Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముప్పులేని ఆస్తుల మానిటైజేషన్ గురించి మభ్యపెట్టేలా మాట్లాడుతూ, భారత ప్రభుత్వ రంగాన్ని విక్రయించాలనే తమ ప్రణాళికను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరంతో ముగిసే నాలుగేండ్ల కాలంలో దాదాపు రూ.6 లక్షల కోట్ల మేరకు ముందస్తు లేదా దశలవారీ చెల్లింపులకు ప్రతిగా రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు, ఇంధన పైప్లైన్లు, టెలికం టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబ్లింగ్, గిడ్డంగులు, స్టేడియాలు వంటి ఆస్తులను బడా ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పగించాలన్నది ఆ ప్రణాళిక సారాంశం. ఆ మొత్తాన్ని కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదేమీ ప్రయివేటీకరణ కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాదిస్తున్నారు. కేవలం, మౌలిక సదుపాయాల రంగంలో ఇప్పటికే ఉన్న, పని చేస్తున్న ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయపు హక్కులను తాత్కాలికంగా ప్రయివేటు పెట్టుబడిదారులకు నిర్దిష్ట కాల వ్యవధికి బదలాయించడమేనని చెబుతున్నారు. యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని, కానీ వినియోగ హక్కులు, ఆదాయాలు మాత్రం నిర్దిష్ట ఫీజు చెల్లింపులపై పెట్టుబడిదారులకు వెళతాయని పేర్కొంటున్నారు. ఇక్కడ చాలా చాకచక్యంగా నాలుగు అంశాలను పక్కన పెట్టారు.
వాటిలో మొదటిది ప్రభుత్వ అధీనంలో నిరుపయోగంగా పడివున్న ఆస్తుల విలువను బయటకు తీయడమే (అన్‌లాక్ చేయడమే) ఈ ప్రణాళిక ముఖ్యోద్దేశం అయినందున ఒకప్పుడు డబ్బు ఆర్జించిన (మానిటైజ్ అయిన) ఈ ఆస్తులు తిరిగి ప్రభుత్వానికి చేరినప్పుడు వాటిని మరిన్ని దఫాలుగా మానిటైజేషన్‌కు మార్కెట్‌కు పంపుతారు. తానే యజమానినని ప్రభుత్వం భావించవచ్చు. కానీ, ఈ ఆస్తులనెన్నడూ అది నిర్వహించదు. అవి ఇచ్చే సేవలను అందించదు. ఆ ఆస్తులకు ఊహించిన విలువను నగదుగా మార్చుకోవడం మాత్రమే చేయగలదు. గత అనుభవాన్ని ఒక సూచనగా తీసుకుంటే పెట్టుబడిదారులను కూడా పెద్దగా ఆకర్షించలేదు. పైగా బిడ్డింగ్ ప్రారంభం కావడానికి ముందుగానే తాము ఊహిస్తున్న ముందస్తు చెల్లింపుల గురించి కూడా ప్రకటించేయడంతో వాస్తవ విక్రయ ధరలు చాలా అధికంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు.
ఇక రెండవది మౌలిక సదుపాయాల రంగంలోని ఆస్తులను నిర్వహించే సమయంలో సేవలందించినందుకు గాను వచ్చే ఆదాయ మొత్తాలు... తాము పెట్టిన పెట్టుబడులను తిరిగి భర్తీ చేసుకునేలా ప్రయివేటు రంగానికి ఉండాలి. అలాగే ప్రాధాన్యతా ప్రాతిపదికన ఆ పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన రీతిలో లాభాలు ఆర్జించేలా ఉండటం కూడా ప్రయివేటు రంగానికి అవసరమే. ఇక్కడ ప్రభుత్వమే యజమాని అయినప్పటికీ, ధరల నిర్ణాయక విధానం వాణిజ్యపరంగానే ఉండాల్సి ఉంటుంది. వచ్చే లాభాలు ఆకర్షణీయంగానూ ఉండాలి. ఇదే సమస్యగా మారుతుంది. వాస్తవానికి, సానుకూల నికర ఆదాయాన్ని అందించగలిగే రంగాల్లో ప్రయివేటు రంగం అంచనాలకు తగినట్లుగా ఉండకపోవచ్చు. వినియోగదారులపై యూజర్ చార్జీలు అధికంగా విధించాల్సి వస్తుంది. లేదా అంతరాన్ని భర్తీ చేసే నిధుల కోసం ప్రభుత్వం నుంచి బదలాయింపులు అవసరం కావచ్చు. వచ్చే ఆదాయం సరిగా లేకపోయినా లేదా పరిమితంగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వ వాటా లేదా సహకారం గణనీయంగా ఉండాలి. ప్రభుత్వానికి వనరులను సమీకరించేందుకు సాయపడే ఈ ప్రక్రియ పెద్ద మొత్తాలనే లాగేయవచ్చు.
ఇక మూడవది తగినంతగా లాభాలు ఆర్జించడానికి వీలుగా ఖర్చును తగ్గించే స్వేచ్ఛ కావాలని ప్రయివేటు రంగం డిమాండ్ చేస్తుంది. అలా వ్యయం తగ్గించే వాటిల్లో కార్మిక ఖర్చులు ఉంటాయి. అంటే వారి వేతనాల్లో కోతలు వంటివి ఉంటాయి. లేదా కార్మికులను తొలగించడం ఉంటుంది. ఒక్కోసారి రెండూ ఉంటాయి. సంఘటిత లేబర్ మార్కెట్లకు ఒక ప్రామాణికతను ఇవ్వడంలో ప్రభుత్వ రంగం పోషించిన పాత్ర దెబ్బ తినే అవకాశం ఉంది.
చివరగా, ఆస్తులను నిర్వహించే ప్రయివేటు మేనేజర్లు ఆమోదయోగ్యమైన నాణ్యతతో ఉండే సేవలను అందించేలా ప్రభుత్వం ఎలా హామీ కల్పిస్తుందో స్పష్టమైన వివరణ లేదు. ఇక ఇందుకోసం నియంత్రణా యంత్రాంగాన్ని ప్రవేశ పెట్టడం ఖర్చుతో కూడింది. పైగా ఎక్కువ సమయం కూడా పడుతుంది. నిర్లక్ష్యానికి, మరింత ఖరీదైన సేవల నాణ్యత క్షీణించడానికి ఈ పరిస్థితి దారి తీస్తుంది. గ్రీన్‌ఫీల్డ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రంగంలో పెట్టుబడుల కోసం వనరులను సమీకరించే ప్రక్రియగా దీన్ని సమర్థిస్తున్నారు. కానీ ఈ మానిటైజేషన్ క్రమమంతా బడా వ్యాపారవేత్తల కార్యకలాపాలు విస్తరించుకునే పథకం తప్ప మరొకటి కాదు. తద్వారా వినియోగదారుల / ప్రభుత్వ ఖజానాను పణంగా పెట్టి అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఆదాయ పిరమిడ్‌లో అగ్ర స్థానాన ఉన్న వారికే ఆదాయం, సంపదను బదిలీ చేసేందుకు ఉద్దేశించిన పథకమిది. దిగ్భ్రాంతిని కలిగించే అంశమేమంటే... ప్రభుత్వ సంపదను ఎంపిక చేసిన బడా వ్యాపార సంస్థలకు తాకట్టు పెట్టే మోసపూరితమైన ఈ పథకం, కొత్త ఆస్తుల కల్పనకు ఏ విధంగానూ దోహదపడదు.
జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌గా పిలవబడే ఈ ప్రక్రియలో ఐదేండ్లలో ప్రాజెక్టుల్లో రూ.111 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టబడతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ ఆస్తుల ద్వారా ఆర్జించే మొత్తం రూ.6 లక్షల కోట్లు మాత్రం అందులో కేవలం ఐదు శాతంగానే ఉంది. రాబోయే ఐదేండ్లలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టే ప్రతిపాదిత పెట్టుబడుల్లో కేవలం ఐదు శాతాన్ని పొందేందుకు గాను... దశాబ్దాలుగా ప్రజా ధనంతో సృష్టించిన ఈ సంపదను బడా వ్యాపార సంస్థలకు అప్పగించడాన్ని మోడీ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇది, ఒక పథకంలా కనిపించే కుంభకోణం తప్ప మరొకటి కాదు.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం