Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆగస్ట్ 14న ''విభజన గాయాల జ్ఞాపక దినం''గా పాటించాలని ప్రకటించాడు. నేడు దేశంలో నివసిస్తున్న మెజారిటీ భారతీయులు, రక్తపాతంతో జరిగిన దేశ విభజన తరువాత పుట్టిన వారే. వారంతా ఈ చరిత్రను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. హిందూ, ముస్లింల అల్లర్లలో ఒక మిలియన్ సంఖ్యలో ప్రజలు తమ మాన ప్రాణాలను కోల్పోయారు. రెండు మార్గాలలోని రైళ్ళలో శవాలు పోగుపడినాయి. మానవ చరిత్రలోనే ఎక్కువ సంఖ్యలో నిరాశా నిస్పృహలలో ఉన్న 14 మిలియన్ల మంది ప్రజలను బలవంతంగా వెళ్ళగొట్టారు. కానీ ఇక్కడ, వారు ఏమి గుర్తుంచుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఈ జ్ఞాపకాల నుంచి ఏమి గుణపాఠాలు నేర్వాలి అనే ముఖ్యమైన ప్రశ్నలు మన ముందున్నాయి.
కొన్ని సంవత్సరాల క్రితం నేను పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఒక హాలులో మత విద్వేషం, మత దురభిమానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడిన విషయం గుర్తుకొస్తుంది. అక్కడ నాకంటే వయసులో పెద్దవాడైన ఒక వ్యక్తి వణుకుతూ నాతో మాట్లాడాడు. దేశ విభజన తన కుటుంబాన్ని, ఇంటిని తనకు దూరం చేసింది. ఆ విభజన సమయంలో జరిగిన దోపిడీని, నరమేధాన్ని ఆయన గుర్తుచేసుకున్నాడు. ''నేను ఈ చరిత్రను నా పిల్లలకు చెప్పే సందర్భంలో, మమ్ములను ఏ మాత్రం కనికరం లేకుండా నాశనం చేసిన ముస్లింలను ప్రేమించాలని, గౌరవించాలని వారికి నేను చెపుతా నని మీరెలా అనుకున్నారని'' ఆయన నన్నడిగాడు.
''నేను మీ బాధను అర్థం చేసుకుంటాను. నేను కూడా మీలాగే దేశ విభజన సమయంలో నష్టపోయి, బాధలు పడిన కుటుంబానికి చెందిన వ్యక్తిని. కానీ ఒకవేళ మీరు ఈ విషయాలను మీ పిల్లలతో, వారి పిల్లలతో చెప్పాల్సిన పరిస్థితి వస్తే, వారికి కనీసం ఈ మొత్తం కథను చెప్పండి. మైనారిటీ సంఖ్యలో ఉన్న హిందువులు, సిక్కులు, మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింల చేతిలో భయంకరంగా బాధలు అనుభవించారని వారికి చెప్పండి. కానీ అదే విధంగా మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువులు, సిక్కులు కూడా మైనారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింల పైన భయంకరమైన దాడులు, అఘాయిత్యాలకు పాల్పడినారని మీ పిల్లలకు, వారి పిల్లలకు చెప్పండి. ఆ భయానక వాతావరణం నెలకొన్న సమయంలో ఏ మతం కూడా ద్వేషపూరిత దాడుల నుంచి కాపాడుకోలేదు. ప్రతీ మతానికి చెందిన చేతులన్నీ సమానంగా అమాయక ప్రజల రక్తంతో తడిసి పొయ్యాయి. మీవాళ్ళు ప్రాణాలను, ఇళ్ళను కోల్పోయారు, కానీ మన ముస్లిం సోదర, సోదరీమణులు కూడా అంతే సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారనే విషయాన్ని మీ పిల్లలకు చెప్పండి. పాక్షికమైన జ్ఞాపకాలు మళ్ళీ ద్వేష భావాతరతరతలను పెంచి పోషిస్తాయ''ని ఆయనతో చెప్పాను.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కొన్ని వారాల తరువాత హిందూ, ముస్లిం మతాల హింసాయుత ఘర్షణలతో వేడిక్కిన నగరంలో శాంతి, హేతుబద్ధతలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా గాంధీజీ కలకత్తాలో చేపట్టిన నిరాహారదీక్షను ఆయనకు ఆ సందర్భంలో గుర్తు చేశాను. అత్యంత విచారంలో ఉన్న ఒక హిందువు నిరాహార దీక్ష చేస్తున్న గాంధీజీ వద్దకు వెళ్ళి, మీరు చేస్తున్న పని చాలా అన్యాయమైనదని అరిచాడు. ముస్లింల గుంపు దాడులలో చిన్న పిల్లవాడైన నా కొడుకును కోల్పోయానని, నేను వారిని ఎలా క్షమిస్తానని అడిగాడు. ''నాకు నీ బాధ తెలుసు. కానీ, నేను నీకొక మార్గాన్ని సూచిస్తాను. హిందువుల గుంపు దాడులలో తల్లిదండ్రులను కోల్పోయిన ఒక చిన్న ముస్లిం పిల్లవాడ్ని కొడుకుగా దత్తత తీసుకుని, అతడిని వారి మత విశ్వాసాల ప్రకారం పెంచి పెద్ద చేస్తే, నీ గాయం మానుతుంది, అప్పుడు క్షమించ గలవని'' గాంధీజీ బదులు సమాధానం ఇచ్చాడు.
విభజన సమయంలో ద్వేషపూరిత హింసాత్మక దాడులకు గురైన గ్రామాలలో రావల్పిండి దగ్గరలోని కహుతా అనే మా స్వగ్రామంలోని హిందువులు, సిక్కులు కోటగోడలంతటి ఎత్తున్న గురుద్వారాలో ఆశ్రయం పొందారు. ముస్లింల గుంపు గురుద్వారాను స్వాధీనం చేసుకునేందుకు వచ్చినప్పుడు, మహిళలు, బాలికలు బావిలోకి దూకి వారి 'మానాలను' కాపాడుకోవాలని ఆ మతాలకు చెందిన పురుషులు నిర్ణయించారు, కానీ ఆ నిర్ణయాన్ని తిరస్కరించిన మహిళలను, ఆ కుటుంబంలోని మగవారే కత్తులతో ముక్కలు చేసి బావిలో వేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మత దురభిమానాన్ని వ్యక్తీకరించే ఒక్క మాట కూడా మాట్లాడని నా తల్లిదండ్రులకు కతజ్ఞతలు. సిక్కు పవిత్ర గ్రంథంలో 'అల్లా' అనే పదం 1000 పర్యాయాలకు పైగా కనిపిస్తుందని నా తండ్రి తరచుగా చెప్పేవాడు. వారి ప్రార్థనా మందిరం గోడలపై అల్లా, సిలువ, బుద్ధుడు, హిందూ దేవుళ్ళు, దేవతల పేర్లు ఉండేవి.
కొన్ని దశాబ్దాల అనంతరం 2002లో గుజరాత్లో జరిగిన మతోన్మాద నరమేధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా నా ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి వేశాను. న్యాయం కోసం పోరాడుతూ, బతికి ఉన్న వారు కోలుకునే వరకూ సహాయంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మా బంధువులు చాలా మంది నాపై కోపంతో నాతో సంబంధాలు తెంచుకున్నారు. ఒక పెళ్ళికి హాజరైన సందర్భంగా ఒక బంధువు, ''విభజన సమయంలో మన కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. నీవు తప్పుడు మార్గం వైపు వెళ్లావు, నీ వల్ల మేము సిగ్గు పడుతున్నామని'' అన్నాడు. మన కుటుంబాలు విభజన సమయంలో చాలా ఇబ్బందులు పడినాయి, అదే విధమైన ద్వేషపూరిత హింసకు గురైన బాధితులను మనకంటే ఎక్కువ ఎవరు అర్థం చేసుకోగలరు? నేరాలు చేసే వారికి వ్యతిరేకంగా, బాధితులకు అండగా ఉండడం మన బాధ్యత. తప్పుడు మార్గం వైపు ఉన్నది మీరని'' నేను తిరిగి జవాబిచ్చాను.
వేదనా భరితమైన విభజన నుంచి ఏమి గుర్తుంచుకుంటాం అనేది ముఖ్యం కాదు, ఆ జ్ఞాపకాల నుంచి మనం ఏమి గుణపాఠాలు తీసుకుంటామనేది ముఖ్యం. విభజన హింసలో అత్యంత విషాదకరమైన బాధితులను మనం గుర్తుంచుకోగలమా? ఆస్తిగా భావించబడిన మహిళలు కూడా బాధితులే. పాకిస్థాన్‌లో వదిలి వేయబడిన దళిత క్రైస్తవులు పాకీ పని కొనసాగిస్తూ, దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ, దైవదూషణ పేరుతో చేసిన చట్టాల చేతిలో, మత వివక్షతతో దాడికి గురవుతున్నారు.
తమ స్వంత మతస్థుల ద్వేషపూరిత హింసాత్మక చర్యల నుంచి ఇరుగుపొరుగు వారి ప్రాణాలను రక్షించేందుకు వేల సంఖ్యలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన హిందూ, ముస్లిం, సిక్కు మతాలకు చెందిన వారిని గుర్తుంచుకోగలమా?
'విభజన గాయాల జ్ఞాపక దినం' ప్రకటన వెనుక ప్రస్తుత పాలకుల రాజకీయాలు ఉన్నాయని మనలో కొందరు అనుకుంటున్నారు. ఆగస్ట్ 14ను పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవంగా పాటిస్తుంది. దేశ విభజనకు గాంధీ, నెహ్రూలను నిందిస్తూ, భారతదేశాన్ని ముక్కలు కాకుండా సర్దార్ పటేల్, ఆరెస్సెస్‌లు రక్షించారని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు అందుతున్నాయి. చారిత్రాత్మకంగా ఆరెస్సెస్ స్వాతంత్య్ర పోరాటంలో ఎటువంటి పాత్రను పోషించలేదు. ఆరెస్సెస్ వారిని దేశభక్తులుగా, గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ వారిని కుట్రదారులుగా చిత్రించి, చరిత్రను తిరగరాసే ప్రయత్నంలో భాగంగానే 'విభజన గాయాల జ్ఞాపక దినాన్ని' ప్రకటించారా?
ఒకసారి మనం దేశ విభజనను గుర్తు చేసుకుంటే, ముస్లింలీగ్ కంటే ముందే హిందూ మహాసభకు చెందిన వీ.డీ.సావర్కర్ హిందువులకు, ముస్లింలకు ప్రత్యేక దేశాలు అవసరమని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. రెండవ తరగతి పౌరులుగా ముస్లింలకు ఒక భారతదేశంను కోరింది ఆరెస్సెస్. ప్రజలను రెచ్చగొట్టి, మతోన్మాద హింసాయుత మంటలను రగిలించింది ఆరెస్సెస్, ముస్లిం మత సంస్థలు.
నిజంగానే విభజన జరిగిన సమయంలో ప్రజలకు అయిన గాయాలను, ఆ భయానక వాతావరణాన్ని భారతీయులు ఎన్నటికీ మర్చి పోకూడదు. మన భూమిని విభజించే ద్వేషాన్ని అనుమతించకపోవడం మాత్రమే కాక, ముఖ్యంగా మన హృదయాలను విభజనకు గురిచేసే ఆ ద్వేష భావాలను కూడా అనుమతించకూడదు. అదే విధంగా ద్వేషపూరిత మత రాజకీయాలు ప్రజలకు ఏమి చేస్తాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి, గుర్తుంచుకోవాలి.
('ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్,
- హర్ష మందిర్
సెల్:9848412451