Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోష్.. హుషారు.. దూకుడు.. దుమ్ములేపుడు... గత రెండు రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ పదాలు నిజంగానే దుమ్మురేపుతున్నాయి. ఒకపక్క పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మరోవైపు మంత్రి మల్లారెడ్డి... పొలిటికల్ స్క్రీన్‌ను షేక్ చేస్తూ తమదైన శైలిలో రెచ్చిపోయారు. వీరిలో ఒకాయన సమరసింహారెడ్డి శైలిలో కళ్లెర్రజేసి, సవాల్ విసిరితే... మరొకరు ఇంద్రసేనారెడ్డి టైపులో మీసం మెలేసి, పడగొడతానంటూ తొడగొట్టి మరీ జవాబిచ్చారు. ఈ రసవత్తర ఘట్టాలు రసకందాయంలో పడుతున్న వేళ... టీఆర్ఎస్ రేసుగుర్రం మంత్రి మల్లారెడ్డి శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రేవంత్ తనను బాగా హింసిస్తున్నాడంటూ మీడియా ముందు ఆయన ఏడ్చినంత పనిచేశారు. 'మొదట్నుంచి ఆయనది ఇదే పద్ధతి, నన్ను బాగా వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు... బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, నేనేం జేయాలే, ఎవరికి జెప్పుకోవాలే... నా బాధ ఎవరు తీర్చాలే...' అంటూ తన గోసనంతా ఏకరువు పెట్టారు. మీడియా సమావేశం అయిపోయాక విలేకర్లతో కలిసి కాఫీ తాగిన అమాత్యుడు... ఆ సమయంలో మాత్రం తనదైన శైలిలో సెటైర్లు విసురుతూ, లాజిక్కులు మాట్లాడుతూ... ప్రశ్నలకు దొరక్కుండా, జర్నలిస్టులు అడిగిన వ్యక్తిగత అంశాలకు విసుక్కోకుండా సూటిగా, సుతిమెత్తగా జవాబిస్తూ నవ్వుల పువ్వులు పూయించారు. 'నేను పాలమ్మిన, పూలమ్మిన, చిట్టీల వ్యాపారం చేసిన, కాలేజీలు పెట్టిన...చివరకు మంత్రి పదవి కొట్టేసిన...' అంటూ గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు తరహాలో డైలాగులు దంచికొట్టారు. తద్వారా సమాజంలో బతకటానికి కావాల్సిన సకల సూత్రాలనూ పూసగుచ్చినట్టు విడమరిచిచెప్పారు. ఆయన ఈ విధంగా మాట్లాడుతున్న క్రమంలోనే ఓ విలేకరి... 'సార్... మీరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా... రాష్ట్రంలోని లక్షలాది మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను ఒక్క సంతకంతో అమలు చేయొచ్చు కదా..? తద్వారా వారి జీవితాలను బాగు చేయొచ్చు కదా...?' అని అడిగితే ఠక్కున సీటు లోంచి లేచి, 'ఆ... ఒక్కటీ అడక్కు...' అనే తరహాలో గబుక్కున బయటికెళ్లిపోయారు. దటీజ్ మినిష్టర్ చామకూర మల్లారెడ్డి.
-బి.వి.యన్.పద్మరాజు