Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పౌర సమాజంలో పత్రికలది విశిష్టమైన స్థానం. అందుకే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం. అందులో ప్రజాశక్తి వారసత్వంతో పురుడు పోసుకున్న 'నవతెలంగాణ' దిన పత్రికది ఇంకా ప్రత్యేకం. అనుదినం.. జనస్వరంతో ముందుకెెళ్తూ అనతికాలంలోనే అశేష ప్రజాధారణను చురగొన్నది. ఉద్యమగడ్డ తెలంగాణపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును లిఖించుకున్నది. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అణగారిన బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషిచేస్తున్నది. బీద, బడుగు, బలహీన వర్గాల ఉద్యమాల హక్కుల గొంతుకగా రణధ్వనిస్తున్నది. దళితులపై కొనసాగుతున్న వివక్షను కూకటివేళ్లతో పెకిలించాలని నినదిస్తున్నది. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను నిశితంగా పరిశీలిస్తూ ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్నది. అందుకే తెలంగాణ బిడ్డల గుండెచప్పుడై మ్రోగుతోంది. ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న 'నవతెలంగాణ' ఏడో వసంతంలోకి సగర్వంగా అడుగుపెడుతోంది..
నేడు దేశంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం.. మతం పేరిట మారణహౌమం.. కులం పేరుతో రాజకీయం.. ఇవేవీ పట్టవు పెట్టుబడి మీడియాకు. ప్రకటనలు రావేమోననే భయంతో ప్రభుత్వాలకు వంత పాడుతున్న పరిస్థితి. పాలకులు కూడా నిజాలు రాయకుండా వారిని దారిలోకి తెచ్చుకునే ఆస్త్రం ఇది. కానీ 'నవతెలంగాణ' లాంటి పత్రికకు ప్రజా సహకారం వెలకట్టలేనిది. అందుకే అనుదినం.. జనస్వరంతో ముందుకు సాగుతున్నది. రోజురోజుకూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో కుల, మతాల అంతర్యుద్ధం పెరుగుతున్నది. పాలకులు మోపుతున్న భారాలతో పేద, మధ్యతరగతి ప్రజానీకం కుదేలువుతున్నది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు అకాశాన్నంటుతున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ కారణంగా ఆర్థిక రంగం మందగమనంలో పడింది. ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకూ క్షీణిస్తోంది. దీనిపై పాలకుల పర్యవేక్షణ కరువైంది. పెట్టుబడిదారులకు ఊతమిచ్చే చర్యల్లోనే ఇంకా మునిగి తేలుతున్నారు.. ఫలితంగా కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన కోడ్లతో కార్మికులకు భద్రత కరువైంది. పార్లమెంట్లో మందబలంతో ఆమోదింపబడిన నూతన సాగుచట్టాలతో రైతుల భవిష్యత్తు ప్రశార్థకంగా మారింది. కానీ ఇదంతా పెట్టుబడి 'మీడియా'కు పట్టదు. దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని నెలలుగా చేస్తున్న రైతు ఉద్యమాన్ని ప్రతి రోజూ పతాక శీర్షికన పెడుతున్నది 'నవతెలంగాణ' ఒక్కటే. రాష్ట్రంలో పోడు భూముల పోరాటంలో ఆదివాసీ గిరిజనులకు అండగా నిలుస్తున్నది. రైతు, కూలీ, నిరుద్యోగి, నిర్వా సితుడి ప్రాణాలకు నేడు విలువేలేకుండా పోయింది. సాధారణ మరణంలా పట్టించుకోని పరిస్థితి. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటే మీడియా ఏదో మూలన వేస్తున్నది. కానీ 'నవతెలంగాణ'లాంటి ప్రజా పత్రికలో దాని స్థానం పతాక శీర్షికన నిలబెడుతున్నది. నేటికీ ప్రాజెక్టుల పేరుతో ప్రజల భూములు కొల్లకొట్టే చర్యలను వ్యతిరేకించడంతో పాటు భూ సేకరణ చట్టం అమలుకు పాలకులపై ఒత్తిడి తెస్తున్నది. తెలంగాణ ప్రజల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమగ్ర అధ్యాయనం చేసి పత్రిక ద్వారా ప్రత్యామ్నాయ పరిష్కారాలను చూపిస్తున్నది.
కరోనా.. ఇదో భయంకర విపత్తు. ఎవరినోట విన్నా దీని గురించే. ఏడాది కాలంగా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎంతోమంది సామాన్యుల బతుకులను ఆగం చేసింది. ఫస్ట్‌వేవ్ భయాన్ని పరిచయం చేస్తే సెకండ్‌వేవ్ ఏకంగా మరణాలనే చూపెట్టింది. థర్డ్‌వేవ్ పట్ల వైద్యులకే స్పష్టత కరువైంది. పాలకులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతోనే దేశంలో కోవిడ్ విజృంభించింది. లక్షల మంది చనిపోయారు. కోట్ల మంది ఆర్థికంగా ఛిద్రమయ్యారు. ఈ మరణాలు వామపక్ష మీడియాకు తప్ప ఇతర మీడియాకు కేవలం అంకెల సంఖ్యలు మాత్రమే. అందుకే 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అంటారు రష్యన్ విప్లవకారుడు లెనిన్. ఆయన మాటలను విశదీకరించి చూస్తే తప్ప ఎవరి కోసం ఏ పత్రిక పనిచేస్తుందో, ఏ పత్రిక ఏ వర్గానికి కొమ్ము కాస్తుందో అర్థం కాదు. అవినీతి సుడిగుండంలో, అక్రమాల పునాదుల్లో అభ్యంతరకర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ప్రజల్ని నిలువునా చీల్చుతుంటే 'నవతెలంగాణ' లాంటి నిఖార్సయిన పత్రిక ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించే ప్రభుత్వాలను విమర్శిస్తుంది. ప్రత్యామ్నాయ్నా మార్గా లను అన్వేషిస్తుంది. ప్రజల్ని నిత్య చైతన్యం చేస్తూ అక్షర సమరం సాగిస్తూనే ఉంటుంది...
- ఎన్. అజయ్ కుమార్
సెల్: 9490099140