Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలన్నింటిని ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ఆన్లైన్ విద్య ఉండబోదనీ, కేవలం ఆఫ్‌లైన్‌లోనే ప్రత్యక్ష పద్ధతిలోనే తరగతులు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి వెళ్ళడించారు. అంగన్వాడీ కేంద్రాలు మొదలుకొని యూనివర్సిటీల వరకు అన్ని విద్యా సంస్థలను భౌతికంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఎంతోమంది మేథావులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాలలను భౌతికంగా ప్రారంభించాలని పలుమార్లు విన్నవించాక ఆలస్యంగానైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినది. పత్రికల్లో విద్యా సంవత్సర ప్రారంభం, సన్నాహక చర్యల పట్ల వరుస కథనాలు రావడం వల్ల విద్యాభిమానులు, సామాజిక స్పృహ కలిగిన విజ్ఞానవంతులు సంతోషిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా ఉపాధి కోల్పోయిన మధ్యాహ్న భోజన కార్మికుల వెతలు ఇక తీరబోతున్నాయనే ఆనందంతో వారి మొహాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి. 18 నెలలుగా వేతనాలు లేక దుర్భరంగా తమ బతుకులీడుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, విద్యా వాలంటీర్లు, వృత్తి విద్యా ఉపాధ్యాయులు తమను ఇకనైనా విధుల్లోకి తీసుకుంటారని ఆశగా ఎదురుచూస్తున్నారు. అర్థం వేతనాలు, అరకొర చెల్లంపులతో తమ కష్టాల పట్ల కనీస మానవత్వం ప్రదర్శించని తమ యాజమాన్యాలను ఎదిరించే సాహసం చేయలేని ప్రయివేటు, కార్పొరేట్ సిబ్బంది భౌతిక తరగతుల బోధన కోసం అబగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు బడికి వస్తూ, విద్యార్థులు చూసే టీవీ పాఠాలను, ఆన్లైన్ విద్యను ఇంటింటికి తిరిగి పర్యవేక్షిస్తూ.. తాము పాఠశాలలకు వచ్చి, ప్రత్యక్ష బోధన చేయగలిగిన పరిస్థితులు ఉండి కూడా ఏమి చేయలేని తమ నిస్సహాయ స్థితిని నిందించుకుంటూ వేచిచూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల ప్రారంభం పట్ల ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్ చదువుల పేరిట తమను నిలువుదోపిడీ చేస్తున్న ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యక్ష తరగతుల ప్రారంభం కోసం పడిగాపులు కాస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులకు చదువునందించడం ద్వారా జ్ఞాన సమాజాన్ని నిర్మించే పాఠశాలలు ప్రారంభమవుతుండటం పట్ల ప్రతి ఒక్కరు సానుకూలతను వ్యక్తం చేస్తున్నారు.
అన్ని తరగతులను భౌతికంగా ప్రారంభించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు పరుస్తున్నప్పటికీ.. మరి పాఠశాలలు నిరాటంకంగా కొనసాగేనా? అనే అనుమానం అందరిలో ఏదో ఓ మూలన తొణికిసలాడుతోంది. కోవిడ్ 3వ వేవ్ ముంచుకు వస్తున్నదనే హెచ్చరికలు ఒక వైపు, దేశవ్యాప్తంగా రోజువారి కేసులు 50వేలకు అటూఇటుగా నిలకడగా కొనసాగుతుండడం మరోవైపు, ఇలాంటి తరుణంలో ప్రారంభమవుతున్న విద్యా సంవత్సరం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సజావుగా సాగేనా? నిర్విఘ్నంగా పూర్తయ్యేనా? అని విద్యా రంగ శ్రేయోభిలాషులు లోలోన కలవరపడుతున్నారు. గత సంవత్సరపు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, అలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని, ఏమరుపాటు లేకుండా, సక్రమంగా చదువులు కొనసాగేందుకు ప్రణాళికలు రచించి, అమలు చేయాలి. దాని కోసం రాష్ట్రంలోని పాఠశాలలు అన్నింటినీ ఒకే యూనిట్‌గా కాకుండా పాఠశాలల స్థితిగతులను బట్టి వివిధ కేటగిరీలుగా వర్గీకరించాలి. కోవిడ్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్న గ్రామీణ ప్రాంత పాఠశాలలను మొదటి కేటగిరీగా, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండే పట్టణ ప్రాంత పాఠశాలలను రెండవ కేటగిరీగా, కోవిడ్ వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువ కలిగిన నగర ప్రాంత కార్పొరేట్ పాఠశాలలు, హాస్టళ్లను మూడవ కేటగిరీగా భావించాలి. ఒక్కో కేటగిరీకి ఒక్కో రకమైన విధానాన్ని పాటించాలి. రాష్ట్రంలో 70-80శాతం పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతికపద్ధతిలో ప్రత్యక్ష బోధన చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ఆన్లైన్ విద్య అవకాశాలు అంతంతమాత్రంగా ఉండి, ఇన్నాళ్లు చదువుకు దూరమైన గ్రామీణ ప్రాంత పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు భౌతిక తరగతులు బహు ప్రయోజనం. ఇక విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండే పట్టణ ప్రాంత పాఠశాలల్లో సంఖ్య ఆధారంగా విద్యార్థులను సెక్షన్లుగా విభజించి ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ పద్ధతిలో తరగతులను నిర్వహించాలి. కోవిడ్ విస్తరణకు అవకాశాలున్న హాస్టళ్ళు, నగర ప్రాంత కార్పొరేట్ పాఠశాలల్లో రోజు విడిచి రోజు భౌతిక తరగతులు నిర్వహించాలి. ఒకరోజు ప్రత్యక్ష తరగతులు, మరునాడు ఆ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినేలా అవకాశం కల్పించాలి, వెసులుబాటు ఇవ్వాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ మాస్కులు, శానిటైజర్లు, శుభ్రత సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేయాలి. పారిశుద్ధ్య నిర్వహణకు స్కావెంజర్లను నియమించాలి. పిల్లల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా ఆరోగ్య సిబ్బంది ప్రతిరోజు పాఠశాలలను సందర్శించి.. విద్యార్థులకు, సిబ్బందికి అవసరమైన వైద్య సహకారాన్ని ఇవ్వాలి. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ద్వారా తగిన వైద్యం అందించాలి. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు గతంలో ఉన్న మధ్యాహ్న భోజన మెనూను సవరించాలి. విద్యార్థికి ప్రతిరోజు గుడ్డును అందించేలా మధ్యాహ్న భోజనానికి చెల్లిస్తున్న రేట్లను పెంచాలి. పాఠశాలల్లో అక్కడక్కడ ఒకటి, రెండు చోట్ల కోవిడ్ కేసులు నమోదైనా రాష్ట్రమంతటా పాఠశాలలను మూసేసే ధోరణి కాకుండా.. కేసులు బయటపడ్డ పాఠశాలలను మాత్రమే తాత్కాలికంగా మూసివేసి, మిగతా పాఠశాలలను యధావిధిగా కొనసాగించాలి. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ పర్యవేక్షణ గరిపేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికార్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునే అధికారాలను దఖలుపరచాలి.
సెప్టెంబర్ 1 నుంచి అన్ని పాఠశాలలు ప్రారంభించాలనే ప్రభుత్వం నిర్ణయం పరిణతితో, ముందుచూపుతో ఆలోచించి తీసుకున్న సరైన నిర్ణయంగా ముందుకే సాగాలి తప్ప, మూన్నాళ్ళ ముచ్చట అవ్వకూడదు. కేవలం ప్రయివేటు పాఠశాలల ఫీజుల వసూళ్ల కోసం ఏకకాలంలో పాఠశాలలన్నిటినీ తెరిచి, ఫీజులు వసూలయ్యాక బడుల్ని తిరిగి మూసేసే ఎత్తుగడగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందేశం అబద్ధపు ప్రచారంగా, అవాస్తవమని నిరూపించబడాలి. బడులు తెరుస్తున్నది విద్యార్థుల భవిష్యత్తుకోసమే, తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే, జ్ఞానవంతమైన తెలంగాణ సమాజాన్ని నిర్మించడం కోసమే తప్ప ఎవరి స్వప్రయోజనాలు నెరవేర్చడానికో తీసుకున్న తొందరపాటు నిర్ణయం కాదని తేటతెల్లమవ్వాలి. పార్లమెంటరీ స్థాయి సంఘం సమర్పించిన రిపోర్టులోని అంశాలను దృష్టిలో ఉంచుకొని, డబ్ల్యూహెచ్ఓ సూచనలకు అనుగుణంగా పిల్లల మానసిక స్థితిని సరిదిద్ది విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసే సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ప్రస్ఫుటమవ్వాలి. ప్రయివేటు పాఠశాలలు నెలవారీగా ఫీజులు వసూలు చేయాలే తప్ప తల్లిదండ్రులను పీడిస్తూ సంవత్సరం ఫీజులు ఒకేసారి గంపగుత్తగా అడ్వాన్స్ రూపంలో వసూలు చేయరాదన్న ప్రభుత్వ ఉత్తర్వులు పకడ్బందీగా అమలయ్యేలా చర్యలకు పూనుకోవాలి. ప్రభుత్వం తీసుకుంటున్న విద్యాసంవత్సర ఆరంభ చర్యల వల్ల బడులు సాగాలింకా... నిరాటంకంగా...
- వి. అశోక్
సెల్:9493001171