Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కొక్కసారి పాలకుల మాటలు వింటుంటే వారి విధానాల లక్ష్యాలూ అమలూ సమర్థనీయమైనవా కావా అనే గందరగోళం వ్యాపిస్తుంది. వారి ప్రకటిత లక్ష్యమైన ప్రజా ప్రయోజనాలు నిజమా, లేక ఆ ప్రకటిత లక్ష్యం వెనుక మరేవైనా ప్రయోజనాలున్నాయా అనుమానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ''అభివృద్ధి'' మంత్రజపం చేస్తూ విధానాలు ప్రకటిస్తున్నప్పుడు, ప్రభుత్వ ప్రచారానికి లోబడి కొందరు ప్రజలు కూడ అదే తమ ''అభివృద్ధి'' అనుకుంటున్నప్పుడు గందరగోళం మరింత విస్తరిస్తుంది. కాని అటువంటి విధానాలను పాలకుల మాటల పునాదిపైననో, ఒక ప్రజాసమూహం ఇష్టాయిష్టాల పునాదిపైననో కాక విశాల ప్రజా ప్రయోజనాల పునాదిపై చర్చించాలి. మొత్తంగా సామాజిక ప్రయోజనానికీ ఆ విధానానికీ వైరుధ్యం ఏమైనా ఉందా పరిశీలించాలి. ఒక విధానాన్ని అనివార్యమైనదిగా, అవసరమైనదిగా, హేతుబద్ధమైనదిగా, ఉత్తమమైనదిగా, స్థానిక ప్రజలకు ఉపయోగకరమైనదిగా ప్రభుత్వాలు ఊదర కొట్టవచ్చు గాని, దాన్ని మొత్తంగా సామాజిక నేపథ్యంలో పెట్టి అంచనా వేసి ఉచితానుచితాలు నిర్ణయించాలి. సామాజిక నేపథ్యం అన్నప్పుడు కేవలం వర్తమాన సమాజం మాత్రమే కాదు, పర్యావరణ స్పృహ వచ్చిన తర్వాత సమాజం అంటే ఎంతగా వర్తమానమో, అంతగా భవిష్యత్తు కూడ.
ఇప్పుడు జి.ఓ. 111 మీద సాగుతున్న వివాదం కొంతవరకు అటువంటి దీర్ఘకాలిక దృష్టితో చూడవలసినది. ఆ జి.ఓ.ను యథాతథంగా, సంపూర్ణంగా అమలు చేయాలని పర్యావరణవాదులు వేసిన వ్యాజ్యం ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు ముందున్నది. ఆ జి.ఓ. వల్ల తమ గ్రామాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని కనుక ఆ జి.ఓ.ను కొట్టివేయాలని ఆయా గ్రామాలకు చెందినవారు వేసిన పిటిషన్లు కూడ హైకోర్టు ముందున్నాయి. తాము అభివృద్ధి చేసిన ప్రాంతాలు ఆ జి.ఓ. పరిధిలోకి రావని కనుక తమకు మినహాయింపు ఇవ్వాలని మరికొందరు వేసిన పిటిషన్లను కూడ కోర్టు విచారిస్తున్నది. ప్రభుత్వం అంటే ఎప్పుడైనా ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం అని మాత్రమే కాదు, పాత ప్రభుత్వాల విధానాలను కూడ తమ విధానాలుగానే పరిగణించడం ఆధునిక ప్రజాస్వామ్య పాలనలో కీలకం. కాని ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వం జారీ చేసిన ఒక జి.ఓ. పట్ల గౌరవం, దాన్ని కచ్చితంగా అమలు చేయాలనే చిత్తిశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ్టి వివాదం వస్తున్నది. ప్రస్తుత ప్రభుత్వం ఆ జి.వో. నుంచి బైటపడడానికి అనేక సాకులు వెతుకుతున్నది. ఆ జి.ఓ. పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చినది గనుక దాన్ని నేరుగా రద్దు చేయలేక, ప్రజల కోరిక, ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి అనే సాకులు వెతుకుతున్నది. మొత్తం మీద ఆ జి.ఓ. 111 మీద ఒక రసవత్తర ప్రహసనం ప్రభుత్వంలోనూ, న్యాయస్థానాలలోనూ జరుగుతున్నది.
కాని ఈ వ్యవహారం కేవలం ప్రభుత్వానికో, ఆ గ్రామాలకో, రియల్ ఎస్టేట్ వ్యాపారులకో, న్యాయస్థానానికో మాత్రమే సంబంధించినది కాదు. ఇది ప్రజలందరి జీవనానికి అవసరమైన పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది. అది ఒక అభివృద్ధి నమూనాకు సంబంధించిన రాజకీయార్థిక వ్యవహారం. ఇది ఎన్ని మలుపులు తిరిగిందో, తిరుగుతున్నదో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అభివృద్ధి పేరిట సాగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా వ్యాపారానికీ, పర్యావరణ పరిరక్షణకూ పోటీ వస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణను వదిలేయదలచుకున్నదని స్పష్టమవుతుంది. చిత్రం ఏమిటంటే, పర్యావరణం ఏమైనా అయిపోనీ, మా రియల్ ఎస్టేట్ బొక్కసాలు నిండితే చాలు అని వ్యాపారులు మాత్రమే కాదు, కొందరు గ్రామస్తులు కూడ అనుకుంటున్నట్టున్నారు. ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నట్టున్నారు. పర్యావరణం, వర్తమాన, భావితరాల ఆరోగ్యం, జీవన భద్రత ఎవరికి పుట్టిన బిడ్డరా అన్నట్టు అనాథగా, విధ్వంసానికి గురి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషాదాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త చరిత్రలోకి వెళ్లాలి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సూవరేజి బోర్డ్ నియమించిన నిపుణుల కమిటీ 1994లో హైదరాబాద్‌కు తాగునీటి ప్రధాన వనరులైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల నీటి నాణ్యతను, జల ఆధారాలను కాపాడడానికి పది కిమీ వ్యాసార్థంలో ఎటువంటి భవన నిర్మాణ, పారిశ్రామిక, జలకాలుష్య కారక కార్యక్రమాలకు అనుమతించవద్దని చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం 1994 మార్చిలో జిఓ నెం.192 జారీ చేసింది. ఆ కమిటీయే 1995 డిసెంబర్లో సమర్పించిన మధ్యంతర నివేదికను కూడ పరిగణన లోకి తీసుకుని ప్రభుత్వం ఆ జి.ఓ. నెం.192కు సవరణలు చేస్తూ, 1996 మార్చి 8న జి.ఓ. నెం.111 విడుదల చేసింది.
హైదరాబాద్ ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఆ జిఓలోని సాంకేతిక అంశాల జోలికి ఇక్కడ వెళ్లనక్కరలేదు గాని అది హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నీటి వనరుల ప్రాంతంలో ఉన్న 84గ్రామాల పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆదేశాలు ఇచ్చింది. అంటే, ఆ గ్రామాల పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలు, భారీ హౌటళ్లు, నివాస కాలనీలు, కాలుష్యానికి దారి తీసే ఇతర సంస్థల నిర్మాణాలకు అనుమతించగూడదని ఆదేశించింది. అయితే నివాస ప్రాంతాలుగా నిర్దేశించిన ప్రాంతాలలో కాలనీలకు అనుమతించవచ్చునని, మొత్తంగా ఆ జలాశయాలలోకి ప్రవహించే నీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు మాత్రం తీసుకోవాలని సూచించింది.
ఆ జి.ఓ. ప్రకారం, శంషాబాద్ మండలంలో 47గ్రామాలు, మొయినాబాద్ మండలంలో 20గ్రామాలు, షాబాద్ మండలంలో రెండు గ్రామాలు, కొత్తూరు మండలంలో ఒక గ్రామం, రాజేంద్రనగర్ మండలంలో ఐదు గ్రామాలు, చేవెళ్ల మండలంలో ఆరు గ్రామాలు, శంకర్పల్లి మండలంలో మూడు గ్రామాలు ఈ ఆంక్షల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం నగరానికి హరిత రక్షణ వలయంగా ఉంటుందని, అందులో వ్యవసాయం, తోటల పెంపకం వంటి పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు తప్ప మరొకటి జరగగూడదని జి.ఓ. నిర్దేశించింది.
అయితే సరిగ్గా ఈ ప్రాంతాలలోనే ఆ తర్వాత వచ్చిన విమానాశ్రయం వల్లగాని, విస్తరిస్తున్న నగరం వల్ల గాని రియల్ ఎస్టేట్ వ్యాపారం విజృంభించింది. ఈ ఉత్తర్వులు ఎంతగా ఉల్లంఘనకు గురవుతున్నా ఆ తర్వాతి ప్రభుత్వాలు ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఉండవలసిన పూర్తి జలాశయ నీటి మట్టం పరిధి లోపలి ప్రాంతాల్లో కూడ అధికారుల అవినీతి వల్ల, ప్రభుత్వ పెద్దల ఆశ్రితుల, స్వయంగా ప్రభుత్వ పెద్దల భవనాలు అనేక నిర్మాణాలు వచ్చాయి. ఫాం హౌజులు, రిసార్టులు పుట్టుకువచ్చాయి. 2019 సెప్టెంబర్‌లో జరిగిన ఒక అంచనా ప్రకారం, జి.ఓ.111 ఉండగానే, ఈ ప్రాంతలో 13,000 అక్రమ నిర్మాణాలు వచ్చాయి.
అలా అక్రమంగా పెద్దల నిర్మాణాలు వస్తున్న కొద్దీ, నగరంలో, శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటున్న కొద్దీ, తమ భూములు కూడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకొని లాభపడవచ్చునని భావించే భూయజమానుల వర్గం ఒకటి తయారయింది. జి.ఓ.111 పూర్తిగా రద్దు చేయడమో, భారీ సవరణలు చేయడమో జరగాలనేది స్థానిక ప్రజల (కొందరు భూయజమానుల) డిమాండ్‌గా రూపు దాల్చింది. అందువల్ల కనీసం 2009 ఎన్నికల నాటి నుంచీ అది ఒక ఎన్నికల నినాదంగా, ఎన్నికల హామీగా కూడ మారింది.
పర్యావరణం, వర్తమాన, భవిష్యత్ తరాల ఆరోగ్య, జీవన భద్రత వంటి అంశాల కన్న రియల్ ఎస్టేట్ ప్రయోజనాల మీదనే ఎక్కువ దృష్టి ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ, ''ప్రజల కోరిక''ను చూపుతూ జిఓ.111 రద్దు చేయడానికి, తూట్లు పొడవడానికి ప్రయత్నాలు పెరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జి.ఓ.111 ఇంకా అవసరమా కాదా అని పరీక్షించడానికి ఒక నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి జలాలు అందుతున్నాయి గనుక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు అవసరం లేదనీ, వాటి నీటి నాణ్యత గురించి అంత శ్రద్ధ అవసరం లేదనీ టీఆర్ఎస్ నాయకులు కొత్త వాదనలు తీసుకువచ్చారు. పాలకులకు ఎంతగా దాసోహం అనే నిపుణులైనా కనీస పర్యావరణ స్పృహ ఉంటే ఆ జలాశయాల భద్రత గురించే సిఫారసులు చేస్తారనే అనుమానంతో నిపుణుల కమిటీ స్థానంలో నలుగురు ఐఎఎస్ అధికారుల కమిటీని నియమించి, 45రోజుల లోపు నివేదిక ఇమ్మని ఆదేశించారు. ఆ నలుగురు ఐఎఎస్ అధికారులు ఎంత సమర్థులైనా కావచ్చు గాని పర్యావరణ అంశాల మీద వారి నైపుణ్యం, అవగాహన ఏమిటో తెలియదు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఐఎఎస్ అధికారుల కమిటీ తన నివేదిక సమర్పించలేదు, సిఫారసులు చేయలేదు.
ఒకవైపు తామే నియమించిన ఐఎఎస్ అధికారుల కమిటీ ఏమీ నిర్థారించకుండానే, 2019 ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తాము మళ్లీ అధికారంలోకి వస్తే జిఓ.111ను రద్దు చేస్తామని చేవెళ్ల బహిరంగ సభలో బహిరంగంగానే ప్రకటించారు. ప్రభుత్వం ఆ దిశ గానే పావులు కదుపుతున్నది.
ఆ కమిటీ ఏమి చేస్తున్నదని రెండు వారాల కింద హైకోర్టులో న్యాయమూర్తులు ప్రశ్నించినప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాలలో అది 28సార్లు సమావేశమైందని మాత్రమే ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆ 28 సమావేశాల్లో ఏమి చేశారో మినిట్స్ తమకు సమర్పించమని కోర్టు ఆదేశించింది. ఆగస్ట్ 27న తుది విచారణ జరిగే సమయానికి కూడ అది తేలలేదంటే పాలన ఎంత అస్తవ్యస్తంగా, హాస్యాస్పదంగా జరుగుతున్నదో అర్థమవుతుంది. తాజా విచారణ రోజున కూడ ఉన్నతాధికార సంఘపు నివేదిక ఇమ్మని న్యాయమూర్తులు అనగా, మరికొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. గడువంటే మరొక దశాబ్దమా అని కోర్టు ప్రశ్నించిందని వార్తలు వచ్చాయి.
జిఓ 111 విషయంలో వంచనాశిల్పానికి నిదర్శనమైన ప్రభుత్వ వాదనలు దురుద్దేశపూరితమైనవి. అవి తాగునీటికి ఉపయోగపడుతున్నాయా లేదా అనే ప్రశ్న లేకుండా జనావాసాల మధ్య, జనావాసాల అంచులలో జలాశయాలు ఉండడం ఆరోగ్య, పర్యావరణ, ఆహ్లాద, జీవన భద్రతా అవసరం. ఆ రెండు జలాశయాలకూ నీరు అందించే వాగులూ వంకలూ కొండలూ బోళ్లూ అడవులూ అన్నీ జనావాసాలుగా, కాలుష్యకారక ప్రాంతాలుగా మారిపోతే, ఆ జలాశయాలు వట్టిపోతాయి. చివరికి ఆ జలాశయాలు కూడ రియల్ ఎస్టేట్‌గా మారిపోతాయి. ఏ నగరంలోనైనా నగరవాసులు ఊపిరి పీల్చుకునే స్థలం, నగరానికి ప్రాణవాయువును అందించే స్థలం - లంగ్ స్పేస్ - ఉండాలని అంటారు. ఆ రెండు జలాశయాలు వట్టిపోయేలా చేస్తే ఆ మేరకు హైదరాబాద్ లంగ్ స్పేస్ తగ్గిపోతుంది. కాని దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టే లేని, తక్షణం తమకూ, తమ ఆశ్రితులకూ డబ్బు మూటలు సంపాదించిపెట్టే అవకాశాలు, అందులోనూ మరింత ఎక్కువ డబ్బు సంపాదించే రియల్ ఎస్టేట్ అవకాశాలు దొరికితే చాలుననుకునే పాలకులు తప్పుడువాదనల సహాయంతో, ఆయా గ్రామాలలో భూయజమానుల అత్యాశలను ప్రేరేపించి మొత్తంగా హైదరాబాద్ జీవన భద్రతను పణంగా పెడుతున్నారు. జనమా లాభమా అంటే లాభమే కోరుకునే పాలకులు, ఆ విలువలనే విషంలా జనం మెదళ్లలో నింపుతున్న పాలకులు ఉన్న చోట జలాశయాలు వాటికవే వట్టిపోతాయి.
- ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028