే ఆలోచనలెందుకూ? 'మనల్ని మనమే ఉద్దరించుకోలేని మనం ఇక దేశం గురించి, ప్రపంచం గురించి ఏమాలోచిస్తాం?' అని పైకి చెప్పరు గానీ, కొందరలా భావిస్తూ ఉంటారు.
ఒకప్పటి మగ విలన్లను తలదన్నే విధంగా కుట్రలు, కుతంత్రాలతో ఆడవిలన్లు కథలో చక్రం తిప్పుతుంటారు. పెద్ద బంగళాముందు లాన్లో కూర్చుని ఇంట్లోవాళ్ళని, బయటివాళ్ళని గడగడలాడించడం, రోల్డుగోల్డు నగలు దిగేసుకుని ఆర్డర్లు వేస్తూ ఉండటం జరుగుతుంటుంది. 'అంతేగ, అంతేగ' అంటూ భర్తలు ఆ ఆడవిలన్లయిన భార్యల వెనక పిల్లులవుతుంటారు. మంచీ, మన్ననా లేక, ఒక మంచి సందేశమూ లేక, ద్వేషాల చుట్టూ, పగలచుట్టూ తిరిగే తెలుగు సీరియల్స్ 'ఎంత బావుంటాయీ?' ఎంత రక్తికట్టిస్తాయీ? ఒక కొడుకు తల్లిని ద్వేషిస్తాడు. మరో చోట ఒక కూతురు తల్లిపై పగతీర్చుకోవాలను కుంటుంది. అక్రమ సంబంధాలూ- వాటి పర్యవసానాలు అన్ని సీరియల్స్‌లో ప్రత్యేక ఆకర్షణ! ''మనిషి ఆకారంలో తిరిగే క్రూర జంతువులతో కాకుండా కాస్త, సీరియల్స్ మనుషులతో తీయండిరా బాబూ!'' అని కొందరు పిచ్చివాళ్ళు గగ్గోలు పెడుతుంటారు - అది మళ్ళీ వేరే విషయం!
ఇక రియాల్టీ షోల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆడామగా తేడా ఉండదు. ఆపకుండా తెగవాగే వాళ్ళే గొప్ప ఏంకర్లవుతారట - మెదడ్లు ఎంత ఖాళీగా ఉంటేనో కదా.. అంతగా వాగుతుంటారు? పిచ్చివాగుడుకు, పచ్చి జోకులకు వాళ్ళే పగలబడి నవ్వుతుంటారు. పైగా వాళ్ళకు వాళ్ళే సెలబ్రిటీలమని ప్రకటించుకోవడం తెలుగు ప్రేక్షకుల దౌర్భాగ్యమా? అదృష్టమా? తెలుగు టెలివిజన్ ఏంకర్ల వాగుడు భరించలేక వినికిడి శక్తి కోల్పోతున్న వారు ఏటా ఎంతమంది ఉంటున్నారో ఎవరైనా పరిశోధన చేయొచ్చు. ఇలా రీసర్చ్ చేయగల అంశాల్ని తెలుగు ఛానళ్ళు ప్రసాదిస్తున్నట్టే కదా?
ఇక వేర్వేరు రంగాలకు చెందిన ఓ పదిహేనుమందిని ఓ వంద రోజులు ఓ ఇంట్లో బంధించి, వారి సొళ్ళు కబర్లు, గిల్లికజ్జాలు, కొట్లాటలు, నిద్రమొహాలు, పాచిపళ్ళు, అర్థనగ శరీరాలు టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం కలుగుతోందీ? ఆరోగ్యవంతుల మెదళ్ళను మొద్దుబారించడం తప్ప.. బద్దకస్తుల సంఖ్య గణనీయంగా పెంచడం తప్ప.. ఏమిటి? ఏమిటీ లాభం? విశ్రాంతి ఎక్కువగా దొరికే వారికి ఏదో.. కాలక్షేపం తప్ప.. ఎవరికి లాభం? విజ్ఞత లేని వాళ్ళ జాతర లైవ్‌లో చూపించడమే బిబిషోనా? యయిత్ సెన్స్ - మెగుడు పెళ్ళాలు వంటి కార్యక్రమాలన్నీ హడావుడికి తప్ప, దేనికి పనికొచ్చేవి? దేశవ్యాప్తంగా ఉన్న తెలివైన విద్యార్థులను ఒకచోట చేర్చి వారి సృజనాత్మకతను ప్రోత్సహించి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదా వందమంది యువ ఇంజనీర్లను ఒకచోట చేర్చి ఒకటి రెండు నెలల్లో కొత్త ఉత్పత్తులకు రూపకల్పన చేయమనండి. అదీ కాకపోతే ఓ పదిమంది రైతులను గుర్తించి, వారికి అన్ని సౌకర్యాలు, పరికరాలూ అందించి కొత్త పద్ధతుల ద్వారా పంటలు పండించమనండి. పండించి చూపుతారు. దేశంలో దేనికీ కొదువ లేదు. అందించాల్సిన వారికి అందించగల ఆదరణే కొరవడింది. పనికిరాని వాటికి ప్రాముఖ్యమిస్తూ, పనికొచ్చేవి పక్కనపడేయడం మూలాన దేశ పరిస్థితి నానాటికీ దిగజారిపోతూ ఉంది.
ఇక తెలుగు టెలివిజన్ వార్తా ఛానళ్ళలో 'చర్చ' పేరుతో వాదనలు జరుగుతుంటాయి. చర్చవేరు. వాదన వేరు. రెండూ ఒకటే అని అనుకుంటారు చాలామంది. రెండింటికీ చాలా తేడా ఉంది. వాదనకు దిగడమంటే బురదపూసుకుని ఉన్న వ్యక్తితో కుస్తీకి దిగడం లాంటిది. వాదన లౌక్యం తెలియని వారి లేదా మొండివారి సాధనం. వాదనలో అహంకారం వ్యక్తమౌతుంది. ఆవేశాన్ని సృష్టిస్తుంది. ఒక్కోసారి వాదనలో విషయం ఉన్నా.. అది వ్యక్తీకరించే పద్ధతివల్ల ఎదుటివారికి అంగీకారం కాదు. ఎందుకంటే ఎదుటివారికి ఏమీ తెలియదన్నట్టు, అంతా తమకే తెలుసునన్నట్టు.. ఒకరకమైన అజ్ఞానంతో కొనసాగేదే వాదులాట. అసహనానికి చిహ్నంగా, అసహ్యంతో విదిలించు కున్నట్టు ఉండేదే వాదన! చర్చనేది వేరు. అది జ్ఞానాన్ని పంచుకోవడం లాంటిది. అది మానసిక పరిణతి ఉన్నవారి మధ్య సాగేది. ఎదుటివారి భావనల్లో, ఆలోచనల్లో ఉన్న లోపాల్ని, పొరపాట్లను సున్నితంగా ఎత్తిచూపడం.. ఒక సూచన చేయడం చర్చలో జరుగుతుంది. తర్కబద్ధంగా చర్చ జరిగినప్పుడు ఒకరిపట్ల ఒకరికి గౌరవం పెరుగుతుంది. అసహ్యంగా విదిలించుకోవడం కాదు, అతిధికి ఆతిధ్యం ఇవ్వడం లాంటిది చర్చ. ఇక్కడ మన తెలుగు ఛానళ్ళలో చర్చపేరుతో వాదనకు దింపుతారు యాంకర్లు. వారిక్కూడా వాదులాటే ఇష్టం! దాన్ని చర్చ అనాలో రచ్చ అనాలో తేల్చుకోవాల్సింది ప్రేక్షకులే!
సమాజాన్ని బాగుపరచడం కోసమే మేమున్నామని చెప్పుకునే ఛానళ్ళవారు వారి పాలసీ ఏమిటో చెప్పరుగాక చెప్పరు. వైజ్ఞానిక విషయాల మీద ఒక శాస్త్రాజ్ఞున్ని పిలిచి వివరాలు చెప్పిస్తారు. మళ్ళీ ఆ పక్కనే ఓ పూజారిని, ఓ జ్యోతిష్యుణ్ణి కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. అన్ని రకాల అభిప్రాయాలకు మేం వేదిక కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. అది సరే కానీ.. మీ ఛానల్, పాలసీ ఏమిటీ? 'చేటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టడమేనా?' క్షమించాలి! ఎవరినో తక్కువ చేయడానికి ఇక్కడ ఈ సామెత చెప్పలేదు. ఒక దృక్పథమంటూ లేని ఛానల్ నిర్వహకుల ఇంగిత జ్ఞానాన్ని ప్రశ్నించడం కోసమే చెప్పాను. వాస్తవ జగత్తులో అన్ని అభిప్రాయాలూ, ధోరణులూ ఉన్నాయి. కానీ, బాధ్యత గల వాళ్ళు ఏంచేయాలి? అవసరమైంది మాత్రమే జనానికి అందించాలి. వారి విజ్ఞత కనిపించేది అక్కడే.. సమాజ ఉద్ధరణకు పనిచేసే ఛానల్ ఏం చేయాలో వారికే తెలిసి ఉండాలి కదా?
మత ప్రచారానికి టీవీ ఛానళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఏ మతానికి సంబంధించిన ఛానళ్ళు ఆ మతానికి ఉన్నాయి. వాటిపనే అది. అవికాకుండా మామూలు ఛానళ్ళలోకూడా సుప్రభాతాలు, జ్యోతిష్యవాణులు, ఆలయ దర్శనాలు వగైరా అనేకం...
తెలుగు ప్రేక్షకులారా జాగ్రత్త!! మీకు ఇంగ్లీషు, హిందీ వంటి ఇతర భాషలు వచ్చినా ఇతర జాతీయ, అంతర్జాతీయ ఛానళ్ళవైపు కన్నెత్తి కూడా చూడకండి. డిస్కవరీ సైన్స్, నేషనల్ జియోగ్రఫీ, సోని బిబిసి ఎర్త్, ఎనిమల్ ప్లానెట్, హిస్టరీ టీవీ వంటి ఛానళ్ళలో మొహం పెట్టారో జాగ్రత్త! మీ మెదడు వాచిపోతుంది. అనవసరంగా ప్రకృతి రహస్యాలు, వైజ్ఞానిక విశేషాలు, ప్రపంచ జ్ఞానం అబ్బుతుంది. కనీసం ఆ ట్రావెల్ ఎక్స్పో, గుడ్టైవమ్స్ వైపు చూశారంటే వాళ్ళు మిమ్మల్ని దేశదేశాలు తిప్పిచూపెడతారు. ఏ దేశం ఎలా ఉంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చెపుతారు. దానివల్ల అనవసరంగా మీకు జనరల్ నాలెడ్జ్ పెరిగే అవకాశముంది. మరి మీఇష్టం! బిబిసి వరల్డ్, సిఎన్నెన్, అల్జజీర్, ఫ్రాన్స్, రష్యా టీవీ లాంటివి చూస్తే ప్రపంచ వార్తలతో మీ మొహం వాచిపోతుంది. అవన్నీ మనకు అవసరమా? తెలుగు ఛానళ్ళకే పరిమితమైపోతే మంచిది. ఎంత అజ్ఞానంలో ఉంటే, ఎంత మూఢత్వంలో ఉంటే బతకు అంత సుఖంగా ఉంటుందని ఓ 'టీవీబాబా'నే చెప్పాడు.
ఈ ఛానళ్ళకు ప్రజలు పట్టరు. జీవితపు విలువలు నిలబెట్టాలని ఉండదు. అన్ని రకాలుగా చచ్చిపోతున్న మనిషిని ఎలా బతికించుకుందామన్న ధ్యాస ఉండదు! తపన ఉండదు!! వ్యాపార ప్రకటనలతో డబ్బు సంపాదిం రచుకుంటూ, రేటింగ్ పెంచుకోవాలి. అంతే! ఒకవైపు రాజకీయ నాయకులు, మరోవైపు ఛానళ్ళూ నరుక్కుంటూ వస్తుంటాయి. తప్పించుకుని ప్రశాంతంగా ఊపిరిపీల్చుకోలేక బలిఅయ్యేది సగటు ప్రేక్షకులు. మనిషికి మెదడు చాలా ముఖ్యమైంది. దాన్ని సరైన దారిలో పెట్టి, మానవ జీవితాన్ని వివేకవంతం చేసుకుందామన్న ఆలోచన ఎవరికీ ఉండటం లేదు. చాన్నాళ్ళ క్రితమే వచ్చిన 'ఈడియట్ బాక్స్' అనే బిరుదును టెలివిజన్ వదులుకోవడానికి ఇష్టపడుతుందా?
- వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు