Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. అయితే, మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పక తప్పదు. 'మాకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు' అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంప చెళ్లుమనిపించి మరీ చెప్పాడు. మత శక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. అనేక మంది తాలిబన్లు-ఆర్ఎస్ఎస్ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్థాన్ వెళ్లండి అని చెప్పే బీజేపీ నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్థాన్ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్థులను తాలిబన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామ్‌రతన్ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు రూ.50 అయినా కొనేవారు లేరంట. అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్ఫీ నియోజకవర్గ బీజేపీ ఎంఎల్ఏ హరిభూషణ్ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్ మీద ఎలా ఉంటుందని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు. పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. మతమేదైనా ఆప్ఘన్ శరణార్థులను అందరినీ అనుమతించాలన్న జేడీయూ నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబన్లతో నిండిపోతుందన్నారు. తాలిబన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్ రహమాన్ వ్యాఖ్యానించినందుకు యూపీ బీజేపీ ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బీజేపీ వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు అడుగుపెడితే తాలిబన్ల పద్ధతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్ఏ అరుణ్ చంద్ర భౌమిక్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తాలిబన్లను ఎవరూ సమర్థించటం లేదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా. దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా? ఎందుకు సమర్థించినట్లు? జనానికి బుర్రలు లేవనుకుంటున్నారా? తాలిబన్ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బీజేపీ వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా?
ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే సంభవించే పరిణామం ఏమిటి? మరో పాకిస్థాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేసేవారు. ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.
ఆర్ఎస్ఎస్ వాణి ఆర్గనైజర్ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి? ''భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే... అత్యంత చెడు ఏమంటే... దానిలో భారతీయం లేకపోవటమే. రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటిష్, అమెరికా, కెనడా, స్విస్...రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి, శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ధి ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు. మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచ వ్యాపితంగా ఉద్వేగపరిచేవి. ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి. కానీ మన రాజ్యాంగ పండితు లకు అర్ధం లేనివి.'' కాశ్మీరు రాష్ట్రాన్ని, రాజ్యాంగం లోని మౌలిక అంశమైన ఆర్టికల్ 370ని ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరన్ఱే హామీ ఏముంది?
మనుస్మృతిలో ఏముంది? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన, హక్కులకు సంబంధించి రెండు వేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక-పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే... ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు?
మనుస్మృతిలో పరస్పర విరుద్ధ అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్థించు కుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూ కోడ్ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్న వారెంత మంది? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధిం చింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కుల పంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట ఆదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజ లక్షణమని చెబుతారు. ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.
ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బీజేపీ ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, ఎజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి, వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూ కోడ్ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి? కేంద్ర మంత్రిగా అంబేద్కర్ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామ లీలా మైదానంలో ఆర్ఎస్ఎస్ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు బెంగాల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన హిందూ మహాసభ నేత నిర్మల్ చటర్జీ (సీపీఐ(ఎం) నేత, లోక్‌సభ పూర్వ స్పీకర్ సోమనాథ్ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్, హిందూత్వ శక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాద నలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.
మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ స్థలాలలో మత సంబంధమైన వాటికి స్థానం లేదు. అయినప్పటికీ రాజస్థాన్ హైకోర్టు ముందు 1989లో రాజస్థాన్ జుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ 'మను' పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్థనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్ బెంచ్ వాజ్య విచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా 'మను' విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలే వరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆ పని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు. మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచి వేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధంలేదని మరికొందరు అంటున్నారు. మరో నోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం? మరి స్వేచ్ఛ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనానికి, కులాలవారీ చీలి పోవటానికి కారణాలు ఏమిటి? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు. వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288