Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్ఘనిస్తాన్ తాలిబాన్ల వశమైంది.. కేవలం ప్రభుత్వ ఏర్పాటే మిగిలి ఉంది.. ఇప్పటి నుంచే అక్కడ మహిళలు, చిన్నారులు, మానవ హక్కుల ఉల్లంఘన ప్రారంభమైందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాలిబాన్లను పాకిస్థాన్ వెనకేసుకు వస్తోంది. తాలిబాన్లు, పాక్‌కు మధ్య బహిరంగంగా స్నేహం కనిపిస్తున్నా.. వారి మధ్య కలహాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. అనేక విషయాల్లో బేధాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశ రక్షణ, ప్రయోజనాలే లక్ష్యంగా ఇండియా పావులు కదపాల్సి ఉంటుంది. సరిహద్దులను దష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తే బాగుంటుంది. అప్ఘాన్లో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంతో అంశాల వారీగా మద్దతు ఇస్తూనే.. హక్కుల ఉల్లంఘన, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది.
మీడియా వార్తలు వింటుంటే మనకు పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య సత్సంబంధాలు ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా తాలిబాన్లు అప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత 'అప్ఘాన్లు బానిస సంకెళ్లను తెంచేశారు' అంటు ప్రకటన జారీ చేశారు. తాలిబాన్లకు పాకిస్థాన్ మిలటరీ, ఐఎస్ఐ ఎప్పటి నుంచో మద్దతు ఇవ్వడమే కాకుండా అనేక రకాలుగా సహకరిస్తూనే వచ్చాయి. కానీ మనం కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ బంధం ఎంత సంక్లిష్టమో అర్థమవుతుంది.
పాకిస్థాన్ ప్రజల మద్దతు అంతంతే..
2015 ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం తాలిబాన్లకు పాకిస్థాన్ ప్రజల మద్దతు అంతంత మాత్రమేనని తేలింది. కేవలం పది శాతం మంది మాత్రమే తాలిబాన్లకు కాస్తో, కూస్తో మద్దతుగా మాట్లాడినట్టు తేలింది. 72శాతం మందైతే తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దీనికి పాకిస్థాన్‌లో జరిగిన కొన్ని ఉగ్రదాడులు కారణంగా తెలుస్తోంది. అయినా పాకిస్థానీ ప్రభుత్వం, పాకిస్థాన్ మిలటరీ బహిరంగంగా తాలిబాన్లకు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే దీన్ని లోతుగా పరిశీలిస్తేనే అర్థం చేసుకోగలుగుతాం.
చరిత్రను పరిశీలిస్తే..
అప్ఘాన్-పాకిస్థాన్ సంబంధాలను తెలుసుకోవాలంటే ఒకసారి చరిత్రను పరిశీలించాల్సి ఉంటుంది. అప్ఘనిస్తాన్, బ్రిటిష్ ఇండియాను వేరు చేయడానికి 1893లో బ్రిటిష్ ప్రభుత్వం డ్యూరాండ్ లైన్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ బార్డర్ అప్ఘనిస్తాన్-పాకిస్థాన్‌ల మధ్య ఉంది. అయితే ఈ డ్యూరాండ్ లైన్‌ను పషఉ్తన్లు అత్యధికంగా నివసించే ప్రాంతం మధ్యలో నుంచి ఏర్పాటు చేయడం సమస్యగా మారింది. 1947లో ఇండియా, పాకిస్థాన్‌లకు స్వాతంత్య్రం వచ్చింది. అయితే ఆ సమయంలో పాకిస్థాన్‌లో భూభాగమైన పషఉ్తన్ లకు సొంతంగా పష్తునిస్తాన్ దేశంగా ఏర్పాటు కావడానికి స్వీయ నిర్ణయ హక్కు ఇవ్వాలని అప్పుడు అప్ఘనిస్తాన్ వాదించింది. అప్పుడు పాకిస్థాన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి నుంచే పాకిస్థాన్, అప్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్యూరాండ్ లైన్‌ను అంగీకరించేది లేదని అప్ఘనిస్తాన్ వాదించింది. 1947లో ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు సభ్యత్వమిచ్చినప్పుడు దీన్ని వ్యతిరేకించిన ఏకైక దేశం అప్ఘనిస్తానే.
పషఉ్తన్లు అధికంగా నివసించే ప్రాంతాలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ప్రాంతం అభివృద్ధిలో ఎంతో వెనకబడి ఉంది. పాకిస్థాన్‌లోని మిగితా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ పేదరికం సైతం అధికమే. ఆ ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాన్ని రేకెత్తించడానికి అప్ఘనిస్తాన్ ఆర్థికంగా సహకరించిందని పాకిస్థాన్ ప్రధాన ఆరోపణ.. పషఉ్తన్లు నివసించే ప్రాంతాన్ని అప్ఘనిస్తాన్ లో కలిపి గ్రేటర్ అప్ఘనిస్తాన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా 1970 నుంచి ప్రారంభమైంది. ఇస్లామిక్ భావాజాలం కంటే పషఉ్తన్ జాతీయవాదంపై అధిక ప్రభావితమైన తాలిబాన్లు 1990 ప్రాంతంలో అప్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా సరిహద్దుగా బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన డ్యూరాండ్ లైన్ ను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2001లో ట్విన్ టవర్స్ పై దాడుల అనంతరం ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా అప్ఘనిస్తాన్‌లో ప్రవేశించి తాలిబాన్లను అక్కడి నుంచి వెళ్లగొట్టింది. ఆ సమయంలో పాకిస్తాన్ లోని పషఉ్తన్ ప్రాంతంలోనే వారు తలదాచుకున్నారు.
స్నేహం ఎలా..
పాకిస్థాన్‌లో వేర్పాటువేదానాన్ని తాలిబాన్లు ప్రోత్సహిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపిస్తున్నా.. పాకిస్థాన్-తాలిబాన్ల మధ్య స్నేహం కొనసాగడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది భారతదేశ ప్రభావాన్ని, శక్తిని ఎదుర్కోవడం. 1979లో సోవియట్ యూనియన్ ప్రభావంలో అప్ఘనిస్తాన్ ఉన్న సమయంలో ఇండియా-సోవియట్ యూనియన్ మధ్య దగ్గరి సంబంధాలు ఉండేవి. దీంతో అప్ఘనిస్తాన్‌పై భారత్ పట్టు సాధిస్తుందేమోనని, ఇండియా ప్రభావం ఎక్కువగా ఉంటుందేమోననే అనుమానంతో పాకిస్థాన్ ఆ సమయంలో మొదట ముజాహిదీన్లకు, ఆ తర్వాత తాలిబాన్లకు సహకరించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా 2001 సమయంలో పౌర ప్రభుత్వం ఏర్పాటై హమీద్ కర్జారు, అష్రఫ్ ఘనీ లాంటి వారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అయితే వారు భారతదేశ అనుకూలురుగా ముద్రపడ్డారు. అప్ఘనిస్తాన్ ప్రభుత్వం భారతదేశానికి అనుకూలంగా ఉంటుండడంతో, వారికి వ్యతిరేకంగా ఉన్న తాలిబాన్లకు పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుఇస్తూ వచ్చింది. రెండో కారణం పషఉ్తన్ జాతీయ వాదం. అప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత ప్రపంచం తమను ఉగ్రవాదులుగా కాకుండా, అప్ఘాన్ చట్టబద్ధ ప్రభుత్వంగా గుర్తించేలా, పలు దేశాల నమ్మకాన్ని పొందేలా తాలిబాన్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ మద్దతు వారికి అత్యవసరం. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి తాలిబాన్లు ప్రస్తుతం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా తాలిబాన్ల మద్దతు తమకు ఉంటే తమ ప్రాంతంలోని పషఉ్తన్ జాతీయ వాదాన్ని అణచివేయవచ్చని పాకిస్థాన్ భావిస్తోంది.
- ఫిరోజ్ ఖాన్
సెల్: 9640466464