Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణస్వీకారం చేశాక న్యాయవ్యవస్థలో అనేక నియమాకాలు, నిర్దేశాలు, వ్యాఖ్యానాలు విస్త్రత ప్రచారానికి నోచుకుంటున్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో కొత్త సారథి రావడమే గాక ఆయన తెలుగువారు కావడం వల్ల తెలుగుమీడియాలో మరింత అదనంగా ప్రచారం లభిస్తున్నది. అదేసమయంలో జాతీయమీడియాలోనూ న్యాయవర్గాలలోనూ కూడా వీటిపై చర్చ సాగుతున్నది. గత ఏడాది కాలంలో సుప్రీం కోర్టు తీరు, దాని ప్రధాన న్యాయమూర్తులుగా చేసిన వారు విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యం కూడా ఇందుకు కొంత కారణమైంది. బహుశా ఈచర్యలన్నిటిలోకి కీలకమైంది సుప్రీంకోర్టులో రెండేండ్లుగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల స్థానాలను భర్తీచేయడం. ఏకంగా తొమ్మిది మంది న్యాయమూర్తులను సుప్రీం కోర్టు కోలీజియం సిఫార్సుచేయడం, వారందరికీ ఎలాంటి ప్రశ్నలు ప్రతిబంధకాలు లేకుండా మోడీ ప్రభుత్వం ఆమోదం తెల్పడం, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా నియమాక ఉత్తర్వులపై సంతకాలు చేయడం జరిగిపోయాయి. 2019 నుంచి ఒక్క జడ్జి పేరు కూడా కొలీజియం సిపార్సు చేయలేదనేది ఒక వాస్తవం. ఇప్పుడు అనేక హైకోర్టుల్లోనూ జడ్జిలసంఖ్యను పెంచి మరీ కొలీజియం నియామకాలు చేయించింది. 2019 నుంచి ఆగిపోయిన నియామాకాలు ఇంత వేగంగా ఇంత పరిపూర్ణంగా ఎలా జరిగాయన్న ప్రశ్న చాలా న్యాయమైంది. ఎప్పుడూ పారదర్శకత గురించి నొక్కి చెప్పేదే న్యాయవ్యవస్థ గనక వాటికి జవాబు చెప్పుకోవలసిందే.
కొలీజియం సిఫార్సుల విశేషాలు
సుప్రీం కోర్టు కొలీజియంలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. అయిదుగురు సీనియర్ న్యాయమూర్తులలో ఇద్దరు ఉమ్మడి ఏపీ హైకోర్టునుంచి, ముగ్గురు మహారాష్ట్ర హైకోర్టు నుంచి వచ్చినవారు. ఈ సిఫార్సుల ప్రక్రియకు కొద్ది రోజుల ముందు జస్టిన్ ఆర్ఎప్ నారీమన్ పదవీవిరమణ చేశారు. తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన మర్యాదవచనాలు, వ్యక్తిగత అంశాలకుతోడు దేశానికి నాణ్యమైన న్యాయం అందిస్తున్నామా అనేది ఆలోచించుకోవాలని చెప్పారు. ఎవరికీ తాము తప్పక న్యాయమూర్తిని అవుతాననే ధీమా ఉండేపరిస్థితి ఉండరాదని కూడా ఆయన సూచించారు. ఈ రెండేండ్లలోనూ కొలీజియం సిఫార్సులు చేయలేకపోవడానికి కారణం నారీమన్ అని, తను రిటైరయ్యారు గనక ఇక వేగంగా నియామకాలు జరుగుతాయని ఊహాగానాలు నడిచాయి. నిజంగా జరిగింది అలాగే ఉంది. హైకోర్టులలో చూస్తే త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అఖిల్ ఖురేషి ప్రస్తుతం దేశంలో బాగా సీనియర్. అంతకుముందున్న కొలీజియం ఆయనను మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తే కేంద్రం ఒప్పుకోలేదు. చిన్నరాష్ట్రమైన త్రిపురకు పంపించింది. గుజరాత్ హైకోర్టులో ఉండగా అప్పటి హోంశాఖ సహాయ మంత్రి (అసలు శాఖ మోడీదే) అమిత్‌షాను సోరాబుద్దిన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో జైలుకు పంపించినందుకుగాను బీజేపీకి ఆయనంటే సరిపడదని అందరికీ తెలుసు. సుప్రీం కోర్టుకు సిఫార్సు చేయవలసివస్తే ముందు ఆయన పేరుండాలి. హైకోర్టుకే ఒప్పుకోని ప్రభుత్వం అందుకు అంగీకరించడం ఎలాగూ జరగదు. ఇదే కేసులో వాదించిన గోపాలసుబ్రహ్మణ్యంను సిజెఐ లోధా హయాంలో సుప్రీంకోర్టుకు సిఫార్సు చేస్తే నానా దుష్ప్రచారాలు నడిపించి చివరకు తనకు తానుగా వద్దని లేఖ రాసేట్టు చేశారు. కొలీజియంలో సభ్యుడైన నారీమన్ అర్హుడైన కురేషి పేరులేకుండా వేరేపేర్లను పంపించే ప్రసక్తి లేదని భీష్మించారని అంటారు. గత సిజెఐ ఎస్ఎబాబ్డే ఆ విధంగా మళ్లీ ఆపేరు పంపించడానికి సిద్దపడలేక మొత్తం సిఫార్సులనే ఆపేశారు. తన హయాంలో ఒక జడ్జిని కూడా కొత్తగా నియమించలేకపోయిన సిజెఐగా ఆయన పేరు నిలిచిపోయింది. మాజీ సిజెఐలకు సంబంధించి మరిన్ని పరిణామాలు జరిగాయి. సుప్రీం న్యాయమూర్తిగా కరుడుగట్టిన యథాతథవాదానికి పేరు పొందడమే గాక ప్రధాని నరేంద్రమోడీని అతిగా పొగిడి విమర్శలపాలైన జస్టిస్ అరుణ్మిశ్రాను ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. అయోధ్య కేసులో తీర్పు చెప్పిన మాజీ సిజెఐ రంజన్గోగోరుని పదవీ విరమణ తర్వాత కొద్దికాలానికే రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు. అంతకుముందు సిజెఐగా చేసిన సదాశివంను కేరళ గవర్నర్‌గా పంపారు. ప్రస్తుతం బార్‌నుంచి న్యాయమూర్తిగా నియమితులవుతున్న మరో తెలుగువ్యక్తి పిఎస్ నరసింహ కూడా ఆ కేసులో రామ్లల్లాతరపున, అంటే సంఘపరివార్ పక్షాన వాదించిన వ్యక్తి. కృష్ణాజిల్లా గణపవరంకు చెందిన వారి తండ్రి సీనియర్ న్యాయవాది కోదండరామయ్య కూడా మనుస్మృతి వంటి సంస్కృత కావ్యాలను ముద్రించి సనాతన ధర్మప్రచారానికి అంకితమైన వ్యక్తి. ఈ నియామకాలపై వ్యాఖ్యలు రాకుండా ఉండాలని భావించడంలో ఔచిత్యంలేదు. వాస్తవానికి ఇప్పుడు సుప్రీంకోర్టులో సిజెఐతో కలిపి ముగ్గురు తెలుగువారు, (లావు నాగేశ్వరరావు, పిఎస్నరసింహ) తెలుగు రాష్ట్రాల హైకోర్టులలో పనిచేసిన ముగ్గురు న్యాయమూర్తులు (జస్టిస్ హిమకోహ్లి, సిటి రవీంద్రన్, జెకె మహేశ్వరి) ఏపీకి రాబోయి ఆగిన మరో న్యాయమూర్తి (జస్టిస్ విక్రమ్‌నాథ్) ఉండబోవడం విశేషమే. మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీల ప్రాతినిధ్యం బాగాపెరిగి ప్రాంతీయ సమతుల్యత కొరవడిందనే విమర్శలు కూడా వచ్చాయి. చాలాకాలంగా ప్రాతినిధ్యంలేని కొన్ని రాష్ట్రాలు ఇప్పుడూ విస్మరణకు గురైనాయనేది ఆరోపణ. ముగ్గురు మహిళా జడ్జిలు రావడం మాత్రం చరిత్రలో తొలిసారి. వారిలో జస్టిస్ బివి నాగరత్న 2027లో సిజెఐ అయ్యే అవకాశం ఉంటుంది.
రాజీలు, రాజకీయాలు
జస్టిస్ ఖురేషి పేరుపై పట్టుదలగా ఉన్న నారీమన్ పదవీ విరమణ అయ్యేవరకు నిరీక్షించి తర్వాత సిఫార్సులు చేయడంలో సిజెఐ రమణ వాస్తవికతకు పెద్దపీట వేశారని కొందరు ప్రశంసిస్తుండగా కేంద్రం కోసం సీనియారిటీ ప్రతిభ కూడా ఉన్న ఒక అర్హుడిని పక్కన పెట్టడం న్యాయమా అన్న విమర్శ కూడా ఉంది. హిందూపత్రిక శనివారం దీనిపై సంపాదకీయం రాస్తూ కేవలం ప్రభుత్వాన్ని(కార్యనిర్వాహక వ్యవస్థను) ఒప్పించడం కోసం అర్హులైన వారిని తోసిరాజని రాజీ పడినట్టే కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. వ్యక్తిగా ఒకరికి అవకాశం కల్పించకపోవడం ఒకటైతే నియామకాలలో ఈ విధమైన రాజీలు సరైనవా అని కూడా ప్రశ్నించింది. అసలు కొలీజియం పద్ధతి రాజ్యాంగంలో లేదు. అత్యున్నత న్యాయవ్యవస్థపై కేంద్రం పెత్తనం ఒత్తిడి పెరిగిపోతున్నాయంటూ దానికి అవకాశం లేకుండా మేమే సిఫార్సులు చేస్తామని సుప్రీం కోర్టు తనుగా దీన్ని సృష్టించింది. ఆ తర్వాత జ్యుడిషియల్ కమిషన్ బిల్లు వంటివి, ఇతర మార్పులు చేర్పుల సూచనలు వచ్చినా మోడీ ప్రభుత్వం మొత్తం సమస్యను పక్కన పెట్టింది. నియామకాలు కూడా ప్రతిష్టంభనలో పడిపోయాయి. న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని గౌరవించాలని న్యాయశాఖా మంత్రి రవిశంకర్ వంటివారు మాట్లాడటం, దానికి అప్పటి ప్రధాన న్యాయమూర్తులు తలవూపడం జరిగిపోయాయి. కేసుల విషయంలో ఇది మరింతగా వ్యక్తమైంది. అత్యంత కీలకమైన కాశ్మీర్ 370, సీఏఏ, వ్యవసాయ శాసనాలు వంటివాటిని సాగదీసిన సుప్రీంకోర్టు ఆరుదశాబ్దాలుగా వాయిదా పడుతున్న అయోధ్య కేసును, శబరిమలై వివాదాన్ని, ట్రిపుల్ తలాక్ వంటివాటిని అత్యవసరమైనవిగా పరిగణించింది. భీమాకొరగావ్ నిందితులు మూడేండ్లుగా జైలులో మగ్గిపోతున్నా స్టాన్‌స్వామి వంటివారు చనిపోయినా కదలికలేదు గాని ఆర్నాబ్ గోస్వామి వంటివారికి ఆఘమేఘాలమీద న్యాయం జరిగింది. రాజకీయ అవినీతి గురించి నీతులు వినిపిస్తున్నా రాఫెల్ కుంభకోణం తప్పించుకోగలిగింది. ఎన్నికల బాండ్లనూ పట్టించుకోలేదు. వలసకార్మికుల ఘోష వినడానికి ఎంతోకాలం పట్టింది. ప్రభుత్వ సంస్థల అమ్మకం, మానిటైజేషన్, కార్మికుల హక్కులకోత ఇవేవీ అత్యతవసర సమస్యలుగా కనిపించవు. ఇప్పుడు పెగాసస్ వంటివి సుప్రీం ముందే ఉన్నాయి. న్యాయవ్యవస్థను, ప్రత్యేకించి హైకోర్టులను, సుప్రీం కోర్టులను సర్వరోగ నివారకాలుగా పరిగణించేవారు ఈవాస్తవాలు కూడా చూడవలసి ఉంటుంది. చట్టం వ్యవస్థపై ఆధారపడి ఉంటుందిగాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి ఉండదని కారల్‌మార్క్స్ చెప్పిన ప్రసిద్ధవాక్యాన్ని సదా గుర్తుపెట్టుకోవాల్సిందే.
సంస్కరణ ప్రక్షాళన
న్యాయవ్యవస్థను న్యాయమూర్తులను గౌరవించడం, రక్షించుకోవడం వేరు, కోర్టులంటేనే వేదవాక్యంగా పరిగణించడం వేరు. సిజెఐ ఎన్వి రమణ ప్రజాస్వామిక హక్కులు పారదర్శకత వంటి విషయాల్లో కొన్ని మంచి మాటలు చెప్పారు. జార్ఖండ్‌లో ధన్‌బాద్ జిల్లా న్యాయమూర్తి ఆటో గుద్దుకుని అనుమానాస్పదంగా మరణించిన ఘటన తర్వాత అసలు వారి రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక దళాన్ని సృష్టించాలా అన్న వాజ్యం కూడా విచారిస్తున్నారు. న్యాయమూర్తుల భద్రత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని, మరో ప్రత్యేక దళం అక్కరలేదని కేంద్రం చెప్పింది. ఏపీలో న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగులు పెట్టిన వారిమీద సిబిఐ విచారణ సాగుతున్నది. కొన్ని కేసులు కూడా నమోదైనాయి. వాటిని లోతుగా విచారించి తగు చర్యలు తీసుకోగల అధికారం హైకోర్టుకే ఉంది. ఆ పని త్వరగా పూర్తికావాలి కూడా. అయితే అదే సమయంలో ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య లౌకిక విలువలు, పౌర స్వేచ్ఛలు పరిరక్షించ బడాలంటే రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు సుప్రీంకోర్టుల తీరులోనూ మార్పు రావలసివుంది. ఉదాహరణకు చట్టసభలలో చర్చలు సరిగ్గా చేయకుండానే శాసనాలు రూపొందిస్తున్నారని సిజెఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ తరుణంలో కేంద్ర పాలకులు ఉభయ సభలలో కనీస చర్చకు అవకాశం లేకుండా అనేక శాసనాలు ఏకపక్షంగా ఆమోదించుకుని సభలను కూడా ముందే వాయిదా వేశారు. పెగాసస్‌పై సభలో చెప్పిన దానికి సుప్రీం కోర్టు ముందు చెప్పిన దానికి హస్తిమశకాంతరం తేడా ఉంది. ప్రజాస్వామ్యం లౌకికతత్వం సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసే కేంద్రం చర్యలపై అనేక వాజ్యాలు కోర్టుముందే ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ జాప్యం గురించి కూడా సిజెఐ ఆవేదన వ్యక్తం చేయడం బాగానే ఉంది. అందులో అసహాయత కూడా ధ్వనిస్తున్నది. సిబిఐకి సిబ్బంది తగినంత లేదు. ఉన్నవారు కూడా పాక్షికంగా ఉపయోగించబడుతున్నారు. విచారణ వేగంగా జరపడానికి న్యాయమూర్తులూ లేరు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే న్యాయవ్యవస్థలో పైనుంచి కిందివరకూ సమూలమైన సంస్కరణలు కావాలి. పారదర్శక వ్యవస్థలు రూపొందాల్సి ఉంటుంది. మోడీ సర్కారుకు ఉన్న వ్యవస్థలను ఒత్తిడిపెట్టి పబ్బం గడుపుకోవడం తప్ప ప్రజాస్వామికంగా పారదర్శకంగా మార్చే ఆలోచనే లేదు. ఏడేండ్ల మోడీపాలన, ముప్పై ఏండ్ల సరళీకరణ తర్వాత న్యాయవ్యవస్థ నుంచి దేశం మరింత సత్వర సమగ్ర న్యాయం కోరుతున్నది. న్యాయవ్యవస్థపై ప్రశంసలు సూక్తులతో పాటు దిగజారిన దాని ప్రతిష్టను స్వతంత్ర రాజ్యాంగ ప్రతిపత్తిని కాపాడుకోవడం ముఖ్యం. సిజెఐ రమణ హయాంలో కొలీజియం దాదాపు న్యాయపరమైన నియామకాలు పూర్తి చేసేస్తున్నది గనక ఈ ప్రశ్నలు మరింత ఎక్కువగా ముందుకొచ్చి నిల్చుంటున్నాయి.
- తెలకపల్లి రవి