Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదిహేడు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. తరగతి గదులు బాలలతో అలరారే చదువులమ్మ తోటగా విరబూసేందుకు సిద్దమవుతున్నాయి. పిల్లలను ప్రేమించే ఉపాధ్యాయులకు ఇదో ఉత్సాహ భరితమైన తరుణం. ఈ నవీన ఆహ్లాదకర వాతావరణంలోకి పిల్లలు ప్రవేశించడం ఎవరికైనా ఆనందకరమే.
కొంతమంది పిల్లలకు గతంలో పరీక్ష భయం (ఎగ్జామినేషన్ ఫోబియా) ఉండేది. ఇప్పుడు పాఠశాలకు తిరిగి రావడానికి కొందరు పిల్లలు భయపడవచ్చని (స్కూలు ఫోబియా) మానసిక నిపుణులు అంటున్నారు. ఇంతకు ముందు చదివింది మరచిపోయి, చదవటం, రాయటం అలవాటు తప్పి, కుటుంబ పేదరిక భారం మోయలేక, ఇక చదువు మనవల్ల కాదు అనే ఆత్మన్యూనత ఏదైనా కావచ్చు. పాఠశాలల్లోకి భయం భయంగా అడుగిడతారు. అలాంటప్పుడు పిల్లలకు కరోనా నుండి భౌతిక రక్షణే కాదు, తగు మానసిక రక్షణ, ఆత్మస్థైర్యం కల్పించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని భావిస్తున్నారు.
వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఉపాధ్యాయ కేంద్రంగానే విద్యాబోధన జరిగింది. పాఠ్యపుస్తకం తీసుకుని కుర్చీలో కూర్చుని, అవసరమైతే బ్లాక్బోర్డుని ఉపయోగించుకుని ఉపాధ్యాయుడు పాఠం చెప్పే పద్ధతి సాగింది. ఎక్కువ సందర్భాల్లో పాఠాన్ని పాఠంగానే చెప్పి, అదే పరీక్షలుగా ప్రశ్నలుగా వస్తే, తగు రీతిలో బట్టీపట్టించి సమాధానాలు రాయించి, ఆ కాలమానం ఆధారంగానే మార్కులు వేసి ఉత్తీర్ణం చేయడం, ర్యాంకులు ఇవ్వడం జరిగేది. కేజీ నుండి పీజీ వరకు ఇదే సాగింది. సాగుతున్నది కూడా. ఒక విధంగా కళ్ళకు గంతలు కట్టిన గుర్రంలాంటి పరిస్థితి ఇది. ఎటుపక్కకు చూడకూడదు. ఆలోచించకూడదు. అదే చదవాలి. బట్టీపట్టాలి రాయాలి. విశాలమైన సహజ బోధన సంకుచితంగా (నేరో) కుచించుకు పోయినట్టు అయింది. విద్యాబోధన అనుభవ సహితం కాకపోవడం వలన ఆ చదువు విద్యార్థికి జ్ఞానంగా పరిణమించడం లేదు. అందుకే నాణ్యత లోపిస్తుంది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. విద్యార్థి కేంద్రంగా విద్యాబోధన విస్తరిస్తున్నది. 'హ్యుటిగాజి' (సొంతంగా నేర్చుకోవడం) వంటి కొత్తపద్ధతులు ప్రవేశిస్తున్నాయి. అనుభవ సహిత విద్యకు (ప్రాక్టికల్ నాలడ్జ్) ప్రాధాన్యత ఇనుమడిస్తున్నది. అందుకు తగిన మార్గాలను అన్వేషించడం, వాతావరణం కల్పించడం నేడు ఉపాధ్యాయుల మౌలిక బాధ్యత అయింది.
మనదేశంలో భిన్న ఆర్థిక వర్గాలు, భిన్న సామాజిక తరగతుల కుటుంబాల నేపథ్యాల నుండి పిల్లలు బడికి వస్తారు. వారినందరిని సమదృష్టితో చూడాలి. అంతరాలకు అతీతంగా అందరూ సమానమనే వాతావరణాన్ని కల్పించాలి. భయాలను పొగొట్టాలి. ఎవరితోనైనా చక్కగా స్నేహం చేసే నిష్కల్మష మనో ధైర్యాన్ని పిల్లలకు ఆ లేత వయసులోనే అందివ్వాలి. పాఠమే పాటగా, చదువే ఓ ఆటగా బాల్యం బడిలో అలా హాయిగా గడిచిపోవాలి. అలాంటి వాతావరణంలోనే పిల్లలు ప్రేమ, కరుణ, స్పందన, ఆత్మీయత వంటి సహజమైన ప్రాకృతిక లక్షణాలను సొంతం చేసుకోగలరు. తమ ఎదుగుదలలో భాగంగానే మానవీయ, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించుకుంటారు. హృదయానికి మేథస్సుకు వారధి నిర్మించుకుంటారు. తాము నేరన్చుకున్న దానికి - కల్పనాశక్తిని జోడించడంలో సమతుల్యతను, ఔచిత్యాన్ని సాధిస్తారు. సృజన శీలత వికసిస్తుంది. ఆ విధమైన నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేలా ఉపాధ్యాయులు తమ మనస్సులను సన్నద్దం చేసుకోవాలి. ఇదంతా బాలల హక్కుల్లో భాగమే.
'విలువలతో కూడిన విద్యే నిజమైన విద్య' అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. మరి ఏవి సరైన విలువలు? స్థూలంగా చూసినప్పుడు ప్రకృతిని ప్రేమించడం, శ్రమను గౌరవించడం, మానవత్వం కలిగి ఉండటం విశ్వజనీన విలువలుగా వర్థిల్లుతున్నాయి. అవి విద్యాబోధనలో అంతర్లీనంగా పాదుకొల్పకపోతే జరుగుతున్న అనర్థాలేమిటో నేడు మనం కళ్ళారా చూస్తున్నాం. అనుభవిస్తున్నాం. పాలకులు గాని, విద్యాధికులుగాని అంతిమంగా తమ మేథస్సు, వ్యవహార దక్షత మానవాళిని ముందుకు నడిపిస్తుందా? లేక వెనక్కి నడిపిస్తుందా అనేది తరచి చూసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. అయితే వీటి మూలాలు విద్యాబోధనలోనే ఉన్న విషయాన్ని మరువరాదు.
పిల్లలు నాలుగు విధాలుగా ఎదుగుతారని పరిశీలకులు చెపుతున్నారు. తల్లిదండ్రులు - కుటుంబ వాతావరణం నుండి, పాఠశాల - ఉపాధ్యాయుల నుండి, సమ వయస్కులు - తన సహచరులైన స్నేహ బృందం (పేర్ గ్రూప్) నుండి, స్వతహాగా ఆలోచించుకుంటూ - శ్రమ పడుతూ.. ఇలా నాలుగు మార్గాల ద్వారా ఎదుగుతారు. ఈ నాలుగు మార్గాల్లో ఉపాధ్యాయుని పాత్ర దండలో ధారం వంటిదని వేరుగా చెప్పక్కర్లేదు.
పిల్లలు - తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు అనే త్రయంతోనే బడి అనే గుడి రూపొందుతుంది. ఇక్కడ బడిలో తల్లిదండ్రులు పాత్ర ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. వారి ఆదరణ ప్రోత్సాహము లేకుండా బడికి పిల్లలు రారు. ప్రభుత్వ బడి అయినా, ప్రయివేటు బడి అయినా ఇది తప్పనిసరి. అయితే తల్లిదండ్రు లకు పిల్లల చదువుగురించి, ఎదుగుదల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులదే. పిల్లలు నాణ్యమైన విద్య పొందడం విద్యాహక్కులో భాగమే కదా...
ఇకపోతే, పిల్లలకు మూడురకాల ఆరోగ్యం అందించినప్పుడే వారి అభివృద్ధికి, వికాసానికి బాటలు వేసిన వారమవుతామని యునిసెఫ్ (ఐక్యరాజ్యసమితి - అంతర్జాతీయ బాలల - అత్యవసర నిధి) వక్కాణిస్తుంది.
1. శారీరక ఆరోగ్యం.. పౌష్టికాహారం తీసుకోవడం, ఆటలు ఆడటం, వ్యాయామం చేయడం వలన, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వలన వస్తుంది. 2. మానసిక ఆరోగ్యం - ఆలోచించడం, చదవడం, రాయడం, వినడం, చూడటం, మాట్లాడటం, క్రమశిక్షణతో నడుచుకోవడం, మంచి-చెడు విచక్షణ కళా-సాహితీ పద్దతుల్లో అభ్యసన గావించడం, కారణాలు తెలుసుకునేలా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేయడం - వీటివలన మానసిక ఆరోగ్యం అలవడుతుంది. బోధన కళలో ఇదంతా నిమగమై ఉంటుంది. ఏదైతే స్పందించి అనుభూతి చెందుతామో, వాటిని అదే పద్ధతిలో గాఢంగా వ్యక్తం చేయగలుగుతాము. అప్పుడే బోధనలో జీవత్వం తొణికసలాడుతుంది. చదువు జ్ఞానంగా మారే రహస్యమిదే. 3. సామాజిక ఆరోగ్యం - అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, మర్యాదగ వ్యవహరించడం, హక్కులను గుర్తించడం, పాటించడం, సహకారం, సామరస్యం, సౌబ్రాతృత్వం మొదలైన జీవన నైపుణ్యాలను అలవాటు చేయాలి. ''మనపనే మన విద్య (అవర్ వర్క్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్)'' అన్నాడు గాంధీ. మెదడుకు, హృదయానికి, చేతులకు (పనికి) సమన్వయం ఉండాలి. ఆలోచన - ఆచరణ కలగలిసి నడవాలి. పాఠశాల చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాకృతిక, సామాజిక వ్యవస్థలు, పంట పొలాలు, పాడిపశువులు, అడవుల సంరక్షణ, తోటల పెంపకం, చేతివృత్తులు, కార్ఖానాలు, సేవా సంస్థలు (పోస్టాఫీస్, బ్యాంక్, రైల్వేస్టేషన్, పోలీస్ స్టేషన్ వగైరా) అన్నింటితో అనుభవ సహిత విద్య (ప్రాక్టికల్ నాలెడ్జి) విద్యార్థులకు ప్రాథమిక దశలోనే అందాలని కోరుకున్నాడు.
ఇవన్నీ పాఠ్యాంశాలలో జతచేసి విద్యార్థులకు అంతర్లీనంగా బోధించాలి. గతంలో ఇది జరిగింది కూడా... మరి ఇప్పుడు ఎందుకు జరగడం లేదంటే, ఈ ముప్ఫైఏండ్ల ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి మరింతగా స్వార్థపరుడయ్యాడు. అంతులేని ధనవ్యామోహంతో బాల్యంపై పంజా విసురుతున్నాడు. హద్దుల్లేని ప్రయివేటీకరణ ఫలితంగా విద్యా వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంటున్నది. ఒక విధంగా ఇది ఆత్మహత్యా సదృశ్యం.
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ (కళలు - మానవ శాస్త్రాలు) - సైన్స్ అండ్ టెక్నాలజీ (శాస్త్ర సాంకేతికత)ని ఎప్పుడైతే విడదీసి విద్యాబోధన చేపట్టామో అప్పటి నుంచే ఆధునిక మానవ జాతి పతనం ప్రారంభమైనదని టి.ఎస్. ఇలియట్ అన్నాడు. ఆ చేదు ఫలితాలను చవిచూస్తున్నాము.
ప్రయివేటీకరణలో కేవలం కెరీర్ ఓరియెంటెడ్‌గా సాగే చదువుల వలన పదిశాతం మంది విద్యార్థులు అధిక జీతాలతో లాభం పొందితే పొందవచ్చు. మిగిలిన తొంభైశాతం మంది అచేతనంగా, అసమర్థం గా నిర్వీర్యంగావడం ఏదేశానికీ క్షేమదాయకం కాదు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఉన్న నవభారతానికి.
పిల్లలకు చక్కటి భవిష్యత్ అందించే ఉపాధ్యాయలోకం విలువైన ప్రణాళికలు రచించి అమలు పరచడానికి ఇది సరైన తరుణం. ఆన్లైన్, ఆఫ్‌లైన్ బోధనా పద్ధతులు ఉపయోగించి పిల్లలను కారెక్టర్ ఓరియెంటెడ్ (గుణశీలురు)గా తీర్చిదిద్దే అవకాశం, సామర్థ్యం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. వెలుగుతున్న దీపమే పదిదీపాలను వెలిగించగలదు.
ప్రపంచం అంతా నిద్రించినా ముగ్గురు మాత్రం మేల్కొని ఉంటారని అరిస్టాటిల్ అంటాడు. కవి గాయకుడు, తత్వవేత్త, బోధకుడు. ఎందుకేంటే ప్రపంచ గతిని వారు భుజానికెత్తుకుంటారు. పతాకలూ మోస్తారు. విశ్వమానవ జాతిని సదా జాగృతం చేస్తుంటారు. ఆ అద్వితీయ బాధ్యతను కొలవడానికి మానవాళి వద్ద మాటలు లేవు.
- కె. శాంతారావు
సెల్: 9959746723