Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. ఇది హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజు. 1905 ఆగస్టు 29నాడు ఆయన జన్మించాడు. ధ్యాన్‌చంద్ క్రీడా రంగంలో ప్రపంచ ఖ్యాతిని పొంది మనదేశానికి హాకీ క్రీడలో ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలను అందించాడు. ఈయన క్రీడాశక్తికి, ప్రతిభకు ముగ్దుడైన హిట్లర్... జర్మనీ దేశ పౌరసత్వంతోపాటు, ఆర్మీలో కీలక పదవిని ఆశచూపినా... నా క్రీడా ప్రతిభాశక్తి నా దేశానికే అంకితమని చెప్పి నిఖార్సైన దేశభక్తిని చాటినాడు. ఆయన జయంతిని జాతీయ క్రీడాదినోత్సవంగా భారత ప్రభుత్వం జరుపుతుంది.
మనిషి మానసిక, శారీరక ఆరోగ్యానికి వ్యాయామవిద్య, క్రీడలే పునాది. శారీరక పటుత్వం, ఏకాగ్రతను పెంచి ఆత్మవిశ్వాసాన్ని, ఉమ్మడి తత్వాన్ని పెంపొందింపజేస్తాయన్న యధార్థాన్ని గుర్తించాలి. క్రీడా స్ఫూర్తి చిన్న నాటినుండే అలవడితే దేహా(దేశా)నికి చాలా మంచిది. అలా నమ్మిన ప్రపంచదేశాలు పటిష్టమైన క్రీడా స్ఫూర్తితో ముందస్తు ప్రణాళిక బద్ధంగా శిక్షణ, సాధనలతో అంతర్జాతీయ శిక్షణ ప్రమాణాలను ప్రాథమిక స్థాయి నుండే అందిస్తూ నిధులను సమకూరుస్తూ పతకాల పంటను పండించుకుంటున్నాయి. ఆటపాటల్లో మునిగి తేలిన పిల్లలకు వర్తమానంలో జీవించడం గురించిన అనుభవం వలన పరిపక్వత పెరుగుతుంది. విజయం ప్రేరణనందిస్తే, పరాజయం బోధకుడి పాత్రను పోషిస్తుంది. సుమారు 140కోట్ల జనాభాకు చేరుకున్న భారతదేశం 60శాతం యువతతో ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా గల దేశంగా పేరొందుతుంది. కానీ క్రీడలు ఏవైనా, ఏ స్థాయిలో జరిగినా పతకాల జాబితాలో చిన్న చిన్న దేశాల ముందు దిగజారిపోతుంది. సహజ సిద్ద క్రీడా ప్రతిభా సంపన్నులకు మనదేశంలో కొదువ లేదు. కానీ పాలకులు క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేకపోవడం, ఉత్సాహవంతు లను ప్రోత్సహించలేక పోవడం చూస్తున్నాం. అవినీతి, బంధు ప్రీతి, ఎన్నో క్రీడా సమాఖ్యల, సంఘాల మధ్య అనైక్యత, కులపరమైన దుర్విచక్షణ, పేదరికం, రాజకీయ జోక్యం లాంటి వాటి వలన క్రీడారంగంలో ఆశించిన స్థాయికి చేరుకోలేక పోతున్నాం. క్రీడారంగానికి ప్రాధాన్యత నానాటికీ దిగజారిపోతుంది.
మొన్న జరిగిన ఒలింపిక్స్ విశ్వక్రీడలలో పతాకాల పట్టికలో అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీలు అగ్రస్థానంలో నిలిచాయి. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న మనదేశం స్వర్ణంతో సహా 7 పతకాలతో 66వ స్థానం నుంచి 47వ స్థానంలోకి ఎదిగింది. ఓ నీరజ్... ఓ చాను... ఓ దహిమా... ఓ సింధూ.. ఓ పూనియా.. ఓ లవ్లీనా... హాకీ ఆటగాళ్ళు వీళ్ళ పోరాటం స్ఫూర్తిదాయకం ఇదే చాలా..! ఇక్కడితో సంతృప్తి చెందుదామా! వందేండ్లకు పైగా పోటీ పడుతున్న ఒలింపిక్స్‌లో మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అందుకు పాలకులు ''75 వసంతాల అమృతోత్సవాల'' వేళ, ''ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం'' సందర్భంగానైనా క్రీడారంగ పటిష్టతకు అకుంఠిత దీక్ష బూనాల్సి ఉంది. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు క్రీడా రంగ పటిష్టతకు, క్రీడా కారుల్లో నైపుణ్యాలను పెంచుటకు కోచ్‌లు కృషిచేయాలి. పి.ఇ.టి.లు, పిడి ఉపాధ్యాయులను నియమించి నాణ్యతతో కూడిన క్రీడా ప్రాంగణాలు నెలకొల్పాలి. పతకాలు గెలుపొందిన వారిని ఆకాశానికి ఎత్తేయడంలో పోటీపడే ప్రభుత్వాలు, అంతేస్థాయిలో క్రీడా రంగానికి నిధుల కేటాయింపులో నిబద్ధత చాటాలి. క్రీడా రంగంలో విశ్వవిజేతలుగా మనం ఎదగాలంటే యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి. ఆత్మ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని ముద్దాడేవరకు అలుపెరగని సాధన చేయాలి. ఈ విజయాలు రాత్రికి రాత్రి వచ్చేవి కావు. పాలకులు, ఉపాధ్యాయులు, సమాజం, తల్లిదండ్రులు క్రీడారంగ ప్రాధాన్యతను గుర్తించాలి. వారి పిల్లలను ఆ వైపుగా ప్రోత్సహించాలి.
విద్యాలయాల్లో క్రీడల కోసం కాలనిర్ణయ పట్టికలో ఓ పీరియడ్ ఉంటుంది. కానీ దాని అమలులో చిత్తశుద్ధి ఉండదు. వ్యాయామ ఉపాధ్యాయులను కూడా వారి విధులు ప్రక్కనపెట్టి బోధన చేయమంటున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అన్ని స్థాయిల్లో పర్యవేక్షణలో కూడా విద్య మీదున్న శ్రద్ధ క్రీడా విద్యపై లేనేలేదు. ప్రపంచీకరణలో భాగంగా క్రీడా రంగంలో వ్యాపారీకరణతో కొన్ని క్రీడలను ప్రోత్సహించడం, మిగిలిన క్రీడలను చిన్నచూపు చూడటం పరిపాటిగా మారింది. ఇది మారాలి. క్రీడా రంగంపై సానుకూల ప్రచారం, క్రీడా కారులకు ప్రత్యేక సౌకర్యాలు,
ఉద్యోగాలు కల్పిస్తూ క్రీడా దినోత్సవం నిర్వహణలో అన్ని స్థాయిల్లో సమాజ భాగస్వామ్యం పెంచాలి. మూలాలలోకి వెళ్ళి నైపుణ్యాలను సాధించి దేశ క్రీడాశక్తికి పదునుపెట్టాలి.
- మెకిరి దామోదర్
సెల్: 9573666650