Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బూర్జువా జాతీయవాదం మొదట 17వ శతాబ్దంలో యూరప్‌లో పుట్టింది. వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా మూడవ ప్రపంచ దేశాలలో జరిగిన పోరాటాల సందర్భంగా అక్కడ తలెత్తిన జాతీయవాదం స్వభావరీత్యానే యూరప్‌లో పుట్టిన జాతీయవాదానికి భిన్నమైనదిగా ఉంటుంది. అయితే, కొంతమంది పశ్చిమ దేశాల మేథావులలో ఏ తరహా జాతీయవాదమైనా ఒకే స్వభావం కలిగినట్టుగా పరిగణించే ధోరణి ఉంది. యూరపియన్ బూర్జువా జాతీయవాదాన్ని, వలసదోపిడీకి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయవాదాన్ని వీరు ఒకే గాటన కట్టి, దానిని అభివృద్ధి నిరోధకమైనదిగా భావిస్తారు. కాని, ఈ రెండు తరహాల జాతీయవాదాల నడుమన చాలా కీలకమైన తేడాలు ఎన్నో ఉన్నాయి.
వాటిలో కనీసం మూడు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మొదటిది: యూరపియన్ జాతీయవాదం మొదటినుంచీ సామ్రాజ్యవాద స్వభావం తోటి ఉంది. రెండవది: అది ఎప్పుడూ భిన్నత్వాన్ని ఇముడ్చుకునే లక్షణం ఉన్నటువంటిది కాదు. తమ దేశంలో ఏదో ఒక సమూహాన్ని ''వీళ్ళు మనవాళ్ళు కాదు'' అన్నట్టు చూపి వారిని శత్రువులుగా పరిగణించేది. మూడవది: అది ''జాతి'' (లేదా దేశం) అనేదానిని ఒక అవతారమూర్తి మాదిరిగా చూపించి దానిని ప్రజల కన్నా ప్రాధాన్యమైనదిగా పరిగణిస్తుంది. ఆ 'జాతి' లేదా 'దేశం' కోసం ప్రజలు అన్ని రకాల త్యాగాలనూ చేయవలసిందే తప్ప ఆ 'జాతి' ప్రజలకోసం చేసేదేమీ ఉండదు.
అదే వలసవాద దోపిడీకి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయవాదం చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. అది ఎన్నడూ సామ్రాజ్య విస్తరణ కోసం ప్రయత్నించలేదు. భిన్న జాతులను, సమూహాలను ఇముడ్చుకుని ఐక్యపరిచే ప్రయత్నమే చేసింది. ఒక దేశంగా విముక్తి సాధించడం ద్వారానే ప్రజల జీవన పరిస్థితులు మెరుగు పడతాయని భావించింది. అందుకోసమే దేశం విముక్తి సాధించాలని ప్రయత్నించింది. వలస విముక్తి పోరాటం బహుళ వర్గాలు కలిసి నిర్వహించిన పోరాటం. అందులో జాతీయ బూర్జువా వర్గం తోబాటు కార్మిక వర్గం, రైతాంగం కూడా భాగస్వాములయ్యారు. అందుచేత దీనిని యూరపియన్ జాతీయ వాదంతో కలిపి ఒకే గాటన కట్టడానికి వీలు లేదు.
రైతులు సంఖ్యరీత్యా ఎక్కువగా ఉండడమే గాక ప్రాధాన్యత కలిగిన వర్గంగా ఉన్నారు. సామ్రాజ్యవాద అణచివేతను అందరికన్నా ఎక్కువగా భరించవలసివచ్చినది వీరే. అందుచేత కొంతమంది రచయితలు 'రైతు జాతీయవాదం' అని అన్నారు. కాని, 'జాతి'గా బతికి బట్ట కట్టాలంటే, సామ్రాజ్యవాద దాడిని తట్టుకుని తన ఉనికిని ఒక జాతిగా నిలుపుకోవాలంటే అది కేవలం రాజకీయ స్వాతంత్య్రాన్ని పొందితే సరిపోదు. ఆ రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించడానికి కూడా రైతాంగం పూర్తి మద్దత్తు అవసరం. అటవంటప్పుడు ఆ రైతాంగానికి హాని కలిగించే ఏ విధానాన్ని చేపట్టినా, అది జాతి నిర్మాణానికి (దేశ నిర్మాణానికి) హాని కలిగిస్తుంది. సామ్రాజ్యవాదం ముందు ఒక్కటిగా నిలబడలేక దేశం ముక్కలు, చెక్కలైపోడానికి దారి తీస్తుంది.
పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా అంటేనే దాని ముఖ్య లక్షణం రైతాంగ వ్యవసాయం మీద, చిన్న ఉత్పత్తిదారులమీద దాడి చేసి వారిని నాశనం చేయడం. వలసపాలననుండి కొత్తగా విముక్తి పొందిన దేశం సామ్రాజ్యవాదుల పట్టు నుంచి బైట పడాలంటే రైతాంగం యొక్క మద్దత్తు, సహకారం అవసరం గనుక అటువంటి దేశంలో పెట్టుబడిదారీ పంథాలో అభివృద్ధి చేపట్టడం సాధ్యం కాదు. ఈ వాస్తవాన్ని వలసవిముక్తి పోరాటాలు జరుగుతున్న కాలంలోనే గుర్తించారు. కమ్యూనిస్టులు కాకుండా ఇతరుల నాయకత్వంలో ఉద్యమాలు నడిచిన దేశాలలో కూడా అనుసరించిన అభివృద్ధి వ్యూహం పెట్టుబడిదారుల కార్యకలాపాలను అనుమతిస్తూనే వారిని అదుపు చేసేదిగా ఉంటూ వచ్చింది. దీనినే మనం ప్రభుత్వ నియంత్రణలో ఆర్ధిక వ్యవస్థను నిర్వహించడం అని అంటున్నాం. ఈ వ్యూహం అమలు లోనే వ్యవసాయంలో రైతాంగంలో దొంతరలు తలెత్తి ఆ రంగంనుండే పెట్టుబడిదారీ విధానం తలెత్తే ధోరణులు వచ్చాయి. భూస్వామ్య పెట్టుబడిదారులతో కొన్ని తరగతులు పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి దిశగా చేతులు కలిపాయి. భూస్వామ్య విధానాన్ని సమూలంగా నిర్మూలించే భూ సంస్కరణలు ఎన్నడూ దేశంలో జరగకపోవడం దీనికి దోహదపడింది. ఈ క్రమం జరుగుతున్నప్పటికీ, వ్యవసాయేతర రంగాలనుండి పెట్టుబడిదారీ శక్తులు వ్యవసాయ రంగంలోకి చొరబడేందుకు ప్రభుత్వాలు అనుమతించలేదు. నయా ఉదారవాద విధానాల అమలుతో ఈ రక్షణ పూర్తిగా ఎగిరిపోయింది. పెట్టుబడిదారీ విధానాన్ని ఎటువంటి అడ్డూ, ఆపూ లేకుండా అన్ని రంగాలలోకీ, అన్ని ప్రాంతాలలోకీ చొరబడేట్టు చూడడమే నయా ఉదారవాద విధానపు లక్ష్యం. అందుచేత ప్రభుత్వ నియంత్రణలో నడిచే విధానాలకు, (అవి పెట్టుబడిదారీ విధానాలే అయినా,) నయా ఉదారవాదం వ్యతిరేకం. అందునా, రైతాంగ వ్యవసాయంలోకి విదేశీ పెట్టుబడిదారులను అనుమతించని విధానం అంటే మరీ వ్యతిరేకం. అందుకే నయా ఉదారవాదం రైతాంగ వ్యవసాయాన్ని దెబ్బ తీస్తుంది.
భారత దేశంలో రైతాంగ వ్యవసాయం మీద అనేక మార్గాలలో దాడి జరుగుతోంది. మొదటిది, వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో తీవ్ర ఎగుడుదిగుడులు సంభవిస్తూండటం. ప్రభుత్వ నియంత్రణ ఉన్న కాలంలో వ్యవసాయోత్పత్తుల ధరలు గనుక పెద్ద ఎత్తున పతనమైతే ప్రభుత్వ ఏజన్సీలు మార్కెట్లో జోక్యం చేసుకుని అటు ఆహార ధాన్యాల విషయంలో గాని, ఇటు వ్యాపార పంటల విషయంలో గాని ధరల పతనాన్ని నిలవరించేవి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చేదాకా, ఆహార పంటల విషయంలో రైతులకు కల్పించిన రక్షణ కొనసాగుతూనే వచ్చింది.
రెండవ వైపు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు నయా ఉదారవాద కాలంలో బాగా పెరిగాయి. కాని, పంటలకిచ్చే రేట్లు మాత్రం పెరగలేదు. నిజానికి వ్యాపార పంటల రేట్లు ప్రపంచ మార్కెట్‌ను బట్టి ఉంటాయి. ప్రత్యేకించి రైతుల రుణాలమీద వడ్డీ భారం బాగా పెరిగింది. బ్యాంకులను ప్రయివేటీకరించడం దీనికి కారణం. ప్రయివేటు బ్యాంకులు కూడా వ్యవసాయ రంగానికి ఒక కనీస స్థాయిలో రుణాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నా అవి వాటిని ఏనాడూ అమలు జరపలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం వ్యవసాయ రంగ రుణాల విషయంలో ప్రభుత్వం అంతగా పట్టు పట్టకపోవడంతో చిన్న రైతులకు రుణాలను ఇవ్వడం బాగా తగ్గించాయి. దాంతో రైతులు అనివార్యంగా ప్రయివేటు వడ్డీ వ్యాపారుల బారిన పడి అత్యధిక వడ్డీలను చెల్లించుకోవలసివస్తోంది.
మూడవది: రైతుల పంటలకు దక్కే రేట్లను వారి వినిమయం కోసం కొనుక్కునే వస్తువుల రేట్లను, పోల్చి చూస్తే వ్యాపారంలోని అసమానతలు వెల్లడి అవుతాయి. రైతులు అమ్మేదగ్గర రేట్లు తక్కువగా ఉంటే, కొనే దగ్గర రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల సేవల నుండి ప్రభుత్వం వేగంగా తప్పుకుంటున్న కారణంగా రైతులు తమ బిడ్డల విద్యకు, కుటుంబ సభ్యుల వైద్యానికి వెచ్చించే మొత్తం విపరీతంగా పెరిగిపోతోంది. నయా ఉదారవాద విధానాలే దీనికి కారణం.
నాలుగవది: గతంలో ప్రభుత్వం రైతాంగ వ్యవసాయానికి, పెట్టుబడిదారులకు మధ్య అడ్డుగోడగా, పెట్టుబడిదారులు చొరబడడానికి వీలు లేకుండా నిలబడేది. ఇప్పుడు నయా ఉదారవాద కాలంలో ఆ అడ్డుగోడ లేదు. దాంతో పెట్టుబడిదారులు యధేచ్ఛగా వ్యవసాయ రంగంలోకి చొరబడగలుగుతున్నారు. బహుళజాతి విత్తన కంపెనీలు, పురుగు మందుల కంపెనీలు తమ ఏజంట్లద్వారా నేరుగా గ్రామాల్లోకి చొరబడగలిగాయి. ఆ ఏజంట్లే వడ్డీ వ్యాపారులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకసారి వీరి వలలో రైతు చిక్కుకుంటే ఇక బైట పడడం అసంభవం. కాంట్రాక్టు వ్యవసాయం తలెత్తుతోంది. రైతుల వ్యవసాయాన్ని వివిధ పద్ధతుల్లో ఛిన్నాభిన్నం చేస్తున్నారు.
ఇప్పటివరకూ చెప్పినవే గాక ఇంకా చాలా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా రైతులు భారీగా అప్పుల్లో కూరుకుపోయి నిష్ట దరిద్రులవుతున్నారు. 1995 నుంచీ నేటి వరకూ 4లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుత ప్రభుత్వం రైతాంగ వ్యవసాయం మీద దాడిని మరో మెట్టు పైకి తీసుకుపోయింది. ఆహార పంటలకు సైతం మద్దత్తు ధరను ఉపసంహరించుకుంది. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గత తొమ్మిది నెలలుగా ఢిల్లీలోవేలాది రైతుల ఆందోళన కొనసాగుతున్నది. ఈ విధమైన చర్యలు యాదృచ్ఛికంగా జరిగినవి కావు. మన దేశానికే ప్రత్యేకమూ కావు. వలస పాలనను అంతమొందించాక, కొన్ని సంవత్పరాలపాటు రైతాంగ వ్యవసాయంలోకి చొరబడకుండా పెట్టుబడిని అడ్డుకున్నాం. ఇప్పుడు ఆ అడ్డు తొలగిపోయింది. నయా ఉదారవాద కాలంలో అన్ని ఆటంకాలూ తొలగిపోవడంతో పెట్టుబడి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నది. ఏ మూడవ ప్రపంచదేశంలోనైనా, రైతులు దివాలా తీస్తున్నప్పుడు ఆ దేశాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యం.
బూర్జువా జాతీయవాదానికి యూరప్‌లో ఏ మాత్రమైనా మద్దతు లభించిందంటే అక్కడ ఏంతో కొంతమేరకు కార్మికవర్గం స్థితిగతుల్లో మెరుగుదల తీసుకురావడమే. ఆ కాస్తైనా చేయగలిగారంటే దానికి కారణం ఆ బూర్జువా జాతీయవాదానికి గల సామ్రాజ్యవాద స్వభావం వల్లనే. ఆ మద్దతు కూడా పైపైనే లభించిందనడానికి మొదటి ప్రపంచ యుద్ధమే తార్కాణం.
సామ్రాజ్యవాద విస్తరణ కారణంగా యూరప్‌లోని కార్మికులలో అధిక సంఖ్యలో వలసలుగా మారిన ఉష్ణ దేశాలకు తరలిపోయారు. దానివలన యూరప్‌లో కార్మికులకు కొరత ఏర్పడింది. అప్పుడు కార్మిక సంఘాలు శక్తివంతంగా జోక్యం చేసుకుని కార్మికుల జీతాలను పెంచుకోగలిగాయి. ఉష్ణ దేశాలను వలసలుగా మర్చి, అక్కడ అప్పటికి ఉన్న పరిశ్రమలను విధ్వంసం చేసి యూరప్ నుంచి నిరుద్యోగాన్ని ఆ దేశాలకు ఎగుమతి చేసింది సామ్రాజ్యవాదం. ఇంకోవైపు ఆ దేశాలనుంచి కొల్లగొట్టి తెచ్చిన సంపద నుండి కొంత భాగాన్ని యూరప్‌లోని కార్మికుల వేతనాలను పెంచడానికి వెచ్చించింది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల లాభాలెంతమాత్రమూ తగ్గిపోకుండా చూసుకుంది.
అందుచేత రైతాంగాన్ని నేరుగా పీల్చి పిప్పి చేసే నయా ఉదారవాద విధానాలను అసుసరిస్తూ, ఇంకోవైపు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయవాదాన్ని అమలు చేయడం మనదేశంలో అసాధ్యం. పోనీ, యూరప్‌లో మాదిరిగా బూర్జువా జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి ఇక్కడ దేశాన్ని నిర్మిద్దామా అంటే యూరప్ దేశాలు ఆనాడు వలసలను ఏర్పాటు చేసి కొల్లగొట్టినట్టు ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు.
బూర్జువా జాతీయవాదంతో హిందూత్వ వాదాన్ని జోడించి దేశాన్ని నిర్మించవచ్చునని భావిస్తే అది జుగుప్సాకరమైనదే కాకుండా పూర్తిగా కొరగాని ఆలోచనే అవుతుంది. నయా ఉదారవాదం రైతాంగ వ్యవసాయాన్ని పిండి పీల్చివేస్తుంటే దానికి హిందుత్వ తోడుగా నిలవడం వలన ఆ హిందుత్వ కు ఉండే ఏ పాటి ప్రజా బలమైనా కూడా అంతరిస్తుంది. ఈ లోపు అది ఏ విజయం సాధించినా, అది తాత్కాలికమే ఔతుంది. హిట్లర్ కూడా తన 'జాతీయ' వాదానికి మద్దత్తు కూడగట్టడానికి ఆ 1930 దశకపు ఆర్థిక సంక్షోభ కాలంలో ఉపాధి కల్పనకు పూనుకోవలసివచ్చిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
భారతదేశం వంటి దేశాల నిర్మాణం జరగాలంటే ఆ వ్యూహంలో రైతాంగ వ్యవసాయాన్ని పరిరక్షించడం ఒక అంతర్భాగంగా ఉండాల్సిందే. అక్కడినుండి ఆ రంగంలో రైతులు స్వచ్ఛందంగా సహకార వ్యవసాయానికి, సమిష్టి వ్యవసాయానికి ముందడుగు వేయాలి. అక్కడినుండి సోషలిజం వైపు అడుగు వేయడం తేలికగా జరుగుతుంది. అందుచేత సోషలిస్టు పంథాలో అభివృద్ధి ఉండాలనేది కేవలం కోరిక మాత్రమే కాదు, ఈ దేశం ఒక స్వతంత్ర దేశంగా మనుగడ కొనసాగించాలంటే ఆ సోషలిస్టు పంథాయే అత్యంత ఆవశ్యం కూడా. (స్వేచ్ఛానుసరణ)
- ప్రబాత్ పట్నాయక్