Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, అందులోనూ 75ఏండ్ల ఉత్సవాలు ప్రారంభించే సందర్భంగా ప్రధాని ఇచ్చే ఏ ఉపన్యాసమైనా స్వాతంత్య్రోద్యమ విలువను పునరుద్ఘాటించాలి. కానీ ప్రధాని మోడీ ఆ పని చేయలేదు. దాదాపు గంటన్నర సాగిన ఆయన ప్రసంగంలో స్వాతంత్య్రోద్యమం, స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగం మాటవరుస ప్రస్తావనకు మాత్రమే నోచుకున్నాయి. బెంగాల్‌కు చెందిన మాతంగిని హజ్రాను అసోంకు చెందిన వ్యక్తిగా అభివర్ణించారంటే స్వాంత్య్రోద్యమ అమరుల గురించి ప్రధాని ఎంత అశ్రద్ధతో ఉన్నారో అర్థమవుతుంది.
కనిపించని పదాలు
ఈ ఉపన్యాసంలో ప్రధాని ప్రస్తావించకుండా వదిలేసిన విషయాలు దేశానికి స్పష్టంగానే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. ఉపన్యాసం ప్రారంభంలో ''దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారందరికీ'' అన్న ప్రస్తావన తప్ప మిగిలిన ఉపన్యాసంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం, లౌకికతత్వం, ఐక్యత, బహుళత్వం, న్యాయం, కార్మికులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి పదాలు మచ్చుకు కూడా కనిపించలేదు. స్నేహం, శాంతి, సత్సంబంధాలు వంటి పదాలు కూడా బూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. స్వాతంత్య్రోద్యమ విలువలకు ప్రధాని ఎంతగా దూరమయ్యారో తెలియచేసే సందర్భంగా ఇది మిగిలిపోతుంది.
మతం ప్రాతిపదికన జరిగిన
విభజనను గుర్తు చేసుకోవాలా?
దేశ విభజనలో చనిపోయిన వారి స్మృతికి గుర్తుగా ఆగస్టు 14 దేశ విభజన విధ్వంస దినంగా స్మరించుకుంటామని ప్రధాని ప్రకటించారు. హిందు, ముస్లిం మతాల పేర్లు చెప్పుకుని రాజకీయం చేస్తున్న వారితో జతకట్టి విభజన కాండకు దేశాన్ని బలిచేసిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇది గుర్తుకు తెస్తున్నది. లక్షలమంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న దేశవిభజన విధ్వంసంతో సమానమైనదనటంలో సందేహం లేదు. ఏ దేశం జీవితంలోనైనా అటువంటి విషాదాలను గుర్తు పెట్టుకోవటం అంటే మతోన్మాద రాజకీయాల హింసాయగ్నానికి దేశం ఆహుతి కాకుండా చూడాలన్న నిబద్ధతను వ్యక్తం చేయటమే. కానీ మోడీ ప్రసంగం దీనికి భిన్నంగా ఉంది. ప్రసంగం ముగిసీ ముగియగానే బీజేపీ అధ్యక్షుడు మొదలు అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం మచ్చిక చేసుకునే రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయన్న వాదన తలకెత్తుకున్నారు. దేశ విభజన గాయాల విషయంలో పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరుతెన్నులు ఆ గాయాలను మరింత పెంచి పోషించేవిగా ఉన్నాయే తప్ప ఉపశమనం కలిగించేవిగా లేవు. ఇటువంటి మతోన్మాదమే దేశ విభజనకు దారితీసింది.
బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చిన విభజించు పాలించు రాజకీయాలను ఆరంభం నుంచీ ఆరెస్సెస్ సమర్థిస్తూ వచ్చింది. బీజేపీకి పితృసమానుడుగా ఉన్న వి డి సావర్కార్ హిందూత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. హిందు మత విశ్వాసాలు పాటించే వారితో హిందూరాష్ట్ర ఏర్పడాలని వాదించాడు. ముస్లింలు ఈ దేశ పౌరులు కాదనీ, రెండు మతాలకు చెందిన వారికీ వేర్వేరు దేశాలు ఉండాలని ప్రతిపాదించాడు. 1937లో అహ్మదాబాద్‌లో జరిగిన హిందూ మహాసభ సమావేశాల్లో అధ్యక్షోపన్యాసం చేస్తూ ''భారతదేశం అఖండ దేశం కాదు. హిందువులు, ముస్లింలు వేర్వేరుగా ఉండాల్సిన దేశం'' అని ప్రకటించాడు. ఇదే సిద్ధాంతాన్ని 1940లో లాహౌర్‌లో జరిగిన సమావేశంలో జిన్నా కూడా ప్రతిపాదించి ద్విజాతి సిద్ధాంతంగా విస్తృతపర్చాడు.
జిన్నా, సావర్కార్ వాదనల్లోని సారూప్యతను డాక్టర్ అంబేద్కర్ గుర్తించాడు. 1940లోనే అంబేద్కర్ ''ఈ దేశం అఖండ దేశమా లేక రెండు వేర్వేరు దేశాలా అన్న విషయంపై ఒకరితో ఒకరు తలపడాల్సిన జిన్నా సావర్కార్లు ఈ విషయంలో పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈ దేశం రెండు ముక్కలు కావాలన్న విషయాన్ని ఇద్దరూ వక్కాణిస్తున్నారు. వక్కాణించటమే కాదు. బలంగా కాంక్షిస్తున్నారు. ముస్లింలకు, హిందువులకు వేర్వేరు దేశాలు కావాలని పోరాడుతున్నారు'' అన్నాడు. నేటి ఓ పాలక పార్టీ నాటి విభజన గాయాలను రేకెత్తించటం అంటే నాటి విభజనలో అత్యాచారాలకు గురై, ధన మాన ప్రాణాలు కోల్పోయిన లక్షాలాదిమందినీ, వారి బాధనూ అవమానించటమే.
కాశ్మీర్‌కు జరిగిన అన్యాయం
దేశం మతం ఆధారంగా చీలిపోయినప్పుడు అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన కాశ్మీర్ పాకిస్థాన్‌లో కలవటానికి బదులుగా భారతదేశంలో విలీనం కావాలని కోరుకోవటం లౌకికతత్వానికి పతాక సన్నివేశం. అటువంటి జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హౌదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తన మందబలంతో రద్దు చేసిన ప్రధాని జమ్ము కాశ్మీర్లో నియోజకవర్గాలను పునర్విభజించటానికి నిర్ణయించినట్లు ప్రకటించటం జమ్ము కాశ్మీర్ ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లుగానే ఉంది. ముస్లిమేతరులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల సంఖ్య పెంచటమే ఈ పునర్విభజనలో కీలకమైన అంశం.
ప్రజల బాధల పట్ల ఏహ్యభావం
ప్రధాని తన ఉపన్యాసంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, క్షుద్భాధల గురించి ఏమి చెప్పాడు? దేశం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా ప్రధాని వాస్తవ విరుద్ధంగా మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలకు బాధలకు ఏమాత్రం విచారం వ్యక్తం చేయకుండా అదేదో ఘన విజయాలు సాధించినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఉదాహరణకు ప్రజల మధ్య అగాధాలతో పోటీ పడుతున్న అంతరాలు కోవిడ్ ఉప్పెన కాలంలో మరింత పేట్రేగిన సమయంలో ''ఏ విద్యార్ధి, ఏ తరగతి సమాజ పురోగమనంలో వెనకబడకుండా చూసుకుంటున్నాం'' అని చెప్పుకున్నారు. ఆక్స్ ఫామ్ విడుదల చేసిన అసమానతల వైరస్ నివేదిక ప్రకారం ఈ కోవిడ్ కాలంలో సంపన్నులు మార్చి 2020 తర్వాత కాలంలో 12,97,822 కోట్లు కూడేసుకున్నారు. ఈ సొమ్ముతో దేశంలోని ప్రతి ఒక్కరికీ రూ.94045 నగదు జమ చేయవచ్చు.
అందరితోటి, అందరికోసం అన్న నినాదాన్ని అమలు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకున్నప్పుడు ప్రజల పట్ల ఆయనకు ఎంత వెటకారం ఉందో తేటతెల్లమవుతోంది. కోట్లాదిమంది అనుభవిస్తున్న కష్టాలు కనిపించనంతగా ప్రధాని కళ్లు మూసుకుపోయాయి. అదేదో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ప్రజలు తగినంత తీవ్రతతో ప్రయత్నం చేయలేదని ఆరోపించే సాహసం చేశారు. ప్రజల ప్రయత్నం ఏమిటో తెలియటానికి ప్రధాని ఒక్కరోజన్నా ఉపాధి హామీ పని జరిగే చోట ఎండలో నిలబడ్డాడా? కనీస వేతనాలు పొందాలంటే ఓ మహిళా కూలీ రోజుకు రెండు టన్నుల మట్టి ఎత్తి పోయాలి. దేశంలో 43శాతం వ్యవసాయ కార్మికులు రెక్కల కష్టం మీదనే బతుకుతున్నారు. కార్మికుడు అన్నపదమే ప్రధాని నిఘంటువు నుంచి మాయమైంది. కానీ ఆయన సంపద సృష్టికర్తల గురించి మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. కానీ ఈ సంపద సృష్టికర్తల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడని ప్రధానిని మొదటిసారి చూస్తున్నాము.
ప్రధాని నూతన ఆవిష్కరణ
చిన్న రైతుల గురించి ప్రధాని ఆందోళన వ్యక్తం చేయటాన్ని వ్యవసాయక చట్టాల రద్దు కోసం సాగుతున్న చారిత్రక పోరాటానికి నాయకత్వం వహిస్తున్న రైతునేతలు గమనించకపోరు. దేశంలో 80శాతం మంది రైతాంగానికి ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్నదని ప్రధానికి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ''చిన్న రైతులే మన లక్ష్యం. మన మంత్రం'' అని ప్రకటించారు. చిన్న రైతులే దేశానికి వెన్నెముక అని ప్రకటించేశారు. నిజానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలతో దారుణంగా దెబ్బతింటోంది ఈ చిన్న రైతులే. రైతాంగం డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం ఈ చిన్న రైతాంగానికే అండగా నిలుస్తుంది. కష్టకాలంలో పొలం అమ్ముకోకుండా ఆదుకుంటుంది. కానీ ప్రధాని ఈ విషయాలేవీ పట్టించుకోకుండా చిన్న రైతుల గురించి మాట్లాడటం అంటే ఉద్యమిస్తున్న రైతాంగ ఐక్యతను దెబ్బతీసే పన్నాగమే.
మహిళలపై నిశ్శబ్ద హింస
మహిళల గురించి కొన్ని ప్రస్తావనలున్నాయి. అయితే మహిళలపై చెలరేగుతున్న హింసోన్మాదం గురించి పల్లెత్తు మాట కూడా లేదు. హథ్రస్ లాంటి చోట్ల స్వయంగా బీజేపీ నేతలే మహిళలపై అమానుషానికి, అత్యాచారాలకు పాల్పడటమే కాక చివరకు ఎదురు తిరిగిన వారిని హత్య చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఢిల్లీలో అత్యాచారానికి గురైన బాలిక కుటుం బాన్ని కేసులు వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేసిన సంఘటనను దేశం ఇంకా మర్చిపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్న హింసను ఖండించాల్సిన ప్రధాని నోరెత్తలేదు.
పథకాల పేర్లు తారుమారు చేయటం
దేశానికి ఆయన 2019 నుంచి 2021 వరకూ చేసిన వాగ్దానాలన్నిటికీ కొత్త పేర్లు పెట్టడం తప్ప మరేమీ చేసిందిలేదు. కోటి కోట్లతో ప్రధానమంత్రి గతి శక్తి ప్రణాళిక అని ప్రకటించారడు. గత మూడు సంవత్సరాలుగా ఇదే పథకానికి ఇదే మొత్తం వాగ్దానం చేస్తూ వచ్చాడు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక పాఠశాలల్లో ఇకమీదట విద్యార్థినులను కూడా చేర్చుకోనున్నామని, ఇదో శుభవార్త అని ప్రకటించాడు. నిజానికి 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలు జరపాలని 2019లోనే ఖరారైంది.
ఈ త్రివర్ణపతాకం సాక్షిగా జాతీయ హైడ్రోజన్ ప్రణాళిక ప్రారంభించనున్నట్లు వాగ్దానం చేస్తున్నానని చెప్పాడు. అయితే ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ఉపన్యాసంలో ప్రతిపాదించిన పథకమే తప్ప ఇది కొత్త పథకం కాదు. మద్యాహ్న భోజన పథకంలో మరిన్ని పోషకాలు జోడించాలన్న నిర్ణయం కూడా దివంగత రాం విలాస్ పాశ్వాన్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా 2019లో చేసిన వాగ్దానమే తప్ప కొత్తది కాదు.
పెగాసస్ - జోక్యానికి విముఖత
పరిపాలన గురించి ప్రధాని చేసిన ప్రకటన నిస్సిగ్గు ప్రకటన. ''పౌరుల దైనందిన జీవితాల్లో వేలుపెట్టరాదని నిర్ణయించుకున్న ప్రభుత్వం మాది. దేశ సమగ్రాభివృద్ధి కోసం రోజువారీ ప్రజాజీవితంతో ముడిపడి ఉన్న అన్ని అంశాల నుంచి ప్రభుత్వం వైదొలగటమే పరిష్కారం'' అని చెప్పుకున్నాడు. మరి పెగాసస్ నిఘా ఏమిటి ప్రధాని గారూ? ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతిపక్షనేతలు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఎన్నికల సంఘం సభ్యులు వంటి 160మంది దైనందిన జీవితాలపై పహరా కాస్తున్న విషయాన్ని మాత్రం దాటేశాడు. పెగాసస్ పహరాపై దర్యాప్తు జరిపించాలని వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అఖిల పక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఏ ప్రభుత్వ విభాగమైనా ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందా అన్న చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సాహసించలేదు. కానీ ఎర్రకోట సాక్షిగా ప్రజా జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోవటం లేదంటూ చెప్పుకోవటం ఆత్మవంచనకు పరాకాష్ట.
దేశ స్వాతంత్య్రం వజ్రోత్సవం జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, విలువలు, లక్ష్యాలు - ఐక్యత, బహుళత్వం, లౌకికతత్వం, సామాజిక ఆర్థిక న్యాయం వంటి విలువలతో వీసమెత్తు సంబంధం కూడా లేని పార్టీ, వ్యక్తులు అధికారంలో ఉండటం దేశానికి పట్టిన దుర్గతి. ఆగస్టు 15న ప్రధాని ప్రసంగం ఈ చేదు వాస్తవాన్నే ప్రతిబింబిస్తోంది.
అనువాదం: కొండూరి వీరయ్య,
- బృందా కరత్
సెల్:8971794037