Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశీర్వాదం! మనదేశంలో ఈ పదం చాలా గొప్పదీ, విలువైనదీ, పవిత్రమైనదీ, గౌరవనీయమైనదీ, ప్రాముఖ్యత గలదీ... ఇంకా ఇలాంటివి ఎన్నో కలిగిన ఏకైక పదమని చెప్పక తప్పదు! ఇంకా ఆశీర్వాదం మన భారతీయ సంస్కృతిలో పురాతనమైన అంతర్భాగం! మన దేశంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరిచేత్తోనో ఆశీర్వాదం తీసుకోని మనిషి ఉండరు కాక ఉండరు! అయినా దీనికి ఈ మధ్య కాలంలో చాలా ప్రాధాన్యత వచ్చింది. ఆశీర్వాదానికి ఎందుకింత ప్రాధాన్యత వచ్చిందన్నది కోటి కోట్ల రూపాయల ప్రశ్న! దానికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం!
తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందాలని ప్రతి బిడ్డకూ ఎంతో తపన ఉంటుంది! తన ఎదుగుదలకు తల్లిదండ్రుల ఆశీర్వాదం తోడ్పడుతుందన్న నమ్మకం ఆ బిడ్డది! అదే నమ్మకం తల్లిదండ్రులకూ ఉంటుంది కాబట్టే, తమ బిడ్డలు కోరినా కోరక పోయినా ఆశీర్వదిస్తుంటారు.
అలాగే బంధుగణంలో కూడా ఆశీర్వాదాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చుట్టరికంలోనూ, వయస్సులో పెద్దవారు, తమకంటే చిన్నవారిని ఎంతో ప్రేమగా ఆశీర్వదిస్తుంటారు! చిన్నవారు అంతే ప్రేమగా ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు!
పెళ్ళిళ్ళ సమయంలో ఈ ఆశీర్వాదాలకు విపరీతమైన డిమాండు ఉంటుంది. మామూలు టైములో ఇల్లు కదలటానికి ఇష్టపడని వారుకూడా, పెళ్ళిళ్ళకు వచ్చి నాలుగు అక్షింతలు వేసి, మనసారా ఆశీర్వదిస్తుంటారు. పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో ఇచ్చే ఆశీర్వాదానికి పవరెక్కువ అని ఆశీర్వదించేవారి నమ్మకం కావచ్చు. పెళ్ళిళ్ళలో ఆశీర్వదించేవారి నమ్మకాల్లో పెద్దగా మార్పు రాలేదు కాని, వధూవరుల ఆలోచనల్లో మాత్రం పెద్ద మార్పు వచ్చింది. గతంలో అంటే ఒక తరం ముందు జరిగే పెళ్ళిళ్ళలో మమ్మల్ని ఆశీర్వదించండి అని వేడుకుంటూ వధూవరులు కొద్దిసేపైనా చేతులు జోడించేవారు. కాని ఇప్పటితరం కెమెరాల వైపు చూస్తున్నారు. అది వేరేసంగతి అనుకోండి!
ఇక మరోరకం ఆశీర్వాదాల కోసం కొందరు పడిగాపులు కాస్తారు. తమ బాసుల ఆశీర్వాదాల కోసం, ఆఫీసు పనితో పాటు, బాసు సొంత పనులు కూడా చేసి పెడుతుంటారు కొందరు చిరుద్యోగులు! పాపం వారినీ తప్పుపట్టలేం! ఎందుకంటే బాస్ ఆశీర్వాదం లేకుంటే బతుకు బస్టాండే! ఈ విషయం ఆర్టీసీ కార్మికులకు మరింత బాగా తెలుసు! ఆర్టీసీ బాసుల ఆశీర్వాదం లేని కార్మికులు బస్టాండ్లలో మూటలు మోస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాము!
ఇంకోరకం ఆశీర్వాదాలు మంచివో, చెడ్డవో తెలుసుకోలేక నానా అవస్థలు పడుతుంటారు కొందరు జనం! ఆ ఆశీర్వాదాలు చెడ్డవని తెలుసుకునే లోపు భారీనష్టం జరిగిపోతుంటుంది! ఈ భారీ నష్టంలో అస్తినష్టం, ధన నష్టంతో పాటు బయటకు చెప్పుకోలేని నష్టాలు కూడా ఉంటాయి! ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చే క్యాటగిరీలో బాబాలు ఉంటారని మనకు బాగా తెలుసు! ఎటొచ్చీ తమ సమస్యలు పరిష్కారిస్తారేమోనని, ఆశతో, నమ్మకంతో వచ్చి ఆశీర్వాదాల కోసం వెంపర్లాడి, బాబాల స్కీములకు బలైపోయే అమాయక భక్తుల గురించి బాధపడుతుంటారు మరికొందరు! ఏదేమైనా ఇలాంటి ఆశీర్వాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పక తప్పదు!
ఈ ఆశీర్వాదాల పరంపర చాలా పెద్దది! ఇందులో ఇటీవలి కాలంలో బాగా ప్రాముఖ్యత ఏర్పడింది రాజకీయ ఆశీర్వాదాలకేనన్నది అందరికీ తెలిసిన సత్యం! పాలకపక్షం అధినేత ఆశీర్వాదాన్ని ప్రతిపక్షంలోని నాయకుడు ఆశిస్తున్నాడంటే అది పార్టీ మారే సంకేతమని మీడియా ఘోషిస్తూనే ఉంటుంది! అలాగే ప్రతిపార్టీ అధినేత, తన పార్టీలోని వారితో తన ఆశీర్వాదం తీసుకొని వారెవరు? అని తెలుసుకుంటూనే ఉంటారు! రెగ్యులర్గా తన ఆశీర్వాదం తీసుకునే వారి తప్పులు ఒప్పులుగానూ, ఆశీర్వాదం తీసుకొని వారి పొరబాట్లు ఘోర తప్పిదాలుగాను మారిపోతుంటాయని వేరేగా చెప్పే అవసరం లేదు. అయితే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీనేత చేయి ఆడిస్తే దాన్నే ఆశీర్వాదమని గొప్పగా చెప్పుకున్నవారు, పార్టీ మారగానే అది భస్మాసుర హస్తమని మనను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు!
చిరుద్యోగులు తమ బాసుల ఆశీర్వాదం కోసం ఆరాటపడటాన్ని ఏదోలే అని సరిపెట్టుకోవచ్చును గానీ! దేశంలో కెల్లా అత్యున్నత చదువులు చదివీ, అత్యున్నత అధికారమైన కలెక్టర్ ఉద్యోగాలు చేసేవారు కూడా ఐదేండ్లు అధికారంలో ఉండే రాజకీయ బాసులకు పాదాభివందనం చేసి మరీ ఆశీర్వాదం తీసుకోవటం చూసి, ఈ ఆశీర్వాదాల పట్ల వెగటు పుట్టిందంటే అదేమీ అతిశయోక్తి కాదేమో!
ఎన్నికలు వస్తే చాలు! ఒక సంవత్సరం ముందు నుండీ ప్రజల ఆశీర్వాదం కోసం, రాజకీయ పార్టీలు నానా రకాల ఎక్సర్సైజులు చేస్తాయి! అవి ఎక్సర్సైజులు మాత్రమే అని తెలిసీ, తప్పని పరిస్థితిలో ఏదో ఒక పార్టీని ప్రజలు ఓట్లతో ఆశీర్వదిస్తారు. అంతే! అధికారంలోకి వచ్చిన తర్వాత నుండీ తాము ఆశీర్వదించిన పార్టీ ఆశీర్వాదం కోసం ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. కాని తమను ఆశీర్వదించిన ప్రజలను కాకుండా, కార్పొరేటు కంపెనీలను మనసారా ఆశీర్వదించటం పాలకవర్గ పార్టీలకు వెన్నతోపెట్టిన విద్య!
ఈ ఆశీర్వాదాలన్నీ ఒక ఎత్తు! తమ ఏడేండ్ల పాలనను ఆశీర్వదించమంటూ, దేశ ప్రజల మీదికి బీజేపీ దండెత్తటం మరొక ఎత్తు! జన ఆశీర్వాద యాత్ర అంటూ పువ్వుగుర్తుపార్టీ, దేశవ్యాపితంగా యాత్రలకు బయలుదేరటం చూసి జనం ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తాను! నన్ను దేశ ప్రధానిగా ఆశీర్వదించమంటూ వేడుకున్నావారే, ఉద్యోగాల కల్పతరువులైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తుంటే తమ ఆశీర్వాదం ఫలించటంలేదని నిరుద్యోగులు నిట్టూరుస్తున్నారు! దేశానికి నేను కాపలాదారుని అంటే నమ్మి రెండోసారి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించిన ప్రజలందరూ తమ నమ్మకం వమ్మైపోయిందని ఆక్రోశిస్తున్నారు! ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ లేక ఆరిపోయిన బతుకుదీపాలు ఎన్నో తెలియని స్థితిలో దేశం కొట్టుమిట్టాడుతుంటే, ఆక్సిజన్ లేక ఎవరూ చనిపోలేదని పార్లమెంటులో ప్రకటించిన పార్టీని తాము రెండోసారి ఎందుకు ఆశీర్వదించామని కోట్లాదిమంది మధనపడుతున్నారు! పెట్రోలు ధర పెరగాలంటే కాంగ్రెసు పార్టీని, పెట్రోలు ధర తగ్గాలంటే బీజేపీని ఆశీర్వదించమంటూ గావుకేకలు పెట్టిన బూటకపు మాటలు నమ్మి బీజేపీని ఆశీర్వదిస్తే పెట్రోలు ధరలు అడ్డగోలుగా పెంచి, అదికూడా దేశాభివృద్ధికేనని అడ్డగోలు వాదనలు చూపి, పెట్రోలు పోయకుండానే కడుపులు భగ్గున మండుతున్న మధ్యతరగతి జీవుల వెతలు చూస్తూ కూడా బీజేపీ నాయకులు జన ఆశీర్వాదయాత్ర తలపెట్టడం తెంపరితనం కాదూ?
పాలకులు పెడుతున్న కష్టాలే తట్టుకోలేకపోతుంటే కరోనా దాడి కూడా తోడై సగటు భారతీయుడి బతుకు భారమైపోయింది. తన దీనస్థితినుండి బయటపడేందుకు ఏ ఆశీర్వాదం తోడ్పడుతుందా అని ఎదురుచూస్తున్న ఈ దేశ ప్రజలనే ఆశీర్వదించమంటూ బయలుదేరిన బీజేపీ నాయకులను ఏమనాలి? ఎందుకు ఆశీర్వదించాలి.
- ఉషా కిరణ్